ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Monday 11 November 2013

కృత్తివాసుడు ...

    పూర్ణిమనాడు కృత్తికా నక్షత్రం ఉంటే అది కార్తికం అవుతుంది. కృత్తికా నక్షత్రం అగ్ని నక్షత్రం. శివుడి మూడోనేత్రం అగ్ని. తన తనయుడు కుమారస్వామిని కృత్తికలనే రుషిపత్నులు పెంచడంవల్ల వారి పేరుతో ఉన్న కార్తికమంటే శివుడికి ప్రీతి. గరళకంఠుడైన శివుడి తమోగుణాన్ని చంద్రుడు మాత్రమే హరించగలడు. కనుక కార్తిక సోమవారం విశిష్టమైనది. శివారాధనకు ప్రత్యేకమైనది. సోముడంటే చంద్రుడు. పూర్ణిమ అనేది చంద్రుడు పదహారు కళలతోనూ కనిపించేరోజు. అటు అగ్ని వేడిమి, ఇటు చంద్రుడి చల్లదనం కలిసి ఒకేసారి శరీరం అనుభవించే రోజు- కార్తిక పూర్ణిమ.

శివుడు రుద్రుడు. అంటే రౌద్ర స్వరూపంతో ఎర్రని కన్నులతో, నుదుట భగభగమండే కొలిమి వంటి నేత్రంతో ఉంటాడు. ఆయన శిరసు మీద ఎంతో చల్లదనంతో ఉండే గంగమ్మ, ఒక పక్కగా చంద్రుడు ఉంటారు. ఇదే చలి వేడిమిల కలయిక. శివపత్ని పార్వతీదేవి కూడా అగ్నివర్ణంలో ఉండటమే గాక తాను నిత్యం చేసే తపంవల్ల ఎర్రదనంతో ప్రకాశిస్తుంటుంది. శివుడు అర్ధనారీశ్వరుడు. పార్వతి ఆయన ఎడమ భాగం, ఆమె శిరసుపై చంద్రుడు ఉంటాడు. కనుక ఆమె కూడా శీతలాగ్నుల కలయికే. పారిజాత పుష్పం పార్వతికి ప్రీతిపాత్రమంటారు. బయట ఎర్రని రంగుతోనూ, లోపల తెల్లని రేకుల తోనూ కనిపించే ఈ పుష్పాన్ని అగ్నిచంద్రులకు ప్రతీకగా భావిస్తారు.

ప్రపంచానికి ఆధారభూతమైన దేవతలెవరని యోచించి అయిదుగురిని నిర్ణయించారట. వారు సూర్యుడు, అంబిక, విష్ణువు, గణపతి, మహేశ్వరుడు. ఈ అయిదుగురి ప్రత్యేక పూజలకూ అయిదునెలలు నిర్ణయించారట కూడా. భాద్రపదమాసంలో గణపతిని, ఆశ్వయుజంలో అమ్మవారిని, కార్తికంలో శివుని, మార్గశిరంలో శ్రీహరిని, పుష్యమాసంలో సూర్యుణ్నీ ఆరాధించేలా వివిధ రకాల పండుగల్ని ఏర్పాటు చేశారు. కార్తికం శివారాధనామాసం.

శివుడంటే శుభప్రదుడని అర్థం. ఆయన భక్తవశంకరుడు. యోగధ్యానంలో తన స్వరూపంలో లీనమైపోయినప్పుడు శాంతుడు, సౌమ్యుడు. జగత్తులోని పాపాలపై దృష్టిసారించినప్పుడు రౌద్రరూపంలో భయంకరాకారుడవుతాడు. అతడు లయకారుడు. సృష్టికి తగినంత సంహారకమున్నపుడే స్థితికార్యం జరగగలదు. సంహారకశక్తి సమతౌల్యంగా ఉన్నప్పుడే సృష్టి స్థితులకు వీలుంటుంది.

శివుడు యోగవిద్యకు ఆద్యప్రవర్తకుడు. నృత్యవిద్యకూ శివుడే అధిదైవం. ఆయన డమరుకం నుంచే అ-ఇ-ఉ-ణ్‌ మొదలైన 14 వ్యాకరణమూల సూత్రాలు వెలువడ్డాయంటారు. వీటిని మహేశ్వర సూత్రాలంటారు. ఈ ధ్వనులే పాణిని వ్యాకరణానికి, భరతుడి నాట్యశాస్త్రానికి మూలమని పండితుల భావన. అక్షరాభ్యాస సమయంలో 'ఓం నమశ్శివాయ' అని పిల్లవాడిచేత బియ్యంపై రాయించడం సంప్రదాయం. శివతత్వాన్ని ఆ సమయంలోనే బోధించడం జరుగుతోందన్నమాట. శివుడు సర్వజీవులయందు సంచరించే చైతన్యస్వరూపుడు. సర్వజీవులయందు కరుణ చూపగలిగితే ఆ ప్రేమతత్వమే శివతత్వం. అది కాలానికి అతీతం. వర్ణనలకు అతీతం. కళ, కాష్టం, నిమిషం అనే కాలప్రమాణాలన్నీ శివతేజస్సులే. కాలం శివాధీనం.

కృత్తివాసుడి ఆరాధనలో రుద్రాభిషేకం, ప్రాతఃకాలస్నానం, దీపదానం, ఉపవాసం ముఖ్యమైనవి.
- డాక్టర్‌ డి.వి.సూర్యారావు

No comments:

Post a Comment