ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Thursday 26 September 2013

బండెళ్లిపోతోంది


  ఓ వృద్ధురాలు ఆవేదన చెందుతోంది... పయనానికి సమయం ఆసన్నమైందనీ, పరంధాముని కొలిచే అవకాశమే రాలేదనీ, ఇక సమయం లేదనీ. ఇంతకాలం ఏం చేశావని మనం ఎద్దేవా చేయకూడదుగానీ ఆమె మరీ ఇంత నిర్లక్ష్యం చేసి ఉండరాదు. అయినా సరే... ఆమె మరీ ఇంత నిరాశపడే అవసరమూ లేదు. కాలాన్ని మనం ఎలా లెక్కలు కడతాం? నిమిషాలు, గంటలు, దినాలు, వారాలు, నెలలు, సం...! కాదు. సమయాన్ని మనసుతో లెక్క కట్టాలి. మనసుతో కొలుచుకోవాలి. మనసుతో అధిగమించాలి.

ఆ వృద్ధురాలి బాధ ఆమెది మాత్రమే కాదు. ఎందరిదో. జీవితమంతా పనులు, బాధ్యతలు, బాధలు, మనోవేదనలు... ఎన్నని! ఎక్కడ తీరిక? అసలు భగవంతుడనే వాడొకడున్నాడనే, 'ఉన్నాడా?' అనే ఆలోచనకైనా అవకాశం ఉందా? సంసారం అనే సాగరం, అలలు, పాములు, మొసళ్లు, తుపానులు... వూపిరాడని పోరాటం. అయినా వూపిరాగని ఉక్కిరిబిక్కిరి. ఔను... దేవుడి లెక్క దేవుడిది. వూపిరి ఆయన చేతిలోది. ముక్కులోని ఈ 'శ్వాస హంస' రెక్కలు కొట్టుకుంటూ ఉన్నా, తోక తెగి ఎగరలేక హింసపడుతున్నా రుణం తీర్చేదాకా ఆ రుణదాత లెక్కలు కడుతూనే ఉంటాడు. రెక్కలు కత్తిరిస్తూనే ఉంటాడు. ఎందుకీ బాధలు! చిన్నప్పుడు అమ్మ చెప్పలేదూ, నానమ్మ బోధించలేదూ? బడికెళ్లే దారిలో గుడి లేదూ, అందులో జేగంటలు మోగలేదూ? ఔను. దేవుడనే అవగాహన మన పుట్టుకతోనే ఉంది. ఉగ్గుపాలతోనే విశుద్ధి, అనాహత, మూలాధార, స్వాధిష్ఠాన, మూలాధార చక్రాల వరకూ దిగింది. మనమే పెరిగి తెలివి మీరిపోయి పొట్టి అయిపోయిన గౌనులా, చొక్కాలా భగవత్‌ స్పృహను విడిచి పారేశాం. పెద్దవాళ్లమైపోయాం కదా? చదువు, పెళ్లి, భర్త (లేదా భార్య), పిల్లలు, సంసారం, సంపాదన, విషయ సుఖాలు...! ఈ విషయ (విష)లోలత్వం మధ్య భగవంతుడనే ఆ బ్రహ్మాండ స్వరూపం మననుంచి పైపైకి అంతరిక్షంలోకి, అనంతంలోకి వెళ్లిపోతూ తగ్గిపోయి, చిన్నదై, సూక్ష్మమై, అగమ్యగోచరమై అంతర్థానమైపోయింది. కల్తీ అయిపోయిన ఈ ప్రాపంచిక ఆదరువులతో మనసు, దేహం, విషమయమైపోయి చివరి ప్రయాణానికి సిద్ధమవుతున్నాం. మరి అలవాటులేని 'రామా' అనే నామం ఇప్పుడు పలుకుతుందా? 'దేవీ' అనే పిలుపు ఇప్పుడు అలవడుతుందా? అలవరచుకుందామంటే, అలవాటు చేసుకుందామంటే- సమయమేదీ? వేళ్లలోంచి నీళ్లలా నిశ్శబ్దంగా జారిపోయింది. రిక్తహస్తాలతో మిగిలిపోయింది వృద్ధురాలు. కాలిన చేతులతో. ఇప్పుడు పట్టుకుంటే ఆకులు పనిచేస్తాయా- చేతులు కాలాక?

అలా నిరాశచెందాల్సిన అగత్యం లేదు. నిజమే... ధన్యం చేసుకోవాల్సిన మానవ జన్మను వ్యర్థం చేసుకున్నాం. దుర్వినియోగం చేశాం. పనులు, తప్పనిసరి బాధ్యతలు, ఆటంకాలు, అవరోధాలు... సమయమేదీ, అవకాశమేదీ? పనులు! ఏం పనులు? భగవత్‌ ధ్యాస ఒక పనా?! అదేం!? పూజ పని కాదా? అర్చన పనికాదా? షోడశోపచారాలకు సమయం పట్టదా? నిజమే... అదంతా పూజే. నిజమే. కానీ... అదే పూజ కాదే? నిజమైన పూజకు పనితో సంబంధం లేదు. పనిచేసే పనిముట్లు పంచేంద్రియాలు. మరి మనసేం చేస్తోంది? దైవస్మరణ, మనన, ధ్యాస, ధ్యానం... వీటికి శరీరంతో, ఇంద్రియాలతో పనిలేదు. మనసు చాలు. నిజమే... లెక్కలోకి తీసుకుంటే మనసుకూడా ఒక ఇంద్రియమే. అదికూడా లుప్తమైపోయే దశ వస్తుంది. రావాలి. అప్పుడు జీవాత్మ పరమాత్మలో రమిస్తూ మిగిలిపోతుంది. అంతవరకూ మనసును మనం నిరభ్యంతరంగా ఉపయోగించుకోవచ్చు. మన బరువులతో, బాధ్యతలతో మనసుకు సంబంధం లేదు. ఆటంకమూ ఉండదు. ఏవైనా, ఎవరైనా శరీరాన్ని ఆపగలరుగానీ- మనసును ఆపలేరు. భగవంతుడికి కావలసిందీ అదే. మనసు. ఆ వృద్ధురాలికి ఒక జీవితకాల సమయం లభించింది- మనసును యథేచ్ఛగా, అవరోధ రహితంగా భగవంతుడి పాదాలవద్ద నియమించేందుకు. అవగాహనా లోపంవల్ల దాన్ని ఇంద్రియాలతో మమేకం చేసి విషాన్ని మప్పి పరమాత్ముడనే అమృతపానాన్ని కోల్పోయింది. ఆమె చేసిన పొరపాటును మనం అర్థం చేసుకుందాం. అవగాహన పెంచుకుందాం.

భగవంతుడు ఇంద్రియాలకు సంబంధించినవాడు కాదు. ఆయన ఆరాధనకు వయసుతో, ఆయుఃప్రమాణంతో కూడా పెద్దగా పనిలేదు. వృద్ధురాలు పశ్చాత్తాప్పడొచ్చుగానీ పూర్తి నిరాశ చెందాల్సిన పనిలేదు. జీవితమంతా సాధన చేసినా ఆధ్యాత్మికత అంటే, అచ్యుతుడంటే ఏమిటో, ఎవరో అవగాహనలోకి రానివాళ్లున్నారు. సాధన కాలపరిమితికి సంబంధించినది కాదు. (ప్రహ్లాదుడు, మార్కండేయుడు, పరీక్షిత్తు... ఎంత కాలాన్ని వెచ్చిస్తే భగవంతుణ్ని పొందారు?) దానిది మనోధర్మం. మనో ప్రమేయంలేని సాధన సాధించేది శూన్యమే. వృద్ధాప్యం భక్తి సాధనకు అనర్హత కాదు. పూర్తి ఆటంకమూ కాదు. కాకపోతే వీలైనంత తొందరగా సాధన ప్రారంభిస్తే అన్నివిధాలా శ్రేయస్కరం.
- చక్కిలం విజయలక్ష్మి 

No comments:

Post a Comment