ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Monday 8 July 2013

మరపు నిత్యావసరం

    నిత్యజీవితంలో ప్రతి ఒక్కరికీ ప్రతికూల సందర్భాలు ఏదో రూపంలో, ఎప్పుడో ఒకప్పుడు ఎదురవుతూనే ఉంటాయి. అనుకున్నది అనుకున్నట్లుగా జరగకపోవటం, వూహించినదొకటైతే జరిగేది మరొకటి కావడం, మంచికి పోతే చెడు ఎదురుకావడం... ఇలా... అవి ముఖ్యమైనవా కాదా... ఆలోచించదగినవా కావా అన్న విషయాల్ని పక్కన పెడదాం. ఇటువంటివి తరచూ ఎదురైనప్పుడు వాటి ప్రభావం మనమీద తప్పక పడుతుంది. నిరాశాభావాన్ని కలగజేస్తుంది. ఇటువంటి పరిణామాలు మనోఫలకంపైన ముద్రవేస్తాయి. ఆ తరవాత నిరుత్సాహం మనసు నిండా అలముకుంటుంది. అది దట్టంగా కమ్ముకోకముందే ఎప్పటికప్పుడు మరచిపోయే దిశలో ప్రయత్నాలు సాగించాలి. జరిగిన, జరుగుతున్న మంచివైపు ఆలోచనలను మళ్ళించాలి.

జరిగినది ఏదైనా మన పరిధిలోకి రాకపోవచ్చు. ప్రమేయమూ లేకపోవచ్చు. అయితే మరచిపోయేందుకు ప్రయత్నం చేయడం ద్వారా దాన్ని జ్ఞాపకాల్లో నిక్షిప్తం చేసుకునే ధోరణిని తప్పించవచ్చు. ఇతరులు మన సలహాను పాటించకపోయినా మన పద్ధతిలో మనం కొంత నియంత్రణ చేసుకునే అవకాశముంది. అసలు విద్య అంటే ఏమిటి? పట్టభద్రులను తయారుచేయడం విద్య ఉద్దేశమా? కాదు. జీవించే కళకు అది రాజమార్గం ఏర్పరుస్తుంది. 'విద్య' ఆలోచింపజేస్తుంది. సక్రమ జీవన విధానాన్ని రూపొందిస్తుంది. ఎదురయ్యే అనుభవాలను అంచనా వేయగల శక్తిని ఇస్తుంది. సాధ్యాసాధ్యాలను లెక్కగట్టి దానికి మన శక్తి సామర్థ్యాలు ఎంతవరకూ సరిపోతాయో చెబుతుంది. విద్యావంతుడైనట్లయితే విలువలను బేరీజు వేసుకుని చేదు అనుభవాలను ఎలా మరచిపోవాలో తెలుసుకుంటాడు. ఇక్కడ సమస్య కేవలం మరచిపోవడం, పోలేకపోవడం కాదు. అన్ని రకాల అసంతృప్తుల మధ్యా జీవిస్తూనే వాటి ప్రభావాలకు లోనుకాకుండా ఉండగలగడం. ఈ అలవాటు ఎన్నో మంచి విషయాలకు మార్గం చూపిస్తుంది. మానసిక క్షోభను తప్పిస్తుంది. శక్తి సామర్థ్యాలు వృథా కాకుండా కాపాడుతుంది. నిరాశామయ భావాల్లో చిక్కుకోకుండా రక్షిస్తుంది. ఇవన్నీ కూడా సుఖమయ, అర్థవంతమైన జీవితానికి అవసరం. ప్రకృతి సిద్ధాంతాన్ని మనం మార్చలేం. కాబట్టి మనలోనే మార్పు తెచ్చుకోవాలి. అప్పుడే సుఖమయ జీవితానికి మార్గం సుగమం అవుతుంది.

మరచిపోవలసిన విషయాలు కొన్ని ఉంటాయి. వాటిని మరచిపోవడానికి సిద్ధం కాకపోతే నష్టమే. చేదు జ్ఞాపకాలకు దురదృష్టకరమైన ఆలోచనలు ఆహారాన్ని అందిస్తుంటాయి. వాటిని అనుక్షణం నెమరు వేసుకుంటూ పోతే వ్యక్తిత్వం పైన 'చెడు' ప్రభావం పడుతుంది. 
మంచి, చెడు రెండు రకాల జ్ఞాపకాలు. 'మంచి' శక్తిని అందిస్తే, 'చెడు' నిర్వీర్యం చేసి బతుకును దుర్భరం చేస్తుంది. ఈ తేడాను గుర్తించి విచక్షణను పెంచుకోవాలి. 

'జ్ఞాపకం' మెదడులోని అంతర్భాగం. దాని నుంచి అంత తేలిగ్గా తప్పించుకోలేం. ఒక్కటే మార్గం- చైతన్యంలో ఉండే బుద్ధికి ఆ బాధ్యతను అప్పజెప్పాలి. మరచిపోయే అలవాటు దీనికి దోహదపడుతుంది. 
జ్ఞాపకం సక్రమమైనదైనట్లయితే ఆశావహ దృక్పథాన్ని, చెడైనట్లయితే నిరాశా ధోరణిని కలిగిస్తుంది. దీన్ని అదుపులో పెట్టగలిగే నైపుణ్యాన్ని మనిషి సంపాదించుకోవాలి.
                                                                  - మంత్రవాది మహేశ్వర్‌

No comments:

Post a Comment