ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Wednesday 2 October 2013

ధర్మ రక్షణ


ప్రపంచంలోని గొప్ప జీవన సూత్రాలెన్నో మనదేశంలోనే ఉద్భవించాయి.  అయినా వెయ్యి సంవత్సరాలపాటు పారతంత్య్రంలో మగ్గిపోయాం. స్వాతంత్య్రానంతరమూ దేశంలో ప్రశాంతత నెలకొనలేదు. ఇందుకు కారణం ఏమిటి? మనకు సిద్ధాంతాలు కరవయ్యాయా? లేదు! ఆ సిద్ధాంతాలపై గాఢమైన అభిమానం కొరవడింది. భగవంతుడు అంతర్యామిగా అంతటా నిండి ఉన్నాడని వేదాంతాలు ఘోషిస్తున్నాయి. ఆత్మలోనే సర్వశక్తులూ ఉన్నాయని తత్వజ్ఞులు సెలవిస్తున్నారు. అయినా మన జాతికి ఆత్మవిశ్వాసం పూర్తిగా కలగలేదు. మంచి చెడుల నిర్ణయానికి తర్కం, అంతస్సాక్షి, శాస్త్రాధారాలు హేతువులని పెద్దలు చెబుతారు. వాటిని వదిలేసి కేవలం పాశ్చాత్యానుకరణే ధ్యేయంగా ప్రవర్తించడం విచారకరం. మనం నేర్చుకున్న పాశ్చాత్య విజ్ఞానం, మన ఆధ్యాత్మికత్వానికి లొంగి ఉండాలి.
శ్రీరామకృష్ణ పరమహంస వద్దకు ఒక యువకుడు వచ్చి, భారతీయ ధర్మశాస్త్రాలను దూషించిపోతూ ఉండేవాడు. ఒకరోజు మాత్రం భగవద్గీతను ప్రశంసించడం మొదలుపెట్టాడు. రోజూ అతడి మాటలు వింటున్నవారు ఆశ్చర్యపోయారు. పరమహంస ఇలా అన్నాడు- 'ఎవరో పాశ్చాత్యుడు భగవద్గీతను మెచ్చుకొని ఉంటాడు, అందువల్లనే మన మిత్రుడు ఇవాళ భగవద్గీతను మెచ్చుకుంటున్నాడు!'

అనుకరణ గొప్ప నాగరికత కాదు. అనుకరణ ఎంత ఎక్కువైతే, జాతి అంత అధఃపతనమవుతుంది. తనమీద తనకే విశ్వాసం లేనప్పుడు మనిషి అనుకరణను ఆధారం చేసుకొని మనుగడ సాగిస్తాడు. అటువంటివాళ్లు మనకు మార్గదర్శనం చేయలేరు. విదేశీయుల ఆమోదంకోసం ఎదురుచూడటం బానిసత్వానికి గుర్తు.

న్యాయాధీశులు, రక్షకభటులు, రైతులు, విద్యార్థులు... అందరూ- తమ కర్తవ్యాలను స్వేచ్ఛగా నిజాయతీగా నిర్వహిస్తే దేశంలో సుఖశాంతులు పరిఢవిల్లుతాయి. ధార్మిక రంగంలో స్వేచ్ఛకు హద్దులుంటాయి. నియమనిష్ఠలు మనిషిని సంస్కారవంతుణ్ని గావిస్తాయి. స్వేచ్ఛ అంటే సామాజిక నియమాలు లేని జీవితం కాదు. లక్ష్మణ రేఖలు ఉన్నంతకాలం మనకు భద్రత ఉంటుంది. అవి ఏర్పరచింది మన రక్షణకే! వేషాన్ని చూసి మోసపోతూ ఉంటారు. 'చెడు' కూడా 'మంచి' వేషం వేసుకొని వస్తే ఏమవుతుంది? రావణాసురుడు సన్యాసి వేషంలో సీతమ్మ వద్దకు వెళ్లాడు. వాడు తన అసలు రూపంలో వెళ్లినా, సీత గీతదాటకపోయినా, సీతాపహరణం జరిగేది కాదు. 'చెడు' తన నిజరూపంతో గెలవలేననుకున్నప్పుడు 'మంచి' వేషాన్ని ధరిస్తుంది. 'భారతదేశం భోగభూమి కాదు. ఇక్కడ సుఖలాలసతకు ప్రాముఖ్యం లేదు. ఇది కర్మభూమి. కర్తవ్య ప్రధాన భూమి!' అన్నారు మహాత్మా గాంధీ. కానీ, ఇప్పుడు జరుగుతున్నది అందుకు విరుద్ధం. మాటిమాటికీ మహాత్ముడి పేరు జపించే మనదేశంలో ఏం జరుగుతోంది? ఎవరి కర్తవ్యం వాళ్లు చేయని నిష్క్రియాపరత్వం అలముకుంది. ప్రయత్నం తక్కువ. లాభాపేక్ష ఎక్కువ. భారతదేశం భోగభూమి కాదన్నాడు గాంధీ. ప్రభుత్వ ప్రోత్సాహంతో మద్యపాన వ్యాపారం, గోవధశాలల స్థాపన, జూదశాలల నిర్వహణ నిరాటంకంగా సాగిపోతున్నాయి. ప్రజలు సుఖలాలసులవుతున్నారు. నీతినియమాలు ఆధ్యాత్మికవేత్తల ప్రసంగాలకే పరిమితమవుతున్నాయి. ఇలాంటి కారుచీకట్లోనూ కాంతిరేఖల్లా కొంతమంది ధర్మ కర్మ వీరులు అక్కడక్కడా కనబడుతున్నారు. ఆత్మరక్షణకోసం వాళ్లు కవచం ధరించి ఉంటారు. దుఃఖ సహిష్ణుతే వారి కవచం. స్వీయరక్షణ కోసం ఖడ్గాన్ని ధరించి ఉంటారు. ఇహ పర భోగాల్లో విరక్తే ఆ ఖడ్గం. గుర్రాలపై సంచరిస్తుంటారు. నీతి నియమాలే ఆ గుర్రాలు!

రామ రావణ సంగ్రామం జరుగుతోంది. ఒక చిన్న రాక్షసుడు శ్రీరాముడిపైకి సమరానికి వచ్చాడు. రాఘవుడు ఎన్ని అస్త్రాలను ప్రయోగించినా అతడినేమీ చేయలేకపోతున్నాయి. ఆ చిన్న రాక్షసుడికి ఉత్సాహం పెరిగి పోతోంది. రకరకాల ఆయుధాలతో విరుచుకు పడుతున్నాడు. విభీషణుడు ఇది చూసి శ్రీరాముడితో ఇలా మనవి చేశాడు- 'సీతాపతీ! వాడిని చంపాలంటే ఒక ఉపాయం ఉంది. చీకటిపడేలోగా వాడి ప్రాణం తీయకపోతే, రాత్రిపూట వాడు మరింత విజృంభిస్తాడు... వాడి ప్రాణం ఎడమకాలు బొటనవేలిలో ఉంది... వెంటనే నీ బాణాన్ని అక్కడ ప్రయోగించు!'. రామచంద్రుడు గురిచూసి ఆ బాలరాక్షసుని ఎడమకాలి బొటన వేలిపై బాణం ప్రయోగించాడు. ఆ రాక్షసుడు వెనువెంటనే మరణించాడు. విభీషణుడు ఈ దృశ్యం చూసి పెద్దగా రోదిస్తూ మూర్ఛపోయాడు. స్పృహలోకి వచ్చిన తరవాత దాశరథి విభీషణుణ్ని అడిగాడు- 'ఆ పిల్లవాడు చనిపోతే నువ్వెందుకు విలపించి స్పృహ తప్పావు?' అని. 'శ్రీరామా! ఆ బాలుడు ఎవరో కాదు- నా ఏకైక పుత్రుడు!' అన్నాడు విభీషణుడు కన్నీరు తుడుచుకుంటూ. రాముడు తాను చేసిన పనికి చింతాక్రాంతుడయ్యాడు. 'శ్రీరామా! నువ్వు చింతించవద్దు! నువ్వేమీ తప్పుచేయలేదు. ధర్మకార్య నిర్వహణకు అడ్డువచ్చిన వారినెవరినైనా మట్టుపెట్టవలసిందే... బంధుప్రీతి ధర్మరక్షణకు అడ్డు కాకూడదు!' అని కరుణానిధియైన శ్రీరామచంద్రుణ్ని విభీషణుడు ఓదార్చాడు.
- డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు 

No comments:

Post a Comment