ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Sunday 4 May 2014

అన్న ప్రసాదం


భారతీయ సంస్కృతికి మోక్షమే లక్ష్యం. అంతఃకరణ శుద్ధి ద్వారా ఇది సాధ్యం. అంతఃకరణ శుద్ధికి ఆహారశుద్ధి ఆవశ్యకం. శుద్ధమైన ఆహారం ప్రశాంత జీవనానికి ప్రథమ సోపానం. 'ఆహారం శుద్ధంగా ఉండాలి. అప్పుడే భోక్త బుద్ధివల్ల స్మృతి దృఢమవుతుంది. స్మృతివల్ల హృదయ దృఢత్వం, దానివల్ల ఆధ్యాత్మిక జ్ఞానం కలుగుతుంది' అని ఛాందాగ్యోపనిషత్తు. భుజించడానికి ముందు ఆహార పదార్థాలను భగవంతుడికి నివేదన చేయాలి. అప్పుడది 'అన్నప్రసాదం'గా మారుతుంది. ప్రసాదగుణం గల భోజనం మనసును ప్రసన్నం చేస్తుంది. భగవన్మార్గంలో ప్రయాణించడానికి సాత్వికాహారం ఇలా తోడ్పడుతుంది. త్రికాలజ్ఞులైన మహర్షులు అన్నాన్ని గురించి ఎన్నో విషయాలు పేర్కొన్నారు.

ధర్మ సాధనకు శరీరమే మూలం. శరీరం ఉంటేనే పురుషార్థాలు పొందగలుగుతారు. ఆరోగ్యవంతులే ధార్మిక, సామాజిక రంగాల్లో రాణిస్తారు. ఈ శరీరానికీ, దీని ఆరోగ్యానికీ ఆధారం అన్నమే. 'కోటి విద్యలూ కూటి కొరకే', 'ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు...' లాంటి సామెతలు అన్న ప్రాధాన్యాన్ని చాటుతున్నాయి. లోతుకుపోయి ఆలోచిస్తే అవి ఎంత సార్థకతో తెలుస్తుంది. వేదంలో 'ఆకలి మానవులకు మహత్తర శత్రు'వని ఉంది. ఆకలి ఒక వ్యాధి అనీ, దీనికి ఔషధం ఆహారమే అని శంకర భగవత్పాదులు సెలవిచ్చారు. ఈ వ్యాధి లేకపోతే లోకంలో ఆకృత్యాలకు తావేలేదు. మితాహారంతో క్షుద్బాధను తగ్గించుకుంటే హితం చేకూరుతుంది. 'అన్నమో రామచంద్రా' అని అల్లాడే దీనులకు పట్టెడన్నం పెట్టడం కంటే పవిత్ర మతం ఏదీలేదని వివేకానందులు చాటారు.

అత్యంత నియమబద్ధ ఆహారాన్నే ఆర్షసంప్రదాయం ఇష్టపడుతుంది. తినడం, తాగడం, నిదురించడం.. మొదలైనవి సర్వప్రాణి సాధారణం అయితే వాటికి మితం ఉండాలి. విశృంఖలత అనర్థాలకు దారితీస్తుంది. అమితమూ, అనియతమూ అయిన ఆహారంవల్ల కీడు కలుగుతుందని స్మృతుల ప్రబోధం. దేశ, కాల, వయో, అవస్థా భేదాలను అనుసరించి వైద్యశాస్త్రం ఆహార నియమాలు పేర్కొన్నది. స్మృతులు, శాస్త్రాలు పేర్కొన్న ఆహార నియమాలు శరీర ఆరోగ్యానికేగాక, పరమార్థ సాధనాలుగా కూడా ఉపయోగపడతాయి.

అంతరింద్రియం మనసు. మనసు ప్రేరణ చేతనే బాహ్యేంద్రియాలు ప్రవర్తిస్తాయి. మనసు సరైన స్థితిలో ఉంటే మానవుడు, లేకపోతే దానవుడు. ఆత్మ సాక్షాత్కారానికి మూలం మనసు. అదే మోక్షసాధనం. మానసిక శుద్ధి ఆహార శుద్ధిపై ఆధారపడి ఉంటుంది. సాత్విక, రాజస, తామస ఆహారాలను అనుసరించి ఆయా గుణాలూ వస్తాయని ప్రాచీనుల విశ్వాసం. రసవంతం, స్వచ్ఛం, మధురం అయిన ఆహారం- ఆయుష్షు, ఆరోగ్యం, బలం, సుఖం కలిగిస్తుంది. ఇది సాత్వికాహారం. కారం, ఉప్పు, పులుపు, ఎక్కువగా ఉంటే రాజసాహారం- దుఃఖప్రదం. అతిగానో తక్కువగానో వండిందీ, దుర్వాసన వేసేదీ, ఎంగిలిదీ- తామసాహారం- విషప్రాయం. వీటిలో సాత్వికాహారం ఉత్తమం అని గీతోపదేశం.

ఒకే ఆహారం సందర్భాన్ని అనుసరించి మంచిగానో చెడుగానో మారుతుంది. ఒకే ఆహారం ఒక వ్యక్తికి బలకరం, ఇంకో వ్యక్తికి రోగకారకం! దేశకాల పాత్రలననుసరించి ఆహారాన్ని ఎన్నుకోవాలి. ఎవరి ఆహారం వారే వండుకొని తినడం 'స్వయంపాకం'. ఎక్కడపడితే అక్కడ, ఏది పడితే అది తినేవారికి 'స్వయంపాకులు' పరిహాసపాత్రులు. మోదుగ, అరటి, నేరేడు, మామిడి ఆకుల్లో భోజనం శ్రేష్ఠం. తూర్పుకు తిరిగి తినాలని పెద్దల మాట. వరసలో తీపి, ఉప్పు, పులుపు పదార్థాలు తినాలి. మొదట ద్రవపదార్థం, తరవాత ఘనపదార్థం, చివర మరలా ద్రవపదార్థం తీసుకోవాలి. తడిబట్టా, తడి తలా ఉండకూడదు. రెండుసార్లే భోజనం. భోజనానికి ముందు, తరవాతా కాళ్లు, చేతులు, నోరు శుభ్రం చేసుకోవాలి. పంక్తిలో నుంచి మధ్యలో లేవకూడదు. పిల్లలకు, వృద్ధులకు ముందు వడ్డించాలి. పాడుబడిన ఇళ్లూ, గుడులూ భోజనానికి పనికిరావు. పెరుగును తప్ప మిగతావాటిని ఒక్క రాత్రి గడిస్తే స్వీకరించకూడదు. శత్రుపక్షంవారు, దొంగ సాక్ష్యాలు చెప్పేవారు, కోపిష్ఠులు పెట్టే అన్నం తినరాదు.

పారంపర్యంగా చెప్పుకొనే కథ ఒకటుంది. ఒక గ్రామాధికారి ఇంట సన్యాసి ఒకడు భోజనం చేశాడు. అన్నం తిన్న తరవాత అతడి మెదడులో చెడు ఆలోచనలు పుట్టుకొచ్చాయి. ఆ ఇంట్లో ఆడుకునే బాలుణ్ని చూశాడు. బాలుడు ధరించిన ఆభరణాలు కాజేయాలనే కోరిక పుట్టింది సన్యాసికి. ఇంతలో పెద్ద దగ్గుతెరకమ్మి, సన్యాసి తిన్నదంతా బయటకు వచ్చేసింది. మరుక్షణమే అతడి మనసు మంచిగా మారింది. ఈ మార్పుకు కారణం ఏమిటా అని ఆరా తీశాడు. ఒక దొంగ కానుకగా ఇచ్చిన పదార్థాలనే గృహస్థు తనకు పెట్టాడని సన్యాసి తెలుసుకున్నాడు. దొంగసొమ్ము కాబట్టే, తన మనసులో చోర గుణం పుట్టిందని గ్రహించాడు. ఇలాగే హింస మూలంగా సంపాదించిన సొమ్ము కూడా సుఖంగా భోజనం చెయ్యనీయదు. పాండవులు రాజసూయ యాగ సందర్భంలో ఎందరో రాజులను హింసించారు. ఆ రాజ్యసంపద వారికి సంతోషాన్నివ్వలేదు. 'నెత్తురు కూడే' మిగిలింది. ఈ విషయాన్ని దేవీ భాగవతం ప్రవచించింది.

న్యాయార్జితమైన కలోగంజో ఏదైనా దాన్ని భగవంతుడికి సమర్పిస్తే అన్న ప్రసాదం అవుతుంది. భగవత్‌ ప్రసాదం సంతృప్తినీ, సంతోషాన్నీ ఇస్తుంది.
- డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు 

No comments:

Post a Comment