ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Wednesday, 6 November 2013

నాగులచవితి

పాముల ఆరాధన ఈనాటిది కాదు. ఎన్నో యుగాలనాటిది. సౌభాగ్యానికి, సత్సంతాన ప్రాప్తికి సర్పపూజ చేయడం లక్షల శరత్తుల కిందటే ఉన్నట్లు ఎన్నో పురాణాలు చెబుతున్నాయి. దేశంలోని అనేక ఆలయాల్లో మెలికలు తిరిగిన నాగరాజు విగ్రహాలు కనిపిస్తాయి ఇప్పటికీ.

దీపావళి అనంతరం వచ్చే కార్తిక శుద్ధ చవితిని నాగుల చవితిగా పండగ చేసుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. పాముల్ని ఆరాధించే భారతీయ సంస్కృతి ఆంతర్యం ఏమిటి? ప్రకృతిలోని సమస్త ప్రాణుల్లో దైవత్వం అదృశ్య రూపంలో పరివ్యాప్తమై ఉంటుంది. ప్రాణికోటిని కాపాడుకొంటే సమస్త మానవకోటి మనగడకు ముప్పు వాటిల్లదు. పర్యావరణ సమతుల్యానికి విఘాతం కలగదు. చెట్లలో, పుట్లలో, రాయిరప్పల్లో, కొండకోనల్లో, నదుల్లో దైవత్వాన్ని వీక్షించింది భారతీయ సంస్కృతి. అందులో భాగంగానే నాగరాజుగా, నాగదేవతగా పామును పూజిస్తూ వస్తున్నారు.

భూమిలో పాములు నివసిస్తూ జీవకోటికి నీటిని ప్రసాదించే దేవతలుగా పూర్వీకులు భావించారు. పంటల్ని నాశనం చేసే క్రిములు, కీటకాలను భక్షిస్తూ, పరోక్షంగా రైతుకు పంటనష్టం రాకుండా చూస్తాయట. విషసర్పాల మాట వినగానే భయపడి పారిపోతాం. విషసర్పాలకు మించిన దుష్ట మానవులు మన మధ్యే తిరుగుతూ నిష్కారణంగా కాటేస్తుంటారు.

శరీరంలో నాడులతో నిండిన వెన్నెముకను వెన్నుపాము అంటాం. కుండలినీ శక్తి మూలాధార చక్రంలో పాము ఆకృతిలో ఉంటుంది. నాగుల చవితినాడు విషసర్పంపుట్టను పూజించి, పాలుపోస్తే, మనిషిలోని విషసర్పం కూడా శ్వేతవర్ణం పొంది హృదయాల్లోని మహావిష్ణువుకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా భాసించాలన్న కోరిక నెరవేరుతుందని పెద్దలు చెబుతారు.

సర్పారాధనకు తామరపుష్పాలు, కర్పూరం, పూలు, లడ్డు మొదలైనవి శుభప్రదమైనవి. సర్పారాధన చేసేవారి వంశం తామరతంపరగా వర్ధిల్లుతుందని భవిష్యపురాణం చెబుతోంది. మన దేశంలోని ఎన్నో ఇళ్లలో ఇలవేలుపు సుబ్రహ్మణ్యేశ్వరుడే.

నాగర్‌కోయిల్‌ అనే వూరిలో ఒక నాగుపాము విగ్రహం ఉంది. దాని సమీపంలో తెల్లని ఇసుక ఆరునెలలు, నల్లని ఇసుక ఆరునెలలు ఉబికివస్తుందని భక్తులు చెబుతారు. పాము కుబుసానికి ఆయుర్వేద గుణాలు ఉన్నాయి. గరళాన్ని ఆయుర్వేద మందుల్లో తగు మోతాదులో ఉపయోగిస్తారు.

నక్షత్ర మండలాలు సర్పాకృతిలోనే ఉన్నాయంటారు. నాగలింగం పువ్వులో పుప్పొడి సర్పాకృతిలోనే ఉంటుంది. శివుడి మెడనిండా సర్పాకృతిలోని హారాలు మెరుస్తుంటాయి. నాగేంద్రుని శివభావంతో చవితినాడు అర్చిస్తే సర్వరోగాలు నశించి సౌభాగ్యవంతులవుతారని రుషివాక్కు..
- కె.యజ్ఞన్న 

Tuesday, 5 November 2013

యమద్వితీయ


'భగిని' అంటే తోబుట్టువు అయిన సోదరి అనీ, భాగ్యవంతురాలు అనీ అర్థం. సోదరి చేతివంటను తినడం భగినీహస్త భోజనం. ఈ సంప్రదాయానికి ఎంతో విశిష్టత ఉంది. యమధర్మరాజు సోదరి యమునానది. ఆమె పూర్వం తన అన్న అయిన యమధర్మరాజు దగ్గరకు ప్రతి నిత్యం వెళ్లి, తన ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్లాల్సిందిగా కోరేదట. నరకలోక పాలనలోనే సతమతమైపోయే యమధర్మరాజుకు సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేయడానికి ఎన్నాళ్లకూ తీరిక దొరకలేదు. ఎలాగైనా ఒక దినాన చెల్లెలి ఇంటికి వెళ్లి భోజనం చేసి రావాలని సంకల్పించుకున్నాడు. చివరికి అతనికి కార్తికమాసం, శుక్లపక్షం, ద్వితీయాతిథినాడు విరామం దొరికింది. ఆ దినాన యమున ఇంటికి వెళ్లాడు. ఎన్నాళ్లో ఎదురుచూడగా అనుకోకుండా వచ్చి, తన ప్రార్థనను మన్నించిన అన్నకు యమున షడ్రసోపేతమైన విందు భోజనాన్ని వడ్డించింది. యముడు సోదరి భక్తితో చేసిన వంటలన్నీ చక్కగా ఆరగించాడు. అమృతాన్ని తాగినంత ఆనందం కలిగింది. అప్పుడు యముడు తన చెల్లెలి చేతివంటను మెచ్చుకొని, ఏదైనా వరం కోరుకొమ్మన్నాడు. అప్పుడామె- 'అగ్రజా! నీవు ప్రతి సంవత్సరం ఇదే రోజున నా ఇంటికి వచ్చి నా చేతివంటను తినివెళ్లాలి. అంతేగాక, ప్రతి సంవత్సరం కార్తిక శుక్లద్వితీయనాడు లోకంలో ఏ అన్నలు చెల్లెళ్లు వండిన పదార్థాలను భోజనం చేస్తారో, అలాంటివాళ్లకు నరకబాధ ఉండరాదు. ఇదే నేను కోరే వరం' అని పలికింది. యముడు 'తథాస్తు' అన్నాడంటారు. నాటి నుంచి ఈ వేడుక 'యమద్వితీయ' (యముడు తన సోదరి చేతివంటను తిన్న దినం) అనీ, 'భ్రాతృద్వితీయ' (అన్న చెల్లెలి చేతివంట తిన్న పవిత్ర దినం) అనీ ప్రసిద్ధిలోకి వచ్చింది.
'భగినీహస్త భోజనం' అనేది అనాదిగా వస్తున్న సంప్రదాయం, ఆచారం. ఇందులో మానవజీవన విశేషాలు, పరమార్థాలు ఇమిడి ఉన్నాయి. మనిషి కుటుంబజీవి. కనుక కుటుంబాన్ని విడిచి క్షణంకూడా జీవించలేడు. కుటుంబంలో ముఖ్యులు తల్లిదండ్రులు. వాళ్లు సంతానాన్ని కని, పెంచి, పోషించి, పెద్దచేసి, విద్యాబుద్ధుల్ని ప్రసాదించి, తమ సంతానానికీ కుటుంబాలను సంపాదించిపెడతారు. మనిషికి తల్లిదండ్రుల తరవాత ఆత్మీయులైనవాళ్లు తోబుట్టువులైన అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లే కదా! తల్లిదండ్రులు వయసులో పెద్దవాళ్లు కనుక, తమ సంతానం బతికినంతకాలం బతుకలేరు. తమ సమకాలంలో పుట్టిన తోబుట్టువులు తమ జీవితాంతం వరకు బతికే అవకాశం ఉంది. అందువల్ల అన్నలు, తమ్ముళ్లు, అక్కలు, చెల్లెళ్లు కనీసం ఏడాదికి ఒక్కసారైనా కలిసి భోజనం చేయకపోతే ఆత్మీయతలు ఎలా నిలుస్తాయి? అంతేగాక, ఒకరి కష్టసుఖాలను మరొకరు తెలుసుకొని స్పందించే అవకాశం ఉంటుందా? ఉండనే ఉండదు. కనుక ఈ భోజన సంప్రదాయం కుటుంబ సభ్యుల మధ్యన జీవితాంతం వరకు ప్రేమాభిమానాలను కలిగి ఉండే అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. బతుకు తెరువుకోసం దూరదూరాలకు వెళ్లకుండా ఉండిన ప్రాచీనకాలంలోనే ఈ సంప్రదాయం, ఆచారం కొనసాగింది. ఇక ఆధునికకాలం ఉపాధికోసం రాష్ట్రాల సరిహద్దులనే కాదు, దేశాలను, ఖండాలను దాటిపోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఏడాదికొకసారి కాదుగదా, రెండు మూడేళ్లకూ ఆత్మీయులను, తోబుట్టువులను కలుసుకోలేని దుస్థితిలో ఆత్మీయతలు ఎలా నిలుస్తాయి? కనుక ఎప్పుడో ఒకప్పుడు కలిసినా ఈ ఆచారాన్ని పాటించి అన్నదమ్ములు అక్కచెల్లెళ్ల ఇళ్లకువెళ్లి, వాళ్ల చేతివంటను భుజించి, వారికి ధనకనక వస్తువాహనాలను యథాశక్తిగా సమర్పించుకొంటే ఆత్మీయబంధాలు వర్ధిల్లుతాయి. ఒకరికొకరం అండగా ఉన్నామనే భావన, విశ్వాసం కలుగుతాయి. ఇవే ఆచారాలు, సంప్రదాయాలు. రాగద్వేషాలకు అతీతంగా విశ్వక్షేమం కోసం ఏర్పాటు చేసినవే ఆచారాలనీ, వాటిని వంశపారంపర్య క్రమంలో పాటించినప్పుడు సంప్రదాయాలవుతాయనీ పెద్దల మాట. ఆచారం ఎప్పుడూ దోషభూయిష్ఠమై ఉండదు. యుక్తాయుక్త విచక్షణగల మానవులు తమ ఆచరణల్లో ఏయే లోపాలున్నాయో తెలుసుకొని, వాటిని సవరించుకొని చక్కగా ఆచరించాలి. అదే విజ్ఞత అంటే.

'ఆత్మా వై పుత్రనామాసి' అన్నది వేదం. అంటే, తల్లిదండ్రుల ఆత్మలే సంతానంలో ఉంటాయని అర్థం. అందువల్ల అక్కాచెల్లెళ్లు అమ్మకు ప్రతిరూపాలే. అమ్మ చేతివంట అమృతసమానం అయితే అక్కాచెల్లెళ్ల చేతివంట కూడా సుధామయమే. కనుక 'భగినీహస్త భోజనం' అన్ని విధాలా అమృతభక్షణంతో సమానం. ఈ పరమార్థాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటే చాలు- ఈ పర్వదినంలోని మహిమ బోధపడుతుంది. ఏ సంప్రదాయమైనా, ఆచారమైనా మానవాళి మధ్య సద్భావనలను పెంపొందింపజేసి, స్నేహాన్ని, ఆత్మీయతను, ఆప్యాయతను శాశ్వతంగా నిలపడంకోసమే. ఇది గ్రహిస్తే భూలోకం అభినవ స్వర్గమే అవుతుంది.
- డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ 

Monday, 4 November 2013

దీపారాధన


 పంచభూతాల్లో ప్రధానమైన 'అగ్ని' ప్రాణికోటి మనుగడకు అవసరమయ్యే తేజస్సును, ఆహారాన్ని ఐహిక ప్రయోజనరూపంలో, సనాతన ధర్మ గరిమను ఆధ్యాత్మిక ప్రయోజన రూపంలో ప్రసాదిస్తోంది. ఏ కార్యక్రమాన్నయినా 'అగ్నిసాక్షి'గా ఆరంభించటం హైందవ సంప్రదాయంలోని ముఖ్యాంశం. దీపాలను వెలిగించడమంటే, మనలోని అజ్ఞాన తిమిరాన్ని పారదోలి జ్ఞానకాంతిని ఇమ్మని ఈశ్వరుణ్ని వేడుకోవడమన్నమాట.
దీపంలో మనకు కనిపించే నీలం, పసుపు, తెలుపు వర్ణాలు మనలోని సత్వరజస్తమో గుణాలకు ప్రతీకలు. సత్యం, శివం, సుందరాలకు సంకేతాలు.

స్వామి దయానంద సరస్వతి అమావాస్యనాడే సన్యసించి తిమిర జగతికి జ్ఞానకాంతిని అందించారు. చీకటి పనులన్నీ పాపాలుగాను, వెలుగులో చేసే పనులను సత్కార్యాలుగాను మహాత్ములు అభివర్ణిస్తారు. దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపంగాను, మనో వికాసానికి, నిర్మల హృదయానికి, పావన భావనకు, ఆనందానికి, ప్రసన్నతకు, ప్రశాంతికి సజ్జనత్వానికి నిదర్శనంగాను భావిస్తారు భాగవతులు. జగతిని జాగృతం చేసే చైతన్య కిరణాలు దీపకాంతినుంచే ఆవిష్కృతమవుతాయి. మానవ శరీరం మట్టితో చేసిన ప్రమిద అనీ, ప్రాణం ప్రకాశించే దీపమనీ, ఆధ్యాత్మిక సాధన అందులో పోసే తైలమనీ, అందుకే భగవంతుడికి భక్తుడు చేసే షోడశోపచారాల్లో దీప సమర్పణ అత్యంత ప్రాధాన్యం సంతరించుకుందనీ పౌరాణికులు చెబుతున్నారు. దీపం లక్ష్మీస్వరూపం కనుక దీపారాధన ద్వారా ఆమెకు ఆహ్వానం పలుకుతాం. అన్ని భారాలనీ భరించే భూమాత దీపం వేడిని భరించలేదట. అందుకే ప్రమిదలో ప్రమిదవేసి మరీ ప్రమదలు, దీపం వెలిగిస్తారట. ఒక దీపం వెలిగించామంటే ఇంట్లోకి అష్టలక్ష్ముల్నీ ఆహ్వానించినట్టేనంటారు. దీపకాంతి జగతికి క్రాంతి, శాంతి ప్రసాదించి భ్రాంతిని తొలగిస్తుందని హైందవ సంప్రదాయ విశ్వాసం.

కార్తిక శుద్ధపాడ్యమి 'బలిపాడ్యమి'గా ప్రశస్తినందుకుంది. ఆరోజునుంచీ మొదలుకొని నెలంతా దీపాలు వెలిగిస్తే పుణ్యలోకం ప్రాప్తిస్తుందని పౌరాణికులు చెబుతారు. నెలంతా వెలిగించలేనివారు కార్తిక సోమవారాల్లో దేవాలయాల్లో దీపదానం చెయ్యవచ్చనీ, అదీ సాధ్యం కాకపోతే కనీసం కార్తికపౌర్ణమినాడయినా దీప ప్రకాశనం చేసి దివ్యలోక సాయుజ్యాన్ని పొందవచ్చని అంటారు. ప్రదోష సమయాల్లో దీపాలు వెలిగించి, పిల్లలు దక్షిణ దిశగా నిలుచుంటే దాన్నే 'ఉల్కాదానం' అంటారు. ఆ దీపాలు పితృదేవతలకు మోక్షద్వారాలు చూపుతాయట. శరదృతువులో క్రిమికీటకాలు వ్యాధుల్ని ప్రబలజేస్తాయి. ఈ కార్తిక దీపాలు ఆ వ్యాధుల్ని నిరోధించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడతాయి. పర్యావరణ పరిరక్షణకు దోహదపడతాయి.

దీపం ఎప్పుడూ అధోదిశవైపు చూడదు. వూర్ధ్వ దిశనే సూచిస్తుంది. మనిషి కూడా ఆ కాంతిలో ఉన్నతమైన ఆలోచనలతో అభ్యుదయ దిశవైపు పయనించాలని అది సంకేతం ఇస్తోంది. 'జ్యోతి స్వరూపమైన ఓ పరమాత్మా! నీవు ఆ కవుల్లో కవిగా మర్త్యజీవుల్లో అమృతుడివిగా భాసిస్తావు. నీ వల్ల మా దుఃఖాలు తొలగుగాక!' అని రుగ్వేదంలో దీపకాంతిని గురించి ప్రార్థన ఉంది. సార్వకాలీనమైన దైవం దీపం. దీపానికి నమస్సునర్పిస్తే సకలదైవాలను ప్రార్థించినట్లే.
- చిమ్మపూడి శ్రీరామమూర్తి

Saturday, 2 November 2013

ఆనందజ్యోతులు

 అలంకారాలన్నింటిలోకీ వెలుగే పెద్ద అలంకారం. అసలు ఏ అలంకారమైనా వెలుగు లేనిదే గోచరించదు కూడా. ప్రపంచంలో ఏ ప్రాంతంవారికైనా ఏ ఉత్సవం జరిపినా వెలుగు తోరణాలతోనో, వెలుగులు చిమ్మే బాణసంచాతోనో వేడుకలు సాగించడం అలవాటు. దీన్నిబట్టి మానవ స్వభావంలోనే వెలుగురవ్వలు ఉత్సాహానందాలకు ఉనికిపట్లు- అనే భావం దాగి ఉంది అని స్పష్టమవుతుంది.
యుగాల క్రితం భారతీయ సంస్కృతి ఈ వెలుగుల వేడుకను 'దివ్యత్వం'గా దర్శించి, దాన్ని పండుగగానూ, పవిత్రమైన ఆధ్యాత్మిక సాధనగానూ ప్రతిష్ఠించింది. ఒక చక్కని వ్యవస్థగా దీపావళిని తీర్చిదిద్దింది.
కేవలం వేడుక మాత్రమే కాక- జ్యోతిషశాస్త్రం, దేవతల అనుగ్రహాన్ని పొందే అర్చనా విధానం, పితరుల్ని తృప్తిపరచే పూర్వీకుల పట్ల ప్రేమ... ఇవన్నీ ఈ పండుగతో ముడివడి ఉన్నాయి. 'దీపావళినాడు ఎలాంటి మానసిక స్థితిలో ఉంటామో, ఏడాది పొడుగునా అదే స్థితి కొనసాగుతుంది' అని ధర్మశాస్త్ర వచనం. అందుకే ఈ రోజున అందరూ ఉత్సాహంగా కలిసిమెలసి ప్రేమలు పంచుకొనే కుటుంబ, సామాజిక సామరస్యపర్వంగా వేడుక జరుపుకొంటారు. పితృతర్పణాలతో, కొరవుల మంటల వెలుగులతో పెద్దలను తలంచుకొని పూర్వీకులపై భక్తిని ప్రకటిస్తారు. ఇంట సిరులు స్థిరంగా ఉండాలని లక్ష్మీపూజ, కుబేరపూజ చేస్తారు. అలక్ష్మిని (దారిద్య్ర, భయ, రోగాది దుర్భావాలను) తొలగించేందుకు ధ్వనులతో కూడిన వెలుగు రవ్వలను బాణసంచులుగా జ్వలింపజేస్తారు. దేవతల కృప లభించేలా దీపతోరణాలను వెలిగిస్తారు. భాద్రపద కృష్ణపక్షపు మహాలయ దినాల్లో ఆరాధించిన పితరులకు ఈ ఆశ్వయుజ అమావాస్య ఒక విధంగా వీడ్కోలు తెలుపుతుందని- పితృదేవతారాధన శాస్త్రాలు చెబుతున్నాయి.

ప్రదోషకాలంలో అమావాస్య ఉన్న రోజునే దీపామావాస్యగా పేర్కొనాలని ధర్మశాస్త్ర వచనం. ప్రాతఃకాలంలో అభ్యంగస్నానం, తదుపరి వినోదాలు, ఇష్టమృష్ఠాన్న భోజనం, బంధుమిత్రులతో సాంగత్యం, సందెవేళ ధనలక్ష్మీ పూజ, దీపలక్ష్మీ ఆరాధన, దీపాలంకరణ- ఈరోజున ఉత్సవ విధులుగా పేర్కొన్నారు. జగదంబ కళాస్వరూపాన్ని నరక చతుర్దశి, దీపరాత్రులతో ఆరాధించడం కూడా కొన్ని చోట్ల సంప్రదాయం.

నరక చతుర్దశి, దీపావళి, కార్తిక శుద్ధ పాడ్యమి- ఈ మూడు రాత్రుల్లో దీపాలు వెలిగించాలి- అని ఈ పండుగకు సంబంధించి ప్రాచీనగ్రంథాలు తెలియజేస్తున్నాయి. అంటే, త్రిరాత్ర పర్వంగా దీన్ని శాస్త్రం అభివర్ణించింది. ఇంటి వాకిళ్లలో, తులసికోటవద్ద, గుమ్మాల్లో, గోశాలలో, దేవాలయాల్లో దీపమాలికలను వెలిగించాలి- అని పురాణాల మాట. దేవతలు కాంతిశరీరులు కనుక, దీపజ్యోతుల వల్ల దేవతాశక్తులు ఆహ్వానితులై అనుగ్రహిస్తారు- అనే కారణంతో దీపాలు వెలిగించాలంటారు.

లక్ష్మీపూజతోపాటు గోమాతను, వృషభాలను అలంకరించి పూజించాలని- కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇది గోలక్ష్మీపూజ. 'దీపేన సాధ్యతే సర్వం' అని ఆర్ష వచనం. దీపంతో దేనినైనా సాధించవచ్చు- అని రుషులు చెప్పిన మహిమా వచనం. గ్రహదోషాలు తొలగాలన్నా, ఆయువు పెరగాలన్నా, అభీష్టాలు సిద్ధించాలన్నా దీపాలను వెలిగించి నమస్కరిస్తే చాలునని దీప మహిమను పురాణ గ్రంథాలు వివరించాయి.
వేదన కలిగించే స్థితికి 'నరకం' అని నిర్వచనం. ఆ నరకాన్ని పోగొట్టి ఆనందాన్నిచ్చే సంతోష కాంతి సాధన దీపావళి పర్వం.
- సామవేదం షణ్ముఖశర్మ 

Friday, 1 November 2013

ధన త్రయోదశి


రోగ్యప్రాప్తి, ఐశ్వర్య సిద్ధికోసం దైవ స్వరూపాల్ని విశేషంగా ఆరాధించే పర్వదినమే ధన త్రయోదశి. ఆశ్వయుజ బహుళ త్రయోదశినాడు ఆచరించే ఈ పండుగకు ధన్వంతరీ త్రయోదశి, యమ త్రయోదశి, కుబేర త్రయోదశి, ఐశ్వర్య త్రయోదశి వంటి పేర్లూ ఉన్నాయి. 'అందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలి. అకాల మత్యుభయాలు లేకుండా, సిరి సంపదలతో విలసిల్లాలి'- అనే శుభాకాంక్షలకు నేపథ్యమే ధనత్రయోదశి పర్వదినం. సంపదలతో తులతూగడానికి లక్ష్మీదేవినీ, సంపూర్ణ ఆరోగ్యంకోసం ధన్వంతరినీ, సుస్థిర ఆర్థిక వృద్ధికి కుబేరుణ్నీ, అపమృత్యు బాధలు తొలగడానికి యమధర్మరాజును వివిధ రీతుల్లో ధన త్రయోదశినాడు పూజిస్తారు.
ధన త్రయోదశికి పౌరాణిక ప్రశస్తి ఎంతో ఉంది. లక్ష్మీదేవిని నరక చెరనుంచి విముక్తి చేసి, శ్రీహరి ఆమెను ధనాధిష్ఠాన దేవతగా ప్రకటించి, ధనలక్ష్మి పేరిట ఐశ్వర్యానికి పట్టాభిషిక్తురాల్ని చేసింది ఈ రోజేనని చెబుతారు. అలాగే వామనుడు త్రివిక్రమావతారాన్ని ధరించి బలిచక్రవర్తి వద్ద మూడు అడుగుల నేలను దానంగా స్వీకరించాడు. భూలోకం మొత్తాన్నీ ఒక్క పాదంతో వామనుడు ఈ ధన త్రయోదశి నాడే ఆక్రమించాడంటారు.

సకల సిరులకు, అష్త్టెశ్వర్యాలకు, నవ నిధులకు, సుఖసంతోషాలకు అధినాయకురాలైన ధనలక్ష్మిని ధన త్రయోదశినాడు ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ విశిష్టమైన పర్వదినంనాడు మనం ఏ భావనతో ఉంటామో, అదే భావం సంవత్సరమంతా కొనసాగుతుందని నమ్మకం. లక్ష్మీదేవి ధనప్రదాతగా ఆవిష్కారమైన రోజు కాబట్టి ఈ ధన త్రయోదశినాడు బంగారు, వెండి ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దీంతో ఏడాది పొడవునా తమకు ధనలక్ష్మీ కృపాకటాక్షాలు చేకూరుతాయని విశ్వసిస్తారు. ఆర్థిక స్థిరత్వాన్ని అనుగ్రహించే కుబేరుణ్ని ధన త్రయోదశినాడు వ్రతాచరణ పూర్వకంగా ఆరాధిస్తారు. కుబేరుణ్ని కుబేర యంత్రసహితంగా పూజించడంవల్ల అక్షయ సంపదలు అందుతాయని భావిస్తారు. ధన త్రయోదశినాడు బంగారు, వెండి ఆభరణాలతోపాటు రాగి, పంచలోహ పాత్రలు కొనుగోలు చేస్తారు. రాబోయే సంవత్సరానికి ఇది సమృద్ధిదాయకమని నమ్ముతారు. అలాగే ఈ పర్వదినంనాడు ఇతరులకు రుణాల్ని ఇవ్వకపోవడం, వృథా ఖర్చులు చేయకపోవడం వంటివి సంప్రదాయాలుగా పాటిస్తారు.

పరిపూర్ణ ఆయువుకోసం యమధర్మరాజును ధన త్రయోదశినాడు పూజిస్తారు. ఈ రోజు సూర్యాస్తమయ సమయంలో ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా మట్టి ప్రమిదల్లో నువ్వులనూనె పోసి దీపాల్ని వెలిగిస్తారు. వీటిని యమదీపాలుగా పేర్కొంటారు. యముడు దక్షిణదిక్కుకు అధిపతి కాబట్టి, ఇంటి ఆవరణలో దక్షిణం వైపున, ధాన్యపు రాశిమీద దీపాన్ని వెలిగిస్తారు. ఈ యమదీపంవల్ల సమవర్తి అయిన యముడు శాంతి చెంది, అకాల మృత్యువును దరిచేరనీయడని ప్రతీతి. విష్ణుమూర్తి అనేక అవతారాల్లో ధన్వంతరీ స్వరూపం కూడా ఒకటి. ధన త్రయోదశినాడే ధన్వంతరి క్షీరసాగర మథన సందర్భంలో అమృతకలశంతో ఉద్భవించాడంటారు. శ్రీహరి ఆయనకు 'జలుడు' అని నామకరణం చేశాడంటారు. ఆరోగ్యంగా జీవించడానికి ఉపయుక్తమైన ఆయుర్వేదానికి ధన్వంతరిని అధిపతిగా నియమించాడని చెబుతారు. సప్త ధాతువుల్లో బంగారానికి వైద్యపరమైన శ్రేష్ఠత అధికంగా ఉందనీ, స్వర్ణభస్మ సేవనంవల్ల మనిషి జీవన కాలాన్ని పెంపొందించుకోవచ్చని ధన్వంతరి వెల్లడించాడు. ధన త్రయోదశికీ, బంగారానికి అవినాభావ సంబంధం ఏర్పడటానికి ఇది కూడా ఓ కారణంగా చెబుతారు. ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో, వారణాశిలో, తమిళనాడులోని శ్రీరంగంలో, కేరళలోని అష్ట ధన్వంతరీ ఆలయాల్లో ధన్వంతరిని ధన త్రయోదశి నాడు విశేషంగా ఆరాధిస్తారు.

ఉత్తర భారతదేశంలో ధన త్రయోదశిని 'ధన్‌ తేరస్‌' పేరిట నిర్వహిస్తారు. ఇది ప్రధానంగా ఉత్తరాది పండుగే అయినా ప్రస్తుతం దేశమంతా వ్యాప్తి చెందింది. ధన త్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి, యమద్వితీయ అనే అయిదు పండుగల సమాహారానికి ధన త్రయోదశి శుభశ్రీకారం చుడుతోంది. ఆరోగ్యలబ్ధి, సౌభాగ్య సిద్ధి, ఆయుర్‌వృద్ధి, ఆర్థిక సమృద్ధి ఏకీకృతంగా దైవారాధన ద్వారా అందుకోవడానికి ధన త్రయోదశి పావనకరమైన పర్వదినం.
- డాక్టర్‌ కావూరి రాజేశ్‌ పటేల్‌