ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Thursday 4 July 2013

భ్రాతృభక్తి

  రామాయణం ఒక జీవిత సూత్రం. ఒక ఆదర్శ పాఠం. భారతీయ సంస్కృతికి ఆధారమైన కుటుంబ జీవితాన్ని సామాజిక ధర్మాన్ని సర్వాంగసుందరంగా చిత్రించిన మహా ఇతిహాసం. సృష్టిలో వ్యక్తుల మధ్య సంబంధాలు ఎంత ఉదాత్తస్థాయిలో ఉండాలో, అలా ఉంటే వారి జీవితం ఎలా భావితరాలకు ఆదర్శప్రాయమవుతుందో అది విశదీకరించింది. పతి ధర్మం, పాలక ధర్మం, పత్నీ ధర్మం, పితృ ధర్మం, భ్రాతృ ధర్మం, భక్త ధర్మం వంటివాటిని నిగ్గుతీసి చూపడం ఈ కావ్యం పరమార్థం.

సౌభ్రాత్ర ధర్మాన్ని గురించి రామాయణం బోధించినట్లుగా విశ్వవాంగ్మయంలో మరెక్కడా కనిపించదు. లక్ష్మణుడితో శ్రీరాముడు 'ఏ దేశంలోనైనా మంచి భార్యలు దొరుకుతారు, మంచి బంధువులు లభిస్తారుకాని, మంచి సోదరులు లభించడం దుర్లభ'మంటాడు. లోకంలో అన్నను అనుసరించి తమ్ముడు ఉండటమే అరుదు. అన్నకు సేవలుచేసే తమ్ముడు ఉండటం ఇంకా అరుదు. అటువంటప్పుడు యౌవనసుఖాలు, భోగభాగ్యాలు సర్వమూ త్యాగంచేసి అన్న కష్టాల్లో తానూ పాలుపంచుకుని అడవుల పాలై అన్నసేవకే జీవితాన్ని అంకితం చేసిన తమ్ములెందరుంటారు... ఒక్క లక్ష్మణుడు తప్ప! శ్రీరాముడి సోదరులు ముగ్గురూ ఆయనకు కేవలం తమ్ముళ్లు కారు. రామాయణంలో రాముడు పరమాత్మ అయితే సోదరులతో సహా ఇతర పాత్రలన్నీ జీవాత్మలే. వారంతా రామభక్తులే.

లక్ష్మణుడికి రాముడే అన్న, తండ్రి, తల్లి. రాముడే దైవం. లక్ష్మణుడు ఆవేశపరుడైనా అన్నపట్ల ఆయనది భక్త్యావేశం. అపరాధుల పట్ల ఆగ్రహావేశం. లక్ష్మణుడు కౌసల్యతో 'అన్న అంటే నాకు అమిత ప్రేమ, అపారభక్తి. ఆయన అగ్నిలో దూకినా, అడవికి వెళ్లినా నేనే ఆయన ముందుంటాను. సూర్యుడు చీకట్లను పారదోలినట్లు మీ దుఃఖాన్నంతా త్రుటిలో తొలగిస్తా'నని ఆవేశపడితే శ్రీరాముడు అనునయిస్తాడు. లక్ష్మణుడు అన్న వెంట అడవులకు వెళ్లడం- నిస్వార్థ త్యాగానికి భ్రాతృభక్తికి పతాకగా నిలిచిన సంఘటన.

తల్లి మాటకు, తండ్రి ఆజ్ఞకు తలవంచి, ఉన్నది వదులుకున్నవాడెంత ఉదారుడో, వంశాచారాన్ని ధర్మతత్వాన్ని తర్కించి వద్దన్నవాడూ అంతే ఉదారుడు, ఉత్తముడు. మహాసామ్రాజ్యాన్ని తోసిపుచ్చిన ఉదారగుణ సంపన్నుడు ధర్మజ్ఞుడు భరతుడు. సామ్రాజ్య వైభవాన్ని, తల్లికాంక్షను భరతుడు తృణీకరించాడు. అడవికి వెళ్లి రాముణ్ని రాజ్యం స్వీకరించాల్సిందిగా ప్రార్థించాడు. కాని, రాముడు తండ్రికిచ్చిన మాట అతిక్రమించనన్నాడు. భరతుడు రామపాదుకలనే అయోధ్యకు, సమస్త ప్రపంచానికీ రక్షగా భావించాడు. రామపాదుకలు రాజ్యం చేశాయి. పాదుకా సేవకుడిగా పాలన వ్యవహారాలు చూస్తూ జీవితం గడిపిన భరతుడి ఆత్మనిగ్రహం, ధర్మశక్తి, త్యాగనిరతి అపూర్వం. భరతుడు పరమ భాగవతోత్తముడు. లక్ష్మణుడు ఎప్పుడూ తాను అన్నగారి పక్కనే ఉండాలనుకున్నాడు. ఉండే ఏర్పాటు చేసుకున్నాడు కూడా. భరతుడికి ఆ అవకాశం లేదు. అన్న లేకుండానే పద్నాలుగేళ్లు గడిపాడు. పాదుకలే ఆయనకు భగవంతుడు. వాటిలోనే ఆయన నిరంతరం భగవంతుని చూడగలిగాడు.

సాలోక్య, సారూప్య, సాయుజ్య సామీప్యాల్లో లక్ష్మణుడు వాంఛించినది సామీప్య మోక్షం. తన అన్నగారే ప్రత్యక్ష దైవం ఆయనకూ. అందుకే రాముడితో అడవికి వెళ్లాడు. 
భరతుడిది సారూప్య భక్తి. జటావల్కలధారియై పద్నాలుగేళ్లు గడిపాడు. అన్నగారి పాదుకలకు నిరంతరం ధూపదీప నైవేద్యాలు ఒసగడమేగాక, రాచకార్యాలన్నీ ఆ పాదుకలకే నివేదించిన భక్తాగ్రేసరుడు.

శతృఘ్నుడూ రామభక్తుడే. ఇతడు భక్తుడి భక్తుడు. రామాయణంలో మొదటి నుంచి రాముని అనుసరించిన తమ్ముడు లక్ష్మణుడైతే, భరతుని అనుసరించినవాడు శత్రుఘ్నుడు. భరతుడంటే ఇతడికి ఉండే ఆప్యాయత విశిష్టమైనది. భరతుడి మనసును, మాటను గ్రహించి మసలుకొనేవాడు. రాముడంటే అపరిమితమైన గౌరవం. అన్నగారి ఎదుటకు రావాలంటే ఎందుకో ఒకవిధమైన జంకు. రాముడెప్పుడు ఎదురుపడినా శిరస్సు వంచి నిలిచి నిలువెల్ల భక్తిగా చేతులెత్తి నమస్కరించేవాడు. భరతుడు రామభక్తుడైతే, భరతుడి భక్తుడు శత్రుఘ్నుడు. 
ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మాన్ని అణువంతైనా అతిక్రమించని జ్ఞానమార్గావలంబి రాముడు. లక్ష్మణుడిది కర్మమార్గం. భక్తిమార్గం భరతుడిది. శత్రుఘ్నుడిది భరతుడి బాటే.
                                                  - డాక్టర్‌ దామెర వేంకట సుర్యారావు 

No comments:

Post a Comment