ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Friday, 9 May 2014

అనుభవించక తప్పదు!


నవారు చేసిన తప్పులకు తాను బాధ్యత వహించేవాడు ఉత్తముడు. తాను చేసిన తప్పులకు తనవారిని, అమాయకులను, తనను విశ్వసించినవారిని బాధ్యులను చేసేవాడు అధముడు.
ఇది సత్యకాలం కాదు. కలికాలం. కాబట్టి నీ, నా భేదాలు, పాపం పుణ్యం పరమార్థాలు ఉండని వైనం సర్వత్రా దర్శనీయమే. స్వప్రయోజనాలకోసం ఎంతకైనా తెగించే తత్వమే ఎక్కువ. ఇతరులకు హానిచేసైనా తన పబ్బం గడుపుకోవాలన్న దుగ్ధతో మనిషి ఎంతకైనా దిగజారే దుర్మార్గమైన ప్రవృత్తి కనిపిస్తోంది.

కుటుంబంలో వ్యక్తి తప్పు చేస్తే కుటుంబ యజమాని; శిష్యుడు తప్పు చేస్తే గురువు; పరివారం, ఉద్యోగులు తప్పు చేస్తే పాలకులు బాధ్యత వహించాలని భారతీయ ధర్మాలు చెబుతున్నాయి. ధర్మాన్ని ఆచరించడం మనిషి ప్రధాన కర్తవ్యం. అధర్మ వర్తన మనసుకు తోచినంత మాత్రానే సరిదిద్దుకునేవాడు వివేకి. న్యాయశాస్త్రాలు తప్పుపట్టినా న్యాయపోరాటాల పేరుతో ముసుగులు కప్పుకొనేవారు సమాజానికి, కుటుంబానికి సైతం దూరంగా ఉండాల్సిన వారే. మనసే మొదటి న్యాయస్థానం. ఆ తీర్పు సరైన, కచ్చితమైన నిర్ణయాన్నే ఇస్తుంది. ఆ తీర్పును శిరసావహించినవారు చరిత్ర పురుషులవుతారు. లోకానికి ఆదర్శనీయులూ అవుతారు.

గంగా యమునలు కలిసే చోట నీటమునిగి పన్నెండు సంవత్సరాలు ఘోర తపమాచరించిన మహా రుషి చ్యవనుడు. ఒకసారి జాలర్లు వేసిన వలలో చిక్కుతాడు. ఆశ్చర్యపోతారు, భయపడతారు మత్స్యకారులు. 'చేపలతోపాటు రాజుగారికి నన్ను కూడా అమ్మేయండి' అంటాడు చ్యవనుడు. విషయం తెలుసుకున్న మహారాజు నహుషుడు వచ్చి చ్యవనుడి పాదాలపై పడి- ఇది నా తప్పుగా భావించి మన్నించమని ప్రార్థిస్తాడు. ఇది ఎవరి తప్పుకాదు. నా విలువ ఎంతో కట్టి, వారికి ఇచ్చి పంపమంటాడు. కోటి మాడలిస్తానని అంటాడు మహారాజు. 'నా విలువ అంతేనా?' అంటాడు. అయితే రాజ్యమే వారికిస్తానంటాడు మహారాజు. నవ్వుతాడు చ్యవనుడు. ఇంతేనా నా వెల అంటాడు. సర్వ సంపదలకు నెలవు గోమాత. కాబట్టి ఆ మత్స్యకారులకు గోదానం చేసి పంపుతారు మధ్యవర్తులుగా అక్కడే ఉన్న రుషులు, మంత్రులు.

ఇక్కడ మనం గమనించాల్సింది- నిజానికి మత్స్యకారులు చేసిన తప్పేమీ లేదు. అది వారి వృత్తి. అంతటి మహర్షి తపోభంగమైంది కాబట్టి తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే కాబట్టి, ఆ తప్పును తనదిగా భావించమని, రాజ్యపరిత్యాగానికి కూడా సిద్ధపడ్డాడు నహుషుడు.

శివాజీ మహారాజుకు కానుకగా సైనికులు, ఓ అద్భుత సౌందర్యవతిని అంతఃపురానికి తెస్తారు. విషయం తెలుసుకున్న ఛత్రపతి ఆ సౌందర్యవతి దగ్గరకు వెళ్ళి- తల్లీ! నా సైనికులు చేసిన ఈ అజ్ఞానపు కార్యానికి నన్ను మన్నించు. 'అమోఘ సౌందర్యవతివి తల్లీ నీవు! బిడ్డగా నీ కడుపున పుట్టే భాగ్యం నాకు లేకపోయెనే' అంటూ చేతులు జోడిస్తాడు.

అంతటి గొప్ప సంస్కారం ఉంది కనకనే చరిత్రలో వారి గాథలు సువర్ణాక్షర లిఖితమయ్యాయి.

అవినీతిపరుల దుశ్చర్యలతో ప్రభుత్వ బొక్కసంలోని ద్రవ్యం అపహరణకు గురైనా, ప్రభుత్వ ఆస్తులు కొల్లగొట్టినా, దుండగుల వల్ల రాజ్యంలో శాంతి సుఖాలకు ఆటంకం ఏర్పడ్డా, ప్రభుత్వ పాలన అస్తవ్యస్తంగా మారినా అందుకు తప్పు- బాధ్యులైనవారిదే కాదు, పాలకులది కూడా!

తన తప్పులకు ఇతరులను బలిచేయడం, అభిశంసించడం, దోషులుగా చేయడం అమానవీయ వైఖరి. పంచతంత్ర కథలు ఇందుకు అద్దం పట్టేవిగా అనేకం కనిపిస్తాయి. 'ఇకపై అడవిలోని సాధు జంతువులను కాపాడదాం. ఇష్టం వచ్చినట్లు తినేయడం, చంపేయడం చెల్లదు' తీర్మానం చేసింది పులి. అలాగేనన్నాయి నక్క, తోడేలు, ఒంటె. నక్కకు జిహ్వచాపల్యం ఎక్కువ.

దొంగచాటుగా సాధు జంతువులను చంపి తింటూ ఎముకలను తోడేలు, ఒంటె సంచరించే ప్రాంతాల్లో వేసేది. పైగా పులితో ఈ రెండింటిపై చాడీలు చెప్పింది. పులి వచ్చి చూసింది. ఆగ్రహించింది. వాటిని చంపేసింది.

తన కడుపు నింపుకోవడంతోనే తృప్తిపడలేదు నక్క. దానిది అధమ గుణం. తోటి జంతువులకే కీడు తెచ్చింది. తన తప్పులను గ్రహిస్తూ ఎప్పటికప్పుడు నడతను మార్చుకునే గుణం కొనియాడతగిందే. ఎందరో పురాణ పురుషులు, మహనీయుల చరిత్రలే ఇందుకు నిదర్శనం.
మహాత్మాగాంధీ చిన్నతనంలో చేసిన చిన్న చిన్న పొరపాట్లను తండ్రికి చెప్పి సరిదిద్దుకునే వరకు, స్థిమిత మనస్కుడిగా ఉండలేకపోయేవాడు. మరలా ఆ పొరపాట్లు చెయ్యలేదు జీవితంలో. అందుకే మహాత్ముడైనాడు. ప్రపంచానికే ఆరాధ్యుడయ్యాడు. నిప్పు కాలుస్తుంది. తప్పూ అంతే. ధర్మరాజుకు తెలియనిదా, జూద వ్యసన ఫలితం ఎలా ఉంటుందో! జూదం ఆడక తప్పలేదు. ఫలితం కురుక్షేత్ర సంగ్రామానికే దారితీసింది. తెలిసి తప్పుచేసి దిద్దుకొనే కంటే, తప్పు చెయ్యకపోవడమే మేలు కదా!
- దానం శివప్రసాదరావు

No comments:

Post a Comment