ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Saturday 25 May 2013

మహా వైశాఖి


వైశాఖ మాసానికి వేదశాస్త్రరీత్యా 'మాధవ'మాసం అనిపేరు. రుతురాజైన వసంతంలో ఈ రెండోనెల దైవశక్తిపరంగానూ ఉత్కృష్టమైనదని ధార్మిక గ్రంథాలు చెబుతున్నాయి.
స్నాన, దాన, జప, హోమాదులకు సమప్రాధాన్యం కలిగిన ఈ మాసమంతా మహిమాన్వితమైంది. అయినప్పటికీ, ప్రత్యేకించి పూర్ణిమకు ఒక వైశిష్ట్యం ఉంది. మాసశక్తి అంతా పూర్ణిమలో సారంగా, కేంద్రంగా ఉంటుంది- ఇది శాస్త్రమర్యాదలతో సాధనకు యోగ్యంగా విజ్ఞులు చెప్పేమాట. అందునా- ఈ వసంత పూర్ణిమ మరింత మహిమాన్వితమని పురాణ వచనం.

మాసమంతా సాధన చేయలేనివారు, ఈ ఒక్క రోజైనా నియమబద్ధంగా చేసే సాధనలు శీఘ్రంగానూ, పూర్ణంగానూ ఫలిస్తాయని శాస్త్రోక్తి. దీనికి 'మహావైశాఖి' అని శాస్త్ర వ్యవహారం. ఈ రోజు చేసే దానానికి విశేషప్రాధాన్యం ఉంది. గ్రహదోషాలను తొలగించడానికి, అరిష్టాలను నివారించడానికి జలదానం, వస్త్రదానం, ఛత్ర పాదుకాదుల దానం కర్తవ్యాలని చెబుతారు. బాటసారులకు జలం, శీతల పానీయాలు భగవత్ప్రీతిగా సమర్పించినవారికి రోగహరణం, తాపనాశనం కలుగుతాయని పురాణాల మాట.

వసంత పూర్ణిమల్లో వైశాఖి రెండోది కనుక- దానికి మరింత ప్రత్యేకత ఉంది. మహాత్ములు 'వసంతంవలె లోకహితానికై సంచరిస్తా'రని వివేక చూడామణిలో ఆదిశంకరుల ఉవాచ.

వసంతం చిగురింతలతో, పూలతో, పళ్లతో వనాలకు పచ్చదనాన్ని, సాఫల్యాన్ని ప్రసాదిస్తుంది. ప్రాణులకు మేలు కలిగిస్తుంది. తానేమీ ఆశించదు.

అదేవిధంగా మహాత్ములు తమ జ్ఞానంతో, స్వార్థరహితమైన సహాయంతో, అనుగ్రహంతో లోకానికి మేలు కలిగించడానికై సంచరిస్తారు. వసంతం తనంత తానై వనాలవద్దకు వచ్చి మోడుతనాన్నీ, నీరసాన్నీ తొలగించి రసత్వాన్నీ, హరితాన్నీ ప్రసాదిస్తుంది. అలాగే త్యాగమూర్తులు సంచరిస్తూ అజ్ఞానాన్నీ, దుఃఖాన్నీ తొలగిస్తూ విద్యతోనో, జ్ఞానంతోనో, హితోపదేశంతోనో, కారుణ్యంతోనో కాపాడి ఎందరి జీవితాలకో జ్ఞానసాఫల్యాన్ని, ఆనందసిద్ధినీ కలిగిస్తారు. అందుకే వారిని వసంతంతో పోల్చారు.

వసంతంలాంటి వ్యక్తిత్వం కలిగిన అవతారపురుషులు, ఆచార్యులు, సిద్ధులు ఈ మాసంలోనే ఎక్కువమంది జన్మించడం విశేషం. ఈ వైశాఖ పూర్ణిమనాడే బుద్ధుడు జన్మించాడు. తొలి తెెలుగు వాగ్గేయకారుడు, సంకీర్తనాచార్యుడు అన్నమయ్య పుట్టిన రోజు కూడా ఇదే. లేతలేత పదాలతో, వేల'పదాల'తో జ్ఞానపథాలను ఏర్పరచిన మహాయోగి అన్నమాచార్య. భారతీయ తత్వచింతనలో ఒక వెలుగు బుద్ధభగవానుడు.

ఈ వైశాఖంలోనే ఆదిశంకరులు, రామానుజులు (శుద్ధపంచమి) జన్మించారు. త్యాగరాజ జయంతి వైశాఖ శుద్ధ షష్ఠి (సప్తమి-అని కొందరి అభిప్రాయం). పరమపావని గంగాదేవి భువిపై అవతరించిన జన్మతిథి కూడా శుద్ధసప్తమి- అని శాస్త్రవచనం.

నారాయణుడి యోగావతారం నరసింహస్వామి ఆవిర్భావతిథి వైశాఖ శుద్ధ చతుర్దశి. జ్ఞానమూర్తి అయిన ఆంజనేయస్వామి పుట్టిన తిథి బహుళ దశమి- అని సంహితవచనం.

ఆదిశంకరుల అనంతరం భారతీయ సనాతన ధర్మానికి మరో అద్భుత ప్రకాశాన్నిచ్చిన ఆచార్యులు శ్రీవిద్యారణ్యస్వామి అవతరించిన పుణ్యతిథి శుద్ధ సప్తమి.

ఇలా వైశాఖంలో ప్రతి తిథికీ పురాణోక్త మహిమలే కాక, చారిత్రక ప్రాముఖ్యాలూ ఉన్నాయి.

ఈ వైశాఖ పూర్ణిమ 'జ్ఞానపూర్ణిమ' అనీ స్పష్టమవుతోంది.

మందర పర్వతాన్ని ఉద్ధరించిన, ఆధారశక్తి స్వరూపంగా ఉపాసించే ఆదికూర్మం అవతరించిన పుణ్యతిథి ఈ పూర్ణిమేనని శాస్త్రాల కథనం. మంగళకరమైన సంపద్గౌరీదేవిని ఆరాధించే పూర్ణతిథి ఇది. ఇలా వ్రతపర్వంగా, దానస్నానపర్వంగా, సాధనల పండుగగా ప్రసిద్ధిచెందిన వైశాఖపూర్ణిమ ఆధ్యాత్మిక పూర్ణత్వానికి సంకేతం.
                                                                                                         - సామవేదం షణ్ముఖశర్మ

No comments:

Post a Comment