'పుట్టిన ప్రతి మనిషీ ఒక్కక్షణం కూడా కర్మ చేయకుండా ఉండలేడు' అని భగవద్గీతలో కృష్ణుడు అంటాడు. అంటే మనిషికి పుట్టుకతోనే కర్మకూడా వెంట వస్తుందని తాత్పర్యం. 'కర్మ' అంటే 'పని' అని కదా అర్థం! మనిషి జీవితంలో మూడు విధాలైన కర్మల్ని ఎదుర్కొంటాడని వేదాంతశాస్త్రం చెబుతోంది. చేసిన ప్రతిపనికీ ప్రతిఫలం ఉంటుందనేది యథార్థం. మంచిపని చేస్తే సత్ఫలం, చెడుపని చేస్తే దుష్ఫలం లభిస్తుందనే మాటా అక్షర సత్యమే. ప్రతి జీవికీ అనేక జన్మలుంటాయని ధర్మశాస్త్రాలు ప్రవచిస్తున్నాయి. కనుక జీవకోటిలోనివాడైన మనిషీ తాను చేసిన, చేస్తున్న పుణ్యపాపాలకు అనుగుణంగా జననమరణాలను ఎదుర్కొంటాడంటారు. మనిషిగా, జంతువుగా, కీటకంగా, చెట్టుగా ఇంకా ఎన్నెన్నో రూపాల్లో జన్మల్ని పొందుతాడని పెద్దలమాట. ఎన్నో సుకృతాలు చేసిన కారణంగానే మానవజన్మ లభిస్తుంది. జీవకోటిలో నరజన్మ దుర్లభమనే సూక్తి ఈ విషయాన్నే సమర్థిస్తుంది. కనుక మనిషి ప్రపంచంలో గొప్పవాడు.
మనిషి చేసే కర్మలు భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు సంబంధించినవై ఉంటాయి. అంటే గతకాలంలో చేసినవీ, ప్రస్తుతకాలంలో చేస్తున్నవీ, రాబోయే కాలాల కోసం చేసేవీ అన్నీ అతడి విషయంలో పరిగణనలోకి వస్తాయన్నమాట. మనిషి గతంలో చేసిన పుణ్యపాపాలను 'సంచిత' కర్మలుగా పిలుస్తారు. సంచీలో సరకులను వేసి దాచినట్లు ఇవి దాగి ఉంటాయి కనుక ఇవి సంచితాలు.
చేసిన పాపాలుగానీ, పుణ్యాలుగానీ పక్వమై మనిషి అనుభవించడానికి సిద్ధంగా ఉంటే అవి 'ప్రారబ్ధ' కర్మలు. పుణ్యం చేయడం, పాపం చేయడం అనేవి మనిషి విచక్షణకు సంబంధించిన అంశాలు. మనిషి చెడు నడతలకు లోనైతే పాపాలు చేస్తాడు. మంచి నడవడిక కలిగి ఉంటే పుణ్యాలు చేస్తాడు. ఒక్కొక్కసారి మనిషి చెడుపనులను చేసి, ఆ తరవాత జ్ఞానోదయమై 'ఇలా ఎందుకు చేశాను?' అని అనుకొంటాడు. చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి ఆరాటపడుతాడు. కానీ చేసిన పాపం వూరకేపోతుందా? పోనే పోదు.
ఒక వేటగాడు మృగాన్ని వేటాడటానికి అడవికి వెళ్లాడు. చెట్లపొదలో ఏదో జంతువు కదులుతున్నట్లు అలికిడి వినబడింది. వెంటనే ధనుస్సుకు బాణాన్ని సంధించి, ఆ పొదలోని జంతువుపై ప్రయోగించాడు. బాణం తగిలిన వెంటనే ఆ జంతువు పెద్దగా అరుస్తూ నేలకూలి మరణించింది. అప్పుడు వేటగాడు ఆ పొదలోకి వెళ్లిచూస్తే సాధుజంతువు అయిన ఆవు చచ్చిపడి ఉంది. వేటగాడు తాను గోవును చంపాలనుకోలేదు. అడవిపందిని చంపి, దాని మాంసాన్ని తినాలనుకున్నాడు. కానీ తన తప్పు వల్ల గోహత్య జరిగింది. అందుకు పశ్చాత్తాపం చెందాడు. కానీ ప్రయోజనం ఏమిటి? బాణం తప్పు చేయదు. దాన్ని వినియోగించినవాడే తప్పు చేస్తాడు. చేసిన తప్పువల్ల ఫలాన్ని అనుభవించవలసిందే. ఇదే ప్రారబ్ధం అంటే.
రాబోయే కాలంలో ఉత్తమ స్థితిని కలిగి ఉండటం కోసం మనిషి చేసే సత్కర్మలు 'ఆగామి' కర్మలు. ఇతరులకు చేసే దానధర్మాలు, ఉపకారాలు, త్యాగాలు మనిషికి ఆగామికాలంలో ఉపయోగపడతాయి. వృద్ధాప్యంలో కాళ్లూచేతులూ ఆడవు కనుక యౌవనంలో ఉన్నప్పుడే పుష్కలంగా ధనాన్ని సంపాదించాలని అనుకొంటారు అందరూ. అంటే తాము సంపాదించి, కూడబెట్టుకున్న ధనం ముసలితనంలో శ్రమపడనవసరం లేకుండా ఉపయోగపడుతుందనే కదా దాని అర్థం! ఇలాగే పుణ్య, పాపకర్మల విషయంలోనూ మనిషి ఆలోచించాలి అనేదే ఈ కర్మల పరమార్థం.
ఎన్ని శాస్త్రాలు చెప్పినా, ఎంతమంది ప్రవక్తలు ప్రబోధించినా వాటన్నింటి సారం ఒక్కటే- అదే సత్కర్మాచరణ. పాపానికి భయపడి మంచి పనులు చేయాలి. పుణ్యానికి ఆశపడి మంచి పనులు చేయాలి. ఎలాగైనా మంచి పనులే చేయాలి. ఇదే పరమార్థం.
గత జన్మలూ, ఆగామి జన్మలూ ఉన్నాయని నమ్మినా, నమ్మకపోయినా ఏ ప్రమాదమూలేదు కానీ- మంచి పనులు చేయడం మరచిపోతే మాత్రం అడుగడుగునా ప్రమాదాలే ఎదురవుతాయనేది త్రికాల సత్యం. అందుకే మనిషి మంచినే భావించాలి. మంచినే భాషించాలి. మంచినే ఆచరించాలి. మంచినే అనుసరించాలి.
- డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ
No comments:
Post a Comment