జనని గర్భాన పుట్టిన నాటి నుంచి ధరణి గర్భంలో కలిసిపోయేవరకు లోకంలో మనిషిని అనుక్షణం వెంటాడేవి దుఃఖాలు. వీటికి అంతం లేదు. ఒక స్వరూపం లేదు. ఒక స్వభావం లేదు. మనిషి బతికి ఉన్నంతకాలం ఏ క్షణంలోనైనా, ఏ సందర్భంలోనైనా, ఎక్కడైనా దుఃఖాలు సంభవించవచ్చు. ఈ దుఃఖాలు తొలగిపోవాలంటే ఏమి చేయాలి? బుద్ధి తెలిసిన నాటి నుంచే మనిషి అందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ అవి తొలగిపోవడం అంత సులభం కాదనీ, వాటిని నిర్మూలించాలంటే విశేష ప్రయత్నమే చేయాలనీ తెలుసుకున్నాడు. త్రిగుణాలకు లోబడిన అతడి ప్రవృత్తి దుఃఖాన్ని ఎంతమాత్రం దూరం చేయలేకపోతోంది.
మనిషికి కలిగే దుఃఖం సహజమైందా? లేక ఏదైనా కారణంతో వచ్చి చేరిందా? దీనిపై వేదాంతులు సుదీర్ఘ చర్చలు చేశారు. వారి శోధనలో తేలిందేమిటంటే- దుఃఖం మనిషికి సహజంగా ఉండేది కాదనీ, కారణంతోనే వస్తూపోతూ ఉంటుందనీ. సహజంగా ఉండేదే అయితే మనిషికి ఎల్లప్పుడూ దుఃఖాలే ఉండాలి. సుఖాలు అసలే ఉండకూడదు. అయితే అలా ఉండటం లేదు కదా! దుఃఖాలు వస్తున్నాయి, పోతున్నాయే తప్ప స్థిరంగా ఉండటం లేదంటే ఏదో కారణం ఉండి తీరాలి. ఏమిటా కారణం?
మనిషి మెదడులో ఆలోచన ప్రారంభం అయింది. అప్పుడు మనిషి లోకంలోని అన్ని వర్గాలవారినీ పరిశీలించడం ప్రారంభించాడు. ఒక నిరుపేద అయిన సామాన్య జనుడు మొదలుకొని దేశాన్ని పాలించే మహారాజు దాకా అందరిలో ఏ ఒక్కరైనా దుఃఖం లేకుండా ఉన్నారా? శోధించడం మొదలుపెట్టాడు. అతడి శోధనలో ప్రపంచంలోని ఏ ఒక్కరూ దుఃఖానికి అతీతులైనవారు కనబడలేదు. ప్రతి ఒక్కరూ, ఏదో ఒక సమయంలో దుఃఖాన్ని అనుభవిస్తున్నవారే అని తేలింది. అందువల్ల దుఃఖానికి మూలకారణం ఏదో ఒకటి ఉండితీరాలి అనే జిజ్ఞాస మొదలైంది. మానవాతీతులైన దేవతలకూ, రాక్షసులకూ కూడా దుఃఖాలు తప్పలేదు. దేవతలకు రాక్షసుల కారణంగా దుఃఖాలు సంభవించాయి. రాక్షసులకు దేవతలవల్ల దుఃఖాలు కలిగాయి. దేవ, మానవ, రాక్షసులకు వారి వారి శరీరాలు ఉన్నాయి. ఆ శరీరాలే దుఃఖాలకు మూలకారణాలని మనిషి తెలుసుకొన్నాడు.
ఆత్మకు దుఃఖం ఎన్నడూ లేదు. శరీరానికే దుఃఖం సంభవిస్తుంది. అత్యంత కష్టతరమైన వ్యవసాయం, బరువులు మోయడం వంటి పనులు చేసే మనిషి ఆ దుఃఖాన్ని మరచిపోవడానికి పనిచేస్తూ పాటలు పాడుతుంటాడు. కనుక మనిషికి సుఖం అనేది మాయే. శరీరం ఉన్నందువల్లనే ఆకలిదప్పులూ, ఎండవాన చలి బాధలు, విష కీటకాల వల్ల ఆపదలూ, రోగాలూ... ఇలా ఎన్నో ఎన్నెన్నో! ఇవన్నీ శరీరం ఉన్నందువల్లనే కలుగుతున్నాయి. దేవతలు, రాక్షసులు శరీరధారులైనందువల్లనే పరస్పరం కలహించుకొని, యుద్ధాలతో, శాపాలతో దుఃఖాలు అనుభవించారు. కనుక శరీరధారణే దుఃఖాలకు మూలం.
మనిషి అజ్ఞానంతో తన దేహాన్ని ఆత్మగా భావించి దుఃఖాలు కొనితెచ్చుకుంటున్నాడు. శరీరం వేరనీ, ఆత్మ వేరనీ తెలిస్తే దుఃఖం ఉండదు. ప్రపంచం అంతా ఒక శరీరమే. శరీరం శాశ్వతం కాదు. ఏనాటికైనా నశించిపోతుంది. ఆత్మ ఒక్కటే నిత్యం, శాశ్వతం. ప్రపంచం ఎంత అందంగా ఉన్నా, అది ఎప్పటికో ఒకప్పటికి నశించిపోయేదే కాని శాశ్వతంగా ఇలాగే ఉండిపోదు. అలాగే మానవశరీరం కూడా. అది ఎన్నటికైనా నశించిపోవలసిందే కనుక శాశ్వతత్వం లేదు. శాశ్వతం కాని శరీరం వల్లనే మనిషికి దుఃఖాలు సంభవిస్తున్నాయి. మనిషి తన శరీరాన్ని చూసుకొని నేను గొప్ప అందగాణ్ననీ, నేను గొప్పవంశంలో పుట్టినవాణ్ననీ, గొప్ప పదవి గల వాణ్ననీ, బాగా డబ్బుగలవాణ్ననీ విర్రవీగుతుంటాడు. కాని వాడి శరీరమే శాశ్వతం కాదని తెలుసుకోడు. శరీరాన్ని చూసుకొని మురిసిపోయే మనిషి ఆత్మ ఉన్నదనే సంగతిని మరచిపోతూ అజ్ఞానాంధకారంలో పడి కొట్టుకొనిపోతుంటాడు.
శాశ్వతం కాని శరీరాన్ని చూసుకొని, అదే శాశ్వతం అనుకొంటున్నందువల్లనే మనిషికి దుఃఖాలు సంభవిస్తున్నాయి. శరీరాన్ని చూసి, అదే గొప్పదని అనుకొన్నప్పుడే దుఃఖాలు సంభవిస్తున్నాయి. శరీరం గొప్పది కాదనీ, అది నశించిపోయేదనీ, ఆత్మ ఒక్కటే నిత్యం అనుకొన్నప్పుడే మనిషికి దుఃఖం దూరమవుతుంది. కనుక మనిషి తెలుసుకోవాల్సిన సత్యం ఒక్కటే- 'శరీరం ఎన్నటికీ శాశ్వతం కాదు. శరీరం వల్లనే దుఃఖాలు కలుగుతున్నాయి. కనుక మళ్ళీ శరీర రూపమైన జన్మలేకుండా పరమాత్మలో లీనమయ్యే సాయుజ్యముక్తి కలగాలి. అదే శాశ్వతం!'
- డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ
No comments:
Post a Comment