జీవిత చక్ర గమనంలో కష్టాలు దొరలిపోయాక మనిషిని సుఖాలు అనుగమిస్తాయి. నిజానికి సుఖాల్ని కష్టాలే మోసుకొస్తాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. పూరించలేని నష్టాన్ని కలగజేసే కష్టం దురదృష్టకరమేగానీ, చిట్టిపొట్టి కష్టాలు మనిషిని ఆనందతీరాలకు చేర్చే సాధనాలే!
ఒక్కొక్కప్పుడు జీవితం వెలుగు జిలుగుల రంగేళిలా భాసిస్తుంది. అంతలోనే పెనుగాలికి ఒరిగిపోయిన తరువులా శూన్యం ఆవరిస్తుంది. ఇలాంటి విపరిణామాలు మనిషిని దిగ్భ్రాంతికి గురిచేస్తాయి. ఒక్కోసారి అవి మనసు చేసే భ్రాంతులుగా మరొకసారి సత్యంగా ఆ పరిస్థితులు చేరువవుతాయి. బతుకు కష్టంగా తోచినా ఇష్టంగా జీవించాల్సిన అవసరం మనిషికి ఉంది. లేకపోతే ఎదురయ్యే చింతలు నిలువునా దహిస్తాయి. జీవితం మూన్నాళ్లముచ్చటే అయినా జీవించి ఉండేకాలం ఎంతో విలువైనది. పవిత్రమైనది. దైవానికి చేరువచేసి ప్రీతిపాత్రుడిని చేసే అవకాశాలను ఎవరూ, ఎన్నడూ చేజార్చుకోకూడదు. కొన్ని క్లేశాలు నిజానికి దుర్భరమైనవిగా ఉండవు. వాటిని బలమైనవిగా మనం భావిస్తే తప్ప అవి మనల్ని బాధించవు. తేలిగ్గా తీసుకుంటే కాలప్రవాహంలో కరిగిపోతాయి. అలా కరిగిపోయాక 'అయ్యో! ఆ పొట్టి కష్టాలకు అంత ప్రాధాన్యం ఎందుకిచ్చాను? నిజానికి అవి దుర్భరమైనవి కాదు కదా' అనుకుంటాం! కానీ, జరిగే హాని ఏమైనా ఉంటే ఈలోపు జరిగిపోతుంది.
చిట్టికష్టాలు నిజానికి మనిషికి మేలు చేసేవే. అవి మనిషి దుర్భర, వ్యధాభరిత, ఏకరీతిలో సాగే జీవితంలోని విసుగుదలను నిర్వీర్యం చేసి కొత్త ఆశలు చివురింపజేస్తాయి. కొత్త విలువలు ఆపాదిస్తాయి. కొత్తకోణాలు ఆవిష్కరిస్తాయి. వాటిని భూతద్దంలో చూసి బెదిరిపోకూడదు. అవి జీవితాన్ని పెనుమలుపు తిప్పుతాయేమోనన్న భ్రాంతి కలగవచ్చు. నిజానికి అది దుర్బలమైన మన మనసు చేసే మాయాజాలమే కానీ మరొకటి కాదు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా సామాజికంగా ఎదురయ్యే చిట్టివ్యధలు, బాధలకు సంబంధించి మనిషి సావధాన చిత్తుడై వ్యవహరించాలి. స్థిరచిత్తంతో వాటి ఆనుపానులు బేరీజు వేసుకొని ముందడుగు వేయాలి. జరగబోయే కొద్దిపాటి నష్టానికి ముందస్తుగా మానసికంగా మనిషి సిద్ధం కాగలిగితే నరాలను కుంగదీసే ఆందోళన తగ్గుతుంది.
మానవుడు సంఘజీవి. చుట్టూ మనవారనుకున్న శ్రేయోభిలాషులు ఉంటారు. అవసరమైనప్పుడు ఆందోళన తగ్గటానికి వారి శుభకామనతో కూడిన సానుభూతి ఉపకరిస్తుంది. ఎక్కవలసిన రైలు తప్పిపోతే నష్టం జరగదు. మరో ప్రత్యామ్నాయం ఉంటుంది. ఒకవేళ ఉన్న ఉద్యోగం వదులుకోవలసి వస్తే జీవించడానికి మరోమార్గం సిద్ధంగా ఉండకపోదు. అడపాదడపా వచ్చే చిన్ని సమస్యలు కాలగతిన సమసిపోయేవే! రుజువర్తనులకు ప్రకృతి ఎప్పుడూ సహకరిస్తుంది. భగవద్విశ్వాసం వల్ల పరిస్థితులు అనుకూలంగా మారతాయి. కొద్దిపాటి ఆర్థిక నష్టం, స్వల్ప అనారోగ్యం, సన్నిహితులతో కొద్ది విభేదాలు జీవితచిత్రాన్నే మార్చివేస్తాయన్న బెంగ కూడదు. మహా ప్రళయం తరవాత సర్వజీవకోటి పునరావిర్భావానికి బీజాలు భగవత్సంకల్పం చేత భద్రపరచే ఉంటాయి. మన మంచి, సత్ప్రవర్తన, ధర్మమార్గం, భావిజీవిత శ్రేయోమార్గానికి అవసరమయ్యే ఆనందబీజాలను తప్పక సంరక్షణ చేస్తాయి. ప్రకృతి పరివర్తనశీలత గ్రహించిన మనిషి అప్పుడప్పుడూ సంభవించే చిట్టిపొట్టి కష్టాలు, నష్టాలకు బెదరవలసిన పనిలేదు. ఇంద్రియ నిగ్రహం, ఆత్మావలోకనం - ఐహిక, ఆముష్మిక విషయాల సమస్యలను నిర్వీర్యం చేస్తాయి. మేలుచేసే కాలం కోసం నిరీక్షించడం వల్ల మనిషికి ప్రాపంచిక, పారమార్థికపరమైన విశేష లబ్ధి తప్పక చేకూరుతుంది.
- గోపాలుని రఘుపతిరావు
No comments:
Post a Comment