ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Thursday, 21 November 2013

ఆనందామృత మంత్రం


 సంతోషంగా ఉండటం ఇష్టం కానిదెవరికి? అటువంటివారు ఎవరూ ఉండరు. సంతోషంగానీ దుఃఖంకానీ ఆకాశంనుంచి అమాంతంగా వూడిపడేవి కావు. ఆలోచనలే వాటికి కారణమవుతాయన్నది గ్రహించాల్సిన అంశం. ఎంత ఆనందంగా ఉన్న సమయంలోనైనా బాధను కలిగించే ఆలోచన ఒక్కటి మెదడులోకి ప్రవేశిస్తే చాలు- ఆనందం ఆవిరైపోతుంది.
ఆనందంగా, హాయిగా ఉండాలని కోరుకుంటే ఒక్కటి గుర్తుంచుకోవాలి... చీకూచింతలను దూరంచేసే వ్యాపకాన్ని అలవాటు చేసుకోవాలి. బుద్ధికి పని కల్పించాలి. 'ఈ ఘడియలు కూడా శాశ్వతం కాదు, గడచిపోతాయి'- దీన్ని గుర్తుంచుకుంటే సంతోషం సంగతి అలాఉంచి, ఎంతటి విచారమైనా తట్టుకోవడం తేలికవుతుంది. దుఃఖమొచ్చినప్పుడు ధైర్యంతో ఎదుర్కోగలిగే పరిస్థితులుంటాయి. 'సుఖదుఃఖాలు శాశ్వతం కాదు'- ఇదొక మంత్రంగా భావించాలి. కష్టసమయాల్ని పదేపదే ఎదుర్కొన్నప్పుడు ఇది సాధ్యమవుతుంది. చలించిపోయే మనస్తత్వం పోయి దృక్పథంలో సమతుల్యత ఏర్పడుతుంది.

రెండు భిన్నమైన పరిస్థితులు జంటగా ఉంటాయి. గమనిస్తే- ఆశ నిరాశలు, కలిమిలేములు, లాభనష్టాలు, శీతల ఉష్ణాలు, చీకటి వెలుగులు... ఇలా ఎన్నో మనిషిమీద ప్రభావం చూపిస్తాయి. ఒక్కో సందర్భంలో, ఒక్కొక్కరిలో ఒక్కోస్థాయిలో వస్తుంటాయి, పోతుంటాయి శరీరం ఉన్నంతవరకూ... వాటికి తీవ్రస్థాయిలో చలించిపోనక్కరలేదు. మనిషి ఏదో ఒకరోజు ఈ లోకం విడిచిపెట్టిపోక తప్పదు. జీవితమే అశాశ్వతమైనప్పుడు అందులో వచ్చిపోయే సుఖదుఃఖాలు ఇంకా ఎంతో అల్పమైనవి. మనిషి ఆనందంగా, ప్రశాంతంగా ఉండే శక్తిని అలవరచుకోవాలి. సుఖమైనా, దుఃఖమైనా ప్రత్యేకంగా ఉండదు. అది మనసుమీదే ఆధారపడి ఉంటుంది. దాని స్వభావం చంచలం. యథార్థ స్థితిని గ్రహించినప్పుడే ప్రశాంతంగా ఉండటం సాధ్యమవుతుంది. ఆనందం అనేది మనలోనే ఉంటుంది. కానీ అజ్ఞానం చేత అది బయట దేని కారణంగానో పొందుతున్నామని భ్రమ చెందుతాం.

నీటిలో సూర్యుడి ప్రతిబింబం పరిశీలిద్దాం. కంటికి కనిపించినా నీటిలో కనిపించేది సూర్యుడు కాదు. ప్రతిబింబమే. ఉందనిపించడం భ్రాంతి. అలాగే ఆనందానుభూతి. సుఖం, సంతోషం... అన్నీ ఇంద్రియాల ద్వారా పొందే అనుభూతి. ఇదీ నిజమైన ఆనందం కాదు. భ్రాంతి మాత్రమే.

మనిషి అది కావాలి, ఇది కావాలి, ఇలా జరగాలి అని కోరుకుంటాడు. అవి తాను పొందగలిగితే, సాధించుకోగలిగితే ఆనందం కలుగుతుందని ఆశిస్తాడు. దానికోసం తాపత్రయపడతాడు. మంచైనా, చెడైనా సాధించడమే ధ్యేయంగా పెట్టుకుని ముందుకెళతాడు. దక్కించుకుంటాడు. దక్కినట్లే దక్కి చేజారితే ఎంత నిరాశో... దక్కితే ఎంత సంబరమో... ఆ తరవాత? అదే అసలైన ప్రశ్న. ఆ దక్కినది శాశ్వతమా? అశాశ్వతమని చూస్తూనే ఉన్నాం. తెలుసుకుంటూనే ఉన్నాం. అయినా ఆలోచనల్లో మార్పురావటం లేదు. అశాశ్వతమైన వాటివెనక పరుగులుపెడుతూ, ఒకదాని తరవాత మరొక 'కోరిక'తో జీవిస్తున్నాం. ఆ కోరికనే త్యజించగలిగితే అసలైన ఆనందం ఏమిటో తక్షణం అర్థమవుతుందని అనుభవజ్ఞులు చెబుతారు. కలల ప్రపంచంలో పొందే ఆనందం కంటే అది ఎన్నోరెట్లు అధికమైందని అనుభవం నేర్పుతుంది.

కోరికలను అధిగమించగలిగితే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. శాశ్వతమైన ఆనందాన్నీ సొంతం చేసుకోవచ్చు. అసలైన శాంతి అంతులేని కోరికల వెంటపడనప్పుడే లభిస్తుందనేది సత్యం.

తృప్తిగా జీవించే వ్యక్తే సంతోషంగా ఉండగలుగుతాడు. కోటీశ్వరుడైనా దివాలా తీస్తాడు, మనశ్శాంతి కరవవుతుంది- 'తృప్తి' అన్నది లేకపోతే. తృప్తి కలిగినవారే నిజమైన సంపన్నులు. వారే ప్రశాంతంగా జీవించగలుగుతారు. వర్తమానానికి విలువిస్తూ, గతంలోని చేదును మరచిపోతూ భవిష్యత్తు గురించి భయంలేకుండా దురాశకు పోకుండా ఉన్నదాంతో తృప్తిచెందే మనస్తత్వం ఏర్పరచుకోవాలి. దేవుడిపట్ల, దేవుడు సృష్టించిన తోటి ప్రాణులపట్ల ప్రేమతో, కృతజ్ఞతతో మెలగినప్పుడే తృప్తి లభిస్తుంది.
- మంత్రవాది మహేశ్వర్‌ 

Wednesday, 20 November 2013

కర్మఫలాలు


'పుట్టిన ప్రతి మనిషీ ఒక్కక్షణం కూడా కర్మ చేయకుండా ఉండలేడు' అని భగవద్గీతలో కృష్ణుడు అంటాడు. అంటే మనిషికి పుట్టుకతోనే కర్మకూడా వెంట వస్తుందని తాత్పర్యం. 'కర్మ' అంటే 'పని' అని కదా అర్థం! మనిషి జీవితంలో మూడు విధాలైన కర్మల్ని ఎదుర్కొంటాడని వేదాంతశాస్త్రం చెబుతోంది. చేసిన ప్రతిపనికీ ప్రతిఫలం ఉంటుందనేది యథార్థం. మంచిపని చేస్తే సత్ఫలం, చెడుపని చేస్తే దుష్ఫలం లభిస్తుందనే మాటా అక్షర సత్యమే. ప్రతి జీవికీ అనేక జన్మలుంటాయని ధర్మశాస్త్రాలు ప్రవచిస్తున్నాయి. కనుక జీవకోటిలోనివాడైన మనిషీ తాను చేసిన, చేస్తున్న పుణ్యపాపాలకు అనుగుణంగా జననమరణాలను ఎదుర్కొంటాడంటారు. మనిషిగా, జంతువుగా, కీటకంగా, చెట్టుగా ఇంకా ఎన్నెన్నో రూపాల్లో జన్మల్ని పొందుతాడని పెద్దలమాట. ఎన్నో సుకృతాలు చేసిన కారణంగానే మానవజన్మ లభిస్తుంది. జీవకోటిలో నరజన్మ దుర్లభమనే సూక్తి ఈ విషయాన్నే సమర్థిస్తుంది. కనుక మనిషి ప్రపంచంలో గొప్పవాడు.

మనిషి చేసే కర్మలు భూత, భవిష్యత్‌, వర్తమాన కాలాలకు సంబంధించినవై ఉంటాయి. అంటే గతకాలంలో చేసినవీ, ప్రస్తుతకాలంలో చేస్తున్నవీ, రాబోయే కాలాల కోసం చేసేవీ అన్నీ అతడి విషయంలో పరిగణనలోకి వస్తాయన్నమాట. మనిషి గతంలో చేసిన పుణ్యపాపాలను 'సంచిత' కర్మలుగా పిలుస్తారు. సంచీలో సరకులను వేసి దాచినట్లు ఇవి దాగి ఉంటాయి కనుక ఇవి సంచితాలు.

చేసిన పాపాలుగానీ, పుణ్యాలుగానీ పక్వమై మనిషి అనుభవించడానికి సిద్ధంగా ఉంటే అవి 'ప్రారబ్ధ' కర్మలు. పుణ్యం చేయడం, పాపం చేయడం అనేవి మనిషి విచక్షణకు సంబంధించిన అంశాలు. మనిషి చెడు నడతలకు లోనైతే పాపాలు చేస్తాడు. మంచి నడవడిక కలిగి ఉంటే పుణ్యాలు చేస్తాడు. ఒక్కొక్కసారి మనిషి చెడుపనులను చేసి, ఆ తరవాత జ్ఞానోదయమై 'ఇలా ఎందుకు చేశాను?' అని అనుకొంటాడు. చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి ఆరాటపడుతాడు. కానీ చేసిన పాపం వూరకేపోతుందా? పోనే పోదు.

ఒక వేటగాడు మృగాన్ని వేటాడటానికి అడవికి వెళ్లాడు. చెట్లపొదలో ఏదో జంతువు కదులుతున్నట్లు అలికిడి వినబడింది. వెంటనే ధనుస్సుకు బాణాన్ని సంధించి, ఆ పొదలోని జంతువుపై ప్రయోగించాడు. బాణం తగిలిన వెంటనే ఆ జంతువు పెద్దగా అరుస్తూ నేలకూలి మరణించింది. అప్పుడు వేటగాడు ఆ పొదలోకి వెళ్లిచూస్తే సాధుజంతువు అయిన ఆవు చచ్చిపడి ఉంది. వేటగాడు తాను గోవును చంపాలనుకోలేదు. అడవిపందిని చంపి, దాని మాంసాన్ని తినాలనుకున్నాడు. కానీ తన తప్పు వల్ల గోహత్య జరిగింది. అందుకు పశ్చాత్తాపం చెందాడు. కానీ ప్రయోజనం ఏమిటి? బాణం తప్పు చేయదు. దాన్ని వినియోగించినవాడే తప్పు చేస్తాడు. చేసిన తప్పువల్ల ఫలాన్ని అనుభవించవలసిందే. ఇదే ప్రారబ్ధం అంటే.

రాబోయే కాలంలో ఉత్తమ స్థితిని కలిగి ఉండటం కోసం మనిషి చేసే సత్కర్మలు 'ఆగామి' కర్మలు. ఇతరులకు చేసే దానధర్మాలు, ఉపకారాలు, త్యాగాలు మనిషికి ఆగామికాలంలో ఉపయోగపడతాయి. వృద్ధాప్యంలో కాళ్లూచేతులూ ఆడవు కనుక యౌవనంలో ఉన్నప్పుడే పుష్కలంగా ధనాన్ని సంపాదించాలని అనుకొంటారు అందరూ. అంటే తాము సంపాదించి, కూడబెట్టుకున్న ధనం ముసలితనంలో శ్రమపడనవసరం లేకుండా ఉపయోగపడుతుందనే కదా దాని అర్థం! ఇలాగే పుణ్య, పాపకర్మల విషయంలోనూ మనిషి ఆలోచించాలి అనేదే ఈ కర్మల పరమార్థం.

ఎన్ని శాస్త్రాలు చెప్పినా, ఎంతమంది ప్రవక్తలు ప్రబోధించినా వాటన్నింటి సారం ఒక్కటే- అదే సత్కర్మాచరణ. పాపానికి భయపడి మంచి పనులు చేయాలి. పుణ్యానికి ఆశపడి మంచి పనులు చేయాలి. ఎలాగైనా మంచి పనులే చేయాలి. ఇదే పరమార్థం.

గత జన్మలూ, ఆగామి జన్మలూ ఉన్నాయని నమ్మినా, నమ్మకపోయినా ఏ ప్రమాదమూలేదు కానీ- మంచి పనులు చేయడం మరచిపోతే మాత్రం అడుగడుగునా ప్రమాదాలే ఎదురవుతాయనేది త్రికాల సత్యం. అందుకే మనిషి మంచినే భావించాలి. మంచినే భాషించాలి. మంచినే ఆచరించాలి. మంచినే అనుసరించాలి.
- డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ

Tuesday, 19 November 2013

జీవిత లక్ష్యం


దైవాన్ని గుర్తించి, నోరెత్తకుండా తన పని తాను చేసుకుపోవడమే ఆధ్యాత్మికతలో ఉన్న పరమ రహస్యం. చాలామంది సాధకులు భగవంతుణ్ని తెలుసుకున్న తరవాత మౌనం వహించారు. ఎందుకు? ఈశ్వరుడు ఆడిస్తున్న నాటకాన్ని సాక్షిగా చూస్తూ లోపల పరమానందాన్ని వాళ్లు పొందుతున్నారు. ఇది నిజమా, ఇదే నిజమా? శాస్త్రాలు, గురువులు ఈ విషయాన్ని పదేపదే చెబుతున్నప్పుడు- విశ్వసించాలి మరి.
అన్ని అనుభవాలూ మనకు సూటిగా లభించవు. ఇతరులకు లభించిన దాన్ని ప్రాతిపదికగా తీసుకుని రుజువు చేసుకోవాలి. దీనికి విశ్వాసం కావాలి. అప్పుడే మన లోపల తాళం మనం తెరుచుకోగలం. అంతరంగంలో జరుగుతున్న దాన్ని అనుభూతిలోకి తెచ్చుకోగలం.

దైవాన్ని గుర్తించడం అంత సులువైన పని కాదు. అది సాదాసీదా పని కాదు. అందరికీ సాధ్యమయ్యేది కాదు. అలా అని వూరుకుంటే మనం నిజమైన మానవులం కాదు. మనకు ఒక బాధ్యత ఉంది. ధర్మం ఉంది. మన జీవితానికి ఒక ప్రయోజనం ఉంది. అన్నింటికీ మించి పరమార్థం ఉంది. దాన్ని గుర్తించాలి.

నన్ను గుర్తించు అంటూ దేవుడు మన దగ్గరకి రాడు. మన సుఖం కోసం శాంతి కోసం ధన సంపాదన ఎలా అయితే చేస్తున్నామో, ఈశ్వరారాధనా అలాగే చెయ్యాలి. ఆధ్యాత్మిక ఐశ్వర్యాన్ని పొందాలి. ఈ విషయాన్ని ఉపనిషత్తులు ఉద్బోధిస్తున్నాయి.

లౌకిక జీవనం సుఖవంతం కావడానికి ఎంతోమంది శాస్త్రజ్ఞులు జీవితాలు అంకితం చేశారు. అపార కృషి చేశారు. అలౌకిక మార్గంలో నడిపించి దైవసాన్నిధ్యం కల్పించడానికి ఎందరో మహానుభావులు తపించారు. ఈ రెండింటినీ సమన్వయం చేసుకుని జీవనం సాగించడం ఉత్తమ మానవుడి లక్ష్యం. ఏది వదిలిపెట్టినా జీవితం పరిపూర్ణం కాదు. వనం ఉండాలి. వసంతం ఉండాలి. అందులో కోయిల ఉండాలి. అప్పుడే పాట హాయిగా ఉంటుంది! హృదయం ఉండాలి. అందులో ప్రేమ ఉండాలి. దగ్గరకు తీసుకునే చేతులు ఉండాలి. అప్పుడే ఆ పరిష్వంగం ఆనంద రసకందాయమవుతుంది.

తీపిని బెల్లం నుంచి వేరు చెయ్యలేం. కాంతిని సూర్యుడి నుంచి వేరు చెయ్యలేం. కెరటాన్ని సముద్రం నుంచి వేరు చెయ్యలేం. మన జీవనం లోంచి ఆధ్యాత్మికతను వేరు చేసి చూసే అవకాశమే లేదు. అవగాహనకు వస్తున్న కొద్దీ దేవుడు మిత్రుడవుతాడు. మార్గదర్శకుడవుతాడు. గురువవుతాడు. చిట్టచివరకు ప్రేమికుడవుతాడు.

ఎక్కడ మనం ఉన్నామో, ఆ ప్రదేశం ఏమిటో, ఎందుకు మనం ఉన్నామో, ఆ స్థితి ఏమిటో, మనల్ని ఇలా ఉంచినవాడితో సంబంధ బాంధవ్యాలు ఎలా జరుపుకోవాలో తెలియకపోతే- మనకు బుద్ధి ఎందుకు? మనిషికి జంతువుకి తేడా ఏమిటి? హేతుబద్ధంగా ఆలోచించడం విజ్ఞానానికే కాదు, వేదాంతానికీ కావాలి. భగవంతుడు రుజువయ్యాడు. దానికి నిజభక్తులే సాక్ష్యం. భగవంతుడు రుజువవుతాడు. ఆధ్యాత్మిక హృదయం వికసించాలి. ఆ దిశలో మనం కళ్లు తెరుచుకుని చూడాలి.

'జీవిత లక్ష్యం ఏమిటి?' అని కొత్తగా వచ్చిన ఓ శిష్యుడు బోధకుణ్ని అడిగాడు.

'ఈ జీవితంలో ఎంతో బ్రహ్మానందం ఉంది. కాని, మామూలుగా జీవించాలని మనం అనుకోవడం లేదు. ఏదో సాధించాలని పరుగులు తీస్తున్నాం. జీవించడమే ప్రాతిపదికగా ఉన్న జీవితాన్ని ఓ సాధనంగా మార్చుకోవాలని అనుకుంటున్నాం. ఆశయాల కోసం తీస్తున్న పరుగులే మనలో ఉద్విగ్నతను పెంచుతున్నాయి' అని బదులిచ్చాడు ఆయన.
- ఆనందసాయి స్వామి 

Monday, 18 November 2013

గోవిందుడే గమ్యం


 ఎప్పుడూ కల్లోల పరిస్థితుల్లోంచి కమనీయత జనిస్తుంది. కన్నీటి మడుగులోంచే కమలాలు ఉద్భవిస్తాయి. శ్రీ కృష్ణుడి ముఖతా యుద్ధమధ్యంలోంచి భగవద్గీత ఆవిర్భవించింది. అంపశయ్యలోంచే భీష్ముడు విష్ణు సహస్ర నామాన్ని లోకానికి అందించాడు. ముళ్ల మీది నుంచి ముళ్లను వొత్తిగించుకుని వచ్చి వికసిస్తుంది గులాబీ పుష్పం. చీకట్లను చీల్చుకునే వెలువడుతుంది కాంతిపుంజం. మథనం, గరళం తరవాతే జనించింది అమృతం. నిజానికి అందువల్లే దేనికైనా వన్నె, విలువ పెరుగుతాయి.
కల్లోలం, కన్నీళ్లు అనివార్యాలు. నిజానికి అవసరాలు. అవి అనివార్యాలనీ, అవసరాలనీ గుర్తించినప్పుడు కన్నీళ్లు కళ్లను శుభ్రం చేస్తాయనీ, గుండెమంటలు ఆర్పుతాయనీ, కల్లోలాలు అమృతోద్భవం ముందు గరళం వేసే చిందులనీ అర్థం చేసుకుంటాం. భగవంతుడు సంతోషాన్ని, సౌందర్యాన్ని ఇనుమడింపజేయడానికే వ్యక్తిరిక్త, విభిన్న అంశాలను పక్కపక్కనే, లేదా వెంటవెంటనే సృజించాడు. సర్వత్రా వర్జనీయమైన 'అతి'ని నియంత్రించేందుకే మంచైనా చెడైనా... దేన్నయినా దీర్ఘం నుంచి లఘువుగా మలిచాడు.

మనిషి ముల్లు విరిగిందని నడక ఆపడు. ముల్లు తీసుకుని తిరిగీ నడుస్తాడు. ఎండ ఉందని, వర్షం వచ్చిందని పనులు ఆపుకోడు. గొడుగు పట్టుకుని వెళ్లి పనులు ముగించుకుంటాడు. అతి చిన్న అవసరాలను, ఆటంకాలను కూడా ఇంత శ్రద్ధగా సరిచేసుకుని, పూడ్చుకొని ముందుకు వెళ్లే మనిషి జీవనగమ్యమైన, జీవిత సార్థక్యమైన అసలు గమనాన్ని గుర్తించకుండా కష్టాల దగ్గరే కుంగిపోయి, గొంతు కూర్చుని ఆగిపోతున్నాడు. చిన్న అవసరాలకే ఆటంకాలను అధిగమించగలిగే మనిషి అత్యంత పెద్దదీ, అసలుదీ అయిన జీవిత సార్థక్య దిశగా సాగిపోయే క్రమంలో... వచ్చే కష్టాలను, ఆటంకాలను లెక్కచేయవలసిన అవసరం ఉందా? ఓరకంట కూడా చూడరాదు. అక్కడే ఆగిపోయి అత్యంత విలువైన కాలాన్ని వృథా చేయరాదు. జీవితం సుదీర్ఘమైందే. అయితే అన్ని విషయాలకు ఇది వర్తించదు. కొన్ని పనులకు అతి స్వల్పమైంది అవుతుంది. ఈ అల్పకాలంలోనే అనల్ప కార్యాన్ని ముగించుకోవాల్సి ఉంది. అదే సాధన. పరమ పదసోపాన అధిరోహణ. గమ్యం ఎంతో దూరం. దుర్గమం. దుర్లభం. దురూహ్యం కూడా. అయినా పయనించాల్సే ఉంది. చేరుకోవాల్సే ఉంది. ఎందుకంటే, అది మనకు అనివార్యం. కాబట్టి, అత్యంత అవసరం. ఇలాంటి పయనంలో మనం ముళ్లూ రాళ్లనే కాదు. కాలనాగుల్ని, కారు చీకట్లను కూడా అధిగమించాల్సి ఉంటుంది.

ఈ లోకంలో ఏ వస్తువూ మనకు వూరకే రాదు. పొందగోరే అంశాన్ని బట్టి శ్రమో, ప్రేమో, ధనమో, మరేదో పెట్టుబడిగా పెట్టక తప్పదు.

దీపం పురుగులు దీపాన్ని ఆశించి రెక్కలు కాల్చుకుంటాయి. చాలాసార్లు ప్రాణాలే పోగొట్టుకుంటాయి. నిజానికి తాను ఆశిస్తున్నది తనకు ఉపయుక్తమైందేనా, లభించి తీరేదేనా అనే జ్ఞానం, భరోసా వాటికి లేవు. అయినా ప్రయత్నం ఆపవు. మరి మనకో? భగవంతుడనే ఓ జ్ఞానదీపం, అమృత కలశం, వాడని పుష్పం, సర్వ కాలాల్లో, సకల లోకాలను కాచే సర్వశ్రేష్ఠుడు... ఉన్నాడు. మనకు అంది తీరుతాడు. మన శాశ్వత ఆనందం, పరిణామం, ప్రమాణం- ఆయనలో ఐక్యతే. మరెందుకు మనం ప్రయత్నించం, ప్రయాణానికి సన్నద్ధం కాము? ఈ ప్రయత్నం, ప్రయాణం కష్టమే. కఠినమే. అయినా మధురమైనవి. పరిమళభరితమైనవి. ప్రమాదరహితమైనవి. భరోసా ఉన్నది. అన్నింటికంటే ముఖ్యంగా అనివార్యమైనది. మనం ప్రయత్నం మొదలుపెడదాం. ప్రయాణం ప్రారంభిద్దాం. యుద్ధం సాగనీ, మథనం జరగనీ, అంపశయ్య సిద్ధమై ఉండనీ, గరళం గొంతు దిగనీ, బురద పీకలలోతు దింపనీ, కంటకాలు హింసించనీ... జానేదో- ఔను. జానేదో. మనసు మాధవుడితో నిండిపోయినప్పుడు, గమ్యం గోవిందుడైనప్పుడు మనం ప్రహ్లాదులమైపోతాం- నీరు ముంచదు, అగ్ని కాల్చదు, విషం చంపదు!
- చక్కిలం విజయలక్ష్మి 

Sunday, 17 November 2013

కార్తిక పౌర్ణమి


  న్ని మాసాల్లోనూ పరమపావనమైనది కార్తిక మాసమని వేదాలు, పురాణాలు చెబుతున్నాయి. 'శివుడికీ, విష్ణువుకీ ఇద్దరికీ ప్రీతికరమైనందువల్ల వారిద్దరి ఆరాధనకీ, తద్వారా వారి అనుగ్రహం పొందడానికీ తగిన మాసమనీ దీనికి ఇంత ప్రాశస్త్యం' అనీ తెలుపుతున్నాయి పురాణాలు. ఈ మాసంలో ప్రతి దినమూ పవిత్రమైనదే. సోమవారాలు, రెండు ఏకాదశులు, శుద్ధద్వాదశి, పౌర్ణమి దినాలు ఒకదానికంటే మరొకటి అధికతరమైన ప్రభావవంతమైనవంటారు. నెలరోజులూ చేసే కృత్యాల ఫలితం ఒక ఎత్తు, పౌర్ణమి నాటి కృత్యాల ఫలితం ఒక్కటీ మరొక ఎత్తు; అందువల్ల అనేక వ్రతాలు, పూజలు, కృత్యాలకు, దైవారాధనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలనీ పురాణాలు వివరిస్తున్నాయి.
ఈరోజు దీపారాధనకు విశేష ప్రాముఖ్యముంది. శివ, విష్ణు దేవాలయాలు రెండింటా దీపాలు వెలిగిస్తారు. విష్ణు ఆలయాల్లో గోపురం మీద, ధ్వజస్తంభం ఎదుట, తులసికోట దగ్గర, దేవుడి సన్నిధిలోనూ ప్రమిదల్లో, ఉసిరికాయలమీద దీపాలు వెలిగిస్తారు. శివాలయాల్లో ధ్వజస్తంభం మీద నందాదీపం పేరుతో అఖండదీపాన్ని, ఆకాశదీపం పేరుతో ఎత్త్తెన ప్రదేశాల్లో భరిణలతో (కుండలు, లోహపాత్రలతో తయారుచేసి) వేలాడదీస్తారు. అరటి దొన్నెల్లో దీపాలు వెలిగించి జలవనరుల్లో విడిచి పెడతారు. ఇలాచేయడం పుణ్యప్రదమని భక్తుల భావన. వైజ్ఞానికపరంగా ఆలోచిస్తే అనేక దీపాలవల్ల, వాటినుంచి వచ్చే వాయువులవల్ల వాతావరణంలో కాలుష్యం తగ్గి, శుద్ధి అవుతుందని తద్వారా ఆరోగ్యం చేకూరుతుందనీ స్ఫురిస్తుంది.

ఈరోజు ఆచరించేవాటిలో భక్తేశ్వర వ్రతం ఒకటి. ఇది స్త్రీలకు సౌభాగ్యం కలిస్తుందంటారు. భక్తురాలి కోరికను మన్నించి వరాలిచ్చే వ్రతం కాబట్టి దీనికీపేరు. ఇది ప్రాచుర్యంలోకి రావడానికి ఒక కథ ఉంది. పాండ్యుడు, కుముద్వతి దంపతులు సంతానార్థం శివుని ఆరాధించి ప్రత్యక్షం చేసుకున్నారు. వారుచేసిన ఆరాధనలోని చిన్నలోపంవల్ల సరైన వరం ఇవ్వదలచుకోలేదట శివుడు. అందుకే 'అల్పాయుష్కుడు, అతిమేధావి అయిన కొడుకు కావాలా... పూర్ణాయుష్కురాలు, విధవ అయిన కుమార్తె కావాలా అని అడిగితే- కుమారుణ్నే కోరుకున్నారా దంపతులు. అతడి వయసు పెరుగుతున్న కొలదీ వారిలో గుబులూ జోరెత్తుతోంది. ఆ సమయంలో శివభక్తి పరాయణురాలైన అలకాపురి రాజకుమార్తెపై వారి దృష్టిపడింది. అమె పిలిస్తే శివుడు పలికేటంత భక్తి, శక్తి కలదని విన్నారా దంపతులు. ఆ పిల్లను తమ కోడలిగా చేసుకుంటే తమబిడ్డను పూర్ణాయుష్కుడిగా మార్చే బాధ్యత ఆమె చూసుకుంటుందని ఆలోచించి అలాగే చేశారు. వివాహమైన కొన్నాళ్లకే భర్తకోసం యమభటులు వచ్చేసరికి విషయం తెలుసుకుందా సాధ్వి. తక్షణమే తనభక్తి ప్రభావంతో శివుని ప్రార్థించి ప్రత్యక్షం చేసుకుని భర్తను పూర్ణాయుష్కుడిగా మార్చుకునే వరం పొందిందని పురాణ కథనం.

ఈ రోజుకు త్రిపుర పూర్ణిమ అనీ మరొకపేరు. తారకాసురుడి ముగ్గురు కుమారులూ బ్రహ్మను మెప్పించి, ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించగలిగే మూడు పురాలను వరంగా పొందారు. ఎవరివల్లా మరణం లేకుండా వరంకోరారు. అది సాధ్యం కాదన్నాడు బ్రహ్మ. అలాగైతే రథంకాని రథంమీద, విల్లుకాని విల్లుతో, నారికాని నారి సారించి, బాణంకాని బాణం సంధించి, మూడు నగరాలూ ఒకే సరళరేఖలోకి వచ్చాక ఒకేబాణంతో ముగ్గురినీ ఏకకాలంలో కొడితేనే మరణం సంభవించేలా వరం కోరారు. ఇవ్వక తప్పలేదు బ్రహ్మకు.

ఆ వరబలంతో పట్టణాలతో సహా సంచారంచేస్తూ లోకాలన్నింటా కల్లోలం సృష్టిస్తున్నారు. వివిధ లోకవాసులు బ్రహ్మకు మొర పెట్టుకున్నారు. వరం ఇచ్చింది తానే కాబట్టి ఏమీ చేయలేనన్నాడు. విష్ణువు దగ్గర కెళ్ళమని ఉపాయం చెప్పాడు. విష్ణువు కూడా తనకా శక్తిలేదని, వారిని వెంటపెట్టుకుని శివుడి దగ్గరకు వెళ్లాడు. దేవతలందరూ సహకరిస్తే తానీపని చేయగలనన్నాడు శివుడు. ఆ మాటతో భూమి రథం కాని రథంగా మారింది. మేరు పర్వతం విల్లుకాని విల్లుగా, ఆదిశేషువు అల్లెతాడు కాని అల్లెతాడుగా, శ్రీమహావిష్ణువు బాణం కాని బాణంగా మారారు. వీరందరి సమాహార శక్తితో శివుడు త్రిపురాసురులను (మూడు పట్టణాల యజమానులైన రాక్షసులను) సంహరించాడని, అందువల్ల ఈ పేరు వచ్చిందనీ పురాణ కథనం.

ఈరోజు చేసే స్నానం, దీపారాధన, ఉపవాసం లాంటి అన్నింటిలోనూ ఆరోగ్య, ఆధ్యాత్మిక భావనలు అంతర్లీనంగా ఉన్నాయి. ఈ మాసమంతా వేకువనే శిరస్నానం చేయడం ఆ కాలపు వాతావరణపరంగా ఆరోగ్య ప్రదం. ఏ కారణం చేతనైనా పైవిధంగా ఆచరించలేని వారు పౌర్ణమినాడు ఆచరిస్తే చాలు, నెలంతా చేసిన ఫలితం ఒనగూరుతుందన్నది పెద్దల మాట. ఈ రోజున స్త్రీలకోసం ప్రత్యేకంగా ఉపవాసం చెబుతున్నాయి శాస్త్రాలు. పగలంతా ఉపవాసం ఉండి, రాత్రి దీపారాధన చేసి, చలిమిడిని చంద్రుడికి నివేదించి, ఫలహారంగా స్వీకరించాలని చెబుతారు. ఇలాచేయడం వల్ల కడుపు చలవ (బిడ్డలకు రక్ష)అని పెద్దలంటారు. ఆరోగ్యపరంగా చూస్తే- ఇలా చేయడం వల్ల గర్భాశయ సమస్యలు దరిచేరవని ఆయుర్వేద కథనం.

శివాలయాల్లో జరిపే జ్వాలాతోరణం ఈ రోజుకు మరో ప్రత్యేకత. ఇంకా ప్రాంతీయ, ఆచార వ్యవహారాల భేదంతో అనేక వ్రతాలు, పూజలు, నోములు చేస్తారీ రోజు. వాటిలో వృషవ్రతం, మహీఫలవ్రతం, నానాఫలవ్రతం, సౌభాగ్యవ్రతం, మనోరథ పూర్ణిమావ్రతం, కృత్తికావ్రతం లాంటివి ముఖ్యమైనవి. వీటితోపాటు లక్షబిల్వార్చన, లక్షప్రదక్షిణి, లక్షవత్తులు, లక్షరుద్రం లాంటి పూజలూ చేస్తారీ రోజు.
- అయ్యగారి శ్రీనివాసరావు