ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Tuesday 24 September 2013

ప్రేరణ కోసం అన్వేషణ

  నలో చాలామంది 'జీవితం ఎందుకు ఉత్సాహంగా ఉండటం లేదు... విసుగ్గా ఉంటోంది' అని పదేపదే అనుకోవడం చూస్తుంటాం. ఏదో యాంత్రికంగా ఉదయం నిద్రలేవడం, కడుపులో అంత పడేసుకోవడం, పనుల్లో పడటం, ఏదోలా పూర్తయిందనిపించడం... ఉరుకులు పరుగులు... ఈ చక్రం ఇలాగే తిరుగుతుంటుంది. ఏం చేయాలి, ఇంతకంటే వేరే ఏముంటుంది ఎవరికైనా... జీవితం బతకడం కోసమే కదా... ఈ ఆలోచన తప్పు. జీవితానికి ఒక పరమార్థం ఉండాలి. ఉత్సాహం కావాలి... ఆలోచనా పరిధి విస్తృతం కావాలి. కూపస్తమండూకంలా ఉండకూడదు. తిండి-బట్ట-గూడు... వీటికోసం ఓ ఉద్యోగం. ఇవి అవసరాలు. ఆ అవసరాలను మించి ఆలోచించాలి, ఆలోచించగలగాలి. దీనికి విశాలదృక్పథం అలవరచుకోవాలి. ఆ దృష్టి మన లక్ష్యాన్ని నిర్దేశించాలి. దానికి కృషి, పట్టుదల, ఏకాగ్రతల అవసరం ఏర్పడుతుంది. చేసే పనిలో తృప్తి లభిస్తుంది. విశ్రాంతి కూడా తీసుకోవాలనిపించదు. ఆ ధ్యాసకు అంతటి శక్తి ఉంటుంది. బతుకుపట్ల సరైన దృక్పథం ఏర్పరచుకోగలిగితే- పనిలోనే పరమార్థం కనబడుతుంది!

ఎటువంటి ఉన్నతమైన ఆశయాలూ లేనట్లయితే, ఆలోచనలు 'నేను-నాది' అన్నదాని చుట్టే పరిభ్రమిస్తుంటే మొహం మొత్తుతుంది. ఏం తిందాం, ఏం చేద్దాం అన్నచోటే ఆగిపోతే, ఎదుటివ్యక్తి ఒక పోటీదారుడిగా కనిపిస్తాడు. మన శక్తియుక్తులను తక్కువగా అంచనా వేసుకుని అభద్రతా భావానికి గురవుతాం. స్వార్థం జీవం పోసుకుంటుంది. అనవసర భయాలు, ఏవేవో వూహించుకోవడాలు, యథార్థాల నుంచి దూరంగా బతకడంతో మన మీద మనకే జాలి కలగడం, వ్యధ చెందడం... చివరికి మన పతనాన్ని మనమే తెచ్చుకున్నట్లు అవుతుంది.

ఈ ప్రపంచానికి అసాధారణ వ్యక్తులే అవసరం అని ఎక్కడా లేదు. చాకచక్యం కలిగిన మేధాసంపన్నులే కావాలనీ ఏం లేదు. మనకు కావలసింది ప్రేరణ కలిగించే శక్తి కలిగినవారు. మహాత్మాగాంధీ సాధారణ వ్యక్తే. కానీ సత్యం, అహింసా ధర్మాలవైపు జనాన్ని ప్రేరేపించగల శక్తిసంపన్నుడు. రైట్‌ సోదరులు- సామాన్యులే. ఎగరాలనే బలమైన కలగన్నారు. ఇలా ఎందరో...

ఎవరైనా ఉన్నతమైన ఫలితాలు సాధించవచ్చు. ఓ గొప్ప ఆదర్శానికి ప్రభావితమైతేనే అది సాధ్యం. నేటి విద్యాప్రమాణాలు క్రమక్రమంగా దిగజారిపోతున్నాయి. కారణం? ఒక ఉపాధ్యాయుడు సమాచారాన్ని విద్యార్థులకు ప్రసారం మాత్రమే చేయగలుగుతున్నాడు. ఒక ఉన్నతమైన ఆశయసాధనకు మేధాశక్తిని ప్రేరేపించలేకపోతున్నాడు. ఉత్తేజపరచడమన్నది అంత క్లిష్టమైన విషయం ఏమీ కాదు. కొద్దిమందే మనకు అటువంటివాళ్లు కనిపించడంవల్ల అలా అనిపించడం సహజం. జీవితాలను త్యాగం చేసినవాళ్లెందరో ఇప్పటికీ ప్రేరేపించగలుగుతున్నారు. విద్య, సామాజిక న్యాయం, పర్యావరణం... ఇలా ఏ రంగమైనా కావచ్చు. ఎవరైనా ఒక ఆదర్శానికి కట్టుబడి ఉండాలి.

అన్నింటిలో ఉన్నతమైనది- ఆధ్యాత్మిక లక్ష్యసాధన. 'దేవుడు నన్ను పరిగెత్తిస్తున్నాడు... నేను దేవుడికోసం పరిగెత్తుతున్నాను' ఎందరినో ఆకట్టుకున్న వాక్యమిది. ఒకసారి భగవంతుడిచే ప్రేరణ పొందగలిగితే ఆ శక్తి మనలో బలంగా చోటుచేసుకుంటుంది. ఆ ధైర్యంతో ఎటువంటి అడ్డంకులనైనా ఎదుర్కోవచ్చు.

మనలో ఎంతమంది ఉత్తేజంతో నిద్రలేస్తాం, తెల్లారిన తరవాత సేవా దృక్పథం కలిగి ఉంటాం? సమాజానికి ఏదైనా చేయాలనే ఉత్సాహం ఎందరికుంటుంది? సేవాభావం ఉన్నప్పుడు జీవితం వూహాతీతంగా, విసుగు చికాకులతో కాకుండా ఉత్తేజవంతమైన స్థాయికి చేరుకుంటుంది. పనికిరాని పద్ధతుల్ని పునర్‌ నిర్వచించుకుని అసాధారణం అనుకున్నవాటినీ సాధించవచ్చు. అనూహ్యమైన విజయాలను సొంతం చేసుకోవచ్చు. పనిలో ఆనందం కనిపిస్తుంది కానీ, పనిని తప్పించుకోవడంలో కాదు. అన్నింటికంటే ముఖ్యమైనది, ఆధ్యాత్మిక ధోరణిని అలవరచుకుని భగవత్తత్వాన్ని అవగతం చేసుకోవడం.

ప్రేరణ కలిగినప్పుడు సామాన్యుల్లో ధైర్యం, ఆశ చోటుచేసుకుంటాయి. అవి వారి జీవితాలనే కాకుండా భవిష్యత్‌ తరాలను సైతం ప్రభావితం చేస్తాయి.
- మంత్రవాది మహేశ్వర్‌

No comments:

Post a Comment