ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Tuesday 13 August 2013

దుఃఖం


నసు, శరీరం రెండూ ప్రతీరోజూ కాకపోయినా ఎప్పుడైనా దుఃఖిస్తాయి. జీవకోటికి అందులోనూ జ్ఞానం ఎక్కువగాగల మనిషికి భగవంతుడు ఏర్పరచిన మానసిక స్పర్శే దుఃఖం. జీవనంలో ఏర్పడుతున్న కష్టాలను గంభీరమైన సముద్రపు ఒడుదొడుకులతో, ఆటుపోట్లతో పోల్చి 'దుఃఖసాగరం' అని పిలుస్తుంటారు.

దుఃఖాన్ని మనిషి తనకుతానుగా ఆపాదించుకొని కన్నీటి ద్వారా బహిర్గతపరచుకుంటాడు. నిజానికి దుఃఖంలో కన్నీరు బయటపడటం మంచిదేనని వైద్యులూ అంగీకరించారు. అదేపనిగా కాకుండా అప్పుడప్పుడు కన్నీరు బయటపడటం కంటివ్యవస్థను శుభ్రపరుస్తుంది. అలాగే జీవకోటి కన్నీటిని జాతివ్యవస్థను శుభ్రపరచే ఆయుధంగా అనుకోవాలి. అదొక విజయానికి నాందీవాచకమవుతుంది. చైతన్యప్రక్రియ ఆరంభమవుతుంది. దుఃఖంలోనే దేవుడి స్మరణ ఎక్కువ కావడానికిదే కారణం. ఆత్మీయులు తమకు బాధ కలిగిస్తే దుఃఖం తెరలుతెరలుగా పొరలుపొరలుగా బయటకు వస్తుంది. సాటివారి ఓదార్పు స్వీకరించలేని స్థితిలో కట్టలు తెగిన ఆనకట్టలా దుఃఖం విజృంభిస్తుంది.

ఒకప్పుడు దర్జాగా బతికిన మనిషి నడిరోడ్డున పడ్డప్పుడు విచారవదనంతో భవిష్యత్తుపై అంచనా ఆరంభిస్తాడు. అప్పుడు కచ్చితంగా అంతర్యామి మంచిని ఉద్బోధించి కార్యోన్ముఖుణ్ని చేస్తుంది. అదే చైతన్యదీపిక అవుతుంది. గుండెల్లో దీపం వెలిగిస్తుంది. ఆ దుఃఖం అలా బయటపడి ఉద్వేగం ఉపశమించి, ఏర్పడ్డ 'పొంగు' తగ్గాక ప్రేమస్పర్శ మళ్ళీ మొదలవుతుంది. అంతా మాయలా అనిపించి ఒక వెలుగుకిరణం చూపించిన దారిలో నడిచి దుఃఖం చెంతనే సుఖం ఉందని అర్థం చేసుకొని వేదాంతిగా మారతాడు. దేవుడు తనకు ఉపశమనం కలిగించాడని ఆకాశం వంక చూసి మొక్కుతాడు. మనసును కష్టమనే నిప్పుమీద కాల్చినప్పుడే నిజాలు బహిర్గతమవుతాయని శ్రీకృష్ణుడు 'గీత'లో ప్రవచించాడు. కానీ, మానవమాత్రులు అవన్నీ పెడచెవిన పెట్టి నిరంతరం పొందనివాటికోసం నిత్యం దుఃఖిస్తూ తమకుతాము వ్యాకులత చెందుతూ బతుకు దుర్భరం చేసుకుంటారు. ప్రకృతి ప్రసాదించిన చిరునవ్వుకు దూరమై తెలీని ఉన్మాదం వైపు అడుగులేస్తారు. కీడు కొనితెచ్చుకుంటారు. పక్కవాడు బాగుపడిపోతున్నాడని అసూయ, విచారంతో కాలం గడిపేస్తాడే తప్ప, అవతలివాడి కష్టానికి దేవుడు సాయం పలికాడని భావించడు. శరీర గాయాల్ని వైద్యుడు నయం చేస్తాడు గానీ మానసిక గాయాలకు మందులు అంతవేగంగా పనిచెయ్యవు. క్రమశిక్షణ, ప్రకృతి ఆరాధన, భగవన్నామ స్మరణం వంటి అంశాలతో మనోవైకల్యం నుంచి బయటపడగల వీలుంది. వెలుగునీడల్లా సుఖదుఃఖాలు పక్కపక్కనే ఉంటాయన్న నిజం మరిచిపోకూడదు. అలా అనుకోవడమే పెద్ద ఓదార్పు.

శ్రీకృష్ణుడు భగవద్గీతలో సుఖదుఃఖాలను, వెలుగునీడల్ని కలిపి ఉద్దేశించడంలో ఎంతో నిగూఢ అర్థముంది. ఇది జీవనసత్యాల వడబోతగా గుర్తించాలి. ఆ 'జ్ఞానగుణం' అజ్ఞానగుణాన్ని తరిమికొట్టి ప్రపంచాన్ని జయించే మహారుషిగా నిలబెడుతుంది. కఠోరమైన మానసిక వ్యాయామం వల్ల దుఃఖం వెన్నలా కరిగిపోయి నెయ్యి అనే పౌష్టికం మిగులుతుంది. మనిషికి సుఖం ఎంత ఇష్టమైనా దుఃఖం కూడా స్వీకరించక తప్పదు. మనిషి విర్రవీగకుండా దుఃఖం మళ్ళీ జీవనరేఖమీదకు తెస్తుంది. 'గీత' గీయిస్తుంది. అంతర్యామి చేసే అద్భుతమే అది.

అంతర్లీనంగా గాలి ద్వారానో, మాట ద్వారానో, నీటి ద్వారానో, మరేదైనా ధాతువు ద్వారానో జీవనసందేశం మనిషికి అందడం వెనక అంతర్యామి సహకారం ఉండనే ఉంటుంది. అందుకే దుఃఖం కలిగితే సహృదయులతో పంచుకొని వీలైతే ఏడ్చేసి బరువు దించుకొని, దుఃఖాన్ని బుజ్జగించి, లాలించి పంపేయడం నేర్చుకోవాలి. అప్పుడు అది నిన్ను చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది.

నిజానికి దుఃఖాన్ని జయించడమే సుఖం!
                                                                         - గుడిమెట్ల గోపాలకృష్ణ 

No comments:

Post a Comment