ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Friday 2 May 2014

చార్‌ధామ్‌ యాత్ర

    భగవంతుడు మనిషికి ప్రసాదించిన అనేక వరాల్లో ఉత్తమమైంది ప్రకృతి. అలాంటి ప్రకృతి రసార్ణవ ఆకృతిగా ప్రకటితమైతే- హిమాలయ పర్వత పంక్తుల సౌందర్యమై విలసిల్లుతుంది. ఆ హిమవన్నగాల చెంత ఉన్న ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని నాలుగు దివ్యస్థలాల్ని చార్‌ధామ్‌గా వ్యవహరిస్తున్నాం. యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్‌, బదరీనాథ్‌ క్షేత్రాల దర్శన సమాహారాన్ని చార్‌ధామ్‌ యాత్రగా పరిగణిస్తారు. ప్రతి సంవత్సరం అక్షయ తృతీయనాడు ఈ యాత్ర ప్రారంభమవుతుంది. ఈసారి మే రెండునుంచి ఆరంభమయ్యే ఈ యాత్రలో వేలాది భక్తులు పాల్గొంటున్నారు. చార్‌ధామ్‌ క్షేత్రాల యాత్రకు హరిద్వార్‌ను ముఖద్వారంగా భావిస్తారు. భగీరథ యత్నానికి తలవంచి, చండప్రచండమైన వేగంతో, గంగ శివుడి జటాఝూటంలోకి దూకింది. ఆ గంగ హిమ పర్వతాల నుంచి జనావాసాల్లోకి వచ్చింది హరిద్వార్‌లోనే! ఇక్కడ నీల పర్వతంపై నెలకొన్న చాందీదేవి, బిల్వ పర్వతంపై ఉన్న మానసాదేవి ఆలయాల్ని భక్తులు సందర్శిస్తారు. హరిద్వార్‌ నుంచి రిషికేశ్‌కు భక్తులు చేరుకుంటారు. క్షీరసాగర మథనంలో ఆవిర్భవించిన హాలాహలాన్ని మహాదేవుడు సేవించిన ప్రదేశంగా వ్యవహరించే నీలకంఠ మహాదేవాలయాన్ని దర్శిస్తారు. ఇక్కడే ఉన్న రామ్‌, లక్ష్మణ్‌ ఝూలాలు, వసిష్ఠ గుహ, భరత్‌ మందిరాల్ని తిలకిస్తారు.

చార్‌ధామ్‌ యాత్రలో మొదటి క్షేత్రమైన యమునోత్రికి డెహ్రాడూన్‌, ముస్సోరీల మీదుగా భక్తులు పయనమవుతారు. యమునా నది పర్వతాగ్రాల నుంచి కిందకు దిగిన ప్రదేశం యమునోత్రి. హనుమాన్‌ చట్టి నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి కాలినడకన లేదా గుర్రాల మీద భక్తులు వెళ్తారు. సముద్రమట్టానికి 3,165 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతంలో యమునాదేవి ఆలయం గోచరమవుతుంది. కిలోమీటరు దూరంలో ఉన్న భారీ పర్వతాన్ని అధిరోహిస్తే యమున జన్మస్థలి దర్శనమిస్తుంది.

యమునోత్రి నుంచి ఉత్తరకాశి మీదుగా గంగనాని, ధూలి ప్రాంతాల్ని దర్శించి భక్తులు గంగోత్రికి చేరుకుంటారు. సముద్రమట్టానికి మూడు వేల అడుగుల ఎత్తులో ఈ ప్రదేశం ఉంటుంది. భగీరథుడి తపోఫలితంగా గంగాదేవి నదీరూపంలో భూమిపై అడుగిడిన చోటుగా భావించే స్థలంలో పవిత్రమైన శిల ఉంటుంది. సహజసిద్ధంగా ఏర్పడిన ఈ శిలాకృతిని శివలింగంగా భక్తులు పూజిస్తారు. గంగమ్మ దూకుడును తట్టుకుని తన జటాఝూటంలో బంధించేందుకు శివుడే ఇక్కడ కూర్చున్నాడని స్థల పురాణం. గంగోత్రిలో మంచు కారణంగా ఏటా ఆరు నెలల పాటు మూసి ఉండే గంగా మాత ఆలయాన్ని, అక్షయ తృతీయ నుంచి దీపావళి వరకు తెరుస్తారు. ఈ ఆలయానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోముఖ్‌ను గంగానది జన్మస్థలిగా భావిస్తారు. ఇక్కడ భాగీరథి ప్రవహిస్తుంది. ఇది దేవప్రయాగ దగ్గర అలకానంద నదితో సంగమమై గంగానదిగా మారుతుంది.

గంగోత్రి నుంచి శ్రీనగర్‌, రుద్రప్రయాగ, గౌరీకుండ్‌ మీదుగా భక్తులు మూడో దివ్యధామమైన కేదార్‌నాథ్‌కి చేరుకుంటారు. ఈ జ్యోతిర్లింగ క్షేత్రం సముద్ర మట్టానికి 12 వేల అడుగుల ఎత్తున ఉంటుంది. హరుడు, కేదారేశ్వరుడిగా వెలసిన ఈ క్షేత్ర వైభవం స్కాంద పురాణంలో ఉంది. ఓసారి పార్వతీదేవి కేదార క్షేత్ర విశేషాల్ని వివరించమని పరమశివుణ్ని ప్రశ్నించింది. 'దేవతల్లో విష్ణువు, సరోవరాల్లో సాగరం, నదుల్లో గంగ, పర్వతాల్లో హిమాలయం, భక్తుల్లో నారదుడు, గోవుల్లో కామధేనువు, పురాల్లో కైలాసం, క్షేత్రాల్లో కేదారం నాకు పరమ ప్రియమైనవి'- అని మహేశ్వరుడు పేర్కొన్నాడట. సృష్టి ప్రారంభం నుంచి నేను బ్రహ్మరూపాన్ని ధరించి, పరబ్రహ్మతత్వాన్ని సాధించడానికి ఈ క్షేత్రంలో నివసిస్తున్నానని శివుడు వెల్లడించాడని చెబుతారు. కేదార్‌నాథ్‌లో మహాదేవుడు లింగాకృతిలో కాకుండా, త్రిభుజాకారంలో దర్శనమిస్తాడు. ఈ ఆలయం ఏటా మే నుంచి అక్టోబర్‌ వరకే తెరిచి ఉంటుంది. పాండవులు స్వర్గారోహణం చేసిన సన్నిధి, జగద్గురువు ఆదిశంకరాచార్యులు కైవల్యం పొందింది ఇక్కడేనని ప్రతీతి.

చార్‌ధామ్‌ యాత్రలో నాలుగో దివ్యస్థలి బదరీనాథ్‌. హిమాలయాల్లోని నీలకంఠ పర్వతాల నేపథ్యంలో నర, నారాయణ కొండల నడుమ, అలకానంద నదీ తీరాన విష్ణు రూప బదరీనాథుడు కొలువుతీరి ఉంటాడు. ఈ ఆలయం ఏడాది పొడవునా తెరిచే ఉంటుంది. గర్భాలయంలో ధ్యానముద్రాంకితుడైన శ్రీహరి విగ్రహం గోచరమవుతుంది. ప్రధాన ఆలయంతోపాటు ఆదిబద్రి, యోగధ్యాన్‌ బద్రి, బృధా బద్రి, భవిష్య బద్రి పేరిట మరో నాలుగు ఆలయాలు ఉంటాయి. ఇక్కడ పంచ ప్రయాగలుగా పేర్కొనే దేవ, రుద్ర, నంద, కర్ణ, విష్ణుప్రయాగలు దర్శనీయ ప్రదేశాలు.

మన దేశం 'నమోనమామి' అంటూ ఆరాధించదగిన కర్మభూమి, పుణ్యభూమి. ఆసేతు హిమాచలం ఎన్నో దివ్యసన్నిధులు ఇక్కడ నెలకొన్నాయి. ఈ మహనీయ స్థలాల్ని శ్రద్ధ, భక్తి, విశ్వాసాలతో దివ్య, భవ్య, ఆధ్యాత్మిక పెన్నిధులుగా సేవించాలి. అప్పుడే యాత్ర సిద్ధి, చిత్తశుద్ధి, అలౌకికమైన ఆత్మానంద లబ్ధి చేకూరుతాయి.
- డాక్టర్‌ కావూరి రాజేశ్‌ పటేల్‌ 

No comments:

Post a Comment