ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Monday, 11 November 2013

కృత్తివాసుడు ...

    పూర్ణిమనాడు కృత్తికా నక్షత్రం ఉంటే అది కార్తికం అవుతుంది. కృత్తికా నక్షత్రం అగ్ని నక్షత్రం. శివుడి మూడోనేత్రం అగ్ని. తన తనయుడు కుమారస్వామిని కృత్తికలనే రుషిపత్నులు పెంచడంవల్ల వారి పేరుతో ఉన్న కార్తికమంటే శివుడికి ప్రీతి. గరళకంఠుడైన శివుడి తమోగుణాన్ని చంద్రుడు మాత్రమే హరించగలడు. కనుక కార్తిక సోమవారం విశిష్టమైనది. శివారాధనకు ప్రత్యేకమైనది. సోముడంటే చంద్రుడు. పూర్ణిమ అనేది చంద్రుడు పదహారు కళలతోనూ కనిపించేరోజు. అటు అగ్ని వేడిమి, ఇటు చంద్రుడి చల్లదనం కలిసి ఒకేసారి శరీరం అనుభవించే రోజు- కార్తిక పూర్ణిమ.

శివుడు రుద్రుడు. అంటే రౌద్ర స్వరూపంతో ఎర్రని కన్నులతో, నుదుట భగభగమండే కొలిమి వంటి నేత్రంతో ఉంటాడు. ఆయన శిరసు మీద ఎంతో చల్లదనంతో ఉండే గంగమ్మ, ఒక పక్కగా చంద్రుడు ఉంటారు. ఇదే చలి వేడిమిల కలయిక. శివపత్ని పార్వతీదేవి కూడా అగ్నివర్ణంలో ఉండటమే గాక తాను నిత్యం చేసే తపంవల్ల ఎర్రదనంతో ప్రకాశిస్తుంటుంది. శివుడు అర్ధనారీశ్వరుడు. పార్వతి ఆయన ఎడమ భాగం, ఆమె శిరసుపై చంద్రుడు ఉంటాడు. కనుక ఆమె కూడా శీతలాగ్నుల కలయికే. పారిజాత పుష్పం పార్వతికి ప్రీతిపాత్రమంటారు. బయట ఎర్రని రంగుతోనూ, లోపల తెల్లని రేకుల తోనూ కనిపించే ఈ పుష్పాన్ని అగ్నిచంద్రులకు ప్రతీకగా భావిస్తారు.

ప్రపంచానికి ఆధారభూతమైన దేవతలెవరని యోచించి అయిదుగురిని నిర్ణయించారట. వారు సూర్యుడు, అంబిక, విష్ణువు, గణపతి, మహేశ్వరుడు. ఈ అయిదుగురి ప్రత్యేక పూజలకూ అయిదునెలలు నిర్ణయించారట కూడా. భాద్రపదమాసంలో గణపతిని, ఆశ్వయుజంలో అమ్మవారిని, కార్తికంలో శివుని, మార్గశిరంలో శ్రీహరిని, పుష్యమాసంలో సూర్యుణ్నీ ఆరాధించేలా వివిధ రకాల పండుగల్ని ఏర్పాటు చేశారు. కార్తికం శివారాధనామాసం.

శివుడంటే శుభప్రదుడని అర్థం. ఆయన భక్తవశంకరుడు. యోగధ్యానంలో తన స్వరూపంలో లీనమైపోయినప్పుడు శాంతుడు, సౌమ్యుడు. జగత్తులోని పాపాలపై దృష్టిసారించినప్పుడు రౌద్రరూపంలో భయంకరాకారుడవుతాడు. అతడు లయకారుడు. సృష్టికి తగినంత సంహారకమున్నపుడే స్థితికార్యం జరగగలదు. సంహారకశక్తి సమతౌల్యంగా ఉన్నప్పుడే సృష్టి స్థితులకు వీలుంటుంది.

శివుడు యోగవిద్యకు ఆద్యప్రవర్తకుడు. నృత్యవిద్యకూ శివుడే అధిదైవం. ఆయన డమరుకం నుంచే అ-ఇ-ఉ-ణ్‌ మొదలైన 14 వ్యాకరణమూల సూత్రాలు వెలువడ్డాయంటారు. వీటిని మహేశ్వర సూత్రాలంటారు. ఈ ధ్వనులే పాణిని వ్యాకరణానికి, భరతుడి నాట్యశాస్త్రానికి మూలమని పండితుల భావన. అక్షరాభ్యాస సమయంలో 'ఓం నమశ్శివాయ' అని పిల్లవాడిచేత బియ్యంపై రాయించడం సంప్రదాయం. శివతత్వాన్ని ఆ సమయంలోనే బోధించడం జరుగుతోందన్నమాట. శివుడు సర్వజీవులయందు సంచరించే చైతన్యస్వరూపుడు. సర్వజీవులయందు కరుణ చూపగలిగితే ఆ ప్రేమతత్వమే శివతత్వం. అది కాలానికి అతీతం. వర్ణనలకు అతీతం. కళ, కాష్టం, నిమిషం అనే కాలప్రమాణాలన్నీ శివతేజస్సులే. కాలం శివాధీనం.

కృత్తివాసుడి ఆరాధనలో రుద్రాభిషేకం, ప్రాతఃకాలస్నానం, దీపదానం, ఉపవాసం ముఖ్యమైనవి.
- డాక్టర్‌ డి.వి.సూర్యారావు

Sunday, 10 November 2013

మానవత


ప్రాణులకు పునరుత్పత్తి శక్తి దైవప్రసాదం. సంతానంపై అంతులేని మమకారం వాటికి కొంతకాలం ఉంటుంది. ఆ ప్రేమే పిల్లలకు శ్రీరామరక్ష. జంతువులు పిల్లలకి పాలిచ్చి పెంచుతాయి. పక్షులు ఆహారం తెచ్చి పిల్లల నోటికి అందిస్తాయి. పిల్లలు రెక్కలు వచ్చి ఎటో ఎగిరిపోతాయి. పశువులూ అంతే! దేనికి అదే!
మనుషులు అలా కాదు. తల్లీ, తండ్రీ, పిల్లలూ... ఒక కుటుంబ వ్యవస్థ. ఈ బంధం శాశ్వతం. పిల్లలకు ఒక బాధ్యత ఉంటుంది. 'తల్లి దైవం, తండ్రి దైవం' అని వేదఘోష. వాళ్లు జీవించినంతకాలం గౌరవంతో, భక్తితో చూడాలి. వాళ్లు స్వర్గస్తులైన తరువాతా భక్తితో స్మరించాలి. ఇలా శ్రద్ధను ప్రదర్శించడమే 'శ్రాద్ధం'.

తల్లిదండ్రులు తమ సంతానం కోసం ఏ త్యాగానికీ వెనకాడరు. తాము తినీ తినకా బిడ్డలను చక్కగా పోషిస్తారు. వారి త్యాగాలను బిడ్డలు సదా స్మరిస్తూ ఉండాలి. కని పెంచడం అనేది కేవలం భౌతిక ధర్మంగా భావించకూడదు. తల్లిదండ్రులకు, బిడ్డలకు, అన్నదమ్ములకు, అక్కచెల్లెళ్లకు మధ్య ఉండే అనిర్వచనీయ బంధం పవిత్రతను సంతరించుకుంది.

మన సంస్కృతిలో భార్యాభర్తల బంధానికి దైవమే సాక్షి. ఈ సంబంధాలన్నీ మన పురాణేతిహాసాల్లో ఆధ్యాత్మికతను సంతరించుకున్నాయి. భరతుడు అన్నగారి పాదుకలను శిరస్సున పెట్టుకుని పూజించాడు. శ్రీరామునితోపాటు ఒక వైపు తమ్ముడు లక్ష్మణుడూ, ఇంకోవైపు సీతాదేవీ పూజలందుతారు. వాళ్ళ మధ్య ఉన్న సంబంధాలు త్యాగం, ప్రేమ, స్నేహం, దయ, వాత్సల్యం, భక్తి... మొదలైన ఉత్తమ గుణాలతో కూడినవి. ఇవన్నీ దైవాంశలు. వీటిని రసవత్తరంగా వర్ణిస్తూ మహాకవులు కావ్యాలనూ, నాటకాలనూ మనకు ప్రసాదించారు.

మానవ సంబంధాలు ఎలా ఉండాలో భాసమహాకవి తన రూపకాల్లో గొప్పగా చిత్రించాడు. 'మధ్యమ వ్యాయోగం' రూపకంలో తల్లిదండ్రులకూ సంతానానికీ మధ్య ఉండే అనుబంధం, ఒకరి కోసం ఒకరు త్యాగం చేయడానికి సిద్ధపడే ఘట్టం హృదయాలను కరిగిస్తుంది. కళ్లు చెమ్మగిల్లేట్లు చేస్తుంది.

ఒక వృద్ధుడి కుటుంబం అరణ్యమార్గంలో పోతూ రాక్షసుడి చేతిలో పడింది. ఆ రాక్షసుడు మంచివాడే! కానీ, తల్లి ఆజ్ఞ చొప్పున, ఒక మనిషిని ఆమె తినడానికి పట్టుకుపోవలసి వచ్చింది! మాతృభక్తి పరాయణుడైన రక్కసుడు ఈ కుటుంబాన్ని పట్టుకున్నాడు. తల్లీ, తండ్రీ, ముగ్గురు కొడుకులు- ఇదీ, ఆ బాటసారుల కుటుంబం. వారిలో ఒకర్ని విడిచిపెడితే, మిగతావారికి హాని తలపెట్టకుండా వదిలివేస్తానని ఆ రాక్షసుడు పలికాడు. 'నేను వృద్ధుణ్ని. సంసారఫలం గ్రహించినవాడిని. నన్ను తీసుకుపో!' అన్నాడు వృద్ధుడు. 'భారతీయ స్త్రీ ముత్తయిదువుగానే జీవితాన్ని ముగించాలనుకుంటుంది కాబట్టి నన్ను నీ వెంట తీసుకువెళ్లు!' అంటుంది ఆ మాతృమూర్తి. ఇలాగే వరసగా ఆ ముగ్గురు కుమారులూ నేను వస్తానంటే నేను వస్తానని ఆ రాక్షసుడి ముందుకు వస్తారు. అందరి లక్ష్యమూ ఒక్కటే. తాను బలియైనా మిగతావారిని రక్షించాలి! వాళ్ల దృష్టిలో త్యాగమే గొప్పది. కుటుంబసభ్యుల రక్షణ కోసం తన ప్రాణం అర్పించడం మహద్భాగ్యం అని ప్రతివారూ భావిస్తున్నారు. తాను పోయినా మిగతావారు క్షేమంగా ఉంటే చాలు! లోకమే తమ కుటుంబంగా మహాత్ములు భావిస్తారు. 'లోకం సమస్తమూ సుఖంగా ఉండాలి' అని మన సనాతన ధర్మం ఉపదేశిస్తున్నది. లోక క్షేమం కోసం తమ జీవితాన్ని హారతి కర్పూరం చేసిన మహాత్ములు దైవసమానులు. భాసుడి 'మధ్యమ వ్యాయోగం' రూపకంలో ఆ పేదకుటుంబ సభ్యుల సంభాషణ విని ఆ రాక్షసుడే చలించిపోతాడు. అతడెవరో కాదు- ఘటోత్కచుడే! అతడు తన తల్లి హిడింబి కోరికను అనుసరించి ఒక మానవుణ్ని పట్టుకువెళ్లడానికి వచ్చాడు. కేవలం తన భర్త భీమసేనుణ్ని దర్శించడానికే హిడింబి ఈ యుక్తి పన్నింది కానీ, నరమాంస భక్షణ కోసం కాదు! అది వేరే కథ. మమతలు ఉన్న చోట మానవత్వం ఎలా పరిఢవిల్లుతుందో చెప్పడానికి భాసుడు మధ్యమ వ్యాయోగంలో ఈ సంఘటన కల్పించాడు.

ఈ మహాకవే రచించిన 'వూరుభంగం' రూపకం- దుష్టుడు సైతం తుది క్షణాల్లో పశ్చాత్తాపం చెందితే, మానవతా లత మరుక్షణమే పుష్పించి, ముక్తి అనే ఫలాన్ని ప్రసాదిస్తుందని నిరూపిస్తుంది. దుర్యోధనుడు ప్రాణం విడిచే ఘట్టం అది. తల్లిదండ్రులతో, గురువుతో, కుమారుడితో, భార్యలతో అతడు సంభాషించిన తీరు ఉత్తమ మానవత్వానికి మచ్చుతునక. తాను గతంలో చేసిన అమానవీయ కృత్యాలను పశ్చాత్తాపంతో గుర్తుచేసుకుంటాడు. ద్వేషం కంటే ప్రేమే గొప్పదంటాడు. హింసకు స్వస్తిచెప్పాలంటాడు. అంతా శ్రీకృష్ణుడి లీల తప్ప వేరేమీ కాదని అతడు గ్రహించడంతో మోక్షం పొందుతాడు. తెలిసి చేసినా, తెలియక చేసినా, కర్మకొద్దీ చేసినా, తుది క్షణాల్లోనైనా హృదయపరివర్తన చెంది భగవన్నామం జపిస్తే సత్ఫలం లభిస్తుందని భాసుడు భంగ్యంతరంగా ఈ రూపకంలో చెప్పాడు. పాండవులను అష్టకష్టాలపాలు గావించిన సుయోధనుణ్ని సైతం మానవతా దృక్కోణం నుంచి చూసిన భాస మహాకవి- వ్యాస హృదయాన్ని తన రూపకాల్లో రసవత్తరంగా ఆవిష్కరించి, లోకంలో శాంతి, అహింసలే ముక్తికి మార్గాలని సూచించాడు.
- డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు 

Saturday, 9 November 2013

మంచి - చెడ్డ


వరి గురించి అయినా మనం ఎప్పుడూ చెడుగా ఆలోచించకూడదు. ఇది ఒక నియమంగా పెట్టుకోవాలి. అలా ఆలోచించకుండా ఉండగలమా అని సందేహం కలుగుతుంది. అయినా దీన్ని మనం అభ్యాసం చెయ్యాలి. ఎందుకంటే, దీనివల్ల చాలా లాభాలున్నాయి. నిరంతరం ఇతరుల గురించి చెడుగా ఆలోచించటంవల్ల ముందు మన మనసులో చెడ్డ వాతావరణం ఏర్పడుతుంది. అది అవతలవారికి ఎంత హాని చేస్తుందో తెలియదు కాని, ముందు మన ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది. తిరుగు లేదు. దీనికి శాస్త్రీయమైన దాఖలాలు ఉన్నాయి. రక్తపోటు పెరుగుతుంది. మధుమేహం అదుపు తప్పుతుంది.

మనిషి ఎలా ఆలోచిస్తే అలాగే ఉంటాడంటారు. చెడుగా ఆలోచించి, ఆలోచించి చెడ్డలో మునిగిపోతే మన మనసును దయ్యంలా చెడు పట్టుకుంటుంది. అది అవతలవారికి హాని చేసే లోపలే మనం దానికి బలి అయిపోతాం.

చెట్టుకు పట్టిన చీడ పక్క చెట్లకు అంటుకునే లోపల మొదటి చెట్టు మూలాన్నే తినేస్తుంది.

దుర్యోధనుడు ఒకసారి వెదికితే ఎక్కడా అతడికి ఒక్క మంచివాడు కూడా కనపడలేదట. చెడ్డవాడికి మంచి ఎక్కడ కనిపిస్తుంది? ఏ చూపుతో చూస్తే ఆ భావమే అందరిలో కనిపిస్తుంది. ఉదయం లేవగానే ఈ లోకం బాగుండాలి, అందరూ బాగుండాలి అని హృదయపూర్వకంగా పది నిమిషాలపాటు కోరుకోవాలి. ఇలా చేస్తే, మందులు వేసుకోకుండానే ఆరోగ్యం బాగుంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఆధ్యాత్మిక శాస్త్రాలు తెలియజేస్తున్నా యి. గురువులు బోధిస్తున్నారు. మనం కూడా ఆలోచించాలి, ఆచరించాలి.

రాగద్వేషాలు మనల్ని నలిపి పారేస్తున్నాయి. నువ్వు-నేను అనే భేదం చివరికి ఒకరినొకరు హతమార్చుకునే స్థితికి తీసుకుపోతోంది. జంతులక్షణాలు బాగా ప్రబలి మానవత్వం మంటగలిసి పోతోంది. ఇలా జరగడానికి కారణాలు ఏమిటి?

మంచిగా ఆలోచించడానికి, మంచిగా ఉండటానికి పుణ్యం కారణమైనట్లు, చెడుగా ఆలోచించడానికి చెడ్డగా ఉండటానికి పాపం కారణం అవుతోంది. ఉల్లి ఉల్లివాసనను ఇస్తోంది. మల్లి మల్లివాసనను ఇస్తోంది. ఏ విత్తనం ఆ ఫలాన్ని ఇస్తోంది.

మంచి చెడుల మిశ్రమమే జీవితం. సుఖదుఃఖాల సంగమమే జీవనం. త్రేతాయుగంలో అవతార పురుషుడైన శ్రీరాముడున్నాడు. మంచికి, ధర్మానికి మారుపేరు ఆయన. ఆ యుగంలోనే అతి దురాత్ముడు, మహా పాపి అయిన రావణాసురుడూ ఉన్నాడు. ఏ యుగమూ చెడ్డను తప్పించుకోలేదు.

చెడ్డలో కూడా మంచిని చూడాలి. మంచి గురించే ఆలోచించాలి. ప్రసాద భావంతో భగవంతుడు దేన్ని ఇస్తే దాన్ని స్వీకరించాలని పెద్దలు చెబుతారు. అందుకు అనుగుణంగా ఎవరూ లేరు. కొత్త వూహలు, కొత్త ఆలోచనలు, కొత్త సిద్ధాంతాలు లేవనెత్తుతున్నారు. శాస్త్రీయ పరిష్కారాలు వెదుకుతున్నారు. ఆధునిక మార్గాల్లో వెళుతున్నారు. మంచిదే... ఎవరు వద్దన్నారు, ఎవరు కాదన్నారు? సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు. రుతువులు వాటి ప్రభావాన్ని తప్పక చూపిస్తాయి. సార్వత్రిక సత్యాలను ఎవరూ కాదనలేరు.

మార్చుకోవలసింది మన తలరాతను కాదు. ఆలోచనా విధానాలను. ఆలోచనలు మారితే అదృష్టాలు మారతాయి. దైవానుగ్రహం లభిస్తుంది. బతుకులు బాగుపడతాయి.

కష్టాలు, కడగండ్లు అనుభవించిన పాండవులను పరమాత్మ వదిలేశాడా? గర్వంతో విర్రవీగే కౌరవుల ఆలోచనలు ఎలా తలకిందులయ్యాయి? చరిత్రలో ఎక్కడైనా చెడ్డవైపు నిలుచున్నాడా భగవంతుడు? అలా అయితే అతడు దేవుడెలా అవుతాడు? మనకు ఇతరులు ఏ మంచి చేయాలని కోరుకుంటామో, ఏ చెడ్డ చెయ్యకూడదని ప్రతిఘటిస్తామో- మనమూ ఇతరుల పట్ల అలాగే ఉండాలి. అనుకోకుండా చెడ్డ జరిగినా, దానికి దారితీసిన పరిస్థితులను విశ్లేషించుకుని, మళ్ళీ ఎప్పడూ అలా జరగకుండా చూసుకోవాలి. ఇది మన జీవన విధానంలో ఒక సూత్రంగా పెట్టుకోవాలి. కౌరవులు నూరుగురు, పాండవులు అయిదుగురు. తాత్కాలికంగా చెడ్డకున్న శక్తి ఎక్కువగా కావచ్చు. సహనం, సంయమనం, సౌశీల్యం, శాంతం, శరణాగతి, ఈశ్వర కృప ఉంటే విజయాన్ని ఎవరూ ఆపలేరు?

మంచిని నిర్మించే శక్తి మనకు లేకపోవచ్చు. చెడ్డను నిరసించే శక్తి కావాలి. చెడుభావనలు మనసును హింస పెడుతున్నప్పుడు తత్సమానమైన మంచి భావాలతో నింపుకోవాలి.

అందరిలో ఒకడే పరమాత్మ నివసిస్తున్నాడు అనే శుద్ధజ్ఞానం కలిగేంతవరకు ఈ అభ్యాసం తైలధారలాగ కొనసాగాలి. అప్పుడే మంచి కోసం మంచిగా ఉండగలం, మానవత్వాన్ని నిలబెట్టుకోగలం.
- ఆనందసాయి స్వామి 

Friday, 8 November 2013

గృహస్థ ధర్మం

లోకాలన్నీ కలిపి పరమాత్మ దివ్యశరీరం. సమస్త దేవతలకు ఆయన శరీరమే గృహం. పంచభూతాలకు తమ అధికార ప్రదేశాలే గృహాలు. భూలోక ప్రాణులకు ఈ చరాచర జగత్తే గృహం. మానవులకు తమ దేహాలే గృహాలు. 
దేహాలను ఆలయంగా వర్ణిస్తుంది వేదం.
ఆ విధంగా ప్రతివారికీ ఒక ఆలయం ఉంది. అది వారి దేహమే. తిరిగి ఆ దేహాలయ రక్షణకు ప్రకృతి వనరులతో మరొక గృహాన్ని నిర్మించుకుంటాడు. అందులో సకుటుంబంగా నివసిస్తుంటాడు. దీన్నే నివాసగృహం అంటారు.
 
స్థిరనివాసం అయితే, అది స్వగృహం. తన ధనంతో నిర్మించుకున్నదన్నమాట. లేదా వారసత్వ ఆస్తిగా లభించినది. ఆధ్యాత్మిక జీవనం గడిపేవారు నివసించేదాన్ని ఆశ్రమం అంటారు. భగవంతుడి విగ్రహాలకు ఆవాసంగా నిర్మించేది కోవెల. అంతరాలయంలో మూలవిరాట్టును ఉంచుతారు. 

ఎవరు గృహ యజమానో అతడే గృహస్థు. వివాహితుడు, భార్యాసమేతుడు అయితే అతడు పూర్ణగృహస్థుడు. భార్యలేనివాడు అర్ధగృహస్థుడు. భార్యకు వివాహమంత్రాల ద్వారా అర్ధశరీర హోదా కల్పిస్తారు. ఆమె అర్ధాంగి అవుతుంది. ఆ క్షణం నుంచీ భార్యాభర్తలిద్దర్నీ గృహస్థులంటారు. యజమాని గృహస్థుడు, యజమానురాలు గృహిణి. 

వేదవిహితమైన సమస్త కర్మలు భార్యాభర్తలిద్దరూ కలిసి చేయాల్సిందే, లేకపోతే ఫలితాలు లభించవని చెబుతారు. సీతాపరిత్యాగం తరవాత శ్రీరాముడు అశ్వమేధయాగానికి సిద్ధపడతాడు. ప్రత్యామ్నాయంగా స్వర్ణసీతను పక్కన ఉంచి యాగాన్ని పరిసమాప్తి చేస్తారు. 
పర, అపర కర్మలు, పూజలు, వ్రతాలు దంపతసమేతంగానే నిర్వహించాలి. అలా చేయాలంటే ఇద్దరిదీ ఒకేమాట, ఒకేమనసు, ఒకేరీతిగా ఉండాలి. దానినే దాంపత్యధర్మం అంటారు.
గృహస్థధర్మం విస్త్రృతమైనది. గృహిణి తన గృహాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దాలి. పరిశుభ్రతను పాటిస్తూ, గృహదేవతలకు (వీరే ఇలవేల్పులు) నివాసయోగ్యంగా, వారు ప్రసన్నులయ్యే విధంగా గృహాన్ని నిర్వహించాలి. ఇంటికి ఇల్లాలే లక్ష్మి. ఆమె సంతోషంగా, ప్రసన్నంగా ఉంటూ అతిథి అభ్యాగతుల్ని ఆదరంగా చూడాలి. అతిథుల్ని విష్ణుస్వరూపాలుగా భావించమంటుంది మన ధర్మం. 

ఆదిశంకరులు భిక్షకు వెళ్లినప్పుడు కటిక బీదరాలు కేవలం ఒక ఉసిరికాయను మాత్రమే సమర్పించుకుంది. ఆ క్షణంలోనే ప్రసన్నులైన ఆదిశంకరులు ఆశువుగా కనకధారాస్తోత్రం చదివి కనక వర్షం కురిపించారని చెబుతారు. ఇదీ, ఆతిథ్యఫలం.
అతిథులందరూ కనకవర్షాలు కురిపించలేరు. కానీ, అందుకు సమానమైన ఆశీస్సులు కురిపిస్తారు. 
గృహిణి తన కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించే విధంగా గృహస్థు ఏర్పాట్లు చేయాలి. అప్పుడే గృహస్థధర్మాలు సవ్యంగా నిర్వర్తించడం సాధ్యపడుతుంది. రెండు చేతులు కలిస్తేనే పని చేయగలం. రెండు కళ్లూ ఒకే దృశ్యాన్ని చూసినప్పుడే స్పష్టత ఉంటుంది. ఒక కన్నుతో స్పష్టత ఉండదు. భార్యాభర్తల విషయం కూడా ఇంతే. ఏకస్తులుగానే వ్యవహరించాలి. భార్యాభర్తల అభిన్నత్వం రాధాకృష్ణులు, పార్వతీ పరమేశ్వరులు, సీతారాములతో పోల్చదగింది.
శరీరం గృహం కాబట్టి, శరీరధర్మాలను శాస్త్రోచితంగా నిర్వహించాలి. శరీరానికి నివాసగృహం ఉంటుంది గనక, గృహస్థధర్మాలు ప్రత్యేక శ్రద్ధతో పాటించాలి. ప్రపంచమూ గృహంతో సమానం గనుక సర్వప్రాణుల్ని తన గృహంలోని సహజీవులుగా, సమానాధికారాలు గలవారిగా గుర్తించి, ఆత్మీయంగా, ప్రేమాస్పదంగా వ్యవహరించాలి. ప్రపంచ గృహానికి పరమాత్మే నిజయజమాని గనుక, ఆయన పట్ల భక్తిశ్రద్ధలు, విధేయత కలిగి ఉండాలి. సర్వమూ ఆయన సంపదే గనుక వాటి విలువల్ని కాపాడాలి. అందరి సంతోషమూ మన సంతోషంగా భావిస్తే ప్రపంచం ఆనంద నిలయమవుతుంది. ఆ విధంగా ప్రవర్తించటమే అసలైన, సిసలైన గృహస్థ ధర్మం.
- కాటూరు రవీంద్ర త్రివిక్రమ్‌ 

Thursday, 7 November 2013

ఆత్మావలోకనం...


త్మ పరిపూర్ణత్వాన్ని మనం అర్థం చేసుకునే వరకు, అనుభూతి పొందేవరకు అపరిపూర్ణమైన ప్రాపంచిక విషయాలపై మక్కువ కలిగి ఉంటాం. పసివాళ్లు వాళ్ల పరిమిత జ్ఞానాన్నిబట్టి వస్తువులకు ఆకర్షితమవుతారు. పెరిగి, వ్యక్తిత్వాన్ని సమకూర్చుకున్న వ్యక్తి అందుకు తగిన వస్తువుల పట్లే ఆకర్షితుడవుతాడు. పిల్లలాశపడే అర్థంలేని వస్తువుల్ని చూసి వాళ్ల అమాయకత్వానికి, అజ్ఞానానికి నవ్వుకుంటాడు. ప్రస్తుతం మన పరిస్థితీ అదే. పసివాడి పరిస్థితి. మానవజన్మ ఔన్నత్వాన్ని గ్రహించక, పరిమిత వస్తుజాలానికి ఆశపడుతూ వాటితో తృప్తిపడుతున్నాం. మనం పశుపక్ష్యాదులకంటే తక్కువ స్థాయిలో ఆలోచిస్తున్నాం. ఆశపడుతున్నాం.
పులి, సింహంలాంటి మృగాలు ఎంత ఆకలిగొన్నా గడ్డి తినవు. గోవు, ఏనుగు మాంసాహారాన్ని ముట్టవు. చకోరపక్షులెంత దాహార్తితో ఉన్నా మేఘాలు వర్షించే శుద్ధజలాన్ని తప్ప నేలమీది నీటికి ఆశపడవు. అవి అసంకల్పితంగానే, అజ్ఞాన దశలోనే వాటివాటి ఆభిజాత్యాన్ని అనుసరిస్తాయి. జాతి మూలతత్వాన్ని నిలుపుకొంటాయి. మరచిపోవు. మనిషి మాత్రమే... మానసికంగా, శారీరకంగా ఎంతో ఉన్నతదశలో ఉన్న మనిషి మాత్రమే దురదృష్టవశాత్తూ తానేమిటో, తానెవరో మరచిపోయాడు. తాహతుకు తగని అల్ప వ్యక్తిత్వంతో తగ్గిపోయాడు. చిన్నబోయాడు. చిన్నపిల్లాడు సరదాపడి పెద్దల పెద్ద చొక్కా వేసుకుంటే వినోదంగా బాగానే ఉంటుంది. కానీ, పెద్దమనిషి చిన్నపిల్లాడి దుస్తులు వేసుకుంటే పరిహాసాస్పదంగా ఉంటుంది. అసహ్యంగానూ ఉంటుంది. మన పరిస్థితి అది. అదే.

ఒక చిన్న మొలక మొలకలాగే ఉండదు. ఎదుగుతుంది. వృక్షమవుతుంది. ఫల పుష్పాదులనిస్తుంది. శీతలఛాయలు పరుస్తుంది. గోవత్సం వత్సగానే ఉండదు. గోవు అవుతుంది. లేదా కోడెదూడ అవుతుంది. వృషభం అవుతుంది. మొనగాడవుతుంది. రైతు బరువుల్ని, బాధల్ని ఒక్క మెడమీద మోస్తుంది. మూపున కాస్తుంది. శిశువుగా పుట్టిన మనిషి శరీరాన్ని పెంచుకుంటున్నాడు. శరాన్ని పెంచుకోవడం లేదు! ఆభిజాత్యాన్ని గుర్తించే శరం, ఔన్నత్యాన్ని గ్రహించే శరం... బేశరం! ఏం చూసుకుని తలెత్తుకు తిరుగుతున్నాం? అద్దంలో శరీరాన్ని చూసుకుని మురవటమేనా? లోపలేముందో గమనించవద్దా?

గుప్తనిధుల కోసం గుళ్లూ, గోపురాలూ తవ్వి చరిత్ర గుండెలు ఛిద్రం చేయటం కాదు. కొలతలకు, అంచనాలకు అందని అపారనిధి ఉంది మన అంతః మందిరంలో, అంతరంగంలో. దాన్ని తవ్వవద్దా, లోతులు తెలుసుకోవద్దా? లోపల ఏ అద్భుత, అపురూప నిధి ఉందో తెలుసుకోవద్దా? శవాన్ని కోతలు పెట్టి అవమానించటం మాత్రమే మనకు తెలిసింది. మలమూత్రాలు, రక్తమాంసాలు నిండిన తుచ్ఛశరీరమా ఇది? కాదు. ముక్కోటి దేవతల మురిపాల మందిరం. మేరుదండ విపంచిపై రుద్రవీణకులా నిట్టనిలువుగా భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాత్మక ప్రతీకలుగా నిలిచిన చక్ర సముదాయం. అధిష్ఠాన దేవతలుగా గణపతి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కొలువుతీరిన నిటారు పవిత్ర ప్రాంగణం. శివపార్వతుల సమ్మేళన కేంద్రం సహస్రార కమలం. రాత్రింబవళ్లు, శుక్ల కృష్ణ పక్ష నియమభేదాల్లేని సూర్యచంద్రుల సదా విరాజమాన సదనాలు నయనాలు. సుషుమ్న ద్వారా ఎప్పుడు పైకెగబాకుతుందో తెలీని కుండలినీ మాత రాకకై సుషుమ్నకు ఇరువైపులా ఇడా పింగళ నాడులుగా శ్వాస అనే వింజామరలు వీస్తూ పైకీ కిందకూ లయబద్ధ విన్యాసం చేస్తున్న అదే సూర్యచంద్రులు. మానవ శరీరంలోని త్రికోణాకార మూలాధార చక్రాన్నే మణిద్వీపంగా మూడున్నర చుట్టలుగా ఒదిగి రాజసంగా నిద్రిస్తున్న దేవి. ఇవేనా? ఎన్నో. ఇదీ మన దేహం. మనం. 'నేను' అనే పవిత్రాత్మ శిలలోని జలలా, టెంక చుట్టిన నారికేళంలోని అమృత తీర్థంలా విరాజమానమై ఉన్న... దేహం.

అద్భుతమైనది ఏదైనా వ్యర్థం మధ్యే ఉంటుంది.. నిగూఢంగా. ఆత్మ అయినా అంతే. ఈ విషయం మనం గ్రహిస్తే ఈ ఆత్మ వజ్రాన్ని ధరించిన ఈ దేహాన్ని 'నేను' అనుకుంటున్న ఈ దేహశకల సముదాయాన్ని ఎంత అజ్ఞానంగా, ఎంత వ్యర్థంగా, ఎంత అర్థరహితంగా వినియోగించుకుంటున్నామో అర్థమవుతుంది. 'నేను' పరిమితం అనుకున్నప్పుడే పరిమితమైన ఆలోచనలు. అంచనాలు, కోరికలు. నేను అని భ్రమ పడుతున్న ఈ శరీరాన్ని శిశువును మోసే పవిత్ర గర్భకోశంలా వికసించనీ, విస్తృతం కానీ. అప్పుడు... తాను ఎంత పవిత్రమో, ఎంత ఘనమో, ఎంత విశాలమో, ఎంత అనంతమో అర్థమవుతుంది.
- చక్కిలం విజయలక్ష్మి