ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Wednesday, 10 July 2013

మూడు రథాల విశిష్టయాత్ర


   ప్రపంచ ప్రసిద్ధి చెందిన పురీ జగన్నాథ రథయాత్ర భారతీయ సంస్కృతిలో ఒక 'అద్భుతం' అని వర్ణించవలసినదే. పౌరాణిక, చారిత్రక ప్రాధాన్యం కలిగిన పురీ క్షేత్రంలో ఎన్నో ప్రత్యేకతలు. జ్ఞానేంద్రియ స్థానమైన వదనమే, ప్రధానంగా కలిగిన విశిష్ట సౌందర్యవంతమైన జగన్నాథ బలభద్ర సుభద్రల దారు విగ్రహాలు మరే క్షేత్రంలోనూ కానరాని లావణ్యాలు.
విభిన్న కళారీతిలో అద్వితీయ వాస్తుశిల్పంతో నిర్మితమైన భవ్యమందిరం జగన్నాథాలయం. ప్రతి ఆలయంలోనూ రథోత్సవాలు జరుగుతున్నప్పటికీ ఇక్కడి రథాలు, ఉత్సవం పూర్తిగా విభిన్నం. మహోత్సాహంతో జనవాహిని పాల్గొనే యాత్ర కూడా ప్రపంచపు వింత వేడుకే.

వాసుదేవుని జగన్నాథమూర్తి, సంకర్షణ స్వరూపమైన బలభద్రుడి విగ్రహం, శక్తితత్వమైన సుభద్రా దారురూపం- మూడు రథాలపై భక్తులను అనుగ్రహించేందుకు వూరేగే దివ్య దృశ్యం అపురూపమైన అనుభూతిని ప్రసాదిస్తుంది. జగన్నాథుడి చెంత సుదర్శనమూర్తి విష్ణురక్షను కలిగించేదిగా శాస్త్రం వర్ణిస్తోంది.

మూడు రథాలను ప్రతి ఏడాదీ నూతనంగా నిర్మిస్తూనే ఉంటారు. ఇవి కూడా దారురథాలే. వీటి నిర్మాణంలోనూ ఎన్నో ఆగమశాస్త్ర నియమాలను అనుసరిస్తారు.

జగన్నాథుడి రథం- 'నందిఘోష'. దీనికి గరుడధ్వజ, కపిధ్వజ- అనే నామాంతరాలున్నాయి. ఇది సుమారు నలభై అయిదు అడుగుల ఎత్తుతోనూ, అంతే విస్తీర్ణంతోనూ ఉండే బృహద్రథం. ఒక్కొక్కటి ఏడడుగుల వ్యాసంతో ఉన్న పదహారు చక్రాలు అమర్చిన రథమిది. ఎరుపు, పసుపు వస్త్రాలతో అలంకరిస్తారు. గరుడుని రక్షణలో ఉన్న ఈ రథానికి సారథి- 'దారకుడు'. ధ్వజం పేరు 'త్రైలోక్యమోహిని'. అశ్వాల పేర్లు- శంఖ, వలాహక, శ్వేత, హరిదశ్వ. శంఖుచూడుడనే నాగదేవత దీని పగ్గాలకు అధిదేవత. ఈ రథాన్ని అధిష్ఠించి ఉండే దేవతలు- వరాహ, గోవర్ధన, గోపీకృష్ణ, నృసింహ, రామ, నారాయణ, త్రివిక్రమ, హనుమ, రుద్ర (తొమ్మిదిమంది).

బలభద్రుడి రథం పేరు 'తాళధ్వజ'. ఇది సుమారు నలభై నాలుగడుగుల ఎత్తయిన రథం. పద్నాలుగు చక్రాలు అమర్చి ఉంటాయి. ఎరుపు, ఆకుపచ్చటి వస్త్రాలతో అలంకరిస్తారు. వసుదేవుడు రక్షకుడు. సారథి పేరు- మాతలి. గుర్రాల పేర్లు- తీవ్ర, ఘోర, దీర్ఘశర్మ, స్వర్ణనవ. పగ్గాలను అధిష్ఠించే నాగదేవత- వాసుకి. అధిష్ఠించి ఉండే తొమ్మిది దేవతలు- గణేశ, కార్తికేయ, సర్వమంగళ, ప్రలంబరి, హతాయుధ, మృత్యుంజయ, నతాంవర, ముక్తేశ్వర, శేషదేవ.

సుభద్రాదేవి రథం- దర్పదళన. దీనికి పద్మధ్వజ, దేవదళన అనే పేర్లు కూడా ఉన్నాయి. పన్నెండు చక్రాలమర్చిన ఈ రథం సుమారు నలభైరెండు అడుగుల ఎత్తయినది. ఎరుపు, నలుపు వస్త్రాలతో అలంకృతమైనది. జయదుర్గాదేవత- రథ రక్షకురాలు. సారథి పేరు అర్జునుడు. ధ్వజం పేరు 'నాదాంబిక'. అశ్వాల పేర్లు- రోచిక, మోచిక, జిత, అపరాజిత. పగ్గాలకు అధిదేవత 'స్వర్ణచూడ' అనే నాగదేవత. అధిష్ఠించిన తొమ్మిది దేవతలు- చండి, చాముండి, ఉగ్రతార, వనదుర్గ, శూలిదుర్గ, వారాహి, శ్యామాకాళి, మంగళ, విమల.

ఈ రథాలను అక్షయ తృతీయ (వైశాఖ శుద్ధ తదియ) నాడు నిర్మించేందుకు సిద్ధమవుతారు. ఆ రోజున 'చందన యాత్ర' ఉత్సవం జరుగుతుంది. జ్యేష్ఠపూర్ణిమనాడు 'స్నానయాత్ర' మహోత్సవం. విగ్రహాలను స్వర్ణకూప జలాలను నూట ఎనిమిది కలశాలతో స్నానం చేయించి రెండు వారాలపాటు దర్శనీయం కాకుండా వేరే గదిలో ఉంచుతారు. చక్కని వర్ణాలతో చిత్రితమై, అలంకృతమైన మూర్తులను 'రథయాత్ర' నాడు ప్రజలు దర్శించవచ్చు. 'బొడొదండొ' అని ఉత్కళ భాషలో వ్యవహరించే ప్రధాన విశాల రాజమార్గాన ఈ మూడు రథాలు, ప్రజలు తాళ్లుపట్టుకు లాగుతుండగా, నృత్యవాద్యకీర్తనల నడుమ, దివ్యమైన సందడితో వూరేగి 'గుండిచా' మందిరానికి చేరుకుంటాయి.

ఇక్కడ నవదినోత్సవం- ఆషాడశుద్ధ దశమి వరకు జరుగుతుంది. ఈ కాలంలో వివిధ అవతారాలతో మూర్తులను అలంకరిస్తారు. ఈ యాత్రకు నవదిన యాత్ర, దశావతార యాత్ర- అని కూడా వ్యవహారం. అన్ని వర్గాల ప్రజలకు ఈ క్షేత్రంలో, ఈ యాత్రలో సమాన ప్రాధాన్యం లభిస్తుంది. భేదరహితమైన సమైక్య ఆధ్యాత్మికతకు సంకేతం ఈ భవ్యక్షేత్రం.

రథం నడిపేటప్పుడు 'డాహుక గీత' (డాహుకొబోలె) అనే ప్రాచీన గీతాలను పాడతారు. అసభ్యంగా అనిపించే ఈ గీతాల్లో కొన్ని సంకేతార్థాలున్నాయి. వీటివల్ల ఒక ప్రత్యేక శక్తి జాగృతమై ఈ మహారథాలను నడిపిస్తుందని- వీటి శాస్త్ర రహస్యవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు.

రథయాత్ర ఈ తిథినాడు విష్ణువుకు జరపడం శ్రేష్ఠమని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రథయాత్ర ప్రేరణతో ప్రభావంతో ఎన్నో చోట్ల ప్రపంచంలో మహోత్సవాలు జరుగుతున్నాయి. ఒడిశాలోని పర్లాకిమిడి, జయపూర్‌ లాంటి ప్రాంతాల్లో పెద్దయెత్తున నిర్వహిస్తారు. ఇంకా దేశంలో అనేక ప్రాంతాల్లోనే కాక, కృష్ణచైతన్య సంస్థవారి ఆధ్వర్యంలో న్యూయార్క్‌, టొరంటో, లండన్‌, ప్యారిస్‌, సింగపూర్‌, బర్మింగ్‌హాం లాంటి అనేక చోట్ల, విదేశాల్లోనూ జగన్నాథ రథయాత్ర జరుగుతోంది.

విశ్వరథంపై అధిష్ఠించి నడిపించే విష్ణుదేవుడి లీలావైభవానికి ప్రత్యక్షరూపంగా ఈ రథయాత్రను సంభావించవచ్చు.
                                                                - సామవేదం షణ్ముఖశర్మ 

Monday, 8 July 2013

మరపు నిత్యావసరం

    నిత్యజీవితంలో ప్రతి ఒక్కరికీ ప్రతికూల సందర్భాలు ఏదో రూపంలో, ఎప్పుడో ఒకప్పుడు ఎదురవుతూనే ఉంటాయి. అనుకున్నది అనుకున్నట్లుగా జరగకపోవటం, వూహించినదొకటైతే జరిగేది మరొకటి కావడం, మంచికి పోతే చెడు ఎదురుకావడం... ఇలా... అవి ముఖ్యమైనవా కాదా... ఆలోచించదగినవా కావా అన్న విషయాల్ని పక్కన పెడదాం. ఇటువంటివి తరచూ ఎదురైనప్పుడు వాటి ప్రభావం మనమీద తప్పక పడుతుంది. నిరాశాభావాన్ని కలగజేస్తుంది. ఇటువంటి పరిణామాలు మనోఫలకంపైన ముద్రవేస్తాయి. ఆ తరవాత నిరుత్సాహం మనసు నిండా అలముకుంటుంది. అది దట్టంగా కమ్ముకోకముందే ఎప్పటికప్పుడు మరచిపోయే దిశలో ప్రయత్నాలు సాగించాలి. జరిగిన, జరుగుతున్న మంచివైపు ఆలోచనలను మళ్ళించాలి.

జరిగినది ఏదైనా మన పరిధిలోకి రాకపోవచ్చు. ప్రమేయమూ లేకపోవచ్చు. అయితే మరచిపోయేందుకు ప్రయత్నం చేయడం ద్వారా దాన్ని జ్ఞాపకాల్లో నిక్షిప్తం చేసుకునే ధోరణిని తప్పించవచ్చు. ఇతరులు మన సలహాను పాటించకపోయినా మన పద్ధతిలో మనం కొంత నియంత్రణ చేసుకునే అవకాశముంది. అసలు విద్య అంటే ఏమిటి? పట్టభద్రులను తయారుచేయడం విద్య ఉద్దేశమా? కాదు. జీవించే కళకు అది రాజమార్గం ఏర్పరుస్తుంది. 'విద్య' ఆలోచింపజేస్తుంది. సక్రమ జీవన విధానాన్ని రూపొందిస్తుంది. ఎదురయ్యే అనుభవాలను అంచనా వేయగల శక్తిని ఇస్తుంది. సాధ్యాసాధ్యాలను లెక్కగట్టి దానికి మన శక్తి సామర్థ్యాలు ఎంతవరకూ సరిపోతాయో చెబుతుంది. విద్యావంతుడైనట్లయితే విలువలను బేరీజు వేసుకుని చేదు అనుభవాలను ఎలా మరచిపోవాలో తెలుసుకుంటాడు. ఇక్కడ సమస్య కేవలం మరచిపోవడం, పోలేకపోవడం కాదు. అన్ని రకాల అసంతృప్తుల మధ్యా జీవిస్తూనే వాటి ప్రభావాలకు లోనుకాకుండా ఉండగలగడం. ఈ అలవాటు ఎన్నో మంచి విషయాలకు మార్గం చూపిస్తుంది. మానసిక క్షోభను తప్పిస్తుంది. శక్తి సామర్థ్యాలు వృథా కాకుండా కాపాడుతుంది. నిరాశామయ భావాల్లో చిక్కుకోకుండా రక్షిస్తుంది. ఇవన్నీ కూడా సుఖమయ, అర్థవంతమైన జీవితానికి అవసరం. ప్రకృతి సిద్ధాంతాన్ని మనం మార్చలేం. కాబట్టి మనలోనే మార్పు తెచ్చుకోవాలి. అప్పుడే సుఖమయ జీవితానికి మార్గం సుగమం అవుతుంది.

మరచిపోవలసిన విషయాలు కొన్ని ఉంటాయి. వాటిని మరచిపోవడానికి సిద్ధం కాకపోతే నష్టమే. చేదు జ్ఞాపకాలకు దురదృష్టకరమైన ఆలోచనలు ఆహారాన్ని అందిస్తుంటాయి. వాటిని అనుక్షణం నెమరు వేసుకుంటూ పోతే వ్యక్తిత్వం పైన 'చెడు' ప్రభావం పడుతుంది. 
మంచి, చెడు రెండు రకాల జ్ఞాపకాలు. 'మంచి' శక్తిని అందిస్తే, 'చెడు' నిర్వీర్యం చేసి బతుకును దుర్భరం చేస్తుంది. ఈ తేడాను గుర్తించి విచక్షణను పెంచుకోవాలి. 

'జ్ఞాపకం' మెదడులోని అంతర్భాగం. దాని నుంచి అంత తేలిగ్గా తప్పించుకోలేం. ఒక్కటే మార్గం- చైతన్యంలో ఉండే బుద్ధికి ఆ బాధ్యతను అప్పజెప్పాలి. మరచిపోయే అలవాటు దీనికి దోహదపడుతుంది. 
జ్ఞాపకం సక్రమమైనదైనట్లయితే ఆశావహ దృక్పథాన్ని, చెడైనట్లయితే నిరాశా ధోరణిని కలిగిస్తుంది. దీన్ని అదుపులో పెట్టగలిగే నైపుణ్యాన్ని మనిషి సంపాదించుకోవాలి.
                                                                  - మంత్రవాది మహేశ్వర్‌

Sunday, 7 July 2013

గమ్యం


ఇద్దరు బాటసారులు ఒక ఎడారిలో నడిచి పోతున్నారు. ఇద్దరి గమ్యస్థానం ఒక్కటే! 'ఈ ఎడారిలో ఒకచోట శీతలజలం గల గొప్ప సరస్సు ఉంది. అక్కడకు చేరుకుంటే కష్టాలన్నీ కడతేరినట్లే!' అని పెద్దలు చెప్పగా ఇద్దరూ విన్నారు. ఆ మాట నమ్మి ఇద్దరూ ఎంతదూరం ప్రయాణించినా చెరువు జాడే కనపడలేదు. పైన ఎండ మండిపోతోంది. కింద ఇసుక నిప్పుల కొలిమిలా ఉంది. నాలుక పిడచకట్టుకుపోతోంది. దాహంతో బాటసారులు తపించిపోతున్నారు. దూరంగా నీటి మడుగులు కనబడుతున్నాయి. ఇద్దరిలో ఒకడు గబగబా అక్కడికి చేరుకున్నాడు. తీరా చూస్తే అక్కడ ఇసుక దిబ్బలు తప్ప నీటిజాడే లేదు.

రెండో బాటసారి నిబ్బరంగా ఉన్నాడు. ఎండమావులు ఎలా భ్రాంతి పెడతాయో అతడికి తెలుసు. మొదటి వ్యక్తికి తెలియదు. అందువల్ల మాటిమాటికీ నిరాశా నిస్పృహలకు లోనవుతున్నాడు. 'ఇక నేను గమ్యస్థానం చేరలేను!'- ఈ ఆలోచన రాగానే అతడి కాళ్లు వణికాయి. ఉన్న కాస్త సత్తువా హఠాత్తుగా హరించుకుపోయింది. తూలి, కూలిపోయాడు. రెండో బాటసారి 'కొంచెం ఓపిక పట్టు! అదిగో ఆ కనబడే చెట్ల వెనకాల తళతళ మెరిసే నీళ్లు కనబడటంలేదా? దగ్గరకు వచ్చేశాం. లే లేచి నడువు, నా భుజం మీద చెయ్యి వెయ్యి. నిన్ను కూడా గమ్యస్థానానికి చేరుస్తా' అన్నాడు. 'కాదు, అంతా భ్రాంతే. ఆ కనబడేది కూడా ఎండమావే... అంతా వట్టిదే... మనం ఎప్పటికీ గమ్యస్థానం చేరలేం' అంటూ మొదటి బాటసారి కళ్లు మూశాడు. రెండో బాటసారి పట్టు వదలకుండా ముందుకు సాగిపోయాడు. కొద్దిదూరంలోనే శీతల జలాశయం నయనానందకరంగా దర్శనం ఇచ్చింది. అతడి జీవిత లక్ష్యం నెరవేరింది.

నిజానికి అందరి గమ్యమూ ఒక్కటే! ఇది ఒకే ప్రపంచం. అన్నింటిలోనూ ఏకత్వమే భాసిస్తుంది. వ్యక్తులు మాత్రం స్వతంత్రులు. సత్యాన్వేషకులు. మొదట్లో అందరివీ సుసంపన్నమైన ఆదర్శాలే. ఈశ్వర తత్వాన్ని అన్వేషించాలనే తపన అందరికీ ఉంటుంది. ఆ దిశగా కార్యోన్ముఖులవుతారు. ప్రయాణం మొదలుపెడతారు. కొందరిని అజ్ఞానం ఆవరిస్తుంది. వాళ్లు నిరాశకు లోనవుతారు. తాము అసమర్థులమని భావిస్తారు. కుంగిపోతారు. మానసిక బలహీనత పొరపాట్లకు, నేరప్రవృత్తికి దారితీస్తుంది. వాళ్లు బాధలు అనుభవిస్తారు. మాయ ఆవరించి ఉన్నంతవరకూ ఈ కష్టాలు తప్పవు. వీటిని దూరం చేసుకోవడానికి ఆధ్యాత్మిక మార్గం రాచబాట. ఈ దారిలో ప్రయాణం సుఖప్రదం.

ఈ నిస్సహాయ భావనకు నైరాశ్యానికి కారణం ఎవరు? మనమే! ఎవరో వచ్చి మనకు సహాయం చేస్తారనుకోవడం భ్రమ. మనకు చేయూత మన లోపలినుంచే లభిస్తుంది. మన ప్రయాణం వృథా కాదు. అప్పుడప్పుడు దారి తప్పవచ్చు. మార్గాయాసం కలగవచ్చు. తుదకు అవన్నీ మనకు ఉపకరించేవే. 'గమ్యం చేరే వరకు ఆగవద్దు... జాగృతి చెందండి' అని ఉపనిషత్‌ బోధ. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసినవారు గమ్యం చేరుకోగలుగుతారు. వారే మనకు ఆదర్శం.

జగత్తు ఒక రంగస్థలం. అందరూ పాత్రధారులే. వీధిలో ఒక తుంటరి ఒక యువతిని అవమానిస్తున్నాడు. దారిన పోయేవాళ్లు అది చూసి ఆగ్రహించారు. వెంటనే ముందుకు ఉరికి వాడికి దేహశుద్ధి చేసి 'ఇక ఎప్పుడైనా ఇలా అబలలను అవమానిస్తే నీ అంతు చూస్తాం!' అని గట్టిగా బుద్ధి చెప్పారు. ఇలా ధర్మసంస్థాపనకు నడుం బిగించినవాళ్లు ఒక నాటకశాలకు వెళ్లారు. అక్కడ 'ద్రౌపదీ మాన సంరక్షణం' నాటక ప్రదర్శన జరుగుతోంది. దుర్యోధన దుశ్శాసన పాత్రధారులు విజృంభించి నటిస్తున్నారు. వారి ప్రతిభను ప్రశంసిస్తూ ప్రేక్షకులు మళ్ళా మళ్లా వారిచేత ద్రౌపదీ వస్త్రాపహరణం గావింపజేస్తూ, సంభాషణలు చెప్పిస్తూ హర్షధ్వానాలు గావిస్తున్నారు! ఈ ప్రేక్షకులకు తెలుసు- ఇదంతా వట్టిదే... ఉత్త మాయ... భ్రాంతి అని. జగన్నాటకంలో ఇదొక అంతర్నాటకం!

'ఇది నిజంగా మన ఎదుట జరుగుతున్నది' అని భ్రాంతి చెందితే దుర్యోధన దుశ్శాసన పాత్రధారులపై ప్రేక్షకులు కక్ష వహిస్తారు. కానీ, నాటకంలో లీనమైన సహృదయులు తాత్కాలికంగా రసానుభూతి చెంది కాసేపు మైమరచిపోతారు. భవభూతి రచించిన ఉత్తర రామచరితం నాటకంలో 'అంతర్నాటకం' ఉంది. రామలక్ష్మణుల వినోదార్థం వాల్మీకి ఒక నాటకం ప్రదర్శింపజేస్తాడు. అన్నగారి ఆనతిని అనుసరించి లక్ష్మణుడు సీతమ్మను అడవిలో దించిపోవడంతో ఆ అంతర్నాటకం ఆరంభమవుతుంది. రాముడు తన జీవితాన్నే ఒక నాటకంగా చూడవలసి వచ్చింది. ఆనందం బదులు రాముడికి పట్టరాని దుఃఖం కలిగింది. శోకంతో స్పృహతప్పి పడిపోతాడు. మాయామేయ జగం సత్యమని మానవుడు ఎంత భ్రాంతి పడతాడో భవభూతి ఈ నాటక ఘట్టంలో చిత్రించాడు.

ఈ మాయ మాటిమాటికీ మనల్ని ఆవరిస్తూ, ఆవహిస్తూ ఉంటుంది. భ్రాంతులనుంచి మానవుడు బయటపడటం కష్టమవుతూ ఉంటుంది. అందుకే ఎండమావుల్ని నీటి మడుగులుగా భ్రాంతిపడటం! ఆ మృగతృష్ణల్లో నీరు తాగే ప్రయత్నంలో తుదకు నైరాశ్యం మిగులుతుంది. గమ్యం చేరకుండానే జీవితం అంతం అవుతుంది.

జీవనం కోసం నటన చేయవచ్చుకానీ, నటనే జీవితం కాకూడదు. నటన యథార్థమని భ్రాంతి పడకూడదు. నటన జీవితానికి అనుకరణ మాత్రమే. ప్రకృతిలో కూడా అనుకరణలుంటాయి. నీటి మడుగుల్ని అనుకరించే ప్రకృతి వైచిత్రే ఎండమావి. అక్కడ నీరు ఉండదు. కానీ, నీటి మడుగు ఉన్నట్లు భ్రాంతి కలుగుతుంది. చలి చెలమ కోసం వెదికే ప్రయత్నంలో ఎదురయ్యే ఎండమావుల్ని చూసి మనసును చెదరనీయకూడదు. అలాగైతేనే గమ్యం చేరడం సాధ్యం!
                                                        - డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు 

Saturday, 6 July 2013

మనసే మిత్రుడు, శత్రువు

    జీవితం ఏమిటి, దీని వెనక అసలు రహస్యం ఏమిటి? ఈ ప్రశ్నలు యుగాలుగా మానవాళిని వేధిస్తున్నాయి. ఇవి అంతుచిక్కని ప్రశ్నలు. మనం ఎవరం, ఈ ప్రపంచానికి ఎలా వచ్చాం, ఎక్కడి నుంచి వచ్చాం, ఎటువైపు పయనిస్తున్నాం? ప్రాచీన మహాద్రష్టలు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి ప్రయత్నించారు. వారి మాటల్ని ఎవరైనా ఆమోదించవచ్చు. తిరస్కరించవచ్చు. వారివారి నమ్మకాలు, విశ్వాసాలను బట్టే నిర్ణయం!

ఆత్మ భూమిపై జన్మ ఎత్తి భగవద్దర్శనం కోసం, ఆ అంతిమ దివ్య అనుభవం కోసం నిరీక్షిస్తుంటుందంటారు. ఈ జన్మ ఆత్మకు గొప్ప అవకాశం. భగవంతుడు- జ్ఞానం, పరిపూర్ణత్వం, ఆనందం కలిసి మెరిసే అనంతం. ఆయన అనంత ప్రేమ జీవ, నిర్జీవ రాశులపై సమానంగా ప్రసరిస్తుంది సూర్యకిరణావళిగా.

మంచి మాటలు, మంచి ఆలోచనలు, మంచి పనులు మనిషిని దైవానికి దగ్గరగా తీసుకుని వెళ్తాయి. వాటి ద్వారా భగవంతుని జ్ఞానాన్ని పొందడానికి ఆత్మ ప్రయత్నిస్తుంటుంది. మౌలికంగా సృష్టితత్వాన్ని మూడు విభాగాలుగా చెబుతారు. భగవంతుడు (పతి), ఆత్మ (పశు), బంధం (అదే పాశం) అని ప్రాచీన శాస్త్రాలు ప్రబోధించాయి. ఈశ్వరుణ్ని పశుపతి అనడంలో అర్థం అదే. ఆయనే పశుపాశ విమోచకుడు.

ఆత్మ మానవదేహం ధరించగానే ప్రపంచంతో బంధమేర్పడుతుంది. అహం, కర్మ, మాయ (మాయ అంటే వ్యామోహం) ఆత్మను ఆవరించి ఉంటాయని; గత కర్మల అవశేషాలను ఆత్మ తనతో తెచ్చుకుంటుందని ఎందరో చెబుతారు. ఈ బంధాన్ని తెంచడం అంత సులభం కాదని, జీవితంలోని ఆకర్షణలు, సుఖాలు అన్నీ ఆత్మ విముక్తికి అడ్డుగా నిలుస్తాయని పురాణవచనం. వ్యక్తిగత ప్రయత్నాలు ఎన్ని చేసినా భగవంతుడి కృప కనుక లేకపోతే ఈ బంధాల నుంచి ఎవరూ బయటపడలేదన్నది మాత్రం ఎవరూ కాదనలేని సత్యం.

గొప్ప తపస్సు చేసిన విశ్వామిత్రుడు వంటి రుషి పుంగవుడే కోరికలకు లొంగిపోయినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆధ్యాత్మిక మార్గం లో సాధన చేస్తున్నప్పుడు కోరికలు, కోపం, అహంకారం, వ్యామోహాలు మొదలైనవి అవరోధాలుగా నిలుస్తాయి. ముక్తికోసం ఆత్మచేసే అన్వేషణలో మనసు, బుద్ధి అహంకారం కీలక పాత్ర వహిస్తాయి. వాటిని అంతరిం ద్రియాలు లేదా అంతఃకరణ అంటారు. ఈ అంతఃకరణ మనకు మిత్రుడు, శత్రువు కూడా! ముక్తికోసం మన ప్రయత్నాలు ఫలించడానికి, విఫలం కావడానికి అంతఃకరణే కారణం.


ఐహిక సుఖాలను అనుభవించాలని మనసే ఇంద్రియాలను ప్రోత్సహిస్తుంది. ఇంద్రియాలను తన అధీనంలో పెట్టుకుని, వాటిని భగవంతుడివైపు మళ్ళించేదీ మనసే. శత్రువులాంటి మనసుతో మైత్రి చేసుకుంటే ముక్తిసాధన సులభతరమవుతుంది. మన ఆత్మకు పాశవిక కర్మపాశాలతో భగవంతుడు గట్టి చిక్కుముడి వేశాడని భావించి దాన్ని విప్పడానికి తంటాలు పడుతుంటాం. అది చిక్కుముడి కాదు. జారుముడి. మనం దాన్ని విప్పే ప్రయత్నంలో అది మరింత బిగుసుకుని పోతుంది. కాని, ఇంకా లోతుగా ఆలోచిస్తే- అసలు ఆయన ఏ ముడీ వేయనేలేదని బోధపడుతుంది. మన ఆత్మ నిత్య విముక్తం. నిత్య స్వేచ్ఛా పథగామి.
                                                                             - కె.యజ్ఞన్న

జీవనగమ్యం ..


 మానవ జన్మ గొప్పది. దీన్ని భోగమయం కావించి రోగమయం చేసుకోరాదు. చేసుకుని చింతించిన ప్రయోజనం ఉండదు. దేహాన్ని పవిత్రంగా భావించాలి. దివ్యత్వాన్ని ప్రకటించే ఉత్తమ సాధనంగా మార్చుకోవాలి.

మన దేహాన్ని ఆధ్యాత్మిక సాధనంగా మార్చుకోవాలి. తుచ్ఛమైనదని భావించరాదు. భగవద్గీత దేహాన్ని క్షేత్రంగా పేర్కొంది. ఈ దేహమనే పొలాన్ని చక్కగా చూసుకొని ఉత్తమ ఆధ్యాత్మిక ఫలాన్ని అందుకోవాలి. దేహం దేవాలయం వంటిదన్నారు విజ్ఞులు. మనిషి పోకడలు విచిత్రంగా ఉంటాయి. అందుకు కారణం మన ఆశలు. వాటిలో ప్రధానమైనది కీర్తి సంపాదించాలన్న కోరిక!

ఒక గొప్ప శిల్పి ఉండేవాడు. తన రూపాన్ని పోలిఉండే శిల్పఖండాలను చాలా నిర్మించాడు. ఒకమారు వాటి మధ్య పడుకొన్నాడు. మృత్యుదేవతకు, అతగాడి అసలు దేహమేదో, నకలు దేహమేదో తెలియలేదు. మృత్యుదేవత ఆలోచించింది. 'ఆహా, ఎంత అద్భుతం... ఎవరో ఈ శిల్పి. అపూర్వ సృష్టి' అని ప్రశంసించింది. అది విన్న వెంటనే శిల్పి ఆనందంతో లేచి 'నేనే' అన్నాడు. మృత్యుదేవత అతణ్ని లాక్కుపోయింది.

మనసు భావోద్వేగాల సాగరం. మనసు ద్వారానే ఆత్మ గొప్పదనాన్ని తెలుసుకోవాలంటుంది ఉపనిషత్తు. నిగ్రహం లేని మనసు, మనిషిని నరకకూపంలో పడవేస్తుంది. నిగ్రహం కలిగిన మనసు మనలను దైవసన్నిధికి తీసుకొని వెళ్తుంది. దానికి జ్ఞానరూపమైన ఉత్తమ ఆహారాన్ని అందించాలి. జ్ఞానం మనకు శక్తిని అందజేస్తుంది. నైతికశక్తివల్ల ఇచ్ఛాశక్తి పెరుగుతుంది. ప్రేమ, దయ, సానుభూతి, సేవాభావం వంటి భావనాత్మక గుణాలు పెంచుకోవటంవల్ల భావశుద్ధి ఏర్పడుతుంది.

దేహేంద్రియాల సర్వతోముఖాభివృద్ధి సాధించడంతోపాటు, వాటికి అతీతంగా మనం జీవనం సాగేలా ప్రయత్నించాలి. ఈ ప్రయత్నాల ఫలితంగా సాధించిన ఫలితాన్ని జ్ఞానులు తమ అనుభవాలు, ఉపదేశాల ద్వారా బోధిస్తారు.

ఒకటి భక్తిమార్గం. మనకంటే మిన్నదైన శక్తినే భగవంతుడు అంటాం. మనం భగవంతుడికి శరణాగతులం కావాలి. మరొకటి జ్ఞానమార్గం. మన వ్యవహారాలన్నింటికీ కాక, మన ఆలోచనలకు ఆధారమైనది. నేను ఎవరిని అని అన్వేషించడమే ఉత్తమ మార్గం. భగవాన్‌ రమణ మహర్షి 'నేను' ఎవరో తెలుసుకొనేందుకు యత్నించమన్నారు. ఆ యత్నమే మన జీవనగమ్యం కావాలి. సత్యాన్ని నిరూపించడానికి ఎన్నో శాస్త్రాలు, ఇతిహాసాలు వెలువడ్డాయి. మహాత్ములు, భక్తులు, అవతార పురుషులు- తాము తెలుసుకొన్న పరమసత్యాన్ని లోకానికి చాటిచెప్పారు.


మన ఆకలి నివారణకు మనమే ఆహారం సేవించాలి. ఇతరులు తింటే మన ఆకలి తీరదు. 'శ్రద్ధావాన్‌ లభతే జ్ఞానం' అన్నాడు గీతాచార్యుడైన కృష్ణ భగవానుడు. అదే మన మహర్షులు, యోగులు అనుసరించిన మార్గం. అప్పుడే మన జీవితం సార్థకం కాగలదు. అదే మన జీవనగమ్యం కావాలి.
                                                                                                                           - డాక్టర్‌ జానమద్ది హనుమచ్ఛాస్త్రి