ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Friday 10 May 2013

ధర్మం- సత్యం..

                                     


ఆధ్యాత్మికత! విస్తృత భావాలున్న పదం. పూజలు, జపాలు, ఆలయాలు... ఇవి మాత్రమే ఆధ్యాత్మికత కాదు. మనిషి మీద మానవత్వం పైన గౌరవం లేనివారు సైతం ఆధ్యాత్మికత గురించి మాట్లాడతారు. దైవచింతన ఉన్నా మానవ సమాజాన్ని గురించి ఆలోచించనివారు ఆధ్యాత్మికులు కారు. నిజానికి ఆధ్యాత్మికత అనేది భగవంతుడి కోసమే కాదు. ఆ పదం మానవుల ఉద్ధరణ కోసం కూడా ఉద్దేశించింది. నేటి సమాజం అవినీతి స్వార్థం ద్వేషాలతో నిండిపోయి ఉంది. మనిషిని వాటినుంచి రక్షించడానికి ఆధ్యాత్మికతే సాధనం. ఆధ్యాత్మికత వినా మరో మార్గంగానీ లక్ష్యంగానీ లేదు. మనిషికి విలువలుండాలి. విలువలు లేని మనిషి వికృత జీవుడంటారు వివేకానందులు. మనిషి విలువ తగ్గడమంటే ఆధ్యాత్మికత తగ్గడమే. మానసం వికృతం కాకుండా ఉండాలంటే... సాధన చేయాలి. ప్రతి మనిషీ తనకోసం సాధన చేయాలి. ప్రస్తుత సమాజంలో మానవుడు నైతికంగా పతనావస్థలో ఉన్నాడు. ధర్మహాని అంటే ఇదే! ఇలాంటి స్థితిలో మనమేం చేయాలి? మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. అలా చేస్తున్నామా... లేదే! అధర్మం పెచ్చుమీరడానికి కారణం మనమైతే దాన్ని నాశనం చేసేందుకు దైవం అవతరించాలా? స్వార్థానికి మించిందీ అతీతమైనదే ధర్మమని మనం తెలుసుకోవాలి. ఇది తెలుసుకోగలిగితే ధర్మోద్ధరణకు మనిషే దైవంగా మారగలడు. చీకటి (ద్వేషం) తగ్గి వెలుగు (జ్ఞానం) పెరగడమే ధర్మోద్ధరణ. అప్పుడే వ్యవస్థ కుదుటపడుతుంది.
           అధర్మం తారస్థాయికి చేరాక ధర్మోద్ధరణ జరగక తప్పదు. అప్పుడు... ఆ మంటల కీలల్లో... అధర్మవర్తనులు శలభాల్లా రాలిపోక తప్పదు. కనుక మనిషికి లాభం కలుగుతుందనే ఉద్దేశంతోనైనా నైతికతను నిస్వార్థాన్ని ఆచరించాలి. ధర్మం సత్యం... ఇల్లాంటివి కేవలం సాధకులే కాదు... సామాజంలో అందరూ పాటించాల్సినవి. భగవద్గీత, మహాభాగవతం, సుభాషితాలను మనం చదువుతాం. ఈ గ్రంథాలు ధర్మం పాటించమనే మనకు చెబుతాయి. వీటిని అర్థం చేసుకోకుండా పుస్తకాలను ఎన్ని చదివినా ఎంత వ్యాఖ్యానించినా ప్రయోజనం శూన్యం. సత్యమేవ జయతే, ధర్మో రక్షతి రక్షితః అంటూ వూరికే నినాదాలు ఇస్తే ఫలితాలు రావు. పదిమందికీ మేలు జరిగే కార్యాలు తలపెట్టాలి.
         విశ్వం మనది... ఇది మనకోసమే అనే భావన కావాలి. వ్యక్తులు మారాలి. ఉన్నత ప్రమాణాలు పాటించాలి. సామాన్యుడు ఉత్తముడిగా మారడమే సాధన. ఒక గ్రామంలో ఒక బౌద్ధ భిక్షువు ఉండేవాడు. అతని తెలివితేటలకూ జ్ఞానానికి అందరూ ఆ భిక్షువును గౌరవిస్తూ ఆయన పట్ల భక్తి ప్రపత్తులతో ఉండేవారు. ఒకరోజు అర్ధరాత్రి బిగ్గరగా ఒక కేక వినిపించింది. గ్రామ ప్రజలందరూ నిద్రలేచి తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. 'నేను కాలిపోతున్నాను- నన్ను రక్షించండి' అనే కేకలు వినిపించాయి. ఆ గళం భిక్షువుదేనని గ్రహించి మంటలను ఆర్పేందుకు తమ తమ ఇళ్ల నుంచి బిందెలతో నీళ్లు తెచ్చారు. తీరా చూసేసరికి అక్కడ మంటగానీ... కనీసం పొగగానీ కనిపించలేదు. భిక్షువు నివసించే గుడిసె భద్రంగా ఉంది. గుడిసెలోకి వెళ్లిచూస్తే ఒక మూలన ఆ బౌద్ధభిక్షువు కళ్లు మూసుకొని కూర్చొని 'రక్షించండి నేను కాలిపోతున్నాను' అంటూ కేకలు పెడుతున్నాడు. అతణ్ని గట్టిగా కుదిపి- 'స్వామీ! నీవంటున్న మంట ఎక్కడుంది' అని అడిగారు.
           'మీరంతా గ్రామంలో సంఘర్షణ, కోపం, అసూయ వంటి సమిధలతో మంటలను ఎగదోస్తూ నా గుడిసె దాకా తెచ్చారు. ఆ వేడి నన్నూ తాపానికి గురి చేస్తోంది. మీరు చల్లని నీరు తెచ్చి ఆ మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మంటలు చల్లని నీళ్లకు కాదు, చల్లని మనసుతో సమసిపోతాయి. ద్వేషం అసూయ వల్ల అధర్మం నెలకొంటుంది. దాన్నుంచి నన్ను కాదు రక్షించాల్సింది. మిమ్మల్ని మీరు చల్లని హృదయంతో రక్షించుకోండి' అన్నాడు.
                                                           - అప్పరుసు రమాకాంతరావు 

No comments:

Post a Comment