ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Sunday 29 September 2013

యాత్రాఫలం


పూర్వీకులు భగవదారాధన కోసమో, జీవితంలో ఏర్పడ్డ ఒత్తిళ్లను అధిగమించడానికో సంవత్సరానికోసారైనా యాత్రలకు వెళ్ళేవారు. అదొక సనాతన సంప్రదాయమైంది. సాధారణంగా వయసుపైబడిన వాళ్లు ఆధ్యాత్మిక చింతన అలవరచుకొని దేవుణ్ని వెతుక్కుంటూ తీర్థయాత్రలు చేస్తూ ఉపశమనం పొందేవారు. వేద భూమి అయిన మనదేశంలో అసంఖ్యాకమైన యాత్రాస్థలాలు ఏర్పడ్డాయి. వేర్వేరు స్థల పురాణాలతో దేవాలయాలు అవతరించాయి.
చాలావరకు యాత్రాస్థలాలు నదీ పరీవాహక ప్రదేశాల్లోనో, కొండలమీదనో ఉన్నాయి. అక్కడైతే పవిత్రంగా ఉంటాయనే భావన ప్రబలంగా ఉంది.

యాత్రలకు వెళ్ళి దైవదర్శనం చేసుకొని కంచు, రాగి పూజాసామగ్రిని, పుస్తకాలను తెచ్చుకుంటూ ఉంటారు. అక్కడ ప్రవహించే నదీ జలాలను, ప్రసాదాలను తెచ్చి ఇరుగుపొరుగులకు పంచడంలో ఎందరో తృప్తి పొందుతారు. ఆ దేవుళ్ల కథలను పూసగుచ్చినట్టుగా చెప్పేవారూ ఉన్నారు. అవన్నీ యాత్రలో అంతర్భాగాలే.

ప్రయాణ సదుపాయాలు పెరిగి, నాగరికత వెల్లివిరిసి యాత్రాస్థలాల్ని 'గొలుసుకట్టు'గా దర్శించే ఏర్పాట్లు జరిగాయి. దేవాలయాల సమీపంలో సత్రాలు, ఉచిత భోజన ఏర్పాట్లు రావడంతో యాత్రలకు వెళ్ళేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రత్యేక పూజలు ఏర్పడ్డాయి. ధ్యానం కోసం మందిరాలు ఏర్పాటయ్యాయి. నిశ్శబ్దానికి గౌరవ ప్రదమైన స్థానం దక్కింది. యాత్రల కోసం ప్రత్యేక నిధులు ఏర్పరచుకొని కొన్ని కుటుంబాలు ఉమ్మడిగా వెళ్ళడం చూస్తూనే ఉన్నాం.

హిమాలయాల్లో అమర్‌నాథ్‌ మంచులింగ యాత్ర నుంచి పక్కనే ఉన్న గ్రామదేవతను దర్శించడం వరకు మన వ్యవహార శైలిని మెరుగుపరుస్తున్నవే. మానసిక క్రమశిక్షణను అలవాటు చేస్తున్నవే. యాత్రలో వివిధ భాషా సంస్కృతుల్ని మనం గమనిస్తుంటాం. వాటిని గౌరవించి శుచిగా, శుభ్రంగా ఆ ప్రాంతాల రీతి, రివాజులను ఆపాదించుకొని ధన్యజీవులమవుతాం. కాశీలో గంగాదేవికిచ్చే హారతి జీవితంలో ఒక్కసారైనా చూసి తీరాలి. హరిద్వార్‌, సోమ్‌నాథ్‌, వైష్ణోదేవి, శిరిడి మొదలైన తీర్థయాత్రల్లో వైవిధ్యాన్ని గమనిస్తూ మరిన్ని యాత్రలు చేయాలనే ఉత్సుకతతో మనసును పునీతం చేసుకుంటారు. ఆ హారతులతో మనసులు పులకించి చైతన్యవంతులవుతారు. యాత్ర ప్రారంభించి తిరిగి ఇంటికొచ్చే వరకు జరిగే ప్రతి అంశం మనసులో పవిత్రమైన ముద్రగా మిగిలిపోతుంది. పుస్తకాలు చదివేకన్నా ఎక్కువ అనుభవాన్ని గడిస్తాం. దైవ సందేశం మనసును సూటిగా తాకుతుంది.

యాత్రలకు ఒంటరిగా కాకుండా మిత్రులతోనో ఇరుగుపొరుగులతోనో కుటుంబ సభ్యులతోనో వెళ్ళడం స్నేహసంబంధాన్ని ఏర్పరుస్తుంది. తిరుమల కొండకు నడక దారిన బయల్దేరేటప్పుడు గుంపుగా వెళ్ళడంవల్ల శ్రమను మరిచిపోతాం. గోవిందనామాల పాటలతో పరిసరాలు మార్మోగడం గమనిస్తాం. హారతిలో మూలవిరాట్టు దేదీప్యమానంగా వికసించడం చూస్తే 'అంతర్యామి' విశేషం అవగతమవుతుంది.

యాత్ర మానసిక క్రమశిక్షణనిస్తుంది. ఉల్లాసాన్ని కలిగిస్తుంది. భగవన్నామస్మరణ చెడు ఆలోచనల్ని దూరం చేస్తుంది. చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుని, కోరికల్ని, కష్టాల్ని నివేదించుకొని తేలికపడ్డ మనసుతో మంచి మార్గంలో నడుస్తానని శపథం చేసుకోవడం దీక్షగా అనుకోవాలి. చాలామంది పాపపరిహారంగా హుండీల్లో ధనం, నగలు గుమ్మరించి బయటపడి- ధనాకాంక్షతోనూ, స్వలాభాపేక్షతోనూ మళ్ళీ తప్పులు చేస్తుంటారు. అలాంటివాళ్లకు యాత్రాఫలం లభించదు. సర్వాంతర్యామి నిత్యం మనల్ని గమనిస్తూనే ఉంటాడు. ధర్మరక్షణను పెడచెవిన పెట్టినవాళ్లకు అశాంతి తప్పదు. ఆరాధనాభావం ఉన్నవారికి తృప్తి, సంతోషం అధికపాళ్లలో లభిస్తాయి. అహంకారం, మొండితనం, బలప్రదర్శన, కామక్రోధాలకు తలవంచి పరులను నిందించేవారు భగవదారాధనే మరిచిపోతారని శ్రీకృష్ణుడు గీతోపదేశం చేశాడు. నరకానికి ద్వారాలైన అవి మనిషిని సర్వనాశనం చేస్తాయి. వాటిని జయించి దైవం ముందు మనసు పెట్టి సాధుజనులను ఆదుకుంటూ నిజాయతీ, దానగుణం, సాత్విక స్వభావం పెంపొందించుకొని మనసులో జయభేరి మోగించడమే మోక్షమార్గం.

ప్రాపంచిక నిజాలు తెలుసుకోవడానికే యాత్రలు చెయ్యాలి. విలాసం కోసం కానేకాదు. ఆలయాలు దర్శించినప్పుడు దానధర్మాలు చేస్తాం. సమీప నదుల్లో వంశవృక్షంలోని పెద్దలను తలచుకొని గతాన్ని నెమరు వేస్తాం. వారు మనకు నేర్పిన జీవన సరళిని జ్ఞప్తికి తెచ్చుకోవడంలో నివాళి ఉండనే ఉంటుంది. ఆ సంస్కారాలు పెంపొందించుకుంటే 'యాత్ర' సఫలమైనట్లే. శరీరాన్ని, మనసును ఎప్పటికప్పుడు శుభ్రపరచుకొని నడచుకునేదే 'జీవనయాత్ర'.
- గుడిమెట్ల గోపాలకృష్ణ 

No comments:

Post a Comment