ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Sunday 15 September 2013

ముక్తికి మార్గం


 'కూర్చోవడానికి నాకు కాస్త చోటిస్తే ఆ తరవాత నిద్రపోవడానికి కావలసిన జాగా నేను సంపాదించుకోగలను' అనేది ఆంగ్ల సామెత. అరిషడ్వర్గాల విషయంలోనూ ఈ సామెత వర్తిస్తుంది. అరిషడ్వర్గం అంటే ఆరుగురు శత్రువులు. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనేవి వాటి పేర్లు. ఇవి బయటికి కనిపించని శత్రువులు. వీటిది రాక్షస ప్రవృత్తి. చూస్తూ ఉండగానే అలాగలాగ ఆకాశం మీదికి ఎదిగిన వామనుడు పాతాళ లోకంలోకి బలిచక్రవర్తిని తొక్కివేసినట్టుగా గోరంతగా ఉన్న కామం (కోరిక) కూడా కొండంతగా పెరిగి తన మిత్రువైన క్రోధాదులతో సహా మనల్ని మూకుమ్ముడిగా ముట్టడించి మరి లేవనివ్వకుండా మట్టి కరిపించి మనల్ని నాశనంచేస్తుంది. అందుచేత మనమంతా మనసును కట్టడి చేసుకోవాలి. నిగ్రహాన్ని అలవరచుకోవాలి. అనంతంగా ఉండే కోరికల్ని అదుపులో పెట్టుకోవాలి. అంతటితో తృప్తిచెంది ఆగిపోకుండా అసలు కోరికలనేవే లేకుండా చేసుకోవాలి. అప్పుడే మనసుకు శాంతి, ఆనందం లభిస్తాయి. ఆ తరవాతనే మోక్షానికి దారి సుగమమవుతుంది.

ఇంద్రియాలను వశపరచుకోవడానికి సాధన అవసరమని అనుభవజ్ఞులు చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఇంద్రియాలు ఎంతో శక్తిమంతమైనవి. మనల్ని అవి బలవంతంగా విషయవాసనలవైపు అంటే, కోరికలవైపు మళ్ళిస్తాయి. మనసును వాటి అధీనంలో పెట్టుకుంటాయి. ఇంద్రియాలు విద్వాంసుని సైతం అస్థిరపరుస్తాయని వ్యాసభగవానులు వెల్లడించారు. అందువల్ల మానవులకు మనోనిగ్రహం అవసరమవుతుంది.

ఇంద్రియ నిగ్రహంవల్ల మనకు సుఖసంతోషాలు లభిస్తాయి. ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. ఈ స్థితిలోనే మోక్షం ప్రాప్తిస్తుందని పెద్దలంటారు. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం మొదలైన జ్ఞానేంద్రియాల్లా చిత్తం (మనసు) కూడా ఒక ఇంద్రియం. ఈ ఇంద్రియాలకు సంబంధించిన శబ్దస్పర్శాది బాహ్యవిషయాల నుంచి మనసును మరల్చి దాన్ని అంతర్ముఖంగా పయనింపజేస్తే అప్పుడది అంతరాత్మలో అచంచలంగా సుస్థిరంగా కొలువై ఉండగలుగుతుంది. ఈ విధంగా సర్వేంద్రియాలను విషయవాసనల నుంచి దూరంగా ఉంచి భగవంతుడిపట్ల మనసును లగ్నం చేసుకొంటే మోక్షప్రాప్తి కలుగుతుందని గీతలో గోవిందుడు తెలియజెబుతాడు. ఇంద్రియ నిగ్రహంతోపాటు ఆత్మచింతన- ఈ రెండూ మోక్షానికి అవసరమని మనం తెలుసుకోవాలి.

మనసు స్వచ్ఛమైనది. నిర్మలమైనది. తెల్లకాగితం లాంటిది. ఏ మచ్చలూ మరకలు లేనిది. మనకళ్లముందు ఎన్నో దృశ్యాలు, ఎన్నెన్నో వస్తువులు, సుందరమైనవి, ఆకర్షణీయమైనవి కనిపిస్తూ ఉంటాయి. వాటిని గురించి మనసు మొదట ఆలోచిస్తుంది. ఆ తరవాత అటువైపు మొగ్గుతుంది. ఆకర్షితమవుతుంది. ఆసక్తి పెంచుకుంటుంది. వాటి లో తనకు నచ్చినవాటిని కావాలని కోరుకుంటుంది. అనుభవించాలని ఆకాంక్షిస్తుంది. ఈ ఆకాంక్షనే లేదా కోరికనే కామం అంటారు. కోరికను తీర్చుకోవడానికి మనం చేసే పనిలో అడ్డుతగిలిన వారిమీద క్రోధం కలుగుతుంది. ఈ విధంగా కామం వెన్నంటే క్రోధం కూడా మనలో ప్రవేశిస్తుంది. కామ క్రోధాల అనుబంధం విడదీయరానిదని పెద్దలందుకే అంటారు. క్రోధంవల్ల ముఖం ఎర్రగా జేవురిస్తుంది. కళ్లు చింతనిప్పులవుతాయి. ముఖం వికృతంగా తయారవుతుంది. దాంతో మనలోంచి వివేకం పలాయనం చిత్తగిస్తుంది. అవివేకం కారణంగా ఏం చేస్తున్నామో మనకే తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. మన శరీరాన్ని మనమే మరిచిపోతాం. బుద్ధి నశించి చేయకూడని ఏ చెడ్డపనినో చేసేస్తాం. నాశనమవుతాం. కాబట్టి మానవులకు ఇంద్రియ నిగ్రహం ఎంతో అవసరం.

సాధారణంగా మనం చేస్తున్నదేమిటంటే- ఆకర్షణీయంగా కనిపించే బాహ్య వస్తువుల గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. దైవధ్యానం గురించి అంతగా పట్టించుకోం. ఈ వైఖరి ఎట్టి పరిస్థితిలోనూ మానవుడికి మేలు చేయదు. విషయవాంఛలనుంచి మనసును దైవం వైపు మళ్ళించాలి. ఇందుకోసం రాగద్వేషాలు లేకుండా మనసును నిర్మలంగా ఉంచుకోవడం అవసరం. మనోనైర్మల్యం వల్లనే ఆనందం లభ్యమవుతుంది. దుఃఖం అంతరిస్తుంది. కష్టాలు ఉండకూడదనీ, ఆనందంగా ఉండాలనే గదా ప్రతి ప్రాణీ కోరుకునేది!

ఇంద్రియాలను, వీటితోబాటు మనసును స్వాధీనంలో ఉంచుకున్న వ్యక్తికి శాంతి, ఆనందం లభిస్తాయన్నది కృష్ణపరమాత్మ గీతలో చెప్పిన మాట. భోగలాలస లేని నిర్మలమైన మనసే మోక్షమని వసిష్ఠ గీత బోధిస్తోంది. ఆత్మతో సమానంగా చిత్తం కూడా నిర్మలమై భాసిల్లే స్థితినే మోక్షమంటారని పతంజలి యోగశాస్త్రం వెల్లడిస్తోంది. అందుకే మనో నిగ్రహంతోనే ముక్తికి మార్గం సుగమమవుతుందని గ్రహించాలి.
- కాలిపు వీరభద్రుడు

No comments:

Post a Comment