ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Sunday, 14 July 2013

సేవే పూజ!

   దుటివారి మీద ఒక్కొక్కస్థాయిలో ఒక్కొక్క రకంగా చొరవ, సాన్నిహిత్యం కనబరుస్తాం. ప్రేమ, సేవ, గౌరవం, ఆదరణ, ఆప్యాయత, అర్పణ... లాంటివి వాటిపేర్లు. వీటిలో ప్రేమ విశ్వవ్యాప్తమైనది. తాను, తనవారు, తనది... అనే పరిధి దాటి, అందరూ అన్నీ అంతా అనే భావన కలిగి ఉండటం గొప్ప లక్షణం. ఆ లక్షణాలను పెంచుకున్నవాడు మానవత్వ పరిధినుంచి దైవత్వపు సీమలోకి పయనించడానికి అర్హుడవుతాడు. అలాంటిదే సేవచేసే తత్వమూ. ప్రతిఫలాపేక్ష లేకుండా, ఎదుటివారికి చేసేదే నిజమైన సేవ. గౌరవం విషయంలోనూ అదే పంథా అవలంబించాలి. వయసు, హోదా, స్థితి లాంటి వేటినీ మనసులోకి రానీయకుండా అందరినీ నిండుమనసుతో గౌరవించాలి. ఆదరణ, అభిమానం లాంటివి సైతం స్థాయికి తగ్గట్టుండాలి. వీటన్నింటి సమాహారమే భక్తి. ప్రతిఫలాపేక్ష లేకుండా ఇన్ని భావనలనీ ఒక్కసారిగా ఒక్కరిమీదనే ప్రదర్శిస్తే వాడికే నిజమైన 'భక్తుడు' అని పేరు. అలాంటి భక్తి కలిగి ఉన్న, పొందిన జీవుడు- సిద్ధుడు, అమృతుడు, తృప్తుడు అవుతాడని నారదుడు తన భక్తి సూత్రాల్లో తెలియజెప్పాడు. అంతే తప్ప భయం, కోరిక, ఆశ, లోభత్వం, క్షణిక తృప్తి తదితరాలతో కొలవడం భక్తి కానేకాదు. కళ్లుమూసుకుని కూర్చుని, ఎదుటివాడు చచ్చిపోతున్నా పట్టనట్టు ఉండటం అంతకన్నా కాదు. అందుకే 'తాను జీవిస్తూ, ఇతరులు జీవించడానికి అవకాశం కల్పించేవాడే నిజమైన భక్తుడు' అంటాడు కృష్ణభగవానుడు భగవద్గీత భక్తియోగంలో. ఇక్కడ 'జీవిస్తూ' అనే పదానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. 'ఎల్లరియందు ఆదరణ కలిగి, అనుబంధం పెంచుకుని, కల్యాణాలు(శుభాలు) కోరుకుని, వారి అఖండమైన ఆనందం చూసి తృప్తి పొందుతున్నవాడే నిజమైన జీవి' అని 'బృహదారణ్యకోపనిషత్తు' చెబుతోంది. తాను అలాంటి భావనలు కలిగి ఉండి, మిగిలినవారు వాటినే కలిగి ఉండేటట్లు చేయగలిగితే అదంతా ఒక భక్త సమాజమే అవుతుంది.

భక్తికి పరాకాష్ఠ పూజ. దాన్ని పొందడానికి అర్హులు అయినవారు అత్యంత ఉత్కృష్టులై ఉండాలి. ఆ అర్హత కలవాడు భగవంతుడే అని చాలామంది భావన. భగవంతుడిగా భావిస్తున్న ఏ మూర్తిలోనూ సర్వశక్తులూ సమాహారమై లేవు. ఒక్కొక్క దేవత ఒక్కొక్క శక్తికి నిలయాలని చెబుతున్నాయి పురాణాలు. అలాంటి శక్తులు కలిగిఉన్నవాడే దేవుడు అని చెప్పడమే ఆయా మూర్తుల ఆంతర్యం. నిజానికి ఆయా శక్తులు కలవారు ఎవరైనా దేవుడే అనిపించుకుంటాడని పురాణాలు, కావ్యాలు ఉపనిషత్తులు చెబుతున్నాయి. దేవుణ్ని ఒక మూర్తిగానో, కోరికలు తీర్చే యంత్రంగానో భావించడం సరైనది కాదు. ఉత్తమోత్తమ, ఉత్తమ, మధ్యమ, అధమ గుణాల స్థాయి, లక్షణాలు కలవాళ్లను వరసగా దేవతలు, యోగులు(మునులు), మానవులు, రాక్షసులు అని పిలుస్తారని ఛాందోగ్యోపనిషత్‌ చెబుతోంది. ఈ వాక్యం ప్రకారం ఉత్తమోత్తమ గుణాల సమాహారమే 'దేవుడు' అని తేలుతోంది. (అన్ని లక్షణాలు కలిగినవారు చాలా అరుదు కాబట్టే 'దేవుడు' అంటే కనబడనివాడు అనే ఒక భావన ఏర్పడి పోయింది). నిజానికి వెదికితే అటువంటి గుణాలు కలిగినవారు (దేవతలు) ఎందరో కనబడతారు.

ప్రేమ స్వరూపుడైనవాడు ఏ వస్తువునీ కాంక్షించడు. దేనికోసమూ శోకించడు. దేని(ఎవరి)నీ ద్వేషించడు, దేనిమీదా ఆసక్తి, అనురాగం చూపించడు. కానీ... వారికి ఎదురుగా కనిపించే అణువంత వస్తువైనా, విశ్వమంత విశాలమైనదిగా కనబడుతుంది. ఎదుటివారిలో ఏ మాత్రం చిన్న మంచి ఉన్నా గొప్పదిగా భావిస్తారు. అందుకే అందరినీ ప్రేమించగలుగుతారు. అలా అందరినీ ప్రేమించేటప్పుడు ద్వేషానికి తావుండదు. కాబట్టి ప్రేమ స్వరూపులు అనిపించుకుంటారు. చెవులకు వినిపించే అతి చిన్న శబ్దం సైతం విశ్వాంతరాళాలు మార్మోగేదిగా భావిస్తారు. అందువల్లనే ఆర్తిగా ఎవరు పిలిచినా స్పందిస్తారు. ఏదో ఒక రూపంలో సాయం అందిస్తారు. ప్రేమస్వరూపుల స్పర్శకు పులకించిపోతారు. ఆ ప్రేమానురాగాల సందడిలో పడిన జిహ్వ ఆకలి దప్పులను, రుచి, అరుచులను సైతం మరిచిపోతుంది.

భక్తులు, భగవంతుడు మధ్య తేడా కనిపెట్టడం చాలా కష్టం. వారిద్దరి మధ్య అతిసున్నితమైన ఎడమే ఉంటుంది. అది మనోగోచరమే తప్ప దృగ్గోచరం కాదు. ఆ ఎరుక కలిగినవారు అన్నింటినీ భగవత్ప్రసాదంగానే భావిస్తారు. ఇదే భక్తికి పరాకాష్ఠ అయిన పూజ. దీనికి పీఠాలు, పూలు, ధూప, దీప నైవేద్యాలు... ప్రత్యేకంగా అక్కరలేదు. భగవత్ప్రసాదితమైన ఈ తనువు, అందులో ఇమిడి ఉన్న మనసు అనే రెండూ... ఎదుటివారి క్షేమాన్ని కాంక్షించి, వారికి ఉపయోగపడేలా చేసే ఏదైనా పూజ అనిపించుకుంటుంది.
                                                              - అయ్యగారి శ్రీనివాసరావు 

No comments:

Post a Comment