మనిషికి మృత్యువు జీవితంలో ఒకసారే వస్తుంది. భయమనే మృత్యువు జీవితమంతా వెంటాడుతూనే ఉంటుంది. మృత్యువు సమస్యలన్నింటినీ పరిష్కరిస్తే భయం కొత్తకొత్త సమస్యల్ని తెచ్చిపెడుతుంటుంది. అందుకే మృత్యువు కన్నా ప్రమాదకరమైంది భయం. జీవితంలో భయానికన్నా భయంకరమైంది లేదు. భయం దుఃఖాన్ని, బాధను, దిగులును, అశాంతినీ కలగజేస్తుంది. ఇది ఒక తీవ్రమైన భావోద్వేగ పరిణామం. అభద్రతా భావం ప్రధానంగా భయాన్ని ప్రేరేపిస్తుంది. భయం మన మనసులో చీకటిని ఆవరింపజేస్తుంది. ఆందోళన పెంచుతుంది. వందమంది మధ్య ఉన్నా మనల్ని ఒంటరిని చేస్తుంది. ఆ ఒంటరితనం మృత్యుతుల్యం. అది మానసిక బలహీనతకు ఉత్ప్రేరకమవుతుంది. పలాయనవాదానికి నాంది పలుకుతుంది. శారీరక ఆరోగ్యం మీదా దుష్ప్రభావం చూపుతుంది. ఎందరికో ముందున్న మనం, మరెందరి వెనకో పడిపోతాం. ఇతరుల్ని, చివరికి భగవంతుణ్ని సైతం నిందిస్తూ మన భయాన్ని కప్పిపుచ్చుకొంటాం. ఆత్మన్యూనతాభావం క్రమేణా అధికమవుతుంటుంది. మన అస్తిత్వ భావనకు విఘాతం ఏర్పడుతోందన్న అనుభూతి బలం పుంజుకుంటూ ఉంటుంది. ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. ఆత్మస్త్థెర్యం దూరమవుతుంది.
మనకు దైవం ఆలోచనా శక్తి ప్రసాదించాడు. యోగశక్తినీ, ధ్యానశక్తినీ ప్రసాదించాడు. వీటిని సద్వినియోగపరచుకుంటే భయాన్ని అవలీలగా దూరం చేసుకోగలం. స్వామి వివేకానంద సందేశం ఈ సందర్భంలో గుర్తొస్తుంది మనకు. 'అద్భుతమైన పనులు చేయగల మీరు దేనికీ భయపడవలసిన అవసరం లేదు. భయం వల్లనే బాధలు కలుగుతాయి. భయం వీడితే జయం మన సొంతం' అనే వాడాయన.మనం పరిగెత్తుతూంటే భయం మనల్ని వెంటాడుతుంది. ఎదిరించి నిలబడితే పారిపోతుంది. కురుక్షేత్రంలో బంధుమిత్రులను చంపడానికి భయపడిన అర్జునుణ్ని వాసుదేవుడు గీతాబోధ చేసి జాగృతం చేస్తాడు. శనికి శివుడు సైతం భయపడి ఏడు ఘడియలపాటు చెట్టు తొర్రలో దాక్కున్నాడు. గురువుల పట్ల భయభక్తులు కలిగివున్న శిష్యులు అపారశాస్త్ర పరిజ్ఞానం పొందగలిగారంటే- భక్తితో, గౌరవంతో భయం కలగడం వల్లనే. తనను, దైవాన్ని విశ్వసించినవాడు నిర్భయుడై ఉండగలడని ప్రహ్లాదుడంటాడు.

చిత్తశుద్ధితో, పవిత్ర కార్యాచరణకు పూనుకొన్నవాడికి పరమాత్మ కృప లభించడంతో భయమనే బలహీనత దరికే చేరదు. మరణానికి సైతం వెరవకూడదని శుకుడు పరీక్షిత్తుకు ప్రబోధిస్తాడు. అచంచల కృష్ణ భక్తురాలు మీరాబాయి కారాగారంలో నిర్భీతితో విషం తాగి తన కృష్ణ ప్రేమను చాటుకుంది. బరువెక్కువైన ఓడ నీట మునిగినట్టే, అధిక భయం కలవారు శోకసముద్రంలో మునిగిపోతారంటాడు వాల్మీకి మహర్షి. నిర్భయుడు సునామీ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధపడతాడు. భయస్థుడు తాటాకు చప్పుళ్లకే బెదిరిపోతాడు.
ప్రకృతి శక్తులకు భయపడక సుమతి సూర్యాస్తమయాన్ని తన పతి ప్రాణరక్షణ కోసం నిరోధించింది. సావిత్రి యముడి వెంట పడి తన భర్తను సజీవుణ్ని చేసుకోగలిగింది. ధ్రువుడు బాల్యంలోనే అరణ్యాల్లో క్రూర మృగాలకు సైతం వెరపు చెందక, తపస్సు చేసి ద్వాదశాక్షర మంత్రజపంతో ధ్రువతారగా వెలుగొందాడు.
దైవానికి, గురువుకు, ధర్మానికి, నీతికీ, సమాజానికీ, చట్టానికీ భయపడటం అవసరమే. అది మితమై ఆదరణ, విశ్వాసం, శ్రద్ధతో కూడి ఉండాలి. అదే భయంతో నిరాశా నిస్పృహలు సృష్టించుకుని, బెంబేలెత్తి, కుంగిపోకూడదు. పెద్దలు పిల్లల్ని భయపెట్టడంలో ప్రేమ ఉండాలి, క్రోధం, ఆవేశం ఉండకూడదు. వారి వృద్ధే లక్ష్యమై ఉండాలి. అర్థం, అవసరం లేని భయం పిన్నల్ని పిరికివాళ్లను చేస్తుంది. అసమర్థుల్ని చేస్తుంది.
భయమనే సంక్లిష్ట వికారం యువతను నిర్వీర్యం చేస్తుంది. అధార్మికుడు, నిత్యశంకితుడు, దుర్వ్యసనపరుడు, అనైతికుడు, శీలరహితుడు ఎప్పుడూ భయపడుతూనే ఉంటాడు. జీవితమంతా చరిత్రహీనుడిగానే మిగిలిపోతాడు. ప్రతి చిన్న సమస్యకూ భయపడేవాడు జీవితంలో ఏదీ సాధించలేడు. మరణ సమయంలోనూ భయరహితుడే ఆధ్యాత్మిక చక్రవర్తి. వైక్లబ్యం వీడితేనే మోక్ష సౌలభ్యం. నిర్భయమనే పునాది పైనే జీవన సాఫల్య సౌధం దృఢంగా నిలబడగలుగుతుంది.
భయపడటం, భయపెట్టడం- రెండూ ఆత్మద్రోహాలే. అదుపు తప్పిన భయం మనసును కుదిపివేస్తుంది. నిర్భీతితో మనిషి తలెత్తుకోగలిగే స్వేచ్ఛాప్రపంచంలో ఈ దేశాన్ని జాగృతం చెయ్యమని భగవంతుణ్ని ప్రార్థిస్తాడు రవీంద్రుడు 'గీతాంజలి'లో. మొహమాటం, సంకోచం, జంకు, బెదురు, అనుమానం మొదలైన అవలక్షణాలుగల భయాన్ని విసర్జిస్తే అఖిలేశుడి అభయహస్తం ఎప్పుడూ మనకు సమస్త సుఖశాంతులనే ఇస్తుంది.
- చిమ్మపూడి శ్రీరామమూర్తి
- చిమ్మపూడి శ్రీరామమూర్తి
No comments:
Post a Comment