ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Monday 13 May 2013

చందనోత్సవం

                                  

             దుష్టశిక్షణ, శిష్టరక్షణ ధ్యేయంగా విష్ణువు ధరించిన అవతారాల్లో నాలుగోది నరసింహావతారం. మనిషి రూపం, సింహం తలతో ద్వయరూపాల సమాహారం కాబట్టి ఆ పేరు వచ్చింది. అలాంటి విచిత్రరూపమే హిరణ్యకశిపుణ్ని సంహరించడానికి సమర్థమైనది. బ్రహ్మ నుంచి హిరణ్యకశిపుడు పొందిన వరాలశక్తికి విరుగుడుగా విష్ణువు ఈ అవతారం దాల్చాడు. రాక్షసుణ్ని సంహరించాడు. రెండు రూపాల సమాహారశక్తి కావడం వల్ల రాక్షస వధానంతరం సైతం ఆ ఉగ్రరూపం శాంతించలేదు. దేవతలు, మునులు, లక్ష్మీదేవి, చివరకు అత్యంత ప్రియభక్తుడైన ప్రహ్లాదుడు సైతం ప్రార్థించినా శాంతించలేదు. తమ చేయి దాటిపోవడంతో బ్రహ్మదేవుడికి మొరపెట్టుకున్నారంతా. అతడు వారికో ఉపాయం చెప్పాడు. తాను గతంలో శ్రీచందన వృక్షానికి ఉగ్రత, తాపం, ఉష్ణం తగ్గించే గుణాన్ని వరంగా ఇచ్చానని, అందువల్ల దాన్ని ఆ మూర్తికి పూస్తే శాంతిస్తాడని సలహా ఇచ్చాడు. ఆ సలహాను అనుసరించి ప్రహ్లాదుడు శ్రీచందనాన్ని తెప్పించాడు. దాని పరిమళం ఆ పరిసరాల్లో ప్రసరించగానే ఆ ఉగ్రమూర్తి కొంతవరకు శాంతించాడు. ఆపైన ప్రహ్లాదుడు స్వామిని స్తుతిస్తూ చందనం పూశాడట. దాంతో పూర్తిగా శాంతించాడా స్వామి. ఇది జరిగినది వైశాఖ శుద్ధ తదియ. ఆ రోజు కృత్తిక, రోహిణి ఈ రెండు నక్షత్రాల్లో ఏదో ఒకటి అవుతుంది. ఈ రెండూ అగ్ని(ఉష్ణ) స్వభావం కలిగిన నక్షత్రాలే. అందువల్ల ఈరోజు వాతావరణంలో వేడి ఎక్కువగా ఉంటుంది. నడి వేసవికాలం. అందునా కృత్తిక కార్తె సమయం. ఈ కారణాలన్నింటివల్ల ఆనాటి వేసవితాపం నుంచి ఉపశమనం కోసమే సింహాచల క్షేత్రంలో వేంచేసి ఉన్న వరాహ లక్ష్మీనృసింహస్వామికి చందనోత్సవం జరుగుతుంది. ఈ తరహాలో ఈ క్షేత్రంలో తప్ప మరే నృసింహ క్షేత్రంలోనూ చందనోత్సవం జరగదు. దీనికి కారణాలు ఉన్నాయి.
       ఉగ్రరూపం శాంతించిన నృసింహస్వామి మూర్తులను, ఆ రూపంలోనే అనేక ప్రాంతాల్లో ప్రతిష్ఠించారు. అందులో మొదటిది మనరాష్ట్రంలో ఉన్న సింహగిరి (అదే సింహాచలం). ఇక్కడే ప్రతిష్ఠించడానికి కారణమూ ఉంది. ప్రహ్లాదుని రక్షించడానికి స్వామి భూమిపైన కాలిడిన ప్రదేశం సింహశైలమేనని పురాణాలు చెబుతున్నాయి. అలా వస్తున్నప్పుడు అతడి ధాటికి పాదాలు పాతాళంలోకి వెళ్ళాయని, కాబట్టి నిజరూప దర్శన సమయంలో పాదదర్శనం ఉండదనీ క్షేత్రమహాత్మ్యం చెబుతోంది.
            వైశాఖ శుద్ధ విదియనాడు రాత్రి సింహాచలేశుడి విగ్రహానికి ఉన్న చందనం అంతా వలిచేస్తారు. తదియనాటి ప్రాతఃకాలంలో స్వామికి సహస్ర ఘటాభిషేకం చేస్తారు. ఆ తరవాత ప్రత్యేక పూజలు, ధూపదీప నైవేద్యాలు జరిపిస్తారు. ఆపైన స్వామివారి విగ్రహ నిజరూప దర్శనానికి అనుమతిస్తారు. సంవత్సరానికి ఒక్కసారి, అదైనా ఒక్కపూట మాత్రమే కలిగే అరుదైన నిజరూప దర్శనం చేసుకోవడానికి భక్తులు అనేక దూర ప్రాంతాలనుంచి తరలివస్తారు. ఉదయం నుంచి సూర్యాస్తమయం వరకు మాత్రమే నిజరూప దర్శనం ఉంటుంది. ఆపైన విగ్రహానికి చందనం పూసేస్తారు. అలా కప్పివేసే సమయంలో మూడు మణుగుల చందనపు ముద్దను విగ్రహానికి అలదుతారు. ఈరోజు తరవాత వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ పూర్ణిమ తిథుల్లో మరల మూడేసి మణుగుల చొప్పున చందనాన్ని స్వామివారికి అలదుతారు. ఇలా చేసేదాన్ని 'కరాళ చందనోత్సవం' అంటారు. వెరసి సుమారు 420 కిలోల చందనం విగ్రహాన్ని అంటి ఉంటుంది. చందనోత్సవానికి వాడే మంచి గంధపు చెక్కలను, తమిళనాడులోని తిరుపత్తూర్‌ నుంచి కొనుగోలు చేస్తుంటారు. సంవత్సరంలో నాలుగుసార్లు అలదే చందనాన్ని సంవత్సరం పొడుగునా రోజుకు కొంత కొంత చొప్పున రాతిసానల మీద అరగదీసి, ఆ ముద్దను చందన భాండాగారంలో భద్రపరుస్తారు. ఇలా తీసిన గంధం పాడైపోకుండా ఔషధ గుణాలున్న మూలికలు, సహజ రసాయనాలు కలిపి నిలవచేస్తారు. పచ్చాకు, పచ్చకర్పూరం, కుంకుమపువ్వు, కస్తూరి, జవ్వాదు, పసుపు, పునుగు, కచ్చూరాలు, భావంచాలు, వట్టివేళ్లు, గవిలాలు మొదలైన సుగంధ ద్రవ్యాలు, మూలికలను కలిపి ప్రత్యేక పద్ధతిలో నిలవ ఉంచుతారు.
           స్వామి విగ్రహం నుంచి వలిచేసిన పాతచందనాన్ని భక్తులకు ప్రసాదంగా పంచిపెడతారు. దీన్ని ధరించడంవల్ల ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని ప్రజల నమ్మకం. ఔషధ విలువలున్న ఈ చందనధారణ ఆరోగ్యప్రదమని, ప్రత్యేకంగా సంపాదించుకోవడానికి భక్తులు పోటీపడతారు. అన్ని ఆలయాలూ తూర్పుముఖంగా ఉంటే ఈ ఆలయం పడమటి ముఖంగా ఉండటం విశేషం. ఇలా ఉన్న ఆలయాన్ని దర్శించడం వల్ల విజయం సిద్ధిస్తుందని శాస్త్రవచనం.
          ఈ క్షేత్రంలో ఉన్నది లక్ష్మీనరసింహస్వామి అయినా, రూపంలో వరాహావతార లక్షణాలూ, ఛాయలూ మూర్తిలో ఉంటాయి. అందుకే ఈ క్షేత్రంలోని స్వామికి 'వరాహలక్ష్మీ నర(నృ)సింహస్వామి' అని పేరు. గ్రామీణులు ఈ స్వామిని అప్పన్న అనీ, లేదా అప్పలనరసింహస్వామి అనీ పిలుస్తారు. కోడెదూడలను అచ్చువేసి స్వామికి అంకితం చేస్తూ ఆలయంలో విడిచిపెడతారు భక్తులు. అలా విడిచిన దూడలు- ఆబోతులుగా, గంగిరెద్దులుగా లోకంలో చలామణీ అవుతూంటాయి. కొన్ని పల్లెల్లో ఆ స్వామి పేరు మీద కోడెదూడను అచ్చువేసి గ్రామాల్లో వదిలేస్తారు. అది ఆ గ్రామానికంతటికీ ఆబోతుగా చలామణీలో ఉంటుంది.

                                                           - అయ్యగారి శ్రీనివాసరావుNo comments:

Post a Comment