ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Sunday 8 September 2013

సాధనా సమయం


  సాధన ఎప్పుడు ప్రారంభించాలన్నది జటిల సమస్య. దీనికి శ్రీకృష్ణుడితోపాటు విజ్ఞులందరి సమాధానం ఒకటే. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా. త్వరగా అంటే? ఏ వయసులో, ఏ సందర్భంలో, ఏ స్థితిలో? భక్తి మొలకెత్తినప్పుడు, ఆధ్యాత్మికావేశం తలెత్తినప్పుడు. మూర్ఖత్వం తొలగినప్పుడు, జిజ్ఞాస రగిలినప్పుడు. అవును కానీ... మనకంత అదృష్టం ఉందా? సహజంగా అంత త్వరగా భక్తి మొలకెత్తుతుందా! గాఢమైన ప్రాపంచిక ఆకర్షణలు అంత త్వరగా తొలగిపోతాయా! నిజమే. అందుకే... కనీసం భగవంతుడనేవాడు ఒకడున్నాడని వూహా మాత్రంగానైనా ఆలోచన అంకురించినప్పుడు అది మనసులోంచి జారిపోకుండా జాగ్రత్తపడుతూ దానికి పాదుచేసి, పందిరేసి, నీళ్లుపోసి, ఎరువు చల్లి... వీలైనన్ని విధాల పెంచి పోషించే ప్రయత్నం చేయాలి. శ్రవణం, స్వాధ్యాయం, సత్సంగం, సత్పురుషుల సంసేవనం... ఈ సాధనా వ్యవసాయం చేయక తప్పదు. మన అదృష్టం బాగుంటే సద్గురు దర్శనమై వారి ప్రాపకమూ లభిస్తుంది.
త్వరగా ఎందుకు? ప్రాపంచిక సుఖాలు అనుభవించవద్దా, కోరికలు తీర్చుకోవద్దా, సంసారాన్ని, సంతానాన్ని చక్కదిద్దుకోవద్దా, బాధ్యతలు నెరవేర్చవద్దా? వయసు మీదనే వైరాగ్యం పొటమరించనీ. మన సాధన ఎవరికీ అడ్డుకాని, ఆటంకం కలిగించని పరిస్థితి రానీ. కోరికలు వెనక్కు లాగని స్థితి స్థిరపడనీ. ఇంతకంటే హాస్యాస్పదమైన విషయం మరోటుండదు. స్నానం చేయాలంటే సముద్రంలో అలలు ఆగేదాకా నిరీక్షించడం అయ్యే పనేనా? సముద్రం ఉన్నంతకాలం అలలూ ఉంటాయి. అవి సందడి చేసే పరిధిని దాటే ప్రయత్నం చేయాల్సిందే. స్నానమాచరించి తీరాల్సిందే. సంసారమూ సముద్రమే. ఇక్కడా అదే పరిస్థితి. కనుక, అదే ప్రయత్నం తప్పదు. ముఖ్యంగా వీలైనంత త్వరగా... ఎందుకంటే మానవుడి ఆయుష్షు చాలా అల్పం. చేయవలసిన సాధన చూస్తే అనల్పం.

ప్రారంభించి, ఆనుపానులు తెలుసుకుని, కుదుటపడి క్రమేపీ తీవ్ర సాధనలోకి ప్రవేశించి పరమపదప్రాప్తి పొందాలంటే... అంత ఉరుకులు పరుగుల వ్యవహారం కాదు. ముఖ్యంగా ఆరోగ్యం బాగుండాలి. శరీరం దృఢంగా ఉండాలి. ఎక్కువసేపు సాధనలో కూర్చునే ఓపిక ఉండాలి. ఇవన్నీ వయసు ఉడిగాక సాధ్యం కావు. అన్నింటికంటే ముఖ్యంగా యోగం ఎప్పుడూ కూర్చునే చేయాలి. పడుకుని చేయడం నిషిద్ధం... కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్ప.

మేరుదండంలో కొలువుతీరిన చక్రసముదాయం నిట్టనిలువుగా వంకరలు పోకుండా ఉండాలి. మూలాధారంలోని కుండలినీ శక్తి, జాగృతమైన నడిచే ముక్తిదారి అది. దాన్ని నిట్టనిలువుగా, కొలబద్దలా నిలబెట్టే శక్తి మనలో ఉండాలి. ఈ నిలువుదారి సరిగ్గా లేకపోతే అవరోధం ఏర్పడి కుండలినీ మాత అలిగి తిరిగి మూలాధారంలోకి వెళ్లిపోతుందంటారు. మనం అత్యంత నిర్లక్ష్యం చేసే మన శరీరం ఓ అద్భుత సాధనోపకరణమే కాదు, దైవసముదాయ నిలయం! భగవంతుడు స్వయంభువుగా కొలువుతీరిన ఆలయం. దీన్ని దీప్తిమంతంగా నిలుపుకొనే శక్తి తగినంతగా వృద్ధాప్యానికి ఉండదు... ముందునుంచీ సాధనలో ఉంటే తప్ప. అందుకే శరీరం దృఢంగా ఉన్నప్పుడే బాధ్యతను గుర్తించి అవగాహనతో సాధన ప్రారంభించాలి.

సాధన ప్రారంభానికి, సాఫల్యానికి భూమికి ఆకాశానికి ఉన్నంత అంతరం. సుదూరం, సుదీర్ఘం. ఇంత దీర్ఘతర, క్లిష్ట ప్రక్రియను, అన్నీ అనుభవించాక చావుమేళం వినిపించే తరుణాన ప్రారంభిస్తే దింపుడు కళ్లంలో శవంలో వూపిరికోసం వెదికినట్లుంటుంది. వద్దు. శరీరం చైతన్యపూరితంగా ఉన్నప్పుడే, సత్తువ సద్దుమణగకముందే శరీర తత్వాన్ని తెలుసుకుందాం. దాని నిర్మాణ క్రమం వెనక ఉద్దేశమేమిటో గ్రహిద్దాం. మనదేశం ఓ ఆధ్యాత్మిక పరిషత్తు. సంస్కృతే ఓ అద్భుత ఉపనిషత్తు. కొత్త ఉద్దేశాలు, కొత్తదారుల అన్వేషణ అవసరం లేదు. దారి వేసే ఉంది. మనదారిలో మనం వెళ్తే చాలు... పూర్వులు నిర్మించిన, నిర్దేశించిన దారిలో అడుగడుగునా, మలుపు మలుపునా మార్గసూచికలు, వెలుగు దివ్వెలు, బోధనలు, సాధనోపకరణాలు, సౌలభ్యాలు... ఒకటేమిటి! మనిషెందుకు ఈ భూమి మీదకు వచ్చాడో, జీవితాన్ని ఎలా ప్రయాణించాలో, గమ్యం ఏమిటో, ఎక్కడుందో, దానికై ఏం చేయాలో వాజ్ఞ్మయ రూపంలో, రుషులరూపంలో, గురువుల రూపంలో... విషయ పరిజ్ఞానం మనకోసం కాచుకుని ఉంది. అంతెందుకు- భారతీయ కుటుంబంలోని దినచర్యలో ప్రతి అడుగూ జీవనగమ్యం వైపే వేలుపెట్టి చూపిస్తోంది. నడిపిస్తోంది. మనం గ్రహించాలి... అంతే. అనుసరించాలి... అంతే. మనకు భగవంతుడు సంస్కృతి రూపంలో అమృతంలాంటి క్షీరాన్ని ఇచ్చాడు. పెరుగు తోడుపెట్టుకుని, మజ్జిగ చిలికి, వెన్న తీసుకోవాలి. అది మన బాధ్యత. మన ధర్మం. మన అవసరం.
                                                                           - చక్కిలం విజయలక్ష్మి

No comments:

Post a Comment