ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Friday, 24 May 2013

నారు పోసినవాడు...


        'నారు పోసినవాడు నీరుపోయడా' అనే మాట చాలా బావుంటుంది. మనిషికి బతికేందుకు ధైర్యాన్నిస్తుంది. భవిష్యత్తుపై భరోసా ఇస్తుంది. నిజమే. కానీ ఆ మాటను మనం రెండు విధాల తీసుకోవచ్చు. నిరాశకు తావు లేకుండా చేసేందుకు, నిస్పృహకు లోను కాకుండా ఉండేందుకు. ఇది బావుంది. ఆ 'మాట' ఆసరాతో బతికేయొచ్చు. భగవంతుడు అవసరమైనప్పుడు జీవన శకటం ఆగిపోకుండా ఎప్పటికప్పుడు ఇంధనాన్ని వేస్తూపోతాడట. అయితే ముందు మనం బండి నడిపే ప్రయత్నం చేద్దాం. ఆగిపోయే పరిస్థితిలో ఆయనే ఆదుకుంటాడనే భరోసా. నిజంగా ఇది బావుంది. మరో ఆలోచన... జీవితం మనదే. కానీ జీవనం పట్ల మనకేమీ బాధ్యత లేదు. పుట్టించిన అతగాడెవరో ఆయనే ఆదుకుంటాడట. ఔను. ఇది పక్కా పరాన్నభుక్కు తత్వం, నీచత్వం, ఆత్మహత్యాసదృశం. వేలు చూపిస్తే దాని ఆసరాతో ముందుకు నడవాలిగానీ దాన్నే కొరుక్కు తినకూడదు.    

దేవుడు మనను సృష్టించి అన్ని హంగుల్నీ సమకూర్చింది స్వయంప్రతిపత్తితో జీవించమని. ఆ తృప్తితో, ఆత్మవిశ్వాసంతో, స్వాభిమానంతో బతకమని. ఇచ్చిన శరీరావయవాలను, మెదడును, మనసును, జ్ఞానాన్ని ఉపయోగించి వాటిని సద్వినియోగం చేసుకొమ్మని. పసితనంలో ప్రతిదానికీ అమ్మ మీద ఆధారపడిన బిడ్డ పెద్దయ్యాక కూడా అన్ని పనులకూ ఆమె మీద ఆధారపడితే అది అవిటితనం అవుతుంది. మనిషికి సొంత ప్రయత్నం ఉండాలి. స్వయంప్రతిపత్తి కావాలి. స్వయంఉపాధి సమకూర్చుకోవాలి. ఎప్పుడూ ఎవరి మీదా ఆధారపడకూడదు... అనారోగ్యంలోనో, అవిటితనంలోనో తప్ప. మనను పోషించటం, అస్తమానం నీరు పోయటం దేవుడి పని కాదు. మనమైనా ఒక మొక్క నాటుతాం. నీరు పోస్తాం. కొంతకాలం పోషిస్తాం. కొన్నినాళ్లు రక్షిస్తాం. అంతే. ఆ తరవాత దాని జీవిక అదే చూసుకుంటుంది. దాని రక్షణ అదే చేసుకుంటుంది. ఉన్నచోటనే దాని ఉనికిని భద్రం చేసుకుంటుంది. పైపెచ్చు మనకే ఉపకారం చేస్తుంది. వూరికే ఉపకారం చేస్తుంది. మనిషి మాత్రం పరాన్నభుక్కుగా మారిపోతున్నాడు... పక్షవాతపు రోగిలా, పనికిమాలిన జోగిలా.

ప్రభుత్వాలు కూడా ఓట్లకోసం అనుచితమైన ఉచితాలు మప్పి ప్రజల్ని తమ మీద ఆధారపడేలా మారుస్తున్నాయిగానీ స్వయంపోషకత్వాన్ని పంచడంలేదు. పెంచడం లేదు. కష్టపడటంలో, కష్టాలను ఎదుర్కోవడంలోనే మనిషి శక్తి పెరుగుతుంది. మనోస్త్థెర్యం రగులుతుంది. సమస్యల్ని అధిగమించే దారులకై అన్వేషణ మొదలవుతుంది. దీనర్థం, కేవలం మనిషి కష్టపడటమే ఉత్తమమని కాదు. సుఖమనీ కాదు. సుఖాన్వేషణ మనిషి బాధ్యతే అని. అవకాశాలివ్వడం వరకే భగవంతుడిదైనా, మన పెద్దలదైనా, ప్రభుత్వాలదైనా బాధ్యత అని. నీరు పోయడమంటే అదే. అంతే.

మనకు పది వేళ్లున్నది రెండు చేతులతో బొక్కమని కాదు, మెక్కమని కాదు, పని చేసుకొమ్మని. పదిమందికి సహాయపడమని. అప్పుడు మనమే దేవుడైపోతాం. ఎవరో రచయిత అన్నట్లు సహాయమే దేవుడు. దేవుడంటే సహాయం. దేవుడు సర్వజ్ఞుడు. మనిషి అన్నం కంటే సోమరితనాన్నే ఎక్కువ అభిలషిస్తాడని ఆయనకు తెలుసు. అందుకే తిన్న అన్నానికి సరిపడా శ్రమ చేయకపోతే అది జీర్ణమయ్యే ప్రసక్తే లేకుండా విధించాడు. అన్నమే కాదు, మనం ఏం పొందినా దానికి తగిన శ్రమనో, ప్రేమనో, త్యాగాన్నో, దానాన్నో మనం పెట్టుబడిగానో, ప్రతిఫలంగానో అందించవలసి ఉంది. ఇది తిరుగులేని వ్యవస్థ. మనిషి అస్తవ్యస్త అవ్యవస్థను అవస్థలు సరిచూసే, సరిచేసే సువ్యవస్థ. నిజమే... నారు పోసినవాడు నీరు పోస్తాడు. కానీ, వ్యవసాయం మనం చేయవలసి ఉంది. అప్పుడే ఫలసాయాన్ని పొందే అధికారం ఉంటుంది.
- చక్కిలం విజయలక్ష్మి 

No comments:

Post a Comment