ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Tuesday 25 June 2013

మనోనిశ్చలత


    రైలు బోగీ కిక్కిరిసి ఉంది. ఓ మనిషి కూర్చున్న ఓ పెద్దాయనను గడబిడ చేసి, మాటల దాడితో కూర్చున్నవారి వరసలో ఇరుక్కున్నాడు. గమ్యస్థానం చేరేవరకు తాను హాయిగా కూర్చోలేకపోయాడు. ఇతరులనూ కుదురుగా కూర్చుండనివ్వలేదు.

మన సౌకర్యం కోసం, ప్రశాంతత కోసం ఇతరుల ప్రశాంత వాతావరణాన్ని భగ్నంచెయ్యడం ఎంతటి అనౌచిత్యమో గ్రహించుకునే వివేకం అవసరం. సరైన ఆలోచనా విధానం, ప్రవర్తనా శైలి మృగ్యమైతే మనకు మనమే ఓ సమస్యగా మారతాం. ఇతరులకు సమస్యగా తయారవుతాం.

వివేకవంతుడైన మానవుడు తనను తాను ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ ఉంటాడు. ఇది ఉత్తమ సంస్కారాన్ని సూచిస్తుంది. ప్రపంచ విజేతగా నిలిచిపోవాలన్న దుగ్ధతో ఎన్నో యుద్ధాలు చేసి ప్రపంచాన్ని యుద్ధభీతిలో ముంచివేసిన గ్రీకువీరుడు సాధించింది ఏమిటి? కడకు అశాంతితో అలమటించి కన్నుమూశాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి? బోగీలో ఇంతచోటు దొరికినందుకు, ప్రయాణించే అవకాశం లభించినందుకు తృప్తిపడాలే కానీ- సౌకర్యం లేకపోయెనే అన్న ఆలోచనే రానీయకూడదు. అశక్తతతో, ఎక్కేందుకు వీలులేక 'ఫ్లాట్‌ఫాం' మీదనే నిలుచుండిపోయినవారికంటే, తానెంతో అదృష్టవంతుణ్నని భావించుకోవాలి. అలాగే, కూర్చున్నవారు తనకంటే ఎంతో శ్రమించి సాధించుకున్నారన్న ఆలోచన రావాలి.

ఒకరికి ఉన్నదాన్ని గురించి ఈర్ష్యాద్వేషాలకు గురికావడం నీచమైన మనస్తత్వాన్ని తెలియజేస్తుంది. ఉన్నతస్థాయికి ఎదిగేందుకు మార్గం అంకితభావంతో చేసే శ్రమ మాత్రమేనని గుర్తెరగాలి. శ్రమించడానికి శక్తిలేనప్పుడు ఉన్నదానితోనే తృప్తిపడే మనస్తత్వాన్ని కలిగి ఉండటమే గొప్ప సుగుణం.

ఇందుకు గొప్పమనసు ఉండాలి. దానికై మానవుడు ప్రయత్నించాలి. శ్రీకృష్ణ దర్శనం చేసుకుంటాడు కుచేలుడు. శ్రీకృష్ణుడి ఆదరాభిమానాలు ఏమీ అడగలేనివాడిగా చేశాయి. తిరుగు ప్రయాణంలో 'ఇదేమిటి, పరమాత్మను ఏదైనా కోరుకోవడం మరిచాను. ఎంతటి జడత్వం ఆవహించింది నన్ను! అయినా ఆయనకు అన్నీ తెలియకుండా ఉంటాయా! ఆ పురుషోత్తముణ్ని చూడగలిగాను. అది చాలు' అంటూ తన నివాస ప్రాంతానికి చేరతాడు. అక్కడ ఇంద్రభవనాన్ని తలదన్నే ఓ సదనాన్ని చూసి 'ఏ పుణ్యాత్ముడిదో కదా ఈ భవనం' అని అనుకుంటాడు. మనం గ్రహించాల్సింది ఒక్కటే. మనకు ఉన్నా లేకున్నా ఇతరుల వైభవాన్ని కీర్తించడం గొప్ప సంస్కారం. ఇతరుల గొప్పదనాన్ని ప్రశంసించడం ఉన్నత సంస్కారంగా గుర్తెరగాలి.

అందుకే పోతన మహాకవి భాగవతంలో అంటాడు- తనకున్నదానితో సంతృప్తి పొందనివాడు సప్తద్వీప ఏలిక అయినా తృప్తిగా జీవించలేడు అని. మానవ జీవితం విలువ కట్టలేనిది. ఈర్ష్యాసూయలతో కుంగదీసుకునేది, ఆయుర్దాయాన్ని తగ్గించుకునేది కాదు.

ప్రశాంత జీవన విధానంకోసం మనకు మనం ఏ విధంగా మారాలో ఆంతరంగిక పరిశీలన అవసరం. మన సుఖం, సంతోషం, అదృష్టం మన చేతుల్లోనూ, చేతల్లోనూ ఉంటాయని గ్రహించుకోవాలి. మనలో లేని ఉన్నత గుణాలు ఇతరుల్లో ద్యోతకమైతే ఆదర్శంగా తీసుకోవాలి.

బుద్ధ భగవానుడు ఏది చెప్పినా వాస్తవిక విషయాల ఆధారంగానే చెప్పాడు. అష్టాంగ మార్గంలో సమ్యక్‌ అవధానాన్ని సూచించాడు. మనలోనూ మనచుట్టూరా ఏది జరిగినా మనం వివేకంగా జాగరూకతగా వ్యవహరించడమే అవధానం. నాలో కోపం వస్తోంది. అసహనం పెరుగుతోంది. కోర్కెల బలం పెరుగుతోంది. మనసు తామస ప్రవృత్తికి లోనవుతోంది. నా ప్రవర్తన ఇలా ఎందుకుంది, ఎలా ఉండాలి, అనాలోచిత విధానాలతో గుడ్డిగా ప్రవర్తిస్తున్నానా అన్న స్వీయ అధ్యయనం అవసరం. మనోశోధన అనివార్యం. ఈ శోధన మనోసాగరాన్ని గంభీరంగా, నిశ్చలంగా ఉంచగలుగుతుంది. ఆ స్థితి మాత్రమే ప్రశాంత వాతావరణాన్ని సృష్టిస్తుంది.                                                                                                                                                         
                                                               
- దానం శివప్రసాదరావు 

No comments:

Post a Comment