ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Wednesday 14 May 2014

మహితాత్ముడు


యిదుగురు ఆధ్యాత్మికవేత్తలకు ఒక వివాదం వచ్చింది. ఎవరికి వాళ్లు తమ మతమే మంచిదని వాదించుకుంటున్నారు. ఎంతకూ వాళ్ల తగాదా తీరడంలేదు. 'ఎవరైనా గొప్ప జ్ఞాని వద్దకు వెళ్లి, మన వాదాలు వివరించి, ఏ మతం గొప్పదో తేల్చిచెప్పమని అడుగుదాం!' అని నిర్ణయించుకున్నారు. అలాంటి గొప్ప జ్ఞాని ఎవరా అని వెతికి, అక్కడకు చేరుకున్నారు. ఒక్కొక్కరే తన మతంలోని విశిష్టతను, తాము పూజించే దేవుడి స్వరూపాన్నీ, స్వభావాన్నీ వర్ణించి చెప్పి, తుదకు ఇతర మతాలపై తమ ద్వేషాన్ని కూడా వెళ్లగక్కారు. 'ఇతర మతాలు పనికి మాలినవి కాబట్టి అందరూ తమ మతాన్ని అనుసరిస్తేనే దైవసన్నిధికి చేరగలరు' అని స్పష్టం చేశారు.
అక్కడ మౌనంగా కూర్చుని ఉన్న మహాత్ముడు తుదకు పెదవి కదిపాడు. 'దేవుడి దృష్టిలో అందరూ సమానులే! ఆయనకు రాగద్వేషాలుండవు. పక్షపాత బుద్ధి ఉండదు. ఆయన శాంతిస్వరూపుడు, కరుణామయుడు, పవిత్రుడు, శుభంకరుడు- అని మీరందరూ స్తుతిస్తూ ఉంటారు. కానీ, మీ హృదయాల్లో మాత్రం పక్షపాత బుద్ధి, రాగద్వేషాలూ నెలకొని ఉన్నాయి. మీ మాటల్లో అసహనం తాండవిస్తూ ఉంది. సర్వ సద్గుణ సముపేతుడైన సర్వేశ్వరుడి చెంతకు చేరుకోవాలంటే, ముందుగా ఈ దుర్గుణాలను మీరు విడిచిపెట్టాలి. మీలో సహిష్ణుత అనే సద్గుణం ఉండాలి. మీరు ప్రేమమూర్తులు కావాలి. శాంతస్వభావులే భగవంతుడి సన్నిధికి చేరుకోగలుగుతారు!'

మహాత్ముడి మాటలు విని ఆ అయిదుగురు మత తత్వవేత్తలూ సిగ్గుతో తలదించుకున్నారు. ఈ హితబోధ చేసిన మహాపురుషుడు బుద్ధభగవానుడు. బుద్ధుడి జీవితంలో మనకు నమ్మశక్యంగాని విషయాలేమీ ఉండవు. కానీ, సన్నివేశాలన్నీ అద్భుతమైనవే! కష్టమంటే ఏమిటో తెలియడానికి అవకాశంలేని రాజసౌధంలో పెరిగిన యువరాజు తుదకు సన్యాసిగా మారడం కంటే ఆశ్చర్యకర సన్నివేశం ఏముంటుంది?

కోరికలే దుఃఖానికి కారణం. అజ్ఞానంవల్ల కోరికలు కలుగుతాయి. అజ్ఞానాన్ని అంతంచేస్తే దుఃఖానికి స్థానం ఉండదు. ఈ ప్రపంచం అశాశ్వతం అని గ్రహిస్తే అజ్ఞానం తొలగిపోతుంది. సరైన వాక్కు, దృష్టి, క్రియ, జీవనం, ప్రయత్నం, మనసు, ధ్యానం అనే వాటివల్ల జ్ఞానం కలుగుతుంది. అహింస, దయ, భోగరాహిత్యం, ప్రేమ, సత్యం- ఈ నియమాలే మనిషి తనను తాను ఉద్ధరించుకోవడానికి తోడ్పడతాయి!

అందరికీ అర్థమయ్యే రీతిలో, ఆచరించడానికి వీలైన వాటిని ప్రవచించాడు బుద్ధుడు. ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ఆయన అడుగుపెట్టగానే మత ధర్మాల తీరే మారిపోయింది. భిక్షాటనం చేసే ఒక భారతీయ సన్యాసి తన ప్రవచనాలతో ఆసియాఖండం మొత్తాన్ని ప్రభావితం చేశాడు. ఆయన వెలిగించిన జ్ఞానజ్యోతి రెండున్నర వేల సంవత్సరాల తరవాతా సర్వ ప్రపంచ మానవాళి శోకపు చీకట్లు చీల్చుకొని బయటపడటానికి కరదీపికగా వెలుగొందుతూనే ఉంది. నాటికీ నేటికీ ఏవైనా మహిమలు చూపగలవారినే ప్రజలు అధిక సంఖ్యలో అనుసరిస్తారు. మహిమలతోగాక, హిత వచనాలతో ప్రపంచ ప్రజల దృష్టిని ఆకర్షించి, వారిని సన్మార్గగాముల్ని చేసిన మహితాత్ముడు గౌతమ బుద్ధుడు.

జీవహింస మానవత్వానికి మచ్చగా ఆయన భావించాడు. ఒక పక్షికి బాణపు దెబ్బ తగిలితే, దాన్ని తన ఒడిలో పెట్టుకొని, కన్నీటితో దాని రక్తాన్ని కడిగాడు. 'ఒక గొర్రెపిల్లను బలి ఇస్తే మోక్షం లభిస్తుందని నమ్మేటట్త్లెతే, మనిషినైన నన్ను బలి ఇస్తే మీరు సరాసరి స్వర్గానికే పోవచ్చు కదా!' అని సమాజంలోని మూఢవిశ్వాసాలకు ముచ్చెమటలు పట్టించాడు. మతం అంటే ప్రేమాదరాలతో, సచ్ఛీలతతో కూడిన ధర్మమార్గం అని బుద్ధుడు విశ్వసించాడు. ఎనభయ్యో ఏట తాను తుదిశ్వాస విడిచే వరకు, సామాన్య ప్రజలకు అర్థమయ్యే భాషలో, సమాజ గమనాన్ని సచ్ఛీలతవైపు మరలించడానికే ప్రయత్నించాడు. 'ఎవరి మోక్షాన్ని వాళ్లే సంపాదించుకోవాలి. ఎవరో వచ్చి సాయంచేస్తే వచ్చేది కాదు అది!' అనే మహత్తర సందేశాన్ని మానవజాతికి ప్రసాదించాడు.

'బుద్ధుడు' అనే పదం అనంత జ్ఞానానికి సంకేతం. 'నేను గౌతముణ్ని. సాధనవల్ల బుద్ధుణ్ని కాగలిగాను! మీరూ సాధనచేస్తే బుద్ధులుగా మారగలరు' అని ఆత్మవిశ్వాసాన్ని మనందరికీ కలగజేసిన మహామహితాత్ముడు బుద్ధ భగవానుడు. 
- డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు 

No comments:

Post a Comment