ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Monday 23 September 2013

అడ్డదారితో అనర్థం


కొందరు చాలా సులువుగా ఇతరులను మోసం చేస్తూంటారు. ధర్మాధర్మాల విచక్షణ సైతం వారికుండదు. తమ వల్ల మోసపోయినవారు పడే బాధను చూసైనా వారికి జాలి కలగదు. మోసం చేయడమే లక్ష్యంగా జీవించేవాళ్లు అనేకులు ఉన్నారు. పదేపదే మోసపోవడం మోసపోయిన వారి అమాయకత్వానికి ప్రతీక. ఐనా మోసాలు జరుగుతూనే ఉన్నాయి. సోక్రటీస్‌ మహాజ్ఞాని, తత్వవేత్త. ఆ కాలంలో ఆయన ఎందరికో బోధించే ఆధ్యాత్మిక నైతిక సూత్రాలు రాజుగారికి నచ్చేవి కావు. ఒక రోజు రాజోద్యోగి ఒకడు సోక్రటీస్‌ వద్దకు వెళ్ళి 'మిమ్మల్ని రాజుగారు ఒకసారి ఆస్థానానికి రమ్మన్నారు. మీరు విజ్ఞులని రాజుగారు నమ్ముతున్నారు. మీరు ఆస్థానానికి ఎప్పుడు రాగలరో చెబితే మిమ్మల్ని సత్కరించడానికి తగిన ఏర్పాట్లు చేస్తాం!' అన్నాడు. 'ఎప్పుడో ఎందుకు? ఈ సాయంత్రమే వస్తాను. సత్కారాలు నాకు అవసరం లేదు. ప్రజల పట్ల రాజుగారు ఎలా నడచుకోవాలో చెబుతాను. ఆ సూత్రాలు పాటిస్తే చాలు... రాజ్యం క్షేమంగా ఉంటుంది!' అన్నాడు. ఆ రాజోద్యోగి సరేనంటూ వెళ్లిపోయాడు. 

ఆ సాయంత్రం సోక్రటీస్‌ రాజాస్థానానికి వెళ్లడానికి సిద్ధమవుతుండగా రాజపురోహితుని కొడుకు పరుగుపరుగున వచ్చాడు. 'మహాశయా! మీరు ఆస్థానానికి వెళ్లవద్దు. రాజు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించలేదు. ఉదయం వచ్చిన రాజోద్యోగి రాజు ఆంతరంగికుల్లో ఒకడు. మీరక్కడికి వెళ్లగానే ప్రజలెవరికీ తెలియకుండా మిమ్మల్ని బంధించి హింసించే ఏర్పాట్లు జరుగుతున్నాయి' అని వివరించాడు. పురోహితుని కొడుకు అనిస్సీకి సోక్రటీస్‌ అంటే ఎనలేని భక్తి గౌరవాలు ఉన్నాయి. అలా సోక్రటీస్‌ చివరి క్షణంలో రాజతంత్రం నుంచి తప్పించుకోగలిగాడు.

తరవాత అనిస్సీ సోక్రటీస్‌తో 'అయ్యా! రాజు మీ ఉనికిని ఇష్టపడడంలేదని తెలిసీ తెలిసీ ఆ రాజోద్యోగి మాటలకు మీరు ఎలా మోసపోయారు!' అని ప్రశ్నించాడు. అందుకు సోక్రటీస్‌ బదులిస్తూ 'నాయనా! ఆ రాజోద్యోగి ఆరితేరిన మోసగాడు. నేను అతని మాయ మాటలు నమ్మాను. నమ్మేవారినేకదా ఎవరైనా మోసం చేయగలరు' అన్నాడు.

మోసగాడు విషసర్పం లాంటివాడు. పాము కాటు వేయడానికి మాటువేసి ఉంటుంది. చాణక్యుడు తన నీతిచంద్రికలో- గయ్యాళి భార్య, మోసగాడు, ఎదురు తిరిగే సేవకుడు, పాము దాగిన ఇల్లు మృత్యువుతో సమానమని అంటాడు. స్వార్థచింతనతో స్వలాభం కోసం మోసంచేసే వారివల్ల సమాజంలో అనర్థాలు జరుగుతాయి.

నిస్వార్థంతో దుష్టశిక్షణ శిష్టరక్షణ కోసమూ కొన్ని మోసాలు జరిగాయి. భస్మాసురుడు శివుడు ఇచ్చిన వరంతో కనబడిన వాళ్లందరి నెత్తిపై చేయిపెట్టి వారిని నాశనం చేస్తూంటే శ్రీమహావిష్ణువు స్పందిస్తాడు. అందమైన స్త్రీ రూపంలో అవతరించి భస్మాసుర సంహారం చేస్తాడు. సముద్ర మథనం సందర్భంగా ఆ మహావిష్ణువే మోహినీ రూపం ధరించి అమృతాన్ని సురులకు అందించి అసురులు అమృతులై భూమికి భారం కాకుండా కాపాడతాడు. మహాభారత యుద్ధంలో సైతం ద్రోణుణ్ని ధర్మరాజు అసత్య వచనంతో మోసగించి అస్త్ర సన్యాసం చేయిస్తాడు. అలాకాకపోతే, పాండవులకు విజయం అంత సులువుగా లభించేది కాదు. ఇలాంటి ఘటనలు పురాణాలకే పరిమితం. దైవం తాను సృజించిన మానవాళి క్షేమం కోసం నిర్వహించే కార్యాల కోవలోకి ఈ సంఘటనలు వస్తాయి. కాని, మనిషే తోటి మనిషిని మోసం చేయడంవల్ల సమాజంలో ఒకరిపై మరొకరికి నమ్మకం నశిస్తుంది. క్రూర మృగాలను కొమ్ములున్న జంతువులను నదులను మోసగాళ్లను ఆయుధాలున్న వారిని ఎన్నటికీ నమ్మకూడదని చణకుడు అంటాడు. మానవుడు మౌలికంగా ఆశాజీవి. తన ఆశయాన్ని సాధించేందుకు రాచబాటను అనుసరించాలేకాని అడ్డదారులను కాదు. అడ్డదారుల్లోనే మోసగాళ్లు తారసపడతారు. వాళ్లబారిన పడితే కుడితిలో పడ్డ ఎలుకలా ఉంటుంది పరిస్థితి. అందుకే దురాశ దుఃఖానికి చేటు అంటారు. దురాశ ఎక్కడ ఉంటుందో అక్కడే మోసం మాటువేసి ఉంటుంది. నిశ్చయంగా లభించేవి కొన్నే అయినా, వాటిని వదిలిపెట్టి- లభిస్తాయన్న నమ్మకం లేని వాటికోసం పాకులాడితే మొదటికే మోసం వస్తుంది.
- అప్పరుసు రమాకాంతరావు

No comments:

Post a Comment