ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Saturday, 24 August 2013

లోకం ఒక కుక్కతోక!


తడొక బీదవాడు. బీదరికం నుంచి విముక్తి పొందాలన్నది అతడి తీవ్రమైన కోరిక. ఒక భూతాన్ని వశపరచుకొంటే దాని ద్వారా కోరినదంతా తెచ్చుకోవచ్చుననుకొన్నాడు. సమీపంలోని అడవిలో ఆ వశీకరణ మంత్రాన్ని అనుగ్రహించే మహాత్ముడున్నాడని తెలుసుకొని వెళ్లి, అతడి కాళ్లమీద పడ్డాడు. భూతాన్ని వశం చేసుకునే మంత్రాన్ని ఉపదేశించమని బతిమాలాడు. మహాత్ముడు ఆలోచించి 'నీకెందుకయ్యా భూతం? దానితో వ్యవహారం చాలా కష్టం. నీవిప్పుడు సుఖంగా ఉన్నావు. పేదరికంలో మనశ్శాంతి ఉంటుంది. సంపద పెరిగితే తాపత్రయాలు పుట్టుకొస్తాయి. నీవు కష్టాలపాలవుతావు. నెమ్మదిగా ఇంటికెళ్లు' అన్నాడు.

బీదవాడు వినలేదు. అతడి దైన్యాన్ని గమనించి మహాత్ముడు 'నేను చెప్పిన మంత్రాన్ని ప్రతిదినం ఉదయం జపించు. భూతం నీ వశమవుతుంది. నీవు చెప్పిన పనులన్నీ చేస్తుంది. కానీ జాగ్రత్త... భూతం చాలా భయంకరమైనది. దానికి సదా పని కల్పిస్తుండాలి. తగినంత పని కల్పించకపోతే అది నీ ప్రాణాలు తీస్తుంది' అన్నాడు. బీదవాడు ఉబ్బితబ్బిబ్బయ్యాడు.

'స్వామీ, తమ సూచన మేరకు కావలసినంత పని కల్పిస్తాను' అంటూ కొన్ని రోజులు శ్రద్ధగా మంత్రాన్ని జపించాడు. వారం రోజుల తరవాత పెద్ద భూతం ప్రత్యక్షమైంది.

'ఇదో వచ్చాను. నీ మంత్రంతో నన్ను వశపరచుకొన్నావు. ఇకమీద, నాకు ఎప్పుడూ ఏదో ఒక పని కల్పించి తీరాలి. పని చెప్పకపోయావో నిన్ను చంపేస్తాను' అన్నది.

'అయితే నాకో రాజ భవనం కట్టించు' అన్నాడు. తన మనసులో భూతానికి పెద్దపనే కల్పించాననుకొన్నాడా బీదవాడు. రాజభవనం నిర్మించడానికి చాలాకాలం పడుతుందిలే అనుకొన్నాడు. చూస్తుండగానే రాజభవనం, ఉద్యానవనం అన్నీ తయారయ్యాయి. 'మరేం చేయాలో చెప్పు' అన్నది భూతం.

'సమీపంలోని అడవిని కూల్చి ఒక మహా నగరాన్ని నిర్మించు' అన్నాడు బీదవాడికేమీ తోచక. నగర నిర్మాణం కొన్నేళ్లు పడుతుందనుకొన్నాడు. భూతం కొన్ని నిమిషాల్లోనే అద్భుతమైన నగరాన్ని సృష్టించింది.

బీదవాడు వణికిపోయాడు. మరేం పని చెప్పాలో పాలు పోలేదు. దిక్కుతోచక నేరుగా మహాత్ముడి వద్దకు వెళ్లాడు. 'స్వామీ, నన్ను కాపాడండి' అంటూ ఏడ్వసాగాడు. 'ఎంత కష్టమైన పని చెప్పినా క్షణాల్లో పూర్తిచేస్తుంది. పని చెప్పమంటుంది. నేను ఏమీ చెప్పలేకున్నాను. స్వామీ నన్ను కాపాడండి' అని పాదాలపై పడ్డాడు. ఆయన- 'అయితే, ఆ కుక్కను పట్టుకో. దాన్ని తీసుకెళ్లి దాని తోకను నిటారుగా ఉంచమని చెప్పు' అన్నాడు మహాత్ముడు.

బీదవాడు ధైర్యంగా ఆ కుక్కను పట్టుకెళ్లి భూతం చేతికిచ్చాడు. 'వెంటనే ఈ కుక్క తోకను నిటారుగా చెయ్యి' అన్నాడు. భూతం 'ఇదేం పెద్దపని!' అంటూ కుక్క తోకను తన రెండు చేతులతో నిలబెట్టి చేతులు తీయగానే వంకర! భూతం ఎన్నిసార్లు యత్నించినా ఏం లాభం, మళ్ళీ వంకరే! వారం రోజులు చేసినా సాధ్యం కాలేదు. బీదవాడి దగ్గరకు వెళ్లి, 'ఈ కుక్క తోకను నిటారుగా పెట్టించే పని మాన్పించు, నేను నిర్మించిన వాటినన్నింటినీ నీకే అప్పగిస్తాను. నిన్ను చంపనని ప్రమాణం చేస్తాను' అన్నదా భూతం.

బీదవాడు సమ్మతించాడు. బతికాను అంటూ భూతం కాళ్లకు బుద్ధి చెప్పింది. బీదవాడు మహాత్ముడి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి తన రాజమందిరం చేరాడు.

ఈ కథను స్వామి వివేకానందులు తమ కర్మయోగంలో చెప్పారు. ఈ ప్రపంచాన్ని దిద్దడానికి మనం యత్నించరాదు. మనకొక ప్రయోజనం ఉంది. ముందు మనసును స్థిరంగా ఉంచుకోవాలి. దాని వంకర పోతుంది. స్థిరమైన మనసుతో మంచి పనులు చేపట్టాలి. అప్పుడే మనసుకు శాంతి లభిస్తుంది. లోకం సుఖంగా ఉండగలదు. 'మనసు మర్మమెరిగినవాడె ఘనుడు' అన్నారు త్యాగరాజస్వామి.
                                                         - డాక్టర్‌ జానమద్ది హనుమచ్ఛాస్త్రి 

No comments:

Post a Comment