ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Tuesday, 16 July 2013

రక్షణ కవచం


  'ఓ గంగా మాతా!
నాకు సంపదలూ అధికారాలూ వద్దు! వచ్చే జన్మలో ఒక పక్షిగా పుట్టి, గంగాతీరంలో చెట్టుపై గూడుకట్టుకొని, నీ పవిత్ర శీకరాలతో సేదతీరే వరం ఇవ్వు!' అని వాల్మీకి మహర్షి ప్రార్థించాడు.

గంగానదితో భారతీయ సంస్కృతి పెనవేసుకొని ఉంది. గంగా యమునలు పుట్టిన ప్రాంతాలు ప్రకృతి సౌందర్యానికి నిలయాలు. పవిత్ర భారతావనికి ఉత్తరాన పెట్టని గోడ హిమాలయం. ప్రతి భారతీయుడు దర్శించాలని కలలుగనే పుణ్యక్షేత్రాలకు, తీర్థాలకు నిలయాలు. సదాశివుడి సంచార భూములు. యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్‌, బదరీనాథ్‌- ఈ చతుర్థామాల యాత్ర పరమ పవిత్రం. కాళిందీ పర్వతం వద్ద యమున ఉద్భవిస్తుంది. అక్కడి భాస్వర ఉదకంలో బియ్యం, బంగాళదుంపలు ఉడుకుతాయి. అవే భక్తులకు ప్రసాదం. నలుపు చలువరాతి యుమునాదేవి ప్రతిమను ఆరాధిస్తారు. గంగోత్రిలో గోర్ఖా అమర్‌సింగ్‌ థాపా గంగోదేవి ఆలయాన్ని నిర్మించాడు. గంగ భువికి అవతరించిన భగీరథ శిలను దర్శించి భక్తులు తన్మయులవుతారు. టిబెట్టు నుంచి మానస సరోవర జలాలు గంగోత్రిలో కలుస్తాయి. మందాకినీ శిరోభాగాన కేదారనాథం నెలకొని ఉంది. పాండవులు భారతయుద్ధానంతరం దీన్ని నిర్మించారంటారు. తొమ్మిదో శతాబ్దిలో ఆదిశంకరులు నందీశ్వర విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. నర, నారాయణ పర్వతాల మధ్య, బదరీ వృక్షాల నడుమ వెలసింది బదరీనాథం. పక్కనే అలకనంద. గంగ-అలకనంద, మందాకిని, భాగీరథిగా చీలడంవల్ల ప్రవాహవేగం అదుపులో ఉంటుంది. ఆదిశంకరులు ఈ విష్ణు దేవాలయాన్ని దర్శించి పరవశించారు. తప్తకుండంలో వేడి వూట నీటిలో రోగనివారణ శక్తి ఉన్నదని విశ్వసిస్తారు.

అల్లసాని పెద్దన మహాకవి మనుచరిత్ర ప్రబంధంలో పరవశంతో ఈ పరమ పవిత్ర క్షేత్రాలను స్మరించాడు. సిద్ధుడి పసరు మహిమతో ప్రవరుడు హిమాలయాలకు వెళ్లి చూసింది ఇక్కడి అద్భుతాలనే! ఇక ఇంటికి పోదామని ప్రయత్నిస్తే పాదలేపనం కరిగిపోవడం వల్ల ఎగరలేకపోయాడు. దారి తెలియని ప్రవరుడు విలపిస్తాడు. మిన్ను మన్నుపై పడ్డ చోటికి తెచ్చి పడవేశావెందుకు దేవుడా- అని మొత్తుకుంటాడు.

యాత్రలకు వెళ్లి చిక్కుల్లో చిక్కుకొనేవారి అనుభూతి ఇలాగే ఉంటుంది. మహిమాన్వితమైన హిమాలయాల్లో వేలకొలది ప్రజలు జలవిలయంలో విగతజీవులు కావడమా! మోక్షానికి పోతే మొసలెత్తుకొని పోవడమా! భక్తులపైనా ప్రకృతి ప్రళయ తాండవం? చతుర్థామాల దర్శనంతో అగణ్యపుణ్యం పొందుతామని వెళ్ళినవాళ్లు ప్రవాహం పాలు కావడమేమిటి? పరమేశ్వరుడి ఉనికినే ప్రశ్నించే దుస్థితి! ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు ఇలాంటి ప్రశ్నలు తలెత్తడం సహజం. ఆత్మవిమర్శ చేసుకుంటే సమాధానం స్ఫురిస్తుంది.

ఆధ్యాత్మిక కేంద్రాలను ప్రభుత్వాలు రాబడి కేంద్రాలుగా భావిస్తున్నాయి. సహజ ప్రకృతిని పరిరక్షించుకోవడంలో విఫలమవుతున్నాయి. కైలాస నాథుడి ఏకాంత ధ్యానానికి భగ్నం కలుగుతోంది. ప్రకృతి ఆరాధనే వేద ధర్మమని విస్మరించారు. ఆధ్యాత్మిక కేంద్రాలను విలాస జీవుల విహార భూములుగా తీర్చిదిద్దే ప్రయత్నం జరిగింది. సహజ నదీప్రవాహాలకు అడ్డుకట్టలు నిర్మించారు. కొండలను బద్దలుచేసి భవనాలు నిర్మించారు. అరణ్యాలను హరించారు. భాగీరథి చూస్తున్నది ఈ పాపాలు. ఫలితమే ఈ కోపాలు! మానవ హననానికి కారణం పరమేశ్వరుడా, మన జనమా? ప్రపంచంలో ఎన్నో నాగరికతలు పెరిగీ పెరిగీ, సహజ ప్రకృతిని వికృతిగా మార్చి, చివరకు జలప్రళయంలో రూపురేకలు లేకుండా మాసిపోయాయి. పాశ్చాత్య సంస్కృతిలో అట్లాంటిస్‌ అలాంటిదే! ప్లేటో రాతల వల్ల దాని కథ తెలుస్తోంది. ఇప్పుడు అట్లాంటిక్‌ సముద్రం ఉన్నచోట అది పరిఢవిల్లింది. అపూర్వ సంపదకు, విజ్ఞానానికి అక్కడి నాగరికత నిలయం. మేధా సంపద, వైజ్ఞానిక వైభవంతో తులతూగీ తుదకు తన బరువుకు తానే ఆ సంస్కృతి అంతా... సముద్రంలో కలిసిపోయింది.

ఇప్పుడూ ఆధునిక సంస్కృతి అంతా జలప్రళయంలో లయం అయ్యే కాలం సమీపించిందని కొందరు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదం నుంచి మానవాళిని గట్టుకు చేర్చే మార్గం ఒక్కటే! ప్రకృతిని పనిముట్టుగా గాక పరమపవిత్ర దైవంగా భావించి ఆరాధించాలి.


ఇంత జలవిలయంలోనూ కేదారీశ్వరుడికీ, ఎదురుగా ఉన్న నందీశ్వరుడికీ ఏ హానీ కలగకుండా జలప్రవాహానికి కొట్టుకువచ్చిన బండరాళ్లు రక్షణ కవచంలా నిలిచాయి! పరమేశ్వరుడు మనకు రక్షణ కవచంగా ప్రకృతిని నిర్మించాడు. మనమే మన రక్షణ కవచాన్ని చీల్చి పారవేస్తే ఇక మనకు దిక్కేది? కంచే చేను మేస్తే కాపేమి చేస్తాడు?
                                                       - డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు 

Monday, 15 July 2013

పుష్ప సందేశం

  ప్రకృతి ప్రసాదించిన పుష్పాలు అనేకం. రకరకాల రంగులతో కనులకు ఆనందాన్నిచ్చే పూలు జీవితాన్ని పరిమళింపజేస్తాయి. పండుగ రోజుల్లోనే కాకుండా అన్ని ముఖ్య కార్యక్రమాల్లోనూ అన్ని మతాల వారూ వీటిని ఉపయోగిస్తారు. పూలు ఆనందాన్నివ్వడంతోపాటు శుభాశుభాలన్నింటికీ పూర్ణత్వాన్నిస్తాయి. దేవతార్చనల్లో పుష్పాలు అతి ముఖ్యమైనవి.

పుష్పమూలంలో బ్రహ్మ, పుష్పమధ్యంలో కేశవమూర్తి, పుష్పాగ్రంలో మహాదేవుడు, దళంలో సర్వదేవతలూ నివసించి ఉంటారని పురాణాలు చెబుతున్నాయి.

పుష్పాలన్నింటిలో ఉత్తమ గుణాలు కలిగి, సహస్ర పత్రాలు కలిగిన కమలం ఎంతో విశిష్టమైనది. లక్ష్మీదేవి ఉద్భవించింది కమలం నుంచే కనుక అది సర్వశుభాలకూ నిలయమైందంటారు.

చదువుల తల్లి సరస్వతిదేవి పూజలో తమస్సును దూరం చేసి, సాత్విక ప్రకాశాన్నిచ్చే తెల్లతామర, మల్లెపూలు ప్రధానమైనవి. తెల్లని పట్టుచీరను ధరించి, మల్లెమాలను దాల్చి, వీణ చేతపట్టి తెల్లతామర పూవులో ఆసీనురాలైన సరస్వతీదేవిని మల్లె, తెల్ల తామరలతో పూజించాలని 'శారదా తిలకమ్‌' చెబుతోంది.

సన్నజాజులు దైవ పూజకు శ్రేష్ఠమైనవని పుష్ప చింతామణి గ్రంథం వివరిస్తోంది. ఈ పుష్పాలతో పగటిపూటైనా, రాత్రిపూటైనా శివకేశవులను, ఇతర దేవతలనూ నిరభ్యంతరంగా పూజించవచ్చునని చెబుతారు.

పుష్పాలు రూపంలో కల్మషం లేనివేగాక సువాసన భరితమైనవి. కొన్ని కొన్ని పుష్పాల పరిమళాలను మనిషి ఆఘ్రాణించడం వల్ల కొన్ని వ్యాధులకు ఉపశమనం కలుగుతుంది. పుష్పాలు రోగ నివారణ ఔషధంగానూ పనిచేస్తాయని శాస్త్రపరంగా పరిశోధించి నిరూపించారు. పుష్పాలకు శారీరకంగానే కాకుండా మానసిక రోగాలను సైతం నివారించే స్వభావం ఉంది.

పుష్పాలు మనసుకు ఆహ్లాదాన్ని ఇవ్వడంతోపాటు తాత్విక, ఆధ్యాత్మిక విలువలను పొందుపరచుకుని ఉన్నాయి. యోగశాస్త్ర రీత్యా సప్తకమలాల్లో హృదయకమలం ఒకటి. హృదయమనే పుష్పాన్ని నిష్కల్మషంగా భగవంతుడి పాదాల చెంత ఉంచి, మన ఆత్మను ఆయనలో ఐక్యం చేసుకొమ్మని అర్థించాలన్నది పెద్దలమాట.అన్ని పూజల అసలు ఉద్దేశం ఇదే.

ఇక అహింసా పుష్పం, ఇంద్రియ నిగ్రహ పుష్పం, సర్వభూతదయా పుష్పం, క్షమా పుష్పం, శాంతి పుష్పం, తపో పుష్పం, ధ్యాన పుష్పం, సత్యపుష్పం అనే ఎనిమిదింటితో అంతరాత్మలో దైవాన్ని పూజించేవారికి దైవ సాక్షాత్కారం లభిస్తుందని శాస్త్రోక్తి. వేరే మాటల్లో, ఈ ఎనిమిది పుష్పాలతో పూజించడం అంటే ఉత్తమ మానవ లక్షణాలు కలిగి ఉండటం అన్నమాట.

అహింస, శాంతి, దయ, ఇంద్రియ నిగ్రహం, క్షమ, ధ్యాన తపస్సులు కలవాడు సాక్షాత్తు బ్రహ్మవేత్త అనక తప్పదు. ఈ గుణాలు కలిగి జీవనం సాగించేవారు భగవంతుని అష్టవిధ పుష్పాలతో పూజించిన వారవుతారు. అష్టదళ పద్మం ప్రాముఖ్యం ఇదే. జ్ఞాన యోగ నిష్ఠ సాధ్యపడని సామాన్యులు కేవలం ఇటువంటి స్వభావం కలిగి ఉన్నా దైవాన్ని పూజించినట్లే.

సత్ప్రవర్తన, సద్గుణాలు కలిగి, నిర్మలమైన మనసుతో సదా పరమాత్ముని సన్నిధి కోరుకోవాలని మనిషికి పుష్పం సందేశమిస్తోంది.
                                                                                        - భరణి

Sunday, 14 July 2013

సేవే పూజ!

   దుటివారి మీద ఒక్కొక్కస్థాయిలో ఒక్కొక్క రకంగా చొరవ, సాన్నిహిత్యం కనబరుస్తాం. ప్రేమ, సేవ, గౌరవం, ఆదరణ, ఆప్యాయత, అర్పణ... లాంటివి వాటిపేర్లు. వీటిలో ప్రేమ విశ్వవ్యాప్తమైనది. తాను, తనవారు, తనది... అనే పరిధి దాటి, అందరూ అన్నీ అంతా అనే భావన కలిగి ఉండటం గొప్ప లక్షణం. ఆ లక్షణాలను పెంచుకున్నవాడు మానవత్వ పరిధినుంచి దైవత్వపు సీమలోకి పయనించడానికి అర్హుడవుతాడు. అలాంటిదే సేవచేసే తత్వమూ. ప్రతిఫలాపేక్ష లేకుండా, ఎదుటివారికి చేసేదే నిజమైన సేవ. గౌరవం విషయంలోనూ అదే పంథా అవలంబించాలి. వయసు, హోదా, స్థితి లాంటి వేటినీ మనసులోకి రానీయకుండా అందరినీ నిండుమనసుతో గౌరవించాలి. ఆదరణ, అభిమానం లాంటివి సైతం స్థాయికి తగ్గట్టుండాలి. వీటన్నింటి సమాహారమే భక్తి. ప్రతిఫలాపేక్ష లేకుండా ఇన్ని భావనలనీ ఒక్కసారిగా ఒక్కరిమీదనే ప్రదర్శిస్తే వాడికే నిజమైన 'భక్తుడు' అని పేరు. అలాంటి భక్తి కలిగి ఉన్న, పొందిన జీవుడు- సిద్ధుడు, అమృతుడు, తృప్తుడు అవుతాడని నారదుడు తన భక్తి సూత్రాల్లో తెలియజెప్పాడు. అంతే తప్ప భయం, కోరిక, ఆశ, లోభత్వం, క్షణిక తృప్తి తదితరాలతో కొలవడం భక్తి కానేకాదు. కళ్లుమూసుకుని కూర్చుని, ఎదుటివాడు చచ్చిపోతున్నా పట్టనట్టు ఉండటం అంతకన్నా కాదు. అందుకే 'తాను జీవిస్తూ, ఇతరులు జీవించడానికి అవకాశం కల్పించేవాడే నిజమైన భక్తుడు' అంటాడు కృష్ణభగవానుడు భగవద్గీత భక్తియోగంలో. ఇక్కడ 'జీవిస్తూ' అనే పదానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. 'ఎల్లరియందు ఆదరణ కలిగి, అనుబంధం పెంచుకుని, కల్యాణాలు(శుభాలు) కోరుకుని, వారి అఖండమైన ఆనందం చూసి తృప్తి పొందుతున్నవాడే నిజమైన జీవి' అని 'బృహదారణ్యకోపనిషత్తు' చెబుతోంది. తాను అలాంటి భావనలు కలిగి ఉండి, మిగిలినవారు వాటినే కలిగి ఉండేటట్లు చేయగలిగితే అదంతా ఒక భక్త సమాజమే అవుతుంది.

భక్తికి పరాకాష్ఠ పూజ. దాన్ని పొందడానికి అర్హులు అయినవారు అత్యంత ఉత్కృష్టులై ఉండాలి. ఆ అర్హత కలవాడు భగవంతుడే అని చాలామంది భావన. భగవంతుడిగా భావిస్తున్న ఏ మూర్తిలోనూ సర్వశక్తులూ సమాహారమై లేవు. ఒక్కొక్క దేవత ఒక్కొక్క శక్తికి నిలయాలని చెబుతున్నాయి పురాణాలు. అలాంటి శక్తులు కలిగిఉన్నవాడే దేవుడు అని చెప్పడమే ఆయా మూర్తుల ఆంతర్యం. నిజానికి ఆయా శక్తులు కలవారు ఎవరైనా దేవుడే అనిపించుకుంటాడని పురాణాలు, కావ్యాలు ఉపనిషత్తులు చెబుతున్నాయి. దేవుణ్ని ఒక మూర్తిగానో, కోరికలు తీర్చే యంత్రంగానో భావించడం సరైనది కాదు. ఉత్తమోత్తమ, ఉత్తమ, మధ్యమ, అధమ గుణాల స్థాయి, లక్షణాలు కలవాళ్లను వరసగా దేవతలు, యోగులు(మునులు), మానవులు, రాక్షసులు అని పిలుస్తారని ఛాందోగ్యోపనిషత్‌ చెబుతోంది. ఈ వాక్యం ప్రకారం ఉత్తమోత్తమ గుణాల సమాహారమే 'దేవుడు' అని తేలుతోంది. (అన్ని లక్షణాలు కలిగినవారు చాలా అరుదు కాబట్టే 'దేవుడు' అంటే కనబడనివాడు అనే ఒక భావన ఏర్పడి పోయింది). నిజానికి వెదికితే అటువంటి గుణాలు కలిగినవారు (దేవతలు) ఎందరో కనబడతారు.

ప్రేమ స్వరూపుడైనవాడు ఏ వస్తువునీ కాంక్షించడు. దేనికోసమూ శోకించడు. దేని(ఎవరి)నీ ద్వేషించడు, దేనిమీదా ఆసక్తి, అనురాగం చూపించడు. కానీ... వారికి ఎదురుగా కనిపించే అణువంత వస్తువైనా, విశ్వమంత విశాలమైనదిగా కనబడుతుంది. ఎదుటివారిలో ఏ మాత్రం చిన్న మంచి ఉన్నా గొప్పదిగా భావిస్తారు. అందుకే అందరినీ ప్రేమించగలుగుతారు. అలా అందరినీ ప్రేమించేటప్పుడు ద్వేషానికి తావుండదు. కాబట్టి ప్రేమ స్వరూపులు అనిపించుకుంటారు. చెవులకు వినిపించే అతి చిన్న శబ్దం సైతం విశ్వాంతరాళాలు మార్మోగేదిగా భావిస్తారు. అందువల్లనే ఆర్తిగా ఎవరు పిలిచినా స్పందిస్తారు. ఏదో ఒక రూపంలో సాయం అందిస్తారు. ప్రేమస్వరూపుల స్పర్శకు పులకించిపోతారు. ఆ ప్రేమానురాగాల సందడిలో పడిన జిహ్వ ఆకలి దప్పులను, రుచి, అరుచులను సైతం మరిచిపోతుంది.

భక్తులు, భగవంతుడు మధ్య తేడా కనిపెట్టడం చాలా కష్టం. వారిద్దరి మధ్య అతిసున్నితమైన ఎడమే ఉంటుంది. అది మనోగోచరమే తప్ప దృగ్గోచరం కాదు. ఆ ఎరుక కలిగినవారు అన్నింటినీ భగవత్ప్రసాదంగానే భావిస్తారు. ఇదే భక్తికి పరాకాష్ఠ అయిన పూజ. దీనికి పీఠాలు, పూలు, ధూప, దీప నైవేద్యాలు... ప్రత్యేకంగా అక్కరలేదు. భగవత్ప్రసాదితమైన ఈ తనువు, అందులో ఇమిడి ఉన్న మనసు అనే రెండూ... ఎదుటివారి క్షేమాన్ని కాంక్షించి, వారికి ఉపయోగపడేలా చేసే ఏదైనా పూజ అనిపించుకుంటుంది.
                                                              - అయ్యగారి శ్రీనివాసరావు 

Saturday, 13 July 2013

విజయకేతనం


   ఆధ్యాత్మిక రంగంలో ఒక అద్వితీయమైన, అద్భుతమైన అంశం ఉంది. లౌకికమైన ఏ విషయంలోనైనా, ఏ యుద్ధంలోనైనా శ్రమించి, సాధించి, విజయం పొందాక విజయకేతనం ఎగురవేసే అవకాశం ఉంటుంది. అయితే ఆధ్యాత్మిక రంగంలో భగవంతుడి పట్ల ఆశ, ఆర్తి ప్రారంభమైన క్షణమే మనం మన జీవిత రథంమీద విజయకేతనం ఎగురవేయవచ్చు. ఎగిరే విజయకేతనంతోనే, ఆ ఆనందంతోనే, ఆ స్ఫూర్తితోనే ఆత్మవిశ్వాసంతో జీవితాన్ని నడుపుకోవచ్చు. ఎందుకిలా?! కేవలం ఒక ఆలోచన లేదా ఒక భావన... దానితోనే విజయం సాధించినట్లా? ప్రయత్నం, విజయం పట్ల భరోసా, మధ్యలో విరమించే ఆలోచనలు, అవరోధాలు, ఆటంకాలు... వీటి మాటేమిటి? వడ్డించేవాడు మనవాడైతే ఆఖరి పంక్తిలో కూర్చున్నా విస్తరి నిండా మృష్టాన్న భోజనం చేయవచ్చు. భగవంతుడు 'మనవాడు', 'నావాడు' అనుకున్న క్షణమే విజయం తథ్యమైపోయినట్లే. ఎప్పుడైనాసరే ఎన్నుకున్న అంశమే మన విజయాన్ని నిర్ధారిస్తుంది. కావలసిన అవసరాలు, ఆదరువులు, సరంజామా, సామర్థ్యం... ఆయన చూసుకుంటాడు. మనం పంక్తిలో కూర్చుంటే చాలు. ప్రయత్నంలో ఉంటే చాలు.

నిజమే... ఆధ్యాత్మిక ప్రయాణం ఒక యుద్ధమే. యుద్ధానికెప్పుడూ ఓటమి భయం ఉంటుంది. మరణభయం ఉంటుంది. శత్రు సామర్థ్య భయం ఉంటుంది. అయితే మన ప్రయాణం పరమపథానికి, మన శత్రువులు మన మనోప్రాంగణంలోనివారే. ఇక మరణమా? లేనేలేదు... కేవలం అమృతత్వమే. బయటి శత్రువులతో యుద్ధం చేయవలసివస్తే శత్రువుల శక్తియుక్తులు, సైనికసామర్థ్యం వ్యూహ రచనా రహస్యాలు... మనకు పూర్తిగా తెలిసే అవకాశం లేదు. ఆధ్యాత్మిక యుద్ధంలో శత్రువులు మన మనో ప్రాంగణంలోనివారే. మనలోని వారే. ముఖ్యంగా మనం సృష్టించుకున్నవారే. అయినా సరే... ఓడించటం కష్టం. అయినా సరే.. ఓడించే అవకాశం ఉంది. ఓడించి తీరాల్సిన అవసరమూ ఉంది. ఎవరువారు? కామక్రోధ లోభమోహమదమాత్సర్యాలు... అరిషడ్వర్గాలు. మహా బలీయమైనవారు. మనకు అర్థం కావాలిగానీ అంతకంటే బలమైన మనసు మన వశంలో ఉంది. అలాగే... అది అదుపుతప్పే ప్రమాదమూ ఉంది. దానికంటే బలమైన అరిషడ్వర్గ గజాలను అదుపుచేయగల అంకుశం లాంటి బుద్ధీ ఉంది. బుద్ధి ఆసరాతో అరిషడ్వర్గాలను అదుపుచేసి సాధనాపథంలో ప్రయాణం సాగించాలి. మరి ఓటమి సంగతి? ఎన్నెన్నో అననుకూల అవరోధాలను అధిగమించి ఓటమిని జయించే మనిషి, కృష్ణుడే హితుడై, స్నేహితుడై, సారథి అయిన అర్జునుడు... ఓటమి పొందుతాడా? ఆధ్యాత్మిక పోరాటంలో ఓటమే లేదు. విజయకేతనం పట్టుకునే విజయంవైపు నడిచే అవకాశం ఒక ఆధ్యాత్మిక ప్రయాణంలో, పోరాటంలో మాత్రమే ఉంది. ఇక ఈ యుద్ధంలో మరణభయం లేదు. గెలిచేవాడికి మరణమెక్కడిది? గెలుపే అమృతత్వమైనప్పుడు, ఓటమిలేని యుద్ధం ప్రసాదించేది అమృతత్వమే కదా!

ఈ యుద్ధానికి, పోరాటానికి- పెట్టుబడి? ధనం, బలం, కాలపరిమితి... వీటితో అవసరమే లేదు. కావలసిందల్లా పరమాత్మపట్ల ప్రేమ. తీవ్రమైన ఆర్తి. వీటికి కావలసిన చిత్తశుద్ధి. నిర్మలత్వం. పవిత్రత. ఇంకా ఇలాంటివి. ఇవి మనం ఏ పెట్టుబడీ లేకుండా సాధించుకోవచ్చు. ఎప్పుడు? నిజమైన భగవత్‌ ప్రేమ ఉన్నప్పుడు. అంటే- పరమపద ప్రయాణానికైతేనేమి, పోరాటానికైతేనేమి... కావలసింది భగవంతుడి పట్ల పరమ ప్రేమ. మనలోని ఆ ప్రేమే మన విజయకేతనం. ఎగరేద్దాం.
- చక్కిలం విజయలక్ష్మి 

Thursday, 11 July 2013

జీవనగానం


జీవితం జీవించడానికే ఉంది. జీవనకళ తెలుసుకోవాలి. ప్రయత్నిస్తున్నాం. కాని నిజమైన సుఖం, శాంతి దొరకటం లేదు. అవి లేకుండా జీవితం ఉందా? జీవనం గురించి ఆలోచించినప్పుడల్లా మరణం మన ఆలోచనల్లో కదలాడుతుంది. రెండు ధ్రువాల మధ్య కొట్టుమిట్టాడుతున్నాం. ఎందుకిలా జరుగుతోంది?

చక్కగా జీవించడం తెలిస్తే మరణం గురించి భయపడనవసరం లేదు. ఒకవేళ మరణ రహస్యమే తెలిసిపోతే, జీవితం ఒక ఆటగా మారిపోతుంది. ఆడుతూ పాడుతూ జీవనయాత్ర సాగించడమే నిజమైన మానవుల లక్షణం.

మరణానికి భయపడనవసరం లేదు. మంచి చెయ్యలేకపోతున్నందుకు, చెడ్డ చెయ్యాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నందుకు, ఎంత ప్రయత్నించినా మన మనసు మన మాట వినకుండా, తప్పుదారి పట్టిస్తున్నందుకు భయపడాలి.

భగవంతుడికి భయపడనవసరం లేదు. మనల్ని అధోగతిపాలు చేస్తున్న మాయ ఆకర్షణలకు, మోహదృశ్యాలకు భయపడాలి. ప్రేమ స్వరూపుడైన దైవాన్ని నిత్యం ప్రేమపూర్వకంగా ఆరాధిస్తే భయం, మరణం రెండూ తొలగిపోతాయి. శాశ్వత జీవనంలోకి ఆహ్వానం అందుతుంది.

ఒక శిశువులాగా మనం ఉండలేకపోతున్నాం. ఆ దశ వెళ్లిపోయింది. ఆ బంగారు బాల్యం కనుమరుగైపోయింది. పూర్ణ శరణాగతితో ఈశ్వరుడి ముందు మోకరిల్లితే అహంకారం పటాపంచలైపోతుంది. అప్పుడు మళ్ళీ శిశుప్రాయమే. దేవుడి బిడ్డలమే అవుతాం.

అందుకే 'ఈ విశ్వానికి తండ్రిని నేను' అన్నాడు శ్రీకృష్ణుడు. జీవించడానికి మన శక్తియుక్తులు సరిపోకపోతే తండ్రి సహాయం కోరటంలో తప్పేముంది? లోకరక్షకుడిగా వ్యవహరిస్తున్న దేవుడు 'నేను నీకోసం ఉన్నాను' అంటే అర్థం చేసుకున్నవాళ్లు ఎంతమంది? ఆయనను తెలుసుకుని జీవితాన్ని బాగుచేసుకుని, అదృష్టాన్ని పండించుకున్నవాళ్లు ఎంతమంది?

జీవించడం మనకు ముఖ్యం. సహాయం చేస్తున్నవాడిని గుర్తుపెట్టుకోవడం ముఖ్యం. ఎంతోమంది రామ సహాయం అందుకున్నారు. చరితార్థులు అయ్యారు. శ్రీకృష్ణ ప్రేమను ఎంతోమంది పొందారు. ధన్యులయ్యారు.

అడిగితే ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు భగవంతుడు. ఎంతమంది ఆయనను ఆర్తితో, ప్రేమతో అడుగుతున్నారు? మన జీవితం బాగుపడాలి. మనం సుఖంగా ఉండాలి. హాయిగా ఉండాలి. బాధలు, ప్రకృతి వైపరీత్యాలు మనల్ని ఇబ్బందులపాలు చెయ్యకూడదు.

గజేంద్రుడు మహావిష్ణువును ప్రార్థించినట్లు, ప్రహ్లాదుడు శ్రీహరిని స్తుతించినట్లు, మారుతి శ్రీరాముణ్ని గానం చేసినట్లు ఎవరు చేస్తున్నారు? ఎందుకు చెయ్యలేకపోతున్నారు?

నాలుగు ముక్కలు తెలిస్తే గురువు, నాలుగు దిక్కులు తిరిగితే శిష్యుడు అనే వింత పరిస్థితి ఉంది. ఈ రోజుల్లో నిజమైన ఆరాధన ఎలా కుదురుతుంది, నాణ్యమైన జీవన విధానం ఎలా లభిస్తుంది?

పరిస్థితులు ఎలా ఉన్నా నిరాశ పడకూడదు. లోకం మారిపోతున్నా మన హృదయంలో దేవుడిపై ప్రేమలో ఏ మార్పు రాకూడదు. నీరు పడితే బిగుసుకుపోయే కాంక్రీటులాగా మన నమ్మకాన్ని అచంచలంగా పెంచుకుంటూపోతే దైవం ముఖాముఖి అవుతాడు. అప్పుడు ఎందుకు మనకు ఈ జీవితాన్ని ప్రసాదించాడు, ఎలా దైవజీవనాన్ని గడపాలి, అపరిమిత ఆనందానికి మనం ఎలా హక్కుదారులం కావాలో ఆయనే తెలియజేస్తాడు.

జీవనకళ ఎవరూ నేర్పరు. జీవిస్తూ నేర్చుకోవాలి. ఈదుతూ ఉంటే ఈత వచ్చినట్లు, పాడుతూ ఉంటే బాగా పాడగలిగినట్లు, సాధనచేస్తూ ఉంటే ఈ జీవితం మనకు సాధ్యమవుతుంది.

జీవితం ఒక వేణువు లాంటిది. అది ఖాళీగా, శూన్యంగా ఉంటుంది. మధుర స్వరాలను అనంతంగా ఆలాపించగల సామర్థ్యం దానికి ఉంది. కానీ, అదంతా గాయకుడి నైపుణ్యం మీదే ఆధారపడి ఉంటుంది.

మనలో ప్రతి ఒక్కరూ తమ వేణువుతో దివ్యగానాలు పలికించవచ్చు. అవధుల్లేని ఆనంద పారవశ్యాన్ని పొందవచ్చు. వెంటనే మన వేణువును మనం తీసుకుందాం. గానాన్ని ఆలపించే అవకాశాన్ని చేజారిపోనివ్వకుండా చూసుకుందాం. తెరదించక ముందే మన జీవనగానాన్ని చక్కగా ఆలపిద్దాం. ఆ బృందావన విహారి మనసు కరిగిద్దాం!                                                                                                       
                                                                    - ఆనందసాయి స్వామి