ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Thursday 27 June 2013

విద్యాధనం

   తెలియనివారికి తెలియజేసేది విద్య. అది అనంతరూపాల్లో లోకంలో కనబడుతుంది. విద్యగలవాడు అన్నీ చక్కగా తెలుసుకోగలడు. విద్యలేనివాడు తెలుసుకోలేడు. అంటే విద్య లేనివాడు కళ్లు ఉన్నప్పటికీ గుడ్డివాడే. తెలుసుకోవడం అనేది రెండు విధాలు. ఒకటి పైచూపులతో చూడటం. రెండోది లోతుల్లోకి వెళ్లి అంతరంగాన్ని తెలుసుకోవడం. ఈ రెండు మార్గాల్లో రెండోదాన్నే 'విద్య' అని అంటారు. ఈ విద్య పైకి కనిపించని ధనం వంటిదని ప్రాచీనులు చెబుతారు. ధనం లేకున్నా విద్య ఉంటే చాలు. దానివల్ల ధనాన్ని సంపాదించుకోవచ్చు. విద్య లేకపోతే ఎంత ధనం ఉన్నా- జీవితానికి అర్థం, పరమార్థం ఉండవు.

విద్య అంటే సరస్వతి. చదువుల తల్లి. ఆమెను ఒక కవి ఇలా సంభావించాడు- 'తల్లీ, సరస్వతీ! నీ దగ్గర అపూర్వమైన ధనాగారం ఉంది. అది విద్యలతో నిండి ఉంది. ఆ ధనాగారంలో నుంచి ఎన్ని విద్యలను తోడుకున్నా, ఇంకా అవి వృద్ధి చెందుతూనే ఉన్నాయి. వాటిని ఖర్చు చేయకుంటే నశించిపోతున్నాయి. ఇలాంటి ధనాన్ని నేనెక్కడా చూడలేదు!'. అంటే, ఖర్చు చేస్తున్నకొద్దీ అభివృద్ధి చెందుతూ ఉండే విద్యాధనం గొప్పతనం ఏమిటో అర్థమవుతుంది.

సంపదలు లోకంలో అసంఖ్యాకంగా ఉన్నాయి. వాటిని లెక్కించడం అసంభవం. గడ్డిపోచను మొదలుకొని పర్వతాలదాకా నెలకొని ఉన్న వస్తువుల్లో దేని విలువ దానిదే. ప్రవాహంలో పడి కొట్టుకొనిపోతున్నప్పుడు మనిషిని గడ్డిపోచలు కాపాడవచ్చు. అవి అమూల్యమైనవే కదా! కానీ, విద్య అనే ధనం మాత్రం సర్వకాలాల్లో సకల ప్రదేశాల్లో ఎంతో విలువైంది. అది ధరించినవారికి ఆభరణంలా భాసిస్తుంది. ఆ ఆభరణానికి విలువ కట్టలేం. ఇతర సంపదలు ఎప్పటికో ఒకప్పటికి తరిగిపోతాయి లేదా నశించిపోతాయి. కానీ, విద్యాధనం మాత్రం అక్షయంగా నిలిచి ఉంటుంది. దానికి ఎన్నటికీ నాశనం లేదు.

విద్యలు ప్రధానంగా రెండు విధాలు. ఒకటి శస్త్రవిద్య. రెండోది శాస్త్రవిద్య. శస్త్రాలు (ఆయుధాలు), శాస్త్రాలు (తత్వజ్ఞాన సాధనాలు) మనిషికి ఎంతో అవసరమైనవే. ఒకటి రక్షణకు, మరొకటి ఆత్మోన్నతికి మూలం. ఈ రెండింటిలోనూ శాస్త్రవిద్యలే గొప్పవి. ఎందుకంటే శస్త్రవిద్యలు యౌవనంలో ఉన్నంత కాలమే ఉపకరిస్తాయి. వృద్ధాప్యంలో పనికిరావు. శాస్త్రవిద్యలు అలా కాదు. పండుముసలితనంలోనూ వాటిని ఉపయోగించే వీలు ఉంటుంది. కనుక జీవితాంతం ఉపయోగపడే శాస్త్రవిద్యలు మనిషికి సంపదలే! అందుకే సుభాషితకారులు- 'ఎన్నో సంశయాలను దూరం చేసేవీ, పరోక్ష ప్రయోజనాలను అందించగలిగేవీ, అన్నింటినీ చూడగలిగే కన్నులవంటివీ అయిన శాస్త్రాలను మనిషి ఎన్నడూ వదిలిపెట్టరాదు. శాస్త్రాలను తెలుసుకోలేని మానవుడు కళ్లుండి కూడా చూడలేనివాడే అవుతాడు' అని ప్రబోధించారు.

ఎన్ని సంపదలను అపారంగా కూడబెట్టినా మనిషికి మానసిక శాంతి ఉండదు. ఎప్పుడు ఏ దొంగ వచ్చి దోచుకొనిపోతాడో అని బిక్కుబిక్కుమంటూ కాలం గడపాలి. ధనం ఎక్కువగా ఉంటే ప్రభువుల కళ్లు దానిపై పడతాయి. ఆ ధనాన్ని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తారు. అన్నదమ్ములూ డబ్బుకోసం పోట్లాడతారు. తమకు వాటా ఇమ్మంటారు. ఇవ్వకుంటే చంపడానికైనా సిద్ధపడతారు. అంతేకాదు, అపారంగా ఉన్న డబ్బును ఎక్కడ దాచాలో తెలియదు. ఎవరికంటా పడకుండా ఎక్కువకాలం దాచడం కష్టమే. అందువల్ల ధనం భారమే అవుతుంది. విద్యాధనం మాత్రం అలాకాదు. ఏ దొంగలూ విద్యను దోచుకోలేరు. ప్రభువులూ గుంజుకోలేరు. అన్నదమ్ములూ పంచుకోలేరు. ఎంత విద్య ఉన్నా ఏ భారమూ లేదు. అందుకే ప్రపంచంలోని అన్ని సంపదల్లో 'విద్య' అనే సంపదకు ఉండే విలువ ఇంతా అంతా కాదు.

విద్యావంతుణ్ని విద్య తల్లిలా సదా రక్షిస్తుంది. కట్టుబట్టలతో విదేశాలకు వెళ్లినా, విద్యావంతుడు పుష్కలంగా డబ్బు సంపాదించుకోగలడు. విద్యావంతుణ్ని విద్య తండ్రిలా ముందుకు నడిపిస్తుంది. ఏది హితమో అదే చెబుతుంది. వేదనలు, కష్టాలు ముంచుకొని వచ్చినప్పుడు వాటిని విద్య దూరం చేస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే- విద్యకూ, కల్పవృక్షానికీ ఏ భేదమూ లేదు. విద్యగలవాడు కల్పవృక్షం నీడలో ఉన్న దేవుడివంటివాడే. ఇందులో ఎంతమాత్రం సందేహంలేదు.
ఎన్ని కష్టాలు అనుభవించినా సరే, ఎంత ధనాన్ని వెచ్చించినా సరే, ఎన్ని త్యాగాలు చేసినా సరే- విద్యావంతుడు కావడానికే మనిషి ఆజీవనాంతం ప్రయత్నించాలి. విద్య ఒక్కటే మనిషి బతుకుకు వెలుగు!
                                                               - డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ

No comments:

Post a Comment