ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Monday, 24 June 2013

పరమాత్మతో ప్రయాణం


    సాధన అంటే ఎన్నుకున్న ధ్యేయాన్ని సాధించే ప్రయత్నం... బాధతోనో, ఆనందంతోనో. అది మనం ఎన్నుకున్న ధ్యేయాన్నిబట్టి ఉంటుంది. ఆధ్యాత్మిక సాధన ఆనంద రసపూర్ణం. ఆ రసం అవిరళ ధారాసదృశం. అంతర్లీనంగా బాధ కూడా ఉంటుంది. తీయని బాధ. తాళలేని బాధ. సాధకుడు.... కావాలని మరీ మరీ కోరుకుని మనసుకు ఎక్కించుకున్న బాధ. మనం ఒక గొప్ప అంశాన్ని కోరుకుని, దాన్ని పొందే ప్రయత్నంలో తగిలే బాధ. రగిలే బాధ. ఇష్టమైన బాధ. సాధనలోని కష్టంలోనూ ఇంత ఇష్టముందంటే, ఇంత మాధుర్యం ఉందంటే మనం కోరుకుంటున్న ఆ అంశం మరెంత అపురూపమై ఉండాలి, ఎంత అమృతతుల్యమై ఉండాలి? మరి దాని సాధనలో మనం తీసుకోవలసిన శ్రద్ధ ఏమిటి, అనుసరించాల్సిన పద్ధతి ఏమిటి?

కొన్ని లక్ష్యాలు బాహ్యోపకరణాల సాధనతో సరిపుచ్చేవి. కొన్ని ఆంతరిక సాధనకుగానీ లభించనివి. పరమపదం అలాంటిది. అది అంతరంగ సాధన. ఆంతర్య శోధన. ఉపకరణం... వేదన! అది ప్రేమతో, ఆర్తితో కూడిన వేదన. ఈ సాధనలో, సాధనా సాగర మథనంలో ప్రాణం పెట్టాలి. ప్రాణం పోయాలి. సామాన్యంగా ప్రాణం కంటే విలువైంది మనకు మరోటుండదు. అలాంటి ప్రాణాన్నీ తృణప్రాయంగా పణం పెట్టి మరీ చేయాలి. సాధనా సంబారాల్లో అంతకంటే విలువైందీ, ఘనమైందీ మన దగ్గర మరోటి లేదు. అయితే ప్రాపంచిక అమూల్య ఉపకరణాలను, ప్రాణాలనూ కేవలం తులసీదళ సమానంగా తూచే వస్తువు మన దగ్గరొకటుంది. అది ప్రపంచాన్ని జయించగలది. విశ్వాన్ని అధిగమించగలది. సంకల్పం చేసుకుంటే భగవంతుణ్ని గెలుచుకోగలది. అదే అంతరంగం. మన సాధనతో దాన్ని ఉపకరణం చేయాలి. సంబారంగా ఉపయోగించాలి.

 ఉదాహరణకు మనం జపం చేస్తాం. ఎలా? అందులో మనకు పూసల సంఖ్య ముఖ్యం. నూట ఎనిమిది పూసలు. ఒక కొలికి పూస. కొలికి పూస తరవాతి పూస నుంచి జపం మొదలుపెట్టింది మొదలు మళ్ళీ కొలికి పూస వచ్చేవరకూ దానిమీదే ఉంటుంది ధ్యాస. జపం మీద కాదు- కొలికిపూస మీద. ఎక్కడ దాన్ని దాటిపోతామోనని. ఎందుకంటే నూటఎనిమిది పూసల తరవాత వచ్చే కొలికి పూసను దాటి అవతలకు పోరాదు. మళ్ళీ వెనక్కు తిప్పాలి. ఇదీ మన జపం! ఇదా జపం! కాదేమో. అయితే అది అందరి గురించీ కాదు. కొందరి గురించి మాత్రమే. జపం అంటే ఏమిటి? ఒక యజ్ఞం. జపయజ్ఞం. యజ్ఞాల్లోకెల్లా ఉత్తమ యజ్ఞం. అష్టాంగ యోగంలోని ఏడో అంగమైన ధ్యానానికి దారితీసే మహాసాధన. మహోన్నత సాధన. రత్నాకరుడనే బోయ, నారదుడు ఉపదేశించిన 'మరా' అనే రామనామాన్ని జపించి జపించి, తపించి తపించి వాల్మీకి మహర్షిగా రూపాంతరం చెందేందుకు దారిచూపిన మహోజ్జ్వల జ్యోతి. మన చేతుల్లో ఉండే జపమాల ఒక పూసల దండ కాదు. మన భగవత్‌ సాధనలో దాదాపు మూడువంతుల వరకు మనకు తోడుండే ఒక అండ. మునుముందుకు సాగడానికి మనకు అనుక్షణం ధైర్యాన్నందించే ఒక కొండ. అలాంటి జపమాలను చేతుల్లోకి తీసుకుంటేనే మన మనసు ప్రఫుల్లమైపోవాలి. పులకరించిపోవాలి. జప ప్రారంభంగా కళ్లు మూయకముందే అవి అరమోడ్పులై ఆనంద పారవశ్యం చెందాలి. జపమాలతో భగవంతుడి నామాన్ని ఉచ్చరిస్తే ఆయనను మన ముందుకు, మనలోకి ఆవాహన చేయమని ఆహ్వానించే ఒక మధుర వైఖరి. ప్రేమ పిలుపు.

 జపమాల....! వందలు, వేలు, లక్షలు, కోట్లసార్లు జపించి జపించి పండిపోయిన జపమాలలోని పూసలు ఒక్కోనామాన్ని లేదా గురు ప్రసాదిత మంత్రాన్ని సాధకుడు జపిస్తూ ఉంటే బీజాక్షరామృతాన్ని తాగలేక అతిశయ మాధుర్యంతో ఉన్మత్తమై మత్తిలి సాధకుడి చేతుల్లో ఆనంద విశ్రాంతంలో ఉండిపోతుంది జపమాల. మనం జపమాలను చేతితో తిప్పుతుంటే గండకీ నదిలోని సూక్ష్మపరిమాణ శివలింగాలు మన భాగ్యవశాన చేతిలో, వేళ్ల మధ్య ఒకటొకటిగా తిరుగుతున్న వాస్తవానుభూతి కలగాలి. స్పర్శాసాధనగా అంతరంగం అమృతోపమానం అయిపోవాలి. ఆధ్యాత్మిక హృదయం దగ్గర జపంతో మాల తిరుగుతూ ఉంటే మన హృదయాన్ని స్పృశిస్తూ ఆశీర్వదిస్తూ కిందికి జారుతున్న పూసలు మనం భగవంతుడికి దగ్గరవుతున్న ఆశ్వాసన ఇస్తున్న అమ్మలా అనిపించాలి.

 జపం... అంకెల లెక్క కాదు. సంఖ్యల గారడి కాదు, అది మన సాధనా పయనంలో పూలబాట. పూసల ఆట కాదు. ఇది నిజం... మనం జపిస్తూ వదిలిపెడుతున్న ఒక్కో పూసా మంత్రపూరిత అమృతాన్ని మోసుకుపోయిన కలశంలా వెళ్లి పరమాత్ముని అభిషేకిస్తుంది. సాధనలోని ప్రతి సూక్ష్మాంగాన్నీ మనం ఇలాగే- కాదు కాదు- ఇంతకంటే అధికంగా, అధికాధికంగా, అపురూపంగా అత్యంత ప్రేమ పూర్వకంగా ఆచరించాలి. అనుభవించాలి. భగవంతుడితో కలిసే మనం భగవంతుడికై ప్రయాణించాలి. ఎంత అద్భుతమైన ప్రయాణం!
- చక్కిలం విజయలక్ష్మి 

No comments:

Post a Comment