ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Friday 7 June 2013

దుఃఖ విముక్తి


తప్పులు చేయడంవల్లనే తమకు కష్టాలు వచ్చాయని, అవన్నీ భగవంతుడు వేసే శిక్షలనీ మనలో చాలామంది దురభిప్రాయపడుతుంటారు. తప్పు చేయనివాడంటూ ఎవరూ ఉండరు. మరి అందరికీ కష్టాలు రావాలి కదా? ఇది తప్పు అని తెలిసి చేయడంలేదు. తెలియక చేయడంలేదు. దేనికైనా ఫలితాలు ఉంటాయి. అవి భగవత్‌కల్పితాలు కావు. అవి స్వీయ భ్రమాజనితాలు.

ఒక వ్యక్తి తాను చేసిన తప్పుల గురించి మితిమీరి ఆలోచించడం వల్ల ప్రయోజనం లేదు. మనసును తప్పులపైన కాకుండా వెలుగు, శాంతి, నిర్మలత్వంపైన కేంద్రీకరించాలి. అప్పుడు మనకు ఆందోళనల నుంచి కొంత విముక్తి లభిస్తుంది. మరికొంత శాంతి లభిస్తుంది. తప్పులు, పాపాలు, పొరపాట్లు కుప్పలుతెప్పలుగా ఉన్న గతం గురించి ఆలోచించడం శుద్ధ తప్పు. వాటిని విడిచిపెట్టి మనల్ని మనం భగవత్‌సంకల్పానికే సమర్పించుకుంటే మంచిది. అది సరైన వైఖరి. నిజమైన ఆత్మ సమర్పణ భావం లేకపోవడంవల్ల గతంలో తప్పులు జరిగి ఉండవచ్చు. నిజంగా చిత్తశుద్ధితో ఆత్మ సమర్పణ చేసుకుంటే తప్పులను నిర్మూలించుకోవచ్చు. అదొక్కటే మార్గం.

తప్పులు చేయడంవల్ల తనకేదో జరగరానిది జరగబోతోందని ఆందోళన చెందితే పరిస్థితి మెరుగుపడదు. ఆత్మవిశ్వాసమే ఘనమైన బలసంపద. తప్పుల్ని గుర్తించడం మేలు. ఆత్మను హింసించుకోవడం తగ్గుతుంది. తప్పు దిద్దుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. 'నేను తప్పులు చేస్తున్నాను' అని తెలుసుకోవడం ఉత్తమం. మన స్వభావంలోని లోపాలు గుర్తించాలి. ఎప్పుడైతే తప్పులపట్ల స్పృహ ఏర్పడుతుందో, అప్పుడు వాటినుంచి బయటపడటం తేలిక. మన స్వభావాన్ని మార్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి.
తప్పు చేసినట్లు గ్రహించాక, ఎప్పటికప్పుడు క్షమాపణ చెప్పుకోవడం కాదు. చేసిన తప్పులను తిరిగి ఎప్పటికీ చేయకూడదని నిర్ణయించుకోవాలి.
జీవితంలో అల్ప సంఘటనలకు ప్రాముఖ్యం ఇవ్వకూడదు. అవి మన పురోగతికి ఎంతవరకు సహకరించాయని ఆలోచించుకోవాలి. పురోగతి సాధించిన పిమ్మట భగవంతుడి కటాక్షంవల్ల గత కాలపు తప్పుల ఫలితాలు అన్నీ తుడిచిపెట్టుకుపోతాయి.

భగవంతుడి సాన్నిధ్యంలో, భగవంతుడి దృష్టిలో పాపం అనేది లేదు. చిత్తశుద్ధితో కూడిన ఆకాంక్షతో అన్ని లోపాలూ అంతర్హితం అవుతాయి. సహనంతో ఉంటే తప్పక విజయం లభిస్తుంది. పాపం అనేది ప్రపంచానికి సంబంధించినది. అది యోగ సాధనకు సంబంధించినది కాదు. వేదన, దుఃఖం ఇవి సాధనలో భాగాలు కావు. వాటిని వదిలివేస్తే అవి విడిచిపెట్టి వెళ్లిపోతాయి. పురోగతికి అవి ఎంతమాత్రం ముఖ్యం కాదు. సుస్థిరమైన, సంతోషప్రదమైన సమస్థితివల్లనే మహనీయ పురోగతిని సాధించవచ్చు.

సాధనా మార్గంలో జరిగే తప్పిదాలు ఒక్కొక్కసారి మనకు మంచి పాఠాలు ప్రబోధిస్తాయి. ఆ మార్గంనుంచి తప్పుకొని చేసే తప్పిదాలు మరింత ప్రమాదకరమైనవి. మనం తప్పటడుగు వేశామంటే, మరింత పరిపూర్ణమైన ప్రస్థాన రహస్యం తెలుసుకోవడానికే!

మనలోని లోపాల గురించి ఎల్లవేళలా ఆలోచించడంకన్నా, భవిష్యత్తులో మనం సాధించే లక్ష్యం వైపే విశ్వాసంతో అడుగు వేయడం క్షేమకరం. శుభకరం.
                                                                       - కె.యజ్ఞన్న

No comments:

Post a Comment