ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Wednesday 18 September 2013

పద్మనాభ చతుర్దశి

 కామితార్థాలు ఈడేరాలనే కోరికతో కొన్ని, కష్టాలూ బాధలనుంచి గట్టెక్కించమనే తలంపుతో కొన్ని వ్రతాలు చేస్తుంటారు మానవులు. ప్రకృతిలోని వనరులపట్ల కృతజ్ఞత తెలుపుతూ చేసేవీ కొన్ని ఉన్నాయి. భాద్రపద శుక్ల చతుర్దశినాడు చేసే అనంత పద్మనాభవ్రతం పై మూడు కోవలకీ చెందుతుంది. అరణ్యవాస క్లేశాన్ని అనుభవిస్తున్న పాండవులు తమ కష్టాలు గట్టెక్కే మార్గాన్ని సూచించమని శ్రీకృష్ణుడిని వేడుకున్నారట. అప్పుడాయన 'అనంత పద్మనాభవ్రతం' చేస్తే కష్టాలు తొలగిపోతాయని తెలిపినట్లు భాగవత కథనం.

శ్రీకృష్ణుడు పాండవులకు చెప్పిన వ్రతకథగా ప్రచారంలో ఉన్నదిది. కృతయుగంలో సుమంతుడనే పండితుడి భార్య దీక్ష. వారి కుమార్తె 'శీల'. దీక్ష మరణించడంతో 'కర్కశ' అనే స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆమె సవతి కూతురుపట్ల దారుణంగా ప్రవర్తించేది. శీల అత్తవారింటికి వెళుతున్న సమయంలో సారె పెట్టి పంపలేదు. అది గమనించిన సుమంతుడు భార్యకు తెలియకుండా కొంత 'సక్తు(పేల)పిండి'ని మూటకట్టి ఇచ్చాడు. అది తీసుకుని భర్త అయిన కౌండిన్యుడితో అత్తవారింటికి వెళుతోంది. తోవలో నదీతీరాన కొందరు స్త్రీలు ఒకవ్రతం చేస్తుండటం గమనించి, విధానం తెలుసుకుని, తానూ ఆ పూజలో పాల్గొని తోరం కట్టుకుంది శీల. తన దగ్గరున్న సక్తుపిండిని సగం వాయనమిచ్చి మిగిలిన సగంలో కొంత భర్తకు ప్రసాదంగా ఇచ్చి, తానూ స్వీకరించింది. ప్రసాదం తిన్న కౌండిన్యుడు వివరాలు అడగలేదు. ఆ దంపతులు ఆశ్రమానికి చేరేసరికి శీల చేసిన వ్రత ఫలితంవల్ల వారికి సకల సంపదలు కలిగాయి. కౌండిన్యుడు ఒకరోజు భార్య చేతికున్న తోరం చూసి తనను వశం చేసుకోవడానికి కట్టుకున్నదని భావించి, ఎంత చెప్పినా వినకుండా తెంపి అగ్నిలో పడేశాడు. అప్పటి నుంచి ఆశ్రమాన్ని దారిద్య్రం అలముకుంది. తరవాత అసలు విషయం తెలుసుకుని తాను చేసిన అపచారానికి చింతించాడు. అనంతుడి అనుగ్రహం కోసం ఎంతగానో పరితపించాడు. చివరికి నీరసించి పడిపోయిన కౌండిన్యుడికి అనంతుడు దర్శనమిచ్చి అనుగ్రహించాడని శ్రీకృష్ణుడు పాండవులకు చెప్పిన కథ.

ఈ వ్రతంలో పద్నాలుగు సంఖ్యకు విశేష ప్రాధాన్యం ఉంది. విష్ణువు పద్నాలుగు భువనాలకీ స్థితి కారకుడు. అవి వూర్ధ్వలోకాలైన భూలోక, భువర్లోక, సువర్లోక, మహాలోక, జనలోక, తపోలోక, సత్యలోకాలు. ఏడు అధో లోకాలు- అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ అనేవి. వాటి మొత్తం సంఖ్య విష్ణు ఆరాధనలో ముఖ్యపాత్ర పోషిస్తుందన్నది విష్ణుపురాణ కథనం. పూజాక్రమంలోనూ ఆ సంఖ్యే అత్యంత ప్రాధాన్యం వహిస్తుంది.

విష్ణువును, అతడి శయ్య అయిన ఆదిశేషు(అనంతు)డినీ కలిపి ఆరాధించడం, వారితోపాటు యమునా జలాలను పూజించడం ఇందులో ప్రధానం. ఈ వ్రతం చేసేవారు వేకువజామునే మేల్కొని, శుచిగా తూర్పు, ఉత్తర, ఈశాన్య దిక్కుల్లో అవకాశాన్ని బట్టి ఒకచోట గోమయంతో అలికి, అష్టదళ పద్మం వేసి దానిమీద పూర్ణకలశం ఉంచాలి. దానిలో యమునానది నీటిని పోయాలి. (లభ్యంకాకపోతే ఆవాహన చేయాలి). ఆ కలశం పక్కన దర్భలతో ఆదిశేషుని (అనంతుని) పద్నాలుగు పడగలకు ప్రతీకగా పద్నాలుగు ముడులతో ప్రతిమను చేసి నిలపాలి. విష్ణుమూర్తి (పద్మనాభుని) రూపానికి ప్రతీకగా పద్నాలుగు ముడులతో తోరాన్ని తయారు చేసి అనంతుడి ప్రతిమ పక్కన ఉంచి, విష్ణు సహస్రనామాలతో విధివిధానంగా పూజించాలి. పూజానంతరం గత సంవత్సరం కట్టుకున్న తోరాన్ని విసర్జించి కొత్త తోరాన్ని కట్టుకోవాలి. ఇలా చేయడంవల్ల విష్ణుశక్తి వారిని ఎల్లవేళలా కాపాడుతుందని నమ్ముతారు. పద్నాలుగేసి చొప్పున పద్నాలుగు రకాల పిండివంటలు తయారుచేసి, నివేదన చేసి వాటిలో సగం వాయనం ఇచ్చి, మిగిలిన వాటిని ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇలా పద్నాలుగు సంవత్సరాలు గడిచాక ఉద్యాపన చేయాలి. ఆపై వీలున్నవారు తిరిగి ప్రారంభించి మరో పద్నాలుగు సంవత్సరాలు చేయాలని భవిష్యోత్తర పురాణ కథనం. దీనికి త్రయోదశితో కూడిన చతుర్దశి పనికిరాదు. పూర్తి చతుర్దశి ఉన్నరోజైతే సాధారణ ఫలితం ఉంటుంది. పౌర్ణమి గడియలు కలిస్తే సర్వశ్రేష్ఠమని చెబుతారు.

పూజలో యమునకు ప్రాధాన్యమివ్వడానికి కారణం... గోవు (ఆవు, పులి కథలో) తన సత్యసంధతను యమున ఒడ్డునే నిరూపించుకుందని. ఆ సంఘటన జరిగిన తిథి భాద్రపదశుక్ల చతుర్దశి అని, దానికి సాక్షీభూతమైన యమునను ఈ దినం పూజిస్తారు. దీనివల్ల పశుసంపదకు మేలు కలుగుతుందని భావిస్తారు. ఈ వ్రతాన్ని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. ఉత్కళ(ఒడిశా) ప్రాంతీయులు 'అఘోర చతుర్దశి' అంటారు. మహారాష్ట్రులు, వంగదేశీయులు, రాజస్థానీయులు ఈ వ్రతాన్ని 'పాలీ చతుర్దశివ్రతం', 'కదళీవ్రతం' అనీ పిలుస్తారు. దీన్ని దక్షిణాది రాష్ట్రాల్లో వైష్ణవ సంప్రదాయానుయాయులు ఎక్కువగా ఉన్న తమిళనాడులో విశేషంగా జరుపుతారు.
- అయ్యగారి శ్రీనివాసరావు

No comments:

Post a Comment