ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Sunday 9 June 2013

ఆధ్యాత్మికత


అన్ని శాస్త్రాల్లాగే ఆధ్యాత్మికత అనేది ఒక శాస్త్రం అనే పొరపాటులో మనం ఉన్నాం. కాని అది శాస్త్రం కాదు. ఒక జీవన విధానం. అత్యున్నతమైన నాణ్యమైన జీవితాన్ని అందించే ఒక మార్గం. ఇది తెలియనంతవరకు మనకు ఆధ్యాత్మికత అందరికి చెప్పుకొనే ఒక గొప్ప అలవాటుగా మాత్రమే మిగిలిపోతుంది.

అయితే ఆధ్యాత్మికత ఎందుకు, అలా ఎందుకు జీవించాలి? మన ఇష్టం వచ్చినట్లు మనం జీవించవచ్చు కదా. క్రమశిక్షణ పెట్టుకుని, నియమాలు అనుసరిస్తూ పూర్వ రుషి సంప్రదాయ మార్గాల్లో ఎందుకు వెళ్లాలి? మంచిని కోరుకునేవాళ్లు, హాయిగా ఉండాలనుకునేవాళ్లు, ఉన్నతంగా తమను తాము తీర్చిదిద్దుకోవాలనుకునేవాళ్లు గొప్ప మార్గాలనే ఎన్నుకుంటారు. అందులో సందేహం లేదు. దీన్నే ఆధ్యాత్మికత నూటికి నూరుపాళ్లు నేర్పుతుంది. వ్యక్తిత్వ వికాస కేంద్రాల్లో దొరకనిదాన్నీ ఆధ్యాత్మికత నేర్పుతుందా? వ్యక్తి అన్ని కోణాల్లోంచీ ఎదగాలంటే ఆత్మ వెలుగు అతడి మీద ప్రసరించాలి. అది ఆధ్యాత్మికతతోనే సాధ్యమవుతుంది. ఒక ఆరోగ్యమైన శరీరాన్ని కావాలని కోరుకున్నప్పుడు అది మంచి బుద్ధితోనే సాధ్యమవుతుంది. మంచి బుద్ధిని స్థిరపరచుకోవాలంటే మంచి శరీర ఆరోగ్యమూ ముఖ్యమే.

ఏదో ఒక విధంగా జీవిస్తుంటారు కొందరు. ఇలాగే జీవించాలనుకుంటారు ఇంకొందరు. జీవించడానికి ప్రమాణాలు ఏమిటని ఎదురు తిరుగుతుంటారు మరికొందరు. జీవన పరమార్థం సాధించడానికి ఒకే ఒక మార్గం ఉంది. అది ఆధ్యాత్మికతతోనే సాధ్యపడుతుంది.

జీవనకళ తెలిసినవాళ్లు హృదయపూర్వకంగా ఆధ్యాత్మికతను ఆహ్వానిస్తారు. ఇది మూఢత్వమూ కాదు, అవివేకమూ కాదు, అశాస్త్రీయం అంతకంటే కాదు. వ్రతానికి సంబంధం లేకుండా మనిషి తనను తాను ఆత్మమార్గంలో నడిపించుకోవటమే ఆధ్యాత్మికత. తానెవరో తెలుసుకోకుండా జీవించేకంటే తానెవరో గ్రహించడం మంచిది కదా. తనకు ఈ విశ్వానికి ఉండే సంబంధం తెలుసుకోవడం అవసరం కదా. సుఖదుఃఖాలకు చలించిపోయే మనసును, స్థిరపరచుకొనే జ్ఞానసంపాదనను ఎవరు వద్దంటారు?

ప్రపంచాన్ని శాస్త్రీయంగా పురోగమించే దిశలోకి తీసుకెళ్లిన చాలామంది శాస్త్రవేత్తలు, ఆలోచనాపరులు ఆధ్యాత్మికత పరిమళాలను ఆఘ్రాణించకుండా ఉండగలిగారా? లోతుకు వెళ్లి అధ్యయనం చేసే ప్రతీ విజ్ఞాని తన లోతు కొంతైనా చూసి తీరతాడు. సందేహం లేదు. రుజువయ్యే వరకు నమ్మకంతోనే నడవాలి. రుజువయ్యాక నమ్మకం అక్కరలేదు. ఆధ్యాత్మికతలో ప్రతి విషయం మన దేహం అనే ప్రయోగశాలలో అనుభవపూర్వకంగా నిరూపణ చేసుకోవచ్చు. ఆధ్యాత్మికతలో ధ్యానం ఒక భాగం. అదేమిటి, ఎలా ఉంటుంది అంటే తెలియదు. ఒక యుక్తితో ధ్యానించడం మొదలుపెడితే అనుభవం కలుగుతుంది. ఆధ్యాత్మికతలో ప్రార్థన ఒక భాగం. ఎవరు వింటారు నా ప్రార్థనలు అని వూరుకుంటే సరిపోదు. ఒకసారి గాఢంగా ప్రార్థించి చూస్తే అప్పుడు జరిగే సంఘటనలు మనం మరిచిపోలేనివి కావచ్చు.

గొప్ప ఆధ్యాత్మికవాదుల అనుభవాలను తెలుసుకోవాలి. వారి జీవితాలను అధ్యయనం చెయ్యాలి. అప్పుడు నమ్మకం దానంతట అదే ఏర్పడుతుంది. దాహమే మంచినీటిని చూపించినట్లు సత్యం దర్శనమిస్తుంది. జీవన పరమార్థం బోధపడుతుంది. అదే ఆధ్యాత్మికత చేసే ఘనకార్యం. జీవితంలో సాధన చేస్తారు కొంతమంది. కాని, జీవితమే సాధన కావాలి. ఆధ్యాత్మికత పూర్ణంగా వికసించే అద్భుతాలు జీవించడంలోనే ఉన్నాయి. కొండల్లో కోనల్లో ముక్కుమూసుకుని తపస్సు చేసుకునే ఏ యోగులైనా సంసారంలో ఉండి తరించిన భక్త మహాశయులను తక్కువగా చూడలేదు. ఎందుకంటే కోట బయట యుద్ధం కంటే కోట లోపల యుద్ధం కష్టం కదా.

ఏ శాస్త్రమైనా దానికి ముడిసరకుగా ఏదో ఒక అంశం ఉంటుంది. ఆధ్మాత్మికతకు మూల వస్తువు మనిషే. మనిషి లేకుండా ఆధ్యాత్మికత లేదు. ఆధ్యాత్మికత లేకుండా మనిషి లేడు. అనుభవించి నిరూపించుకునేది ఆధ్యాత్మికత అనడానికి పతంజలి యోగసూత్రాలు, నారదభక్తి సూత్రాలు, బ్రహ్మసూత్రాలు చక్కటి ఉదాహరణలు.
                                                         - ఆనందసాయి స్వామి

No comments:

Post a Comment