ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Wednesday, 17 July 2013

అమ్మ ఆరాధన


  కల సృష్టికి మూలం శక్తి. సృష్టి స్థితి లయ కారణమైన శక్తిని పలువిధాలుగా దర్శిస్తున్నాం. శక్తిని ఏ పేరుతో వ్యవహరించినా ప్రకటించే చైతన్యం ఒక్కటే. ఆ శక్తే ఆదిశక్తి, మూలశక్తి, చిచ్చక్తి. ఈ జగత్తంతా ఆ చిచ్చక్తి లీలా విలాసమే! అండ పిండ బ్రహ్మాండమంతా శక్తి ఆవరించి ఉంది. ఈ ప్రకృతి శక్తి వివిధ శక్తులుగా, విభిన్న దేవతలుగా వ్యక్తమవుతోంది. అలాంటి ప్రకృతి ఆకృతులైన జగన్మాత స్వరూపాల ఆరాధనకు తగిన తరుణం ఈ ఆషాఢమాసం.

ఆషాఢమాసం శూన్యమాసంకాదు. ఆధ్యాత్మిక ఆరోగ్యసాధనకు ఉపయుక్తమైన మాసం. ప్రకృతిమాతకు కృతజ్ఞతల్ని సమర్పించే మాసం. భక్తిప్రపత్తులతో అమ్మను అనేక మార్గాల్లో కొలిచే మాసం. సమాజానికి, సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తికి ముఖ్యమైనవి మూడు అంశాలు. అవి జ్ఞానం, శక్తి, సంపద. జ్ఞాన, శక్తి, ఐశ్వర్య స్వరూపాలే సరస్వతి, దుర్గ, లక్ష్మి. ఈ ముగ్గురమ్మల మూలపుటమ్మగా మహాశక్తి రూపాల్ని అర్చించడం ఈ మాసంలోని సంప్రదాయం. ప్రాకృతికంగా అనేక రోగకారక పరిస్థితులు ఆషాఢంలో ఉంటాయి. ఈ స్థితిని తట్టుకుని, అన్ని ఆటంకాల్ని అధిగమించడానికి అమ్మ ఆలంబనను భక్తులు కోరుకుంటారు. ఆషాఢమాసంలో మహిషాసుర మర్దిని రూపాన్ని విశేషంగా పూజించాలని 'స్మృతికౌస్తుభం' తెలియజేస్తోంది. ఆషాఢ శుద్ధ నవమినాడు (ఈరోజు) ఇంద్రాదేవిని పూజించాలని 'రామార్చన చంద్రిక' వెల్లడిస్తోంది.

ఆషాఢ శుద్ధ నవమి నుంచి శ్రావణ శుద్ధ ఏకాదశి వరకు 'శాకమహాలక్ష్మీ వ్రతం' పేరిట లక్ష్మీ ఆరాధనం కొనసాగుతుంది. సంపదల తల్లి అయిన మహాలక్ష్మిని దశమినాడు షోడశోపచారాలు, అష్టోత్తరాలు, శ్రీసూక్త సహితంగా పూజించి ఆకుకూరల్ని నివేదన చేస్తారు. ఈ వ్రతాచరణ చేసేవారు నెలరోజులపాటు ఆకు కూరల్ని స్వీకరించకూడదని వ్రత విధివిధానం తెలియజేస్తోంది. ఆషాఢ పూర్ణిమ రోజున 'అంబికావ్రతం' పేరిట జగన్మాతను ఆరాధిస్తారు. ఆయురారోగ్య సిద్ధికి ఈ వ్రతం దోహదపడుతుందని చెబుతారు. ఆషాఢ పూర్ణిమ నుంచి శ్రావణ పూర్ణిమ వరకు అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి 'కోకిలా వ్రతాన్ని' ఆచరించే సంప్రదాయం ఉంది. నదీతీరాల్లో లేదా గృహాల్లో తులసి మొక్క సమక్షంలో నువ్వుల పిండితో కోకిల బొమ్మను తయారుచేస్తారు. ఈ ప్రతిమను అమ్మవారి రూపంగా భావించి, పూజాదికాలు నిర్వహిస్తారు. లేత చిగురాకులు, ఫలాల్ని నివేదన చేస్తారు. శ్రీఘ్ర వివాహ సిద్ధి, సౌభాగ్య ప్రాప్తి ఈ వ్రత ఫలితాలని శాస్త్ర వచనం.

ఆషాఢమాసంలో నిర్వహించే మరో ముఖ్యమైన వేడుక శాకంబరీదేవి ఉత్సవం. పూర్వకాలంలో హిరణ్యాక్షుడి వంశానికి చెందిన దుర్గముడు అనే రాక్షసుడు తన తపశ్శక్తితో వేదాల్ని అంతర్ధానం చేశాడంటారు. దానితో, వైదిక కర్మలు, యజ్ఞయాగాదులు లోపించాయి. ఫలితంగా సుదీర్ఘకాలం కరవుకాటకాలు ఏర్పడ్డాయి. 'శతాక్షి' నామంతో ప్రకటితమైన జగదంబ, అసుర సంహారం చేసి, వేదాల్ని రక్షించి, వైదిక కర్మాచరణను పునరుద్ధరించిందని చెబుతారు. క్షామాన్ని నివారించి, లోకానికి వివిధ శాకాల్ని ప్రసాదించి, ఆకలి బాధను తొలగించిందంటారు. శతాక్షీమాత శాకంబరిగా అభివ్యక్తమైందంటారు. ఆ స్వరూపాన్నే అన్నపూర్ణగా ఆరాధిస్తారు. ఆషాఢంలో అమ్మవారి వివిధ స్వరూపాల్ని ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, సస్యాలు వంటి ఆహార ద్రవ్యాలతో అలంకరించి శాకంబరిగా ఆరాధించడంవల్ల వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండుతాయని విశ్వసిస్తారు. ఆషాఢమాసంలోనే బోనాల వేడుకతో ప్రకృతి శక్తిని తమ ఇలవేల్పుగా, కులదేవతగా, గ్రామదేవతగా కొలుచుకుంటారు. ప్రకృతిలో జరిగే అనేక మార్పులను, పరిణామాలను భక్తులు తమ ఆయురారోగ్య సుఖ సౌభాగ్యాలకు అనుగుణంగా మలచాలని ఆషాఢంలో అమ్మను ఆరాధిస్తారు. శారీరక, మానసిక ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రచోదనం చేయడానికి ఆషాఢంలో మాతృశక్తిని పూజిస్తారు.
                                                            - డాక్టర్‌ కావూరి రాజేశ్‌ పటేల్‌

No comments:

Post a Comment