ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Saturday 21 September 2013

జయించడమంటే?


నసుంటే మార్గం ఉంటుందంటారు. మనసుండటమంటే- చేస్తున్న పనిమీద ధ్యాస ఉండటమని అర్థం. ఇష్టంగా చేస్తే పనిమీద ధ్యాస కుదురుతుంది. ఏ పనైనా ఇష్టంగా చేద్దామనుకుంటే- మనసు ఏదో ఒక చక్కని మార్గాన్ని చూపిస్తుంది. ఒకవేళ ఎగ్గొడదామనుకున్నా- తగిన సాకునూ మనసే చూపిస్తుంది. ఇది చాలా చిత్రమైన విషయం. నచ్చిన మనిషిలో వెయ్యి సుగుణాలను వెతికే మనసే, నచ్చకపోతే వెయ్యి దుర్గుణాలనూ ఎత్తిచూపిస్తుంది. అలా విచిత్రంగా ప్రవర్తించడమే మనసు ప్రత్యేకత!
'శరీరం కన్నా విభిన్నమైనది, అపూర్వమైనది, విశేషమైనదీ అయిన మనసు అనేదాన్ని సృష్టించి, ప్రజాపతి ప్రతి మనిషిలోనూ దాన్ని నిక్షిప్తం చేశాడు' అని ఐతరేయ బ్రాహ్మణం వెల్లడిస్తోంది. ఆ విశేషణాలను మనం విశ్లేషిస్తే- మనసు ప్రత్యేకత ఏమిటో తెలుస్తుంది. పైగా అది సృష్టిలో మనిషి ఒక్కడి సొత్తు. అందుకే మనసంటే మనందరికీ ఎంతో ఆసక్తి! అదెలా ఉంటుందో, ఎక్కడుంటుందో తెలియదు. కనుక మనం దాని గురించి ఆలోచించాలి. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలి.

'ఆ అమ్మాయి మీద మనసు పడ్డాను' అని ఏ కుర్రాడో అన్నాడంటే- అతగాడు నిరంతరం ఆ పిల్ల గురించే ఆలోచిస్తున్నాడని అర్థం. ప్రతి మనిషీ అలా ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. మనసు పనే అది! పుట్టలోంచి లక్షలాది చీమలు బారులుతీరి సాగిపోతున్నట్లుగా- మనసులో ఆలోచనలు ఒకదానివెంట మరొకటి ప్రవాహంలా వస్తూనే ఉంటాయి. ముసురుకునే ఆలోచనల ప్రవాహంలో మునిగిపోకుండా ఉండటం మునులకే తప్ప మామూలు మనుషులకు సాధ్యం కాదు.

నిరంతరాయంగా అలా వచ్చిపోతుండే ఆలోచనల్లో మంచివీ ఉంటాయి, చెడ్డవీ ఉంటాయి. మంచి ఆలోచన తడితే మనిషి సంతోషపడతాడు, చెడు ఆలోచనలు వస్తే కంగారు పడతాడు. వాటిని అదుపు చెయ్యలేకపోతున్నామని దిగులూ పడతాడు. నిజానికి ఈ మథనంవల్ల ఏ ప్రయోజనమూ లేదు. అవి మన వశంలో ఉంటే కదా, రావద్దనడానికి? 'ఒక పరిస్థితిని నీవు అదుపు చేయలేనప్పుడు- దాన్ని గురించి స్పందించడం మానేసెయ్‌'' అన్నారు రాధాకృష్ణ పండితులు. అంటే- ఆలోచనలను అరికడదామనిగాని, అలా చేతకావడం లేదని ఆందోళన చెందడం కాని- శుద్ధ అనవసరం. ఎలాంటివైనా ఆలోచనలంటూ వస్తే వాటిని ఎదుర్కోవడం కన్నా వాటిని గమనిస్తూ ఉండటం చాలా ముఖ్యం. అదే మనిషికి ఆరోగ్యకరం. ఆలోచనలు మంచివే అయితే పేచీయే లేదు. వాస్తవానికి మనిషి ఆలోచన ఎన్నో అద్భుతాలను సాధించింది. ఎంతో విలువైన విషయాలను కనుగొంది. ఎన్నింటినో ఆవిష్కరించింది. సృష్టించింది. కనుక మనసును అదేపనిగా ద్వేషించవలసిన పనిలేదు. మంచి ఆలోచనలతో మనిషికి చాలా అవసరం ఉంది.

ఆలోచనలు చెడ్డవైతే మాత్రం మనిషి నిదానించాలి. ఎదిరించి లాభం లేదు కనుక, వాటిని గమనిస్తూ ఉండాలి. వాటి నుంచి తాను విడిపోయి, ఉన్నది ఉన్నట్లుగా చూస్తూ ఉండిపోవాలి. ఆ స్థితిలోనే మనిషిని 'సాక్షీభూతుడు' అంటారు. పారిపోదామనుకుంటే భయపెడతాయి తప్ప- చూస్తూ నిలిచిపోతే చెడు ఆలోచనలు నెమ్మదిగా కరిగిపోతాయి. ఇంతలోనే మరో ఆలోచన ఎలాగూ మొదలైపోతుంది. ఆలోచన ఎంత చెడ్డదైనా ప్రమాదం లేదు- దాన్ని అమలు చేయడానికి సిద్ధపడితే మాత్రం ఆపద ముంచుకొస్తుంది. కనుక చెడు ఆలోచనలు రావడంలో తప్పులేదు. వాటిని అమలు చేద్దామనుకోవడం మాత్రం తప్పు. బుద్ధిమంతులు ఇక్కడే జాగ్రత్తపడతారు. విచక్షణ పాటిస్తారు. ఆయా సందర్భాల్లో తమ బుద్ధికి పని చెబుతారు. మనిషి మేల్కొని ఉన్న ఇంటికి దొంగల వల్ల ప్రమాదం లేనట్లే- బుద్ధి మేల్కొని ఉన్న మనిషికి చెడు ఆలోచనల వల్ల ఎలాంటి అపాయమూ ఉండదు. కనుక మనం ఎల్లప్పుడూ బుద్ధిని మెలకువగా ఉంచుకోవాలి. అది- ఆలోచనలు మంచివైతే, వాటిని ఆచరణలోకి తెస్తుంది. చెడు ఆలోచనల పట్ల ఉదాసీనంగా ఉంటుంది. ఈలోగా ఆలోచన మారేపోతుంది. ఈసారి అది మంచిదైతే బుద్ధి చక్కగా స్వీకరిస్తుంది. చెడ్డదైతే దాన్నీ తిరస్కరిస్తుంది. మనసును అదుపులో ఉంచుకోవడమంటే ఇంతే! ఆలోచన మంచిదైతే వాడుకోవడం, కాకపోతే మరిచిపోవడం- మంచిదా చెడ్డదా అని తేల్చుకోవడానికై బుద్ధిని ఉపయోగించడం... ఇంతే మన పని! మనసును జయించడమంటే- దాన్ని ఓడించడం కాదు, సరిగ్గా వాడుకోవాలని అర్థం. నిజానికి, అది చాలా గొప్ప గెలుపు!
- ఎర్రాప్రగడ రామకృష్ణ

No comments:

Post a Comment