ప్రహ్లాదుడు జ్ఞాని. అతడి హరి పదాంబుజ ధ్యాన నిష్ఠా గరిష్ఠత గొప్ప భక్తుడిగా నిలబెట్టింది. నడుస్తున్నప్పుడు, తింటున్నప్పుడు, తాగుతున్నప్పుడు అన్నివేళలా హరిని స్మరించే ప్రహ్లాదుణ్ని పరిపూర్ణ భక్తి తత్వానికి దృష్టాంతంగా భాగవత పురాణం చిత్రించింది. హరి సర్వాంతర్యామిత్వాన్ని నిరూపించింది ప్రహ్లాదుడే. ప్రహ్లాదుని రక్షించి హిరణ్య కశిపుని దంభాన్ని హరించడానికే హరి స్తంభంలో ఆవిర్భవించాడు. అదే నరసింహావతారం. కొన్ని ఘడియలు మాత్రమే ఈ అవతార విజృంభణ, ఉపసంహరణ. 'కలడో లేడో, అన్న సంశయానికి 'కలడు' అన్న నివృత్తి లభింపజేసిన అవతారమిది.
మనిషిలోని వీర్యత్వం, సింహంలోని వేట లక్షణం కలిసి దుష్టశక్తిపై అద్భుతమైన పరాక్రమాన్ని స్ఫురింపజేసి విజయాన్ని సాధించిన విలక్షణ రూపం నరసింహ రూపం.
నరసింహావతారంలో మరొక వైశిష్ట్యం శివ, విష్ణుతత్వాల కలయిక. స్థితిని కలిగించే విష్ణువు నరరూపం, లయ కారకుడైన శివుడి ఉగ్రరూపాల సమైక్య స్వరూపం నరసింహస్వామి.
నృసింహుడు ఆవిర్భవించిన సంధ్యాకాలం శివతాండవ సమయం. హిరణ్య కశిపుని లయం చేసేందుకు, ప్రహ్లాదుని ఉన్నత స్థితుని గావించేందుకు ఆవిర్భవించిన హరిహరరూపంగా కొందరు భావిస్తారు. ఆయన ఉగ్రమూర్తి అయినా ప్రహ్లాదుడి వంటి భక్తులకు ఆకర్షణీయమైన సుందరరూపమే. ఆగ్రహానుగ్రహాలు ఏకకాలంలో ప్రదర్శించిన అద్భుతావతారం. ఒకే సమయంలో నరసింహుడి నేత్రంనుంచి వెలువడిన కోపాగ్ని హిరణ్యకశిపుడి హృదయాన్ని భయకంపితం చేయగా, అదే కంటినుంచి వెలువడిన దయావర్షం ప్రహ్లాదుణ్ని పులకాంకితుని చేసింది. అత్యద్భుతమైన ఆవేశావతారమిది.
నృసింహస్వామిని అపార కరుణామయుడిగా కీర్తించే గుణ సంప్రదాయం ఉంది. స్వామి ఆత్మ సాధకులకు, హృదయోపాసకులకు అత్యంత ప్రీతిపాత్రుడు. నవనారసింహమూర్తిగా అహోబిలంలో, పంచనారసింహమూర్తిగా వేల్పుగొండలో, లక్ష్మీనరసింహమూర్తిగా మంగళగిరిలో, వరాహనరసింహస్వామిగా సింహాచలంలో, లక్ష్మీ నరసింహస్వామిగా యాదగిరిగుట్టలో, ఇంకా అంతర్వేది మొదలైన చోట్ల పూజలందుకొంటున్నాడు. తెలుగువారు నరసింహ భక్తులు. శ్రీ నారసింహుడి నిత్యారాధనవల్ల ఐహికమైన మృగ, వృశ్చిక, జరా, మరణాది భయాలు తొలగి పారలౌకిక సద్గతులు కలుగుతాయని భక్తుల విశ్వాసం. వైశాఖ శుద్ధ చతుర్దశి నృసింహ జయంతి.
- డాక్టర్ దామెర వేంకట సూర్యారావు
No comments:
Post a Comment