ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Wednesday, 9 October 2013

సామూహిక ధ్యానం


మానవ నిశ్శబ్దం పరాత్పర నిశ్శబ్దంతో సంభాషించడమే ప్రార్థన. అంతరంగం అనంతంతో మాట్లాడటమే ప్రార్థన. అసలు ఎందుకు ప్రార్థన? ఏవేవో కావాలని, కష్టాల నుంచి కాపాడాలని, సదా రక్షించమని కోరడమేనా? ఎన్నో ఇచ్చినందుకు కృతజ్ఞత చూపడం ప్రార్థనా? ఎటువంటి లోటులేకుండా, భగవంతుడితో బంధం తెగిపోకుండా నిత్యం కృప చూపాలనుకోవడం ప్రార్థనా?
అన్నింటికన్నా నిశ్శబ్ద ప్రార్థనే ఉత్తమం. యాంత్రికంగా బాహ్యపెదవుల్ని కదపడంకన్నా నిండుగుండెతో మౌన ప్రార్థన మేలు- 'నాకు సంపద కాని సౌందర్యం కాని వద్దు. మరో ప్రపంచం అసలే వద్దు. ఈ ప్రపంచాన్ని భరించే నువ్వు ఈ జీవన భారాన్ని మోయడంలో సహాయపడు...' 'ఒక తండ్రి తన కుమారుడి హస్తం పట్టుకుని నడిపించినట్లు నన్ను మహోదయ తీరాలవైపు నడిపించు. నీ కృపచాలు. కోటివరాలు వద్దు'.

వెలుగుకోసం జ్ఞానం కోసం ప్రార్థన మరింత ఉత్తమమైనది. భ్రమలు, భ్రాంతులు తొలగించి దైవం తన యథార్థరూపాన్ని, అంతిమ సత్యాన్ని సాక్షాత్కరింపజేయడానికి మనల్ని మనం అర్హులుగా తీర్చిదిద్దుకోవాలి. కోరికలు తీరుతున్నా కష్టాలు తప్పవు. కృప ఉన్నా నష్టాలు తప్పవు. భగవంతుడి కరుణవల్ల కొందరికి బాధలు అంతరిస్తాయి. మరికొందరికి బాధలు పోవు. అంతమాత్రాన భగవంతుడి కృప వారిపై లేనట్లేగా? ఈ భూమిమీద కావలసినవన్నీ వరాలుగా కురిపిస్తాడు భగవంతుడు. ఒక్కొక్కసారి ఏమీ ఇవ్వకుండా ఆ రోజుకు వాయిదా వేస్తుంటాడు. ఈలోగా భక్తుల్ని తన ఆనంద పరిష్వంగంలోకి తీసుకొని రక్షిస్తాడు. విశ్వాసం, శ్రద్ధ, ఆత్మ సమర్పణ- ప్రార్థనకు పూజా వస్తువులు.

విధివల్ల కలిగే గాయాలు మనల్ని భగవంతుడికి మరీ దగ్గరకు తీసుకొని వెళ్తాయి. గతం, వర్తమానం, భవిష్యత్తులో భగవంతుడి స్వరూపాల్ని కనుగొనాలి. మనం పొందిన వరాలు, పోగొట్టుకున్న వరాలు... అన్నీ ఆయనలోనే పదిలంగా ఉంటాయి. తగిన సమయంలో అన్నీ ఇస్తాడు.

ఈ విశ్వాన్ని ఎవరో రక్షిస్తున్నారు, మనల్ని ఎవరో రక్షిస్తున్నారు అన్న భావన చాలు- జీవితాన్ని వెలుగుగా మార్చడానికి. నిత్యానందమయమైన ఆత్మనుంచి వెలువడే మంత్ర ధ్యానాలే ప్రార్థనలు. వ్యక్తి ప్రార్థనకన్నా సామూహిక ప్రార్థన మరింత శక్తిమంతమైనది. కొంతమంది కలిసి ఒక ముఖ్య లక్ష్యంతో ఒక బృందంగా ఏర్పడి చేసేదే సామూహిక ప్రార్థన లేదా ధ్యానం. అన్ని యుగాల్లో ప్రార్థనకోసం ఒకచోట సమావేశం కావడం జరుగుతుండేది. అనేక దేశాల్లో ఈ సమావేశాలు జరిగేవి. కొందరు దైవసంకీర్తనలు గానం చేసేవారు. స్తోత్రాలు, ధన్యవాదాలు, ఆరాధన, కృతజ్ఞత, సమర్పణ లేదా కీర్తన, ప్రస్తుతి చేసేవారు. ఇందుకు చారిత్రక ఆధారాలున్నాయి. అందరూ కలిసికట్టుగా సమకూడటంవల్ల ప్రార్థనకు బలం చేకూరుతుందని విశ్వసించేవారు. క్రీ.శ. 1000 సంవత్సరంలో జరిగిన ఒక ప్రాచీన ఘటన అద్భుతమైనది. కొంతమంది ప్రవక్తలు విశ్వం అంతమైపోతుందని ప్రకటించినప్పుడు, అన్ని చోట్ల ప్రజలు సమూహాలుగా ఏర్పడి ప్రపంచం అంతం కాకూడదని, రక్షించమని భగవంతుణ్ని ప్రార్థించారట. ఇటీవలి కాలంలో, ఆధునిక యుగంలో ఇంగ్లాండ్‌కు చెందిన కింగ్‌జార్జి న్యూమోనియాతో మరణశయ్యపై ఉన్నప్పుడు, ప్రజలంతా వీధుల్లో బారులుతీరి త్వరగా నయంకావాలని ప్రార్థించారు. ఆశ్చర్యకరంగా ఆ రాజు కోలుకొన్నాడు. ఇందుకు భిన్నంగా సామూహిక అభ్యున్నతికోసం, ఒక శక్తికి, ఒక తేజస్సుకు ఉన్మీలనం కావడం కోసం ఆశ్రమాల్లో, దీక్షారామాల్లో సామూహిక ధ్యానం చేసేవారు. అప్పుడే అంతర్దీపాలు వెలుగుతాయి. అంతర్మార్గాలు తెరచుకొంటాయి... త్వరగా.
- కె.యజ్ఞన్న 

Tuesday, 8 October 2013

రాగద్వేషాలు


నిషి మనసును పక్షితో పోలుస్తారు. రాగద్వేషాలు దాని రెండు రెక్కలు. ఆ రెండు రెక్కల సాయంతో మనసనే పక్షి యథేచ్ఛగా విహరిస్తుంది. మమకారం, అహంకారం, అభిమానం, దురభిమానం, అతిశయం... లాంటివన్నీ- రాగం అనే రెక్కలోని ఈకలు. అలాగే ఈర్ష్య, అసూయ, పగ, ప్రతీకారం, కోపం, మూర్ఖత్వం మొదలైనవన్నీ- ద్వేషం అనే రెక్కలోని ఈకలు. ఈకలు ఎంత దట్టంగా ఉంటే రెక్కలంత బలిష్ఠంగా ఉంటాయి. రాగద్వేషాలు బలపడితే మనసు గతి తప్పుతుంది.

మనసును అదుపులో ఉంచాలనుకుంటే మొదట రాగ ద్వేషాలను నియంత్రణలో ఉంచాలి. చిత్త నిరోధమని చెప్పలేదు- మన పెద్దలు చిత్తవృత్తి నిరోధం అనే చెప్పారు. పక్షికి ఈకలుగా చెప్పుకొన్నవన్నీ ఒకరకంగా చిత్త వృత్తులే! వాటిని అదుపు చేయడం ద్వారా రాగద్వేషాలు, తద్వారా చిత్తం అదుపాజ్ఞల్లోకి వస్తాయి. చిత్తవృత్తులను లోబరచుకోవడాన్ని 'యోగ' అన్నారు.

బంధమైనా, మోక్షమైనా మనసు కారణంగానే ఏర్పడతాయని అమృతబిందు ఉపనిషత్తు బోధించింది. రాగద్వేషాలకు మనిషి బద్ధుడైతే- అది బంధం. వాటినుంచి ముక్తుడైతే - అది మోక్షం. బందీ అయినవాడు బద్ధుడు. బయటపడినవాడు- బుద్ధుడు!

రాగద్వేషాలు వ్యసనాలకు తల్లిదండ్రులు. కామజాలు అంటే కోరికల్లోంచి పుట్టేవి. క్రోధజాలంటే కోపంలోంచి పుట్టే వ్యసనాలు. రాగం కామజాలకు పుట్టిల్లు. ద్వేషం క్రోధజాలకు పుట్టిల్లు. సప్త వ్యసనాలైన స్త్రీ, పానం, జూదం, వేట, వాక్పారుష్యం, దండపారుష్యం, అనవసర వ్యయప్రీతికి రాగద్వేషాలే కారణం. అంటే, వ్యసనాలన్నీ మనసులోంచే ఉద్భవిస్తాయి.

ధర్మరాజు ద్యూత వ్యసనం, దుర్యోధనుడి దురభిమానం, ధృతరాష్ట్రుడి పుత్రవ్యామోహం, దక్షప్రజాపతి దురహంకారం, రావణాసురుడి కాముకత్వం, కీచకుడి మూర్ఖత్వం, కంసుడి భయం, అశ్వత్థామ పగ, తన కూతురు దేవయానిపై శుక్రాచార్యుడి మితిమీరిన మమకారం... ఇలా మనిషి పతనానికి దోహదం చేసే సంభారాలన్నీ రాగద్వేషాల ముడిసరకులే!

ముని శాపం కారణంగా పరీక్షిత్తు అనే రాజు తక్షకుడనే సర్పం కాటుకు మరణించాడు. పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు. తన తండ్రి మరణానికి ఒక పాము కారణమైంది కనుక, సర్పజాతి మొత్తాన్ని సమూలంగా నిర్మూలించాలని జనమేజయుడు కక్షగట్టాడు. సర్పయాగం తలపెట్టాడు. ఇది కలియుగ ఆరంభంలోని మానవ జాతిలో మొలకెత్తిన ఒకానొక విపరీత వికార లక్షణం. ఇది మహాభారత గాథలోని ఒక విషాదకరమైన కీలకాంశం. కేవలం ఒక్క వ్యక్తి మృతి కారణంగా, ఈ సృష్టిలోని ఒక జాతి మొత్తాన్ని సర్వనాశనం చేయాలన్న ప్రతీకారేచ్ఛకు అది బీజ ప్రాయమైన హెచ్చరిక. ఒక్క మనసులో రగిలిన పగ, సృష్టిని ఒక కుదుపు కుదుపుతుందని, అది కలియుగ లక్షణమని మనకు మహాభారతం చేసిన సూచన.

దీన్ని సూక్ష్మంగా పరిశీలిస్తే- ఈ కాలంలో సంభవిస్తున్న దుర్ఘటనలు, నరమేధాలు, మారణహోమాలు, వూచకోతలు తదితరాలకు ప్రధాన హేతువు మనకు గోచరిస్తుంది. ఒక మనసు రాజేసిన పగ- ఆ జాతికో, తెగకో సంక్రమించి దావానలంగా విస్తరించి, ప్రతీకారంగా ప్రజ్వలించి మరో జాతికో, తెగకో హాని చేస్తోంది. మానవ జాతి వినాశనానికి మూల కారణం అవుతోంది. కలియుగ మానవుడి ప్రధాన కర్తవ్యం ఏమంటే ప్రతిమనిషీ- జనమేజయుడి సర్పయాగాన్ని అడ్డుకున్న అస్తీక మహర్షి కావాలి. తన మనసుదాకా వచ్చిన చీడను తనలోనే అంతం చేసి, దాన్నిక వ్యాపించకుండా చూడాలి. అలా చేటును అడ్డుకున్న ప్రతి వ్యక్తీ అస్తీక మునే అవుతాడు. అలా కావాలంటే ముందు మన చిత్తవృత్తుల తోకలుత్తరించాలి. రాగద్వేషాలనే రెక్కలను కత్తిరించాలి. మనసనే పక్షిని పంజరంలో బంధించాలి. అలా మనసును మనం బంధించకపోతే మనమే దానికి బందీలవుతాం. బంధం విడిపోతే మోక్షం. మనసు ప్రభావం నుంచి బయటపడిన మనిషే మహర్షి! బంధమైనా, మోక్షమైనా కారణం మాత్రం మనసే- అని ఉపనిషత్తు చెప్పిన మాటకు అర్థం అదే!

మనమూ ఆధ్యాత్మిక యోగబలంతో రాగద్వేషాలను నిరోధించి మనసును అదుపాజ్ఞల్లో ఉంచుకోవచ్చు. రాగద్వేషాలతో కిక్కిరిసిపోయిన మనసులో శివుడికి కాస్త చోటు కల్పిస్తే, అదే యోగం! శివుడితో బంధం పెరగడమే మనసు నుంచి మోక్షం చిక్కుతోందనడానికి చిహ్నం.ఇది మనసును అదుపు చేయడానికి సులువైన దారి!
- ఎర్రాప్రగడ రామకృష్ణ

Monday, 7 October 2013

పద్మాసనం


ద్మాసనంలో కూర్చోగానే కళ్లు అరమోడ్పులవుతాయి. చేతులు చిన్ముద్రలోకి వెళ్లిపోతాయి. ముఖం ప్రశాంతమై పద్మంలా వికసిస్తుంది. భారతీయుల అపూర్వమైన ఆసనం... పద్మాసనంలోని ప్రభావం అది. పద్మాసనం వేయగానే మిగిలిన శరీరం సహజంగానే ధ్యానసన్నద్ధమైపోతుంది. మనసు ధ్యానస్థితిలోకి వెళ్లిపోతుంది. ధ్యానస్థితికి అవసరమైన మేరుదండపు నిటారు భంగిమ యథాలాపంగా కుదిరిపోతుంది. మానవుడనే ఈ బాల బ్రహ్మకు బ్రహ్మాండాన్ని ఔపోసన పట్టే, బ్రహ్మనే గుండె పిడికిట పట్టే ప్రక్రియకు చాలిన సన్నద్ధ క్రియ, భంగిమ, స్థితి... ఇది. ప్రపంచాన్ని జయించిన ఏ చక్రవర్తి అయినా ఈ భంగిమలోని ధ్యానిని మించి జయించలేడు. ముల్లోకాలను ఆక్రమించుకునేందుకు వామన రూపంలోని ఆ విష్ణువుకైనా మూడడుగులు కావలసి వచ్చింది. కానీ ఈ మానవుడికి, ఈ ధ్యానికి తాను కూర్చున్న రెండు చదరపు అడుగుల స్థలం సరిపోతుంది. అవని ఆసనంగా, ఆకాశం ఆచ్ఛాదనగా 'తపోభూమిక'లోకి వెళ్లిపోయే సాధకుడు ఈ లోకంలో, ఏ లోకంలో అయినా సాధించలేనిది ఏముంది?
అద్భుతాలెప్పుడూ బృహత్తర ప్రయత్నాల ద్వారానే జరగవు. వాటి మూలం సూక్ష్మంలోనే ఉంటుంది. ఆ కిటుకు తెలియాలి. దాన్ని అనుసరించాలి. ఆచరించాలి. ఔపోసన పట్టాలి. అదే ధ్యానం. తపస్సు. ఓ గొప్ప శాస్త్రజ్ఞుడు కుదురుగా కూర్చుని ఒక్క పది నిమిషాలు ధ్యానం చేయలేకపోవచ్చు. ఒక ధ్యాని అవసరమైతే ఆ శాస్త్రజ్ఞుడి కంటే గొప్ప అంశాన్ని ఆవిష్కరించగలడు. ఆయన ప్రయోగశాల ప్రాంగణం రెండు చదరపు అడుగుల స్థలం. అంతరంగమే ఆయన ప్రయోగశాల. యోగం ఆయన ప్రయోగం. ఒక ధ్యాని, యోగి, రుషి ఎవరైనా... వారి యోగాలు, ప్రయోగాలు పైకి వ్యష్టి ప్రయోజనంగా కనిపించినా నిజానికి అవి సమష్టి ప్రయోజనాలు. సమష్టి హక్కుభుక్తాలు. లోక కల్యాణ కారకాలు.

ఇదంతా భారతీయ సంస్కృతీ వైభవం. రెండు చదరపు అడుగుల సింహాసనం మీదినుంచి విశ్వాన్ని శాసించే భారతీయ యోగికి సాటిరాగల ధీరుడు ప్రపంచ చరిత్రలోనే లేడు. ఉండడు.

పద్మాసనం... ఈ ఆసనంలో సాధకుడు పద్మంలా కనిపిస్తాడు. సాధకుడు మానసికంగా ఏ మాలిన్యాన్నీ అంటకుండా బురద మడుగులోని పద్మంలా స్వచ్ఛంగా, స్నిగ్ధంగా, సౌరభ పూర్ణంగా విరాజమానమవుతాడు. పద్మాసనంలో కూర్చున్న సాధకుడి ఆంతర్యం కూడా ఆసన ప్రభావంతో ఒక ఉదాత్త వైఖరిలోకి వెళ్లిపోతుంది. ఆసనం మీద, ఆ విక్రమార్క సింహాసనం మీద కూర్చున్న ఆ రుషి చక్రవర్తి, ఆ యోగిరాజు మనిషిగా మరణించి మహాత్ముడిగా ఆత్మనేత్రం తెరుస్తున్నాడు.

ప్రపంచ సాధకలోకానికి భారతదేశం ప్రసాదించిన వరం మన పద్మాసనం. కనురెప్పలు అరమోడ్చినా, మోడ్చమని చెప్పినా దానికో ఉత్కృష్ట ప్రయోజనాన్ని గ్రహించాకే లేదా ఆవిష్కరించాకే అలా చెప్పగల సూక్ష్మదర్శులు మన రుషులు. పద్మాసనంలోని ప్రయోజన వైచిత్రిని దర్శించాకే ధ్యానానికి, తపస్సుకు దాన్ని నిర్దేశించింది శాస్త్రమైనా, రుషిగణమైనా. యోగానికి కాలపరిమితి లేదు. సమయ నిర్దేశం లేదు. యోగి జడల్లో పక్షి సమూహాలు గూళ్లూ నిర్మించుకోవచ్చు. శరీరం చుట్టూ పుట్టలూ వెలయవచ్చు. సాధకుడు మొండివాడైతే ఎముకలు అరగనీ అంటాడు. కండలు కరగనీ అంటాడు. జుట్టు జడలు కట్టనీ అంటాడు. తపోదీక్ష అంత కఠినమైనది. బుద్ధుడైతే జ్ఞానోదయం అయ్యేవరకు లేచే ప్రసక్తే లేదని బోధివృక్షం కింద కూర్చున్నాడు. స్వామి వివేకానందుడు సముద్ర మధ్యంలో ఓ శిలాలంక మీద శైల సదృశంగా కూర్చుండిపోయాడు. ఆత్మ సాక్షాత్కారం మాత్రమే ఆయనను ఆసనం మీంచి లేపగలిగింది.

అందుకే... పద్మాసనం. అది దీర్ఘకాలం కదలకుండా కూర్చునే ఓపికనిచ్చే ఆసనం. మూలాధారం నుంచి సహస్రార చక్రం వరకు సూక్ష్మమైన వంకరకూడా లేకుండా నిటారుగా నిలపగలిగే ఆసనం. చిన్ముద్రకు చేతుల్ని సౌకర్యంగా మలచుకోనిచ్చే ఆసనం. మేనునే కాదు మనసునూ ధ్యానానుకూలంగా ఆయత్తం చేసే ఆసనం- పద్మాసనం.
- చక్కిలం విజయలక్ష్మి

Sunday, 6 October 2013

దివ్యత్వపు దారి


చిన్నప్పటినుంచీ కళ్లతో చూసిందే నమ్ముతున్నాం. అలా నమ్మటంవల్ల తార్కిక బుద్ధి ఏర్పడి, ప్రతిదీ రుజువు చేసుకుంటూ ఉంటే మనకు ఆనందం కలుగుతుంది. అందుకు మనల్ని మేధావులని పిలిస్తే గొప్ప సంతోషం మనకు. మన అహంకారం సంతృప్తి చెందితే విశ్వాన్ని జయించినంతగా ఆనందపడిపోతాం. ఒక్కోసారి చిన్నమాటకే బాధపడి గాలి తీసిన బుడగలాగ అయిపోతాం.
నమ్మకాలు ఉండాలి. నమ్మాలి. కొందరు అమ్మ చెబితేనే నమ్ముతారు. కొందరు నాన్న చెబితే నమ్ముతారు. కొందరు భార్య చెబితే నమ్ముతారు. కొందరు భర్త చెబితే నమ్ముతారు. కొందరు స్నేహితులు చెబితే నమ్ముతారు. కొందరు బంధువులు చెబితే నమ్ముతారు. కొందరు ఎవరు చెప్పినా నమ్మరు. థామస్‌ ఆల్వా ఎడిసన్‌ దిగి వచ్చి చెప్పినా వాళ్లకు నమ్మకం కలగదు. ఐన్‌స్టీన్‌నీ ఎగాదిగా చూస్తారు. అబ్దుల్‌ కలామ్‌ మాటలనీ హేళనగా తీసుకుంటారు.

చూసింది నమ్మక, చూడనిది నమ్మక మరి వీళ్లు ఎవరిని నమ్ముతారు? నమ్మకం లేకపోతే జీవితం లేదు. అడుగడుగునా నమ్మకాలతో ముడివడే- జీవితాలు నడుస్తూ ఉంటాయి. గడుస్తూ ఉంటాయి. నిత్యం సందేహాలతో కొట్టుకునేవాళ్లు, అపనమ్మకాలతో జీవించేవాళ్లు- మందులనే కాదు, తల్లిప్రేమలో సైతం కల్తీ ఉందేమోనని అనుమానపడుతూ ఉంటారు. నమ్మడంవల్ల ఆత్మవిశ్వాసం, ధైర్యం కలుగుతాయి. నమ్మడంవల్ల విజయానికి చేరువ కావడానికి కావలసిన దారులను మన అంతశ్చేతన కల్పిస్తుంది. నమ్మి సహనంతో నిరీక్షిస్తే దివ్యత్వపు దారులు తెరచుకుంటాయి. ఎంతోమంది మహానుభావులు ఈ విషయాన్ని రుజువు చేశారు.

నమ్మకం అనే విషయం మీద ఆధారపడే, సర్వమత గ్రంథాలు మనుగడ సాగిస్తున్నాయి. నమ్మకం లేకపోతే, దేవుణ్ని చూడటం మాట అటుంచి, మనిషిని మనిషిగా చూసే పరిస్థితీ ఉండదు. మన మాటల్లో నమ్మకం ఉంటుంది. నమ్మకం ఉన్నట్లు మాట్లాడతాం. మనసు నిండా సందేహం గూడు కట్టుకుని ఉంటుంది. ఈ పరిస్థితిని ఏమనాలి? ఇటువంటి నమ్మకాలు ఏ ఫలితాలను ఇస్తాయి?

ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు? ఇలా చాలామంది తర్జనభర్జన పడుతూ ఉంటారు. లోకంలో జరుగుతున్న మోసాలను చూసి అలా అనుకోవడం సహజమే. అలా అని నమ్మకం మీద నమ్మకం వదిలేస్తే జీవనం సాగించగలమా, బతుకుబండి నడుస్తుందా?

మంచికో చెడుకో దుర్యోధనుణ్ని నమ్మాడు కర్ణుడు. జీవితం చివరిదాకా అతనితోనే ఉన్నాడు. ఎన్నో దూషణ భూషణ తిరస్కారాలను ఎదుర్కొన్నాడు. బాధలు పడ్డాడు. స్థిరమైన విశ్వాసంతో ఉన్నాడు. చరిత్రలో నిలిచిపోయాడు. పాండవులు పూర్ణంగా శరణాగతితో శ్రీకృష్ణుని విశ్వసించారు. విధిని ఎదిరించారు. విజయం సాధించారు. నమ్మడం ఎప్పుడూ మంచిదే. నమ్మకపోవడమే చెడ్డది. జీవితంలో ఎదగాలనుకునేవాళ్లు నమ్మకాన్ని గౌరవిస్తూనే ఉండాలి.

నమ్మితే అద్భుతాలు చూడగలవు అంటుంది క్రైస్తవ మతం. యద్భావం తద్భవతి అంటుంది హిందూ తత్వం. విశ్వాసమే ప్రాతిపదికన ఇస్లాం మతం ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. పొర్లు దండాలు, చెక్క భజనలు మూఢనమ్మకాలు అనుకున్నా, వాటిలోనూ మానవుడి హృదయముంది. ప్రేమ ఉంది. విశ్వాసం ఉంది. ఎవరు ఏ దారిలో వెళ్లి నమ్మినా మంచిదే. తరవాత అందులో ఉన్న మంచిచెడ్డలు వాళ్లే స్వయంగా తెలుసుకుంటారు.

ఎవరిని నమ్మినా, నమ్మకపోయినా మనల్ని మనం నమ్మాలి. మనశక్తిని నమ్మాలి. మానవుడు సృష్టిస్తున్న అద్భుతాలను నమ్మాలి. ఏ శక్తి విశ్వానికి కారణం అవుతుందో ఆ శక్తిని తెలుసుకోవడానికి మనలో ఉన్న దైవత్వాన్ని నమ్మాలి. మట్టిసారం తెలుసుకోవాలంటే మట్టిని విశ్వసించాలి. విశ్వ రహస్యాలు తెలుసుకోవాలంటే, దానికి ప్రతీక అయిన నరుడి అంతరంగంలోకి నమ్మకంతో నడవాలి. మహాత్ములు తెలుసుకున్న సత్యాన్ని మనమూ నమ్మక తప్పదు.

'సమస్త జ్ఞానం నాలో ఉంది. సర్వశక్తి నాలో ఉంది. నేను పరమ పవిత్రుణ్ని, నిత్య ముక్తుణ్ని... ఈ జ్ఞానం నేను ఎందుకు అభివ్యక్తం చేయలేక పోతున్నాను? నాకు దానిపై విశ్వాసం కుదరలేదు కాబట్టే! దానిపై నాకు విశ్వాసం కలిగిన వెంటనే అది అభివ్యక్తం కాగలదు. అభివ్యక్తమయ్యే తీరుతుంది' అంటాడు స్వామి వివేకానందుడు.
- ఆనందసాయి స్వామి

వైకుంఠ బ్రహ్మోత్సవాలు


  వేంకటేశ్వర స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలు తిరుమలలో నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. కలియుగ దైవం మాడ వీధుల్లో వివిధ రూపాల్లో తొమ్మిది రోజులు వూరేగనున్నాడు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి హస్త నక్షత్రంలో ప్రారంభమవుతున్న బ్రహ్మోత్సవాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసాదిస్తాయి. ఈ క్షేత్రంలోని మూర్తిలో సాక్షాత్తు విష్ణు అంశ నిండి ఉందని అంటారు. దైవానికి ఆది అంతం లేనట్లే ఈ మూర్తి సైతం ఆద్యంత రహితమే! గర్భగుడిలోని దైవాంశ మాడ వీధుల్లో వూరేగడమన్నది ఒక అద్భుతం. భక్తుల కళ్లముందు స్వామి వూరేగుతూంటే వీక్షకులు తమ విన్నపాలను ప్రత్యక్షంగా విన్నవించుకొంటారు. 'విన్నపాలు వినవలె వింత వింతలు పన్నగపు దోమతెర పైకెత్తవేమయా' అంటూ అన్నమయ వేంకటేశ్వరుడికి సూచించాడు. పూర్వం చక్రవర్తులు రాజులు సైతం రాజోత్సవాల సందర్భంగా రాజ వీధుల్లో వూరేగి ప్రజలకు దర్శనమిచ్చేవారట. పాలితుల కష్ట నష్టాలను గమనించేందుకు రాజులు ఈ అవకాశాన్ని వినియోగించుకునేవారు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సైతం ప్రతి పునర్వసు నక్షత్రం రోజు అయోధ్యానగరంలో సీతమ్మతో సహా వూరేగేవాడని మొల్ల రామాయణం చెబుతోంది. గర్భగుడిలో కనురెప్ప పాటులో జరిగే దర్శనానికన్నా దైవాన్ని వూరేగుతూంటే చూడటమన్నది ఒక మహత్తర అనుభూతి.

తిరుమలలో తొలి బ్రహ్మోత్సవం సాక్షాత్తు విరించి నిర్వహించాడని బ్రహ్మపురాణం వెల్లడిస్తోంది. తలచినంత మాత్రాన కలియుగంలో ప్రజలను స్వామి సంరక్షిస్తున్నందుకు సంతసించి పుష్కరిణీ తీరంలో బ్రహ్మ ఈ ఉత్సవాలను ప్రారంభించాడని అంటారు. తిరుమలలో తమిళ పంచాంగాన్ని అనుసరించడం ఆనవాయితీ. తమిళ పురాత్తసి మాసంలో బ్రహ్మోత్సవాలు జరుపుతారు. బ్రహ్మోత్సవాల తొమ్మిది రోజుల కాలంలో వేంకటేశ్వరుడు పులకాంకితుడై ఉంటాడని శ్రీ తిరుమల చరిత్ర చాటుతోంది. ఈ తొమ్మిది రోజులూ పరమాత్మ సంతుష్టుడై భక్తులు కోరినదెల్లా ఇస్తాడట. తిరుపతిలోని గోవిందరాజస్వామి తనకు సైతం ఒక పుష్కరిణి కావాలని అరవై సంవత్సరాల కాలం వేంకటేశుని వేడుకొన్నాడట. అయినా ఆ దైవం పుష్కరిణి ప్రసాదించలేదు. బ్రహ్మోత్సవాల సమయంలో గోవిందరాజస్వామి దేవదేవుని కార్యనిర్వహణలో తలమునకలై ఉండేవాడు. ఆ సమయంలో శ్రీవారిని పుష్కరిణి కోసం విన్నవించుకోలేకపోయాడు. ఒకసారి నారదుడు గోవిందరాజస్వామిని బ్రహ్మోత్సవాల సమయంలో పుష్కరిణి కోసం వేంకటేశ్వరుని వేడుకొమ్మని సూచించాడు. ఉత్సవం సమయంలో గోవిందరాజస్వామి ప్రార్థనను వెంటనే మన్నించి దిగువ తిరుపతిలో పుష్కరిణిని దైవం ప్రసాదించాడని బ్రహ్మపురాణం చెబుతోంది. ఈ బ్రహ్మోత్సవాల కాలంలో పరాత్పరుడు కోరిన కోర్కెలకు నెలవుగా నిలుస్తాడని ప్రతీతి.

బ్రహ్మోత్సవాల తొలిరోజు పూర్వ సాయంవేళ అంకురార్పణ జరుగుతుంది. నవధాన్యాలను పుష్కరిణిలో నుంచి పైకి తెచ్చిన మట్టిలో నాటడాన్ని అంకురార్పణ అంటారు. తొలిరోజు ధ్వజారోహణం చేస్తారు. గరుడ రూపాన్ని కలిగిన పతాకాన్ని ధ్వజ స్తంభంపైన ఎగురవేస్తారు. ఇక్కడి నుంచే గరుత్మంతుడు (గరుడాళ్వార్‌) దేవ లోకాలకు ఎగిరి బ్రహ్మోత్సవాలకు దేవతలనందరినీ ఆహ్వానిస్తాడన్నది నమ్మకం. ఈ తొమ్మిది రోజులూ వివిధ హోమాలు జరుగుతాయి. ఉత్సవ మూర్తులను వివిధ వాహనాలపై వూరేగిస్తారు. సింహ వాహనం, కల్పవృక్ష వాహనం, గరుడ వాహనం, సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనాల్లో వూరేగింపు, స్నపన తిరుమంజనం, చక్రస్నానం లాంటి సేవలు భక్తులను ఆనంద పారవశ్యానికి గురిచేస్తాయి.

శ్రేష్ఠమైన సర్పరాజు శేషుడు బ్రహ్మోత్సవాల తొలిరోజు రాత్రివేళ శేషవాహనంగా మారి వేంకటేశ్వరుని మాడ వీధుల్లో వూరేగించే సన్నివేశం చూసి తరించాల్సిన సేవ. శేషుడు తన స్వామికి శరణాగతుడై గరుత్మంతుని కాదని స్వామిని తనపై మోస్తాడట. శరణాగతితత్వం ఈ సన్నివేశంలో ప్రస్ఫుటమవుతుంది. ఈ తొమ్మిది రోజులూ త్రిమూర్తులు తమ తమ స్థానాలను విడచి తిరుమలలో నివాసం ఉంటారని నమ్ముతారు. ఈ సమయంలో తిరుమలలో ఉండటం వైకుంఠంలో నివసించడంలాంటిదేనని భక్తుల నమ్మకం. బ్రహ్మోత్సవాల చివరి రోజు స్వామి జన్మ నక్షత్రంలో అవభృత ఉత్సవం నిర్వహిస్తారు. అవభృత ఉత్సవం అంటే ఉత్సవ మూర్తులకు ప్రత్యేక అభిషేకం నిర్వహించడం! చక్రస్నానం తరవాత సుదర్శన చక్రాన్ని ఒక ఎత్త్తెన వేదిక పైన ఉంచి దానికింద నుంచి భక్తులు నడిచేలా ఏర్పాటు చేస్తారు. తిరుమలలోని దసరా నవరాత్రి బ్రహ్మోత్సవాలు భక్తులపాలిట వైకుంఠ సమారాధనలే.
- అప్పరుసు రమాకాంతరావు