ప్రతి నెల కృష్ణపక్షం ఆఖరిరోజు అమావాస్య. మహాలయ అమావాస్య ఏడాదికొకసారి వస్తుంది. ఆ రోజు పితృదేవతలకు తర్పణం చేస్తే వాళ్లకు మోక్షం కలుగుతుందని శాస్త్ర వాక్యం. కాబట్టి, అమావాస్య కూడా మంచి దినమే. దక్షిణాదిలో సౌర పంచాంగం ప్రకారం దీన్ని ఒక పవిత్ర దినంగానే పరిగణిస్తారు. కాలప్రభావం వల్ల కొన్ని అపోహలు ఏర్పడి అమావాస్యకు తీరని అన్యాయం చేస్తున్నాయనే చెప్పాలి. చీకటి అంటే భయపడే మనిషి తత్వానికి ఇదొక నిదర్శనంగా చెప్పవచ్చు. ఒకప్పుడు ఉన్నదంతా అజ్ఞానపు చీకటేనని, విజ్ఞాన పుంజం ఆ చీకట్లో నుంచే బయలుదేరిందని వేదం చెబుతోంది. మరి కాస్త లోతుగా పరిశీలిస్తే, అమావాస్యకు ఉన్న ప్రాధాన్యం ఏమిటో తెలుస్తుంది.
అ+మ+వాస= అమావాస్య. అ అంటే అర్కుడు లేక సూర్యుడు. మ అంటే చంద్రుడు. అంటే, సూర్యచంద్రులు అమావాస్య రోజు చేరువై ఒకేచోట నివసించే రోజు కాబట్టి అమావాస్య అన్న పేరు సార్థకం అయింది. కొంతమంది ఈ అపురూప సంఘటనను స్వార్థం కోసం వాడుకోవచ్చు. మంత్రతంత్రాలు ఉపయోగించి కొన్ని క్షుద్రశక్తుల్ని వశీకరణం చేసుకోవడానికి యత్నిస్తారనీ అంటారు. అంతమాత్రాన అమావాస్యకు దోషం ఆపాదించటం తగదు. లయం అంటే ఆలింగనం, కలిసిపోవటం, విశ్రమించటం, కరిగిపోవటం. పరమాత్మ జీవాత్మల సంయోగానికి, సంగమానికి అది సంకేతం. అమావాస్య తరవాత శుక్లపాడ్యమి నుంచి చంద్రుడు రోజురోజుకు కొత్త కళలను పుంజుకొని పౌర్ణమిరోజు షోడశ కళాపూర్ణుడవుతాడు. చైత్రమాసంలో శుక్లపాడ్యమి రోజే నూతన సంవత్సరం మొదలు కావటమూ శుభసూచకమే. ఎటు చూసినా, అమావాస్యకు అనవసరమైన ఒక భయానక ముద్ర పడటానికి ఇదివరకు చెప్పుకొన్న కారణాలు తప్ప, వేరే ఎలాంటి వంక పెట్టనవసరం లేదనిపిస్తుంది.
ఆధ్యాత్మిక దృష్టికోణం నుంచి పరిశీలించినప్పుడు ఒక సత్యం అంగీకరించక తప్పదు. సూర్యుడు అంటే ఆత్మ. సూర్యుడి వెలుగు ఆత్మజ్ఞానానికి చిహ్నం. చంద్రుడు మనసుకు సంకేతం. వెన్నెల రోజుల్లో మనోచాంచల్యం మరింత విజృంభిస్తుందని మనోధర్మశాస్త్రం చెబుతోంది. ఆంగ్లంలో 'ల్యూనటిక్' అన్న పదం చంద్రుడి (లూనార్) వల్లే వచ్చింది. గాఢనిద్రలో ఆదమరచి మనిషి నిద్రపోతున్నాడంటే దానికి కారణం చంచలమైన మనసు, స్థిరమైన ఆత్మస్థానంలో చేరుకోవటమే. ఈ కలయిక సుస్థిరమైనప్పడు ఆ వ్యక్తి స్థితప్రజ్ఞుడవుతాడు. యోగి ధ్యానావస్థలో సమాధి స్థితి చేరుకున్నప్పుడు మనసు ఆత్మరతిలో నిరతిశయానందం పొందుతుంది. సుషుప్తిలో తాత్కాలికమైన ఈ అనుభూతి, ధ్యానావస్థలో యోగికి శాశ్వతంగా దక్కుతుంది. పితృ దేవతలను మహాలయ అమావాస్యనాడు నిత్యముక్తుల్ని చేయటానికి తర్పణం వదలటం ఇందుకోసమే. సూక్ష్మ శరీరం అంటే మనసే. మనోలయమే మహాలయం!
- ఉప్పు రాఘవేంద్రరావు
No comments:
Post a Comment