ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Tuesday, 16 July 2013

రక్షణ కవచం


  'ఓ గంగా మాతా!
నాకు సంపదలూ అధికారాలూ వద్దు! వచ్చే జన్మలో ఒక పక్షిగా పుట్టి, గంగాతీరంలో చెట్టుపై గూడుకట్టుకొని, నీ పవిత్ర శీకరాలతో సేదతీరే వరం ఇవ్వు!' అని వాల్మీకి మహర్షి ప్రార్థించాడు.

గంగానదితో భారతీయ సంస్కృతి పెనవేసుకొని ఉంది. గంగా యమునలు పుట్టిన ప్రాంతాలు ప్రకృతి సౌందర్యానికి నిలయాలు. పవిత్ర భారతావనికి ఉత్తరాన పెట్టని గోడ హిమాలయం. ప్రతి భారతీయుడు దర్శించాలని కలలుగనే పుణ్యక్షేత్రాలకు, తీర్థాలకు నిలయాలు. సదాశివుడి సంచార భూములు. యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్‌, బదరీనాథ్‌- ఈ చతుర్థామాల యాత్ర పరమ పవిత్రం. కాళిందీ పర్వతం వద్ద యమున ఉద్భవిస్తుంది. అక్కడి భాస్వర ఉదకంలో బియ్యం, బంగాళదుంపలు ఉడుకుతాయి. అవే భక్తులకు ప్రసాదం. నలుపు చలువరాతి యుమునాదేవి ప్రతిమను ఆరాధిస్తారు. గంగోత్రిలో గోర్ఖా అమర్‌సింగ్‌ థాపా గంగోదేవి ఆలయాన్ని నిర్మించాడు. గంగ భువికి అవతరించిన భగీరథ శిలను దర్శించి భక్తులు తన్మయులవుతారు. టిబెట్టు నుంచి మానస సరోవర జలాలు గంగోత్రిలో కలుస్తాయి. మందాకినీ శిరోభాగాన కేదారనాథం నెలకొని ఉంది. పాండవులు భారతయుద్ధానంతరం దీన్ని నిర్మించారంటారు. తొమ్మిదో శతాబ్దిలో ఆదిశంకరులు నందీశ్వర విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. నర, నారాయణ పర్వతాల మధ్య, బదరీ వృక్షాల నడుమ వెలసింది బదరీనాథం. పక్కనే అలకనంద. గంగ-అలకనంద, మందాకిని, భాగీరథిగా చీలడంవల్ల ప్రవాహవేగం అదుపులో ఉంటుంది. ఆదిశంకరులు ఈ విష్ణు దేవాలయాన్ని దర్శించి పరవశించారు. తప్తకుండంలో వేడి వూట నీటిలో రోగనివారణ శక్తి ఉన్నదని విశ్వసిస్తారు.

అల్లసాని పెద్దన మహాకవి మనుచరిత్ర ప్రబంధంలో పరవశంతో ఈ పరమ పవిత్ర క్షేత్రాలను స్మరించాడు. సిద్ధుడి పసరు మహిమతో ప్రవరుడు హిమాలయాలకు వెళ్లి చూసింది ఇక్కడి అద్భుతాలనే! ఇక ఇంటికి పోదామని ప్రయత్నిస్తే పాదలేపనం కరిగిపోవడం వల్ల ఎగరలేకపోయాడు. దారి తెలియని ప్రవరుడు విలపిస్తాడు. మిన్ను మన్నుపై పడ్డ చోటికి తెచ్చి పడవేశావెందుకు దేవుడా- అని మొత్తుకుంటాడు.

యాత్రలకు వెళ్లి చిక్కుల్లో చిక్కుకొనేవారి అనుభూతి ఇలాగే ఉంటుంది. మహిమాన్వితమైన హిమాలయాల్లో వేలకొలది ప్రజలు జలవిలయంలో విగతజీవులు కావడమా! మోక్షానికి పోతే మొసలెత్తుకొని పోవడమా! భక్తులపైనా ప్రకృతి ప్రళయ తాండవం? చతుర్థామాల దర్శనంతో అగణ్యపుణ్యం పొందుతామని వెళ్ళినవాళ్లు ప్రవాహం పాలు కావడమేమిటి? పరమేశ్వరుడి ఉనికినే ప్రశ్నించే దుస్థితి! ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు ఇలాంటి ప్రశ్నలు తలెత్తడం సహజం. ఆత్మవిమర్శ చేసుకుంటే సమాధానం స్ఫురిస్తుంది.

ఆధ్యాత్మిక కేంద్రాలను ప్రభుత్వాలు రాబడి కేంద్రాలుగా భావిస్తున్నాయి. సహజ ప్రకృతిని పరిరక్షించుకోవడంలో విఫలమవుతున్నాయి. కైలాస నాథుడి ఏకాంత ధ్యానానికి భగ్నం కలుగుతోంది. ప్రకృతి ఆరాధనే వేద ధర్మమని విస్మరించారు. ఆధ్యాత్మిక కేంద్రాలను విలాస జీవుల విహార భూములుగా తీర్చిదిద్దే ప్రయత్నం జరిగింది. సహజ నదీప్రవాహాలకు అడ్డుకట్టలు నిర్మించారు. కొండలను బద్దలుచేసి భవనాలు నిర్మించారు. అరణ్యాలను హరించారు. భాగీరథి చూస్తున్నది ఈ పాపాలు. ఫలితమే ఈ కోపాలు! మానవ హననానికి కారణం పరమేశ్వరుడా, మన జనమా? ప్రపంచంలో ఎన్నో నాగరికతలు పెరిగీ పెరిగీ, సహజ ప్రకృతిని వికృతిగా మార్చి, చివరకు జలప్రళయంలో రూపురేకలు లేకుండా మాసిపోయాయి. పాశ్చాత్య సంస్కృతిలో అట్లాంటిస్‌ అలాంటిదే! ప్లేటో రాతల వల్ల దాని కథ తెలుస్తోంది. ఇప్పుడు అట్లాంటిక్‌ సముద్రం ఉన్నచోట అది పరిఢవిల్లింది. అపూర్వ సంపదకు, విజ్ఞానానికి అక్కడి నాగరికత నిలయం. మేధా సంపద, వైజ్ఞానిక వైభవంతో తులతూగీ తుదకు తన బరువుకు తానే ఆ సంస్కృతి అంతా... సముద్రంలో కలిసిపోయింది.

ఇప్పుడూ ఆధునిక సంస్కృతి అంతా జలప్రళయంలో లయం అయ్యే కాలం సమీపించిందని కొందరు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదం నుంచి మానవాళిని గట్టుకు చేర్చే మార్గం ఒక్కటే! ప్రకృతిని పనిముట్టుగా గాక పరమపవిత్ర దైవంగా భావించి ఆరాధించాలి.


ఇంత జలవిలయంలోనూ కేదారీశ్వరుడికీ, ఎదురుగా ఉన్న నందీశ్వరుడికీ ఏ హానీ కలగకుండా జలప్రవాహానికి కొట్టుకువచ్చిన బండరాళ్లు రక్షణ కవచంలా నిలిచాయి! పరమేశ్వరుడు మనకు రక్షణ కవచంగా ప్రకృతిని నిర్మించాడు. మనమే మన రక్షణ కవచాన్ని చీల్చి పారవేస్తే ఇక మనకు దిక్కేది? కంచే చేను మేస్తే కాపేమి చేస్తాడు?
                                                       - డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు 

No comments:

Post a Comment