ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Monday, 20 May 2013

భక్తుడు


భగవంతుడి పట్ల ప్రదర్శించే ప్రేమను భక్తి అంటాం. భగవంతుని హృదయపూర్వకంగా ప్రేమించాలనుకొనే ఆశ సాకారం కానపుడు భక్తుణ్ని నిరుత్సాహం ఆవహిస్తుంది. ఎదుటి వ్యక్తిని పవిత్రంగా ప్రేమించగలిగే హృదయం ఉంటే చాలు. సభక్తికంగా, సంతృప్తికరంగా భగవంతుని కూడా ప్రేమించడంలో కృతకృత్యులం కావచ్చు. విషయ వస్తుజాలంపై ఉండే ప్రేమను పవిత్రీకరించి భగవంతుడి పైకి మరల్చినప్పుడు ఆయనకు ఆ ప్రేమ ప్రీతిపాత్రమవుతుంది. ఆయన అనుగ్రహ భాగ్యం అమృతధారగా తప్పక చేతికందుతుంది.
        లోకాన్నంతా భగవన్మయంగా భావించి ప్రేమను పంచగలిగే వ్యక్తిత్వాన్ని నిజభక్తుడు సాధన చేస్తాడు. దైవాన్నే తోడునీడగా భావిస్తాడు. తల్లిదండ్రులు, సోదరీసోదరులు, స్నేహితులు, సన్నిహితులు- ఇలా అందరూ భగవంతుడి ప్రతిరూపాలే అన్న స్పృహ ఇరుగుపొరుగువారినీ అదే స్ఫూర్తితో దర్శించగల అవకాశం కల్పిస్తుంది. ఆ చేతన భక్తుణ్ని దైవానికి దగ్గర చేస్తుంది.

కొందరు సాధకుల లక్ష్యం స్వర్గం కావచ్చు. మరికొందరు మోక్షాన్ని కోరుకోవచ్చు. లౌకిక సుఖాలను స్వర్గంగా, లౌకిక బంధనాల నుంచి విముక్తిని మోక్షంగా భావించడం సాధారణంగా జరిగే విషయం. పారమార్థిక పరిభాషలోని స్వర్గమోక్షాలు లభించాలంటే వాటికోసం అవిరళ కృషి, అచంచల విశ్వాసం, అవిశ్రాంత సాధన సాగించవలసి ఉంటుంది. మరణానంతరం లభించగల స్వర్గ సుఖాలు, మోక్షంపై ఆకాంక్షవల్ల అవి ప్రసాదించగల దైవంపై విశ్వాసం బలోపేతమవుతుంది. విశ్వాసం ప్రవర్ధమానమైతే శాంతి, ఆనందాలు క్రమక్రమంగా చేరువవుతాయి. నిజానికి శాంతి, ఆనందాలే స్వర్గమోక్ష ధామాలకు స్వాగత తోరణాలు.

ప్రతి సాధకుడికీ ఆత్మోన్నతి లక్ష్యం కావాలి. ఆ లక్ష్యం ఆధ్యాత్మిక పరిణతి, వికాసానికి దోహదకారి అవుతుంది. భక్తి వికసించిన మహనీయుడికి భగవంతుడే తోడు-నీడ, సర్వస్వం అవుతాడు. జీవన నౌకను ఒడుదొడుకులు లేకుండా ముందుకు సాగించమని భక్తుడు తన దైవానికి నివేదించుకొనే భాష మంత్ర సదృశమవుతుంది. ప్రేమాస్పదులు శాశ్వతంగా ఎడమైనప్పుడు కలిగే బాధ వర్ణనాతీతం. ఆ బాధ ముల్త్లె హృదయాన్ని గుచ్చుతుంది. భగద్విశ్వాసమనే కవచం హృదయానికి తొడిగినప్పుడు సాధకుణ్ని ఏ బాధా బాధించదు. అన్నీ దైవమే అని నమ్మిన సాధకుడు భగవంతుడి సర్వవ్యాపకత్వాన్ని, సర్వకర్తృత్వాన్నీ విశ్వసించినట్టే! ముక్కుతాడు వేసి పగ్గాలు పట్టుకున్న రైతు కనుసన్నల్లో సేద్యపు గిత్తలు నడచినట్లు, స్వీయనియమాల నియంత్రణా వలయంలో భక్తియాత్ర సాగించినప్పుడు- భక్తుడు గమ్యం నుంచి వైదొలగే ప్రమాదం ఉండదు.

రక్షించే దైవం తప్పులను సరిదిద్దే బాధ్యతనూ తీసుకుంటాడు. దైవం దుష్టశిక్షణే కాక భక్తులను సన్మార్గంలో నడిపించడానికి వలసిన దండనా చేస్తాడు. ఆ ప్రభావంగా భక్తుడి హృదయం వ్యాకులపడవచ్చు. శరీరం గాయపడవచ్చు. మనసు సంకట పడవచ్చు. అంతా తన మంచికే అని భక్తుడు త్రికరణ శుద్ధిగా విశ్వసించినప్పుడు అతడికి మేలే జరుగుతుంది.

కనిపించేవారిపై చూపే ప్రేమలో కాపట్యం ఉండవచ్చు. కాలుష్యం చోటు చేసుకోవచ్చు. నిరాకారుడిపై ప్రేమ నిర్మలమైతేనే అది స్వీకరణ యోగ్యమవుతుంది. దైవంపై భక్తికి ఎల్లలుండవు. హృదయాంతర్గతమైన భక్తివల్ల శంకరుడు కింకరుడవుతాడు. పైకి మిసమిసలాడుతూ కనిపించే మేడిపండు లోపల పురుగులతో నిండి ఉన్నట్లు ఈ ప్రపంచం పైకి అందంగా కనిపిస్తూ ఆంతరంగిక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. అంతర్గత క్షోభతో కునారిల్లే జగత్తును రక్షించగల సర్వసమర్థుడు దైవమే. భక్తుడి ఆ భావనే భగవంతుడిపై పొంగులువారే భక్తికి ప్రేరణ అవుతుంది. దేహధారులందరూ భగవత్‌ స్వరూపులే అన్న మహాన్నత భావన భక్తుణ్ని సర్వోన్నతంగా నిలిపి దైవసమానుణ్ని చేస్తుంది.
                                                         - గోపాలుని రఘుపతిరావు

No comments:

Post a Comment