ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Monday, 12 August 2013

ప్రేమ నేత్రం


దేవుడు తన ఆనందాన్ని నాలో అనుభవిస్తున్నాడు అని నిశ్చయంగా ఎవరు చెప్పగలరు? దైవాన్ని అనుభవిస్తున్న వాళ్లు. అనుభవమే అనుభవాన్ని ఇస్తుంది. అది అపరోక్ష అనుభూతి. నేను రోడ్డుమీద ఉన్నా, ఆఫీసులో పనిచేసుకుంటున్నా, ఇంట్లో వ్యవహారం సాగిస్తున్నా- ఆయన కృప నామీద ఉంటే... దుఃఖంలో కూడా సహాయం చేస్తున్న హస్తం నన్ను ప్రేమతో స్పృశిస్తున్నట్లుగా ఉంటుంది. నాకు ఎంతో ధైర్యంగా ఉంటుంది.
కాషాయ వస్త్రాలతో నా శరీరాన్ని కప్పుతాను. నా హృదయంలో ప్రేమ ఉండదు. అప్పుడు నన్ను ఎవరు దైవభావంతో చూస్తారు? కనీసం మంచి మానవుడిగానైనా గుర్తించరు.

ఖురాన్‌లో సూక్తులు వల్లెవేస్తాను. భగవద్గీత ప్రవచనాలు అలవోకగా చెబుతాను. వేదం చెప్పినందుకు నాకు బంగారు కడియాలు తొడిగారు. నా హృదయం ప్రేమలో మునిగి తాండవమాడదు. నా వల్ల సంఘానికి ఏమి ప్రయోజనం?

మరకైనా లేకుండా హృదయంలో మాలిన్యాలన్నింటినీ కడిగేసుకున్న తరవాత, నిరక్షరాస్యుడికీ పరమేశ్వరుడు ప్రేమామృతాన్ని పంచడానికి తహతహలాడుతాడు. వసంతం వనంలో ప్రవేశించినప్పుడు సహజంగా కోయిల అటువైపే పరుగులు తీస్తుంది కదా.

భగవంతుని సమాగమంలో తప్ప తృప్తిలేని జీవితం కావాలి. దానికోసం పాటుపడాలి. కాలం కరిగిపోతూ ఉంటుంది. పగలు సుఖం ఉండదు. రాత్రి నిద్ర ఉండదు. ఈశ్వరుడు రాడు. నేనేం చేయాలి అనే తపనతో హృదయం రగిలిపోవాలి. అప్పుడే ఆనంద పరవశుణ్ని చేసే ఆ మురళీరవం వినిపిస్తుంది. కాంతులు విరజిమ్ముతుంది.

అత్యంత సూక్ష్మమైనది దైవ మార్గం. ఆనందాన్వేషణలో మునిగి ఉన్నవాడికే ప్రేమ లోతు తెలుస్తుంది. నీటిలో ఈదే చేపకు లోతులు తెలియవా? 'సదాచార కర్మలకంటే సహజ మార్గంలోనే భగవంతుడు తెలుస్తాడు' అంటాడు కబీరు. పాండిత్యం వల్ల జ్ఞానం వస్తుంది. అనుభవం రాదు. రకరకాలుగా పోగు చేసిన జ్ఞాన సమాచారం మనసును కప్పేస్తుంది. అటువంటి మనసు సత్యాన్ని దర్శించలేదు.

ఓ పండితుడు ఫకీరు దగ్గరకు వెళ్ళాడు. అతడి చేతిమీద ఓ చిలుకు కూర్చుని ఉంది. పంజరం లేదు కానీ, ఎగిరిపోవడాన్ని ఆ చిలుక మరిచిపోయింది. ఆ చిలుక మాట్లాడుతోంది- పండితుడికి బదులు.

'రామా! రామా! జపించు రామ నామం! జపించు రామ నామం!'

'భలే మాట్లాడుతోందే ఈ చిలుక!' అన్నాడు ఫకీరు. పండితుడన్నాడు- 'అవును స్వామీ, ఈ చిలుక మహాజ్ఞాని!'

ఆ మాటలు విని ఫకీరు నవ్వాడు. 'నిజమే అయ్యుండాలి... మరి జ్ఞానులందరూ చిలుకలాగే తప్ప వేరుగా ఉండటం లేదుకదా' అన్నాడు. మత గ్రంథాలను, మహా వాక్యాలను బట్టీపట్టి అప్పజెప్పడం కాదు జ్ఞాన ప్రాప్తికి మార్గం. ఎప్పటినుంచో అంతటా సాక్షాత్కారం అయి ఉన్న సత్యాన్ని చూడటానికి కావలసిన చూపును పొందటం. 'నాకు తెలుసు' అనేవాడికి ఎవడూ ఏమీ చూపించడు. చెప్పడు.

తెలుసుకున్నవాడు, తెలుసుకోవాల్సిన విషయం- ఈ రెండూ లేని ఒక పవిత్రమైన శూన్యం ఏర్పడినప్పుడే, భగవంతుడు అక్కడికి వచ్చి చేరతాడు. గొయ్యి తవ్వి మట్టితీసి వదిలేస్తే, అందులోకి వర్షపు నీరు వచ్చి చేరినట్లు.

విశ్వవ్యాప్తమైన సత్యాన్ని దర్శించటానికి ప్రేమ నేత్రాన్ని తెరిచి ఉంచుకోవాలి. హృదయాన్ని మేల్కొలిపే సద్గురువును మనం కలుసుకున్నప్పుడు ఏది రాయో ఏది రత్నమో అతడే తేలుస్తాడు. ప్రేమ-వైరాగ్యాల రహస్యాలు అతడికి తెలిసినట్లు ఎవరికీ తెలియదు!

- ఆనందసాయి స్వామి

Sunday, 11 August 2013

ఆత్మసౌందర్యం


న దేహాన్ని శుచిగా, అందంగా ఉంచుకోవటమే చాలదు. మన అంతరంగ సౌందర్యాన్ని పెంచుకోవటం ప్రధానం. నిష్కళంకమైన ఆచరణ, సచ్ఛీలం, మధురభాషణం మనం అలవరచుకోవాలి. అప్పుడే మనం నిజమైన సౌందర్యాన్ని సంతరించుకోగలం. అటువంటి సౌందర్యానికి వేషభూషణాలు అనవసరం. బుద్ధ, మహావీర, ఏసుక్రీస్తు మొదలైనవారి జీవిత చరిత్రల అధ్యయనం ద్వారా వారి వ్యక్తిత్వ సౌందర్యం, స్వభావం స్పష్టంగా అర్థమవుతుంది. సౌందర్యాన్ని విభిన్న రూపాలలో చూడగలం.

హృదయ సౌందర్యం: 
ఇక్కడ హృదయం అంటే మన శరీర ప్రక్రియలకు మూలమైన హృదయం (గుండె) కాదు. భావనాత్మక హృదయం ప్రధానం. ప్రేమ, దయ, వాత్సల్యం, నిస్వార్థ చింతన, భక్తి, గౌరవం మొదలైనవి. భౌతిక సంపద కంటే గొప్పది హృదయ సౌందర్యం.


మనస్సౌందర్యం: 
మనసు మనకు కనిపించదు. అది చాలా శక్తిమంతమైనది. మనసు కలవాడే మనిషి. మనసు మర్మమెరిగిన ఘనుడికి మొక్కుతానన్నారు నాదయోగి త్యాగరాజస్వామి. మనిషిని దేవుడి గానో, దానవుడిగానో రూపొందించేది మనసే. మనసును నియంత్రించటం అందరికీ సాధ్యం కాదు. సచ్ఛింతన, సత్సాంగత్యం, సదాచారం, సాత్వికాహార సేవనం తదితరాలతో మానసిక సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. ఆశలకు, ఆకాంక్షలకు అడ్డుగోడలు వేయటం సాధన చేయాలి.


నేత్ర సౌందర్యం: 
మహాత్ములను దర్శించినప్పుడు వారి నేత్రాల్లో కరుణ, విశ్వప్రేమ, వాత్సల్యం, చిప్పిల్లుతుంటాయి. శంకరభగవత్పాదులు జగన్మాత సౌందర్యాన్ని వర్ణిస్తూ, 'అమ్మా నవ్వులన్‌ గను కనుల్‌ సారించు నాపై గృపన్‌' అని ప్రస్తుతించారు. ఆ స్తోత్రమే, సౌందర్యలహరిగా ప్రశస్తినందుకొంది. వైష్ణవుడైన ధనుర్దాసు, తన అర్ధాంగి నేత్ర సౌందర్యం పట్ల ఆకర్షితుడై, నిరంతరం ఆమెను అనుసరిస్తుండేవాడు. భగవద్రామానుజులు ధనుర్దాసుకు, శ్రీరంగనాథస్వామి దర్శనం చేయించారు. స్వామి నేత్రాల దివ్య సౌందర్యాన్ని తిలకించిన ధనుర్దాసు, శ్రీరంగనాథస్వామి దాసుడయ్యాడు.


మాటల్లో సౌందర్యం: 
మన ఆలోచనల ప్రకటనకు ప్రధానమైన సాధనం మన మాట. మాట మధురంగా లేనప్పటికీ మృదువుగా ఉండాలి. శ్రీరామలక్ష్మణులు, సీతను అన్వేషిస్తూ కిష్కింధ పర్వతం వద్దకు వెళ్ళారు. వానర రాజైన సుగ్రీవుడు, మిత్రుడైన ఆంజనేయుని పంపి, వారి రాకకు కారణం కనుగొనమన్నాడు. ఆంజనేయుడు వారిని చూసి, వారిరాకకు కారణమేమని ప్రశ్నించాడు. ఆంజనేయుడి మాట తీరును విన్న రాముడు ముగ్ధుడయ్యాడు. అతడి మాటలు సంస్కార సంపన్నమైనవి. మంగళకరమైనవే కాక, హృదయాన్ని స్వాధీనపరచుకోగలిగినవి అన్నాడు. మాటల్లో ధ్వనించే స్నేహ భావం, ప్రశాంతత, నిత్యజీవితంలో మాధుర్యానికి చక్కటి సూత్రాలు. మృదువైన పద ప్రయోగాల వల్ల ఎన్నో ప్రయోజనాలుంటాయి.

ఆత్మస్త్థెర్యం: మనం ఎల్లవేళలా ధైర్యంగా ఉండాలి. 'అభీః' అన్నది వేదం. ధైర్యాన్ని శరీరబలంతో సాధించలేం. ధైర్యం అంటే ఆత్మబలం, ఆత్మవిశ్వాసం. ఆత్మస్త్థెర్యం కలిగిన వ్యక్తిముందు ఎక్కుపెట్టిన తుపాకులైనా తలవంచుతాయి. ఆత్మస్త్థెర్యం నాయకుడి మొదటి గుణం. మహాత్మాగాంధీ అపారమైన ఆయుధ శక్తిగల బ్రిటిష్‌ సామ్రాజ్యాన్నే తన ముందు మోకరిల్లజేశాడు. స్వామి వివేకానంద అభిమానులు, మిత్రులు కలిగించిన ఉత్సాహంతో ప్రపంచ మత మహాసభలో అనర్గళంగా ఉపన్యసించాడు. భారతీయ సంస్కృతికి సంకేతమైన వసుధైక కుటుంబం అంటే ఏమిటో విశ్లేషించి ప్రస్తుతులందుకొన్నాడు.

బౌద్ధిక సంపద లేనప్పుడు సౌందర్యం ఏ మాత్రం రాణించదు. విశ్వసుందరీమణుల ఎంపికలో వారి దైహిక సౌందర్యంకంటే బుద్ధిశక్తికి ప్రాధాన్యమిస్తారు. బౌద్ధిక శక్తి పెంచుకోవడానికి ఏకాగ్రత కావాలి. శరీరం దృఢంగా ఉండాలి.

మనం చేసే ప్రతి పనిలోనూ దీక్ష దక్షత ఉన్నప్పుడు మన వ్యక్తిత్వ సౌందర్యం ఇనుమడిస్తుంది. ప్రతి పనినీ పూర్తిచేసిన తరవాత ఆత్మావలోకనం చేసుకోవాలి. ఈ రీతిగా మనం వ్యవహరించినప్పుడు- మర్త్యలోకం స్వర్గలోకం కాగలదు.
                                             - డాక్టర్‌ జానమద్ది హనుమచ్ఛాస్త్రి

Saturday, 10 August 2013

నిష్ఫల యోగం

గవంతుడితో అనుబంధమే యోగ ప్రయోజనం. శరీరానికి సంబంధించిన యోగ ప్రక్రియలన్నీ పరిమిత ప్రయోజనం కలిగి ఉంటాయి. కొందరికి సాధనవల్ల యోగశక్తులు లభించవచ్చు. అవి ప్రదర్శనకు పెడితే, గారడీలాగానే భ్రమింపజేస్తాయి. 

భగవంతుడి ధామం చేరుకునేందుకు ప్రధానమైనవిగా మూడు మార్గాలు చెబుతారు. భక్తిమార్గం, యోగమార్గం, జ్ఞానమార్గం. ఎవరి అభిరుచినిబట్టి వారు తమ మార్గాన్ని ఎంచుకుంటారు. 

ఎవరు ఏ మార్గం ఎంచుకున్నా తదేక దీక్షగా అందులోనే కొనసాగాలి. లేకపోతే గమ్యాన్ని చేరుకోలేరు. కానీ, బహుకొద్దిమంది మాత్రమే గమ్యం వరకు చేరుకోగలుగుతారు. ఎక్కువ మంది గమ్యాన్ని మధ్యలోనే మరిచిపోతారు. కారణం ప్రాపంచిక భ్రమలు.

సమాజం తన ఘనతను గుర్తించి ప్రశంసించాలనీ, గొప్పవ్యక్తిగా గౌరవించాలనీ కొందరు ఆరాటపడతారు. తమకు లేని గొప్పతనాన్ని మాటల ద్వారా ఘనంగా చెప్పుకొంటుంటారు. ప్రజలు ఆ మాటలు నమ్ముతున్నారనీ, తనంత ఘనుడు తానేననే భ్రమలో తమలో తాము మురిసిపోతుంటారు. వీరి వెర్రిధోరణికి ప్రపంచం నవ్వుకుంటుందే తప్ప ఏదీ విశ్వసించదు. ఆ సంగతిని వీరు గ్రహించే మనోస్థితిలో ఉండకపోవటం వల్ల తమ ధోరణి మార్చుకోరు. కొంతకాలానికి ప్రజలు ఇలాంటివారినుంచి తప్పించుకు తిరుగుతుంటారు. అది కూడా వీరు గ్రహించరు. 

సామాన్యులు ఇలా ప్రవర్తిస్తే పోనీలెమ్మనుకోవచ్చు. 
యోగులుగా ప్రచారం చేసుకునేవారు కూడా ప్రాపంచిక ప్రలోభాలకు దూరంగా ఉండలేకపోతే అది నిష్ఫలయోగమే. వారు యోగి వేషధారులే తప్ప యోగులు కారు. శ్రీకృష్ణ వేషధారి పరమాత్మ కానట్లే వీళ్లూ యోగులు కారు.

యోగి వేషధారులు ప్రపంచంలో అపరదైవాలుగా చలామణీ కావటానికి అన్ని హంగు ఆర్భాటాలు ఏర్పాటు చేసుకుంటారు. వందిమాగధులు, యోగి మహత్తుల ప్రచారభేరి- వీటికి జనం దాసోహమనేస్తారు. మరీ దురదృష్టం మహిళల అమాయకత్వం. వీరు ఓ పట్టాన తమ భ్రమల్లోంచి బయటపడలేరు. లోకమంతా కపట యోగులని గొంతెత్తి చెబుతున్నా వీరు నమ్మలేకపోతుంటారు. అందుకే కుహనా యోగులు భక్తురాళ్లపట్ల అతి ప్రసన్నంగా ఉంటారు. యోగి వేషంలో భోగిగా జీవించటంకన్నా ఆత్మద్రోహం, దైవద్రోహం మరోటి ఉండదు. నిజానికి ప్రతి మనిషిలోనూ ఒక యోగి ఉన్నాడు. కానీ, నిద్రాణంగా ఉంటాడు. ప్రతి మనిషిలోనూ దైవం ఉన్నాడు. కానీ, అంతర్యామిగా అదృశ్యుడిగా ఉంటాడు. 

తనను తాను వెలిగించుకున్నవాడే ఆత్మజ్ఞాని. ఆత్మగానే తప్ప ఇతరత్రా తనను భావించకపోవటమే ఆత్మజ్ఞానం. శ్రీకృష్ణుడు- 'యోగి నా ఆత్మ. యోగులు, నేను వేరు కాదు' అన్నాడు. యోగభ్రష్టుల గురించీ గీతాచార్యుడు చెప్పాడు. 

యోగమార్గం దైవమార్గం. దాన్ని కపట వేషాలతో కంటకమయం చేసి, ప్రజలకు యోగవిరక్తి కలిగించకూడదు. మోసగాడు యోగి వేషం వేసినా, అది నిష్ఫలయోగం కాక మానదు.
                                                                      - కాటూరు రవీంద్ర త్రివిక్రమ్‌

Thursday, 8 August 2013

క్షమాగుణం

 న మనసులో రెండు వైరుధ్య భావాలుంటాయి. ఒకటి క్షమించడం. రెండోది పగతీర్చుకోవడం. ఈ రెంటికీ సదా సమరం జరుగుతూ ఉంటుంది. అదే 'కురుక్షేత్రం'. క్షమ గెలిస్తే హృదయం ఆనందమయం. మనసులో అంతులేని సంతోషం. మనిషికి తృప్తి. మనలో ఉండే ప్రేమ ఎప్పుడూ 'క్షమించు క్షమించు' అని చెబుతూనే ఉంటుంది. ప్రేమిస్తే ప్రేమను పొందుతాం. ద్వేషిస్తే ద్వేషాన్నే తిరిగి పొందుతాం. 'గుండెలో పగ దాచుకోవడం అంటే పామున్న ఇంటిలో ఉండటమే' అంటుంది భారతం. పగవల్ల పగపోదనీ, ఏ విధంగా చూసినా పగని అణచడం లెస్స అనీ భారత మహేతిహాస ఉద్బోధ!

'నా కన్ను నువ్వు పొడిస్తే నీ కన్ను నేను పొడుస్తా' అని 'కన్నుకు కన్ను పన్నుకు పన్ను' సిద్ధాంతంతో అందరూ ముందుకు దూకితే- లోకం అంతా గుడ్డివాళ్లతో, బోసినోటివాళ్లతో నిండిపోతుంది. ఈ పగ, ప్రతీకారం అనే విషచక్రం నుంచి బయటపడాలంటే క్షమించడం ఒక్కటే ఉపాయం. ఇందువల్ల రెండు లాభాలు. ఒకటి- క్షమించేవారు ఆదర్శ వ్యక్తులుగా గౌరవం పొందుతారు. రెండోది- క్షమ పొందేవారు తమ జీవితాలను సరిదిద్దుకుంటారు. క్షమాగుణం శత్రువును సైతం మిత్రుడిగా మార్చేస్తుంది. 'పొరపాటు మానవ సహజగుణం, క్షమ దైవ విశిష్టగుణం' అని ఆంగ్ల సామెత. మహాభక్తుల జీవితాలన్నీ ప్రేమమయాలు.

ఏకనాథుడు పాండురంగడి భక్తుడు. ప్రశాంతచిత్తుడు. సదా స్వామి సేవలో, భజనలో కాలం గడిపేవాడు. ప్రజలందరూ ఆయన్ని ప్రశంసించడం చూసి కొందరు ఈర్ష్యపడ్డారు. ఎలాగైనా ఏకనాథుడికి కోపం తెప్పించాలని ప్రయత్నించసాగారు. ఒక దుష్టుడికి డబ్బు ఆశచూపి, ఆ పనికి నియోగించారు. ఏకనాథుడు రోజూ తెల్లవారుజామునే నదిలో స్నానం చేసి వచ్చేవాడు. ఆ సమయంలో ఆ దుష్టుడు ఏకనాథుడిపై ఉమ్మి వేశాడు. ఏకనాథుడు ప్రశాంత చిత్తంతో, చిరునవ్వు చెరగనీయకుండా వెనక్కి వెళ్లి నదీస్నానం ఆచరించాడు.. ఇలా మొత్తం నూట ఏడుసార్లు జరిగింది. ఏకనాథుడు ఏమాత్రం నిగ్రహం వీడకుండా, మందస్మిత వదనంతో అన్నిసార్లూ మరల మరల స్నానం చేసి వస్తున్నాడు. దీంతో ఆ కుటిలుడి హృదయం చలించిపోయింది! ఆయన ఏకనాథుడి కాళ్లపై పడ్డాడు. 'స్వామీ, మీరు నిజంగా దైవస్వరూపులు. మీ నిగ్రహం చెడగొట్టి, ఎలాగైనా మీకు కోపం తెప్పించాలని కొందరు నన్ను పురమాయించారు. మీకు ఆగ్రహం తెప్పించగలిగితే నాకు ధనం ఇస్తామని ఆశచూపారు. మీ క్షమాగుణం తెలియక నేనీ నీచకృత్యానికి అంగీకరించాను!' అన్నాడు ఆ వ్యక్తి పశ్చాత్తాపంతో. ఏకనాథుడు అతడికి నమస్కరిస్తూ ఇలా అన్నాడు. 
'నాయనా, నీవు నాకెంతో మేలుచేశావు. నాచేత నూట ఎనిమిదిసార్లు పవిత్ర నదీస్నానం చేయించిన మహానుభావుడివి నువ్వు! నేను నీ మేలు ఎన్నటికీ మరచిపోను!' ఏకనాథుడి పలుకులు విని అవతలి వ్యక్తి నిర్విణ్నుడయ్యాడు. ఆ భక్తాగ్రేసరుడి క్షమాగుణం ఆ ఉమ్ము వేసిన వ్యక్తి హృదయాన్ని ప్రక్షాళనం గావించింది. పశ్చాత్తాపంతో అతడు కన్నీరు కార్చాడు.

క్షమ అంటే భూమి. భూమి ఓర్పుగల తల్లి కనుకనే మనం ఎంత బాధపెట్టినా భూమాత మనపై పగ తీర్చుకోవాలనుకోదు. క్షమించే గుణం ఉన్నది కదా అని మనం భూమాతను అదేపనిగా హింసించకూడదు. క్షమాగుణానికీ హద్దులుంటాయని గుర్తుంచుకోవాలి! క్షమాగుణం పురాణాలకు, ప్రాచీన ఇతిహాసాలకే పరిమితం కాదు. ఇటీవలి చరిత్రలో క్షమాగుణంతో చరితార్థులైన మహాపురుషులెందరో ఉన్నారు. ఆర్యసమాజ స్థాపకులైన మహర్షి దయానంద నిష్కాపట్యం, నిర్భయత్వం సమాజంలో అనేకులకు కంటగింపైంది. ఆయన వద్ద వంటవాడికి లంచం ఇచ్చి, ఆహారంలో విషం పెట్టించారు. దయానందులు మృత్యుశయ్యపై ఉన్నారు. తన వంటవాడిని దగ్గరకు పిలిచారు. కొంత డబ్బు అతడి చేతిలో పెట్టి ఇలా అన్నారు. 'వెంటనే నువ్వు నేపాల్‌కి వెళ్లిపో! నా శిష్యులకు నువ్వు చేసిన పని తెలిస్తే నిన్ను బతకనీయరు!'

తనకు ప్రాణహాని కలిగించిన వ్యక్తిని సైతం క్షమించి, అతడికి ప్రాణదానం చేసిన మహర్షి దయానంద చరితార్థులయ్యారు.క్షమాగుణం మానసిక రుగ్మతలకు మంచి మందు. పగతీర్చుకుంటే ప్రశాంతత చిక్కుతుందనుకోవడం కేవలం భ్రాంతి మాత్రమే! నిజానికి అభద్రత మిగులుతుంది. చిత్తవికారం ఏర్పడుతుంది. చివరకు జీవితం విషాదాంతం అవుతుంది. 
ఒక అరబ్బీ సామెత ఇలా చెబుతుంది- 'ఇతరులు మనకు చేసిన అపకారాలను ఇసుకపై రాయాలి. ఇతరులు మనకు చేసిన ఉపకారాలను చలువరాయిపై చెక్కుకోవాలి!'
                                                              - డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు 

Wednesday, 7 August 2013

సహనంతో అహం దహనం

హనం మానసిక పరిపక్వతగల శక్తి. కష్ట సమయాల్లో ఉద్వేగం కలిగినప్పుడు సమస్యను దాటవేయాలన్నా, వాయిదా వేయాలన్నా సహనం అనివార్య లక్షణం. అనుకున్నది జరగనప్పుడు, మౌనంగా చిరునవ్వుతో ఆ పని జరిగేవరకు నిరీక్షిస్తుండటమే సహనం. ఈ సద్గుణం ఉన్నవారు స్థితప్రజ్ఞులవుతారు. సహనం మనిషిని సాత్విక పురుషుడిగా తీర్చిదిద్దుతుంది.

మనిషిలో సహజంగా తొందరపాటు అనే బలహీనత ఉంటుంది. అనుకున్న పని వెంటనే అయిపోవాలనుకుంటాడు. సందర్భాసందర్భాలు, ఉచితానుచితాలు, న్యాయాన్యాయాలు ఆలోచించడు. జరిగిన పని సత్ఫలితాలు ఇవ్వకపోతే అంతర్విశ్లేషణ చేసుకోడు. భగవంతుడినో, ఇతరులనో నిందిస్తాడు. ఆపద కలిగినప్పుడు డీలా పడిపోతాడు. భయపడిపోతాడు. ఆవేశం వచ్చినప్పుడు ఆలోచన కోల్పోయి అక్కసు వెళ్లగక్కుతాడు. కొంత సహనంతో, కొంచెం ఓపికతో, ఆలోచనతో నిగ్రహంగా ఉంటే వివేకం మేల్కొని సరైన దారి చూపుతుంది. 'సత్యమేవ జయతే'- సత్యం వల్లనే విజయం లభిస్తుందని ముండకోపనిషత్తు చెబుతోంది. ఆ సత్యాన్ని గెలిపించేందుకు సహనం తప్పనిసరి. హరిశ్చంద్రుడు సహనం వల్లనే సత్యవ్రతుడని శ్లాఘనీయుడైనాడు. అర్జునుడు సహనశీలుడు కావడంవల్లనే పలు విజయాలు సాధించి విజయుడనిపించుకున్నాడు. శివసహస్రనామాల్లో శివుడికి 'సుసహః' అన్న పేరుంది. 'సహిష్ణు' అని విష్ణు సహస్రనామాలలో ఉంది. శివకేశవులు సహనమూర్తులు.

మహా భారతంలో వాసుదేవుణ్ని దుర్యోధనుడి వద్దకు రాయబారిగా పంపే సందర్భంలో ధర్మరాజంటాడు- 'పగను పెంచుకోకూడదు. దాన్ని అణచుకోవటమే శుభం, సుఖం. నిప్పుతో నిప్పు చల్లారదు. పగతో పగ చల్లారదు!' ఆ సహనగుణం వల్లనే ధర్మజుడు సంగ్రామంలో విజేత అయ్యాడు.

అల వచ్చినప్పుడు తలవంచితే, తలమీంచి వెళ్లిపోతుంది. అదే నిటారుగా అహంతో నిలుచుంటే దెబ్బతగులుతుంది. ఎదుటివారు కోపంలో నిందిస్తుంటే కొన్ని క్షణాలు మౌనంగా ఉంటే జరిగే నష్టమేమిటి? పైగా ఎదుటివాడే తన తప్పును తెలుసుకునే అవకాశమిచ్చినవాళ్లమవుతాం కదా! 'క్షమయా ధరిత్రీ' అనేది కేవలం స్త్రీలకోసమే కాదు, పురుషులకూ వర్తిస్తుంది. భూమి నుంచి ప్రతి మనిషీ నేర్చుకోవలసింది 'సహనం' అనే మహాగుణం. దూషణభూషణ తిరస్కారాలకు స్పందించనివాడే సహనమూర్తి.

వెలుగు నీడల్లా కష్టసుఖాలు అందరి జీవితాల్లోనూ తారసిల్లుతాయి. ఆపదల్లో సహనం అలవరచుకుంటే, తేలిగ్గా గట్టెక్కే అవకాశముంటుంది. అరణ్య, అజ్ఞాతవాసాల్లో పాండవులంతటి వాళ్లు అష్టకష్టాలు అనుభవించారు. ఎవరినీ నిందించలేదు. ఒకరినొకరు నిందించుకోనూ లేదు. ఓర్పుతో అవకాశం కోసం నిరీక్షించారు.

'ఆవేశం అనర్థదాయకం, సహనం సర్వజనామోదం' అని ఆర్యోక్తి. మనసు భావోద్వేగాల నిలయం. నిగ్రహం కోల్పోయిన మనసు మనిషిని నరకకూపంలో పడేస్తుందని ఉపనిషత్కథనం. సహనం ఓ వజ్రకవచం. ఆపదలో ఆదుకుంటుంది. దుఃఖంలో సాంత్వన చూపుతుంది. సహన సంపద ఆత్మస్త్థెర్యాన్నీ వివేచనను ప్రసాదించి, మనిషిలో మానవీయ విలువల కలువలు పూయిస్తుంది. రాగద్వేషాలను మదినుంచి తరిమేస్తుంది. అహాన్ని దహించేస్తుంది.

ఏసుక్రీస్తు తనను సిలువవేసి హింసించిన వారిపట్ల క్షమాగుణం ప్రదర్శించి, మహనీయుడయ్యాడు. మహత్తరమైన మనోబలం సాధించాలంటే అంతశ్శత్రువులను జయించాలి. చిత్తశుద్ధితో మనసున ఒక బిందువుమీద కేంద్రీకృతం చేస్తే ఏకాగ్రత సిద్ధిస్తుంది. దీన్నే యోగా, ధ్యానం, తపస్సు అంటాం. సహనగుణ సముపార్జనకు వీటిని అలవరచుకోవాలి. పరమగయ్యాళి అయిన భార్య సభలో కూర్చుని ఉన్న భర్త సోక్రటీస్‌ మీద బిందెడు నీళ్లు ఆగ్రహావేశాలతో గుమ్మరిస్తే 'ఉరుము ఉరిమాక కురవడం సహజమే కదా!' అంటూ తన ఓర్పును చూపించాడు ఆ తత్వవేత్త!

ఒక ఉత్సవంలో వూరేగింపుగా దేవత విగ్రహాన్ని తెస్తున్నారు. దాన్ని చూసిన ఓ పడికట్టురాయి అంది- 'నీవూ రాయివే, నేనూ రాయినే. మరి నీకెందుకీ పూజలూ, వూరేగింపులు, త్రాసులో నాకీ ఖర్మేంటి?'. విగ్రహం అంది- 'పిచ్చిదానా! ఉలిదెబ్బలను సహించి, ఎన్నో నెలలు శిల్పి ముందు నిలుచున్నాను. శిల్పి సుత్తితో ఎన్నిసార్లు కొట్టినా భరించాను. ఆ సహనం వల్లనే నాకీ అర్చనం, ఆరాధనం కలుగుతున్నది. పడికట్టు రాయి తలవంచుకుంది. అంగుళం నాలుకను అధీనంలో ఉంచుకోగల మనిషే మనీషి అవుతాడు. మితభాషి మాటలు ఇతరులకు అసహనం కలిగించవు. అసహనం ఆధ్యాత్మిక ప్రగతికి అవరోధం కలిగిస్తుంది. సామాన్యుణ్ని మాన్యుణ్ని చేసేది సహనమే. అహాన్ని దహనం చేసేదీ సహనమే. అందుకే ఆవాహనం పలుకుదాం సహనానికి!                                                                    - చిమ్మపూడి శ్రీరామమూర్తి