ఇటీవలి కాలంలో అందరూ దేహ సాక్షాత్కారం కోసమే చూస్తున్నారు. అది అయ్యే ఉంది. కనిపిస్తూనే ఉంది. మరి ఎందుకో ఆరాటం? దేహమే సర్వం అనుకుంటున్నాం. దేహంతోనే కదా అంతా జరుగుతోంది అనుకుంటున్నాం. అది నిజమే. కళ్లకు కనిపించేది అదే. కాని, అదే సత్యమా? ఈ దేహం ఎంతకాలం ఉంటుంది? ఉన్నంతకాలం దీన్ని తీర్చిదిద్దుకుని అందంగా అలంకరించుకొని, చూపించుకోవాలని ఉబలాటపడతాం. దేహప్రశంసలు, పొగడ్తల కోసం అర్రులు చాస్తాం. ఆహ్లాదం కోసం దేహం, ఆనందం కోసం దేహం అని తీర్మానించేసుకుంటాం.
కొందరైతే వారి దేహానికి శాశ్వతమైన గుర్తింపు ఉండాలని బాగా ఖర్చుపెట్టి సమాధులు కూడా తయారు చేసుకోవడానికి పథకాలు రచించుకుంటున్నారు. దేహం అశాశ్వతం కదా. గుప్పెడు బూడిదే కదా. చైతన్యం తరలి వెళ్ళిపోయిన తరవాత దేహం ఎండుకట్టెతో సమానం కదా. మరి ఈ దేహం మీద వ్యామోహం ఎందుకు? అదే చమత్కారం, గారడి, మాయాజాలం, ఓ వింత నాటకం.
దేహ సాక్షాత్కారం కోసం శ్రమపడనవసరం లేదు. ఎక్కడపడితే అక్కడ దేహాలు దర్శనమిస్తూనే ఉంటాయి. సత్యం శివం సుందరం అని నిరూపిస్తున్న సృష్టి అంతా అందమైన శరీరంగా కనిపిస్తూనే ఉంటుంది. అందమైన దేహాన్ని చూస్తే ఒక పులకరింత. ఒక గొప్పదేహాన్ని చూస్తే గౌరవ భావన. ఒక రోగిష్ఠి దేహాన్ని చూస్తే ఏవగింపు. ఒక భయంకరమైన దేహాన్ని చూస్తే జలదరింపు.
'జంతూనాం నరజన్మ దుర్లభం' అన్నారు. నరుడికే ఈ దేహం మీద ఇంత వ్యామోహం. ఇన్ని రాగ ద్వేషాలు. అయినా దేహభావం విడిచిపెట్టం. విడిచి పెట్టలేం. నేను దేహం అనుకోకుండా ఉండలేం. దేహస్మరణ చెయ్యకుండా బతకలేం. దేహబాధలు మనల్ని తడిగుడ్డ పిండినట్లు పిండుతూ ఉన్నా దేహాన్ని అంటిపెట్టుకుని, చూరుకు వేలాడే గబ్బిలంలా బతుకుతూ ఉంటాం. తప్పదు. దేహం మనల్ని అలా ఆడిస్తూ మాయ కుట్రకు బలి చేస్తోంది.
సరే. ఈ దేహం తరవాత మరో దేహం ఉందా? ఉంటే దానికీ ఇదే పరిస్థితి. మార్పు ఉండదా? ఇలా ఎంతకాలం ఈ ప్రయాణం? దీనికి అంతం ఉందా? దీన్ని ఆపగలమా, దీనికి మూలం ఏమిటి, దీన్ని అన్వేషించాలా, వద్దా?
శ్రీకృష్ణ బోధ తరవాత అర్జునుడు నిరంతరం ఆ పరమాత్మను చూడకుండా ఉండలేకపోయేవాడు. ఎప్పుడూ వెన్నంటి ఉండేవాడు. శ్రీకృష్ణ రూపం కోసం గోపికలు పిచ్చివారై తిరిగేవారు. శ్రీరాముడిది విశ్వభువనైక సౌందర్యం.
మరి ఆ మహాత్ములు దేహాలా, ఆత్మలా? ఆ రూపాలు ఎందుకు పూజనీయమై విలసిల్లాయి?
ఏది దేహం, ఏది ఆత్మ? కనిపిస్తే దేహం. కనపడకపోతే ఆత్మ అనుకోవచ్చా? మరి మహానుభావులందరూ ఆత్మసాక్షాత్కారం కోసమే ఎందుకు శంఖం పూరించారు? ఈ కోణంలో మనం ఆలోచిస్తున్నామా?
మనకు ఆత్మ అక్కరలేదు. దేహమే కావాలి. అది శాశ్వతంగా ఉండిపోవాలి. కొత్త జీవకణాలతో దేహాన్ని మళ్ళీ మళ్ళీ నిర్మించుకుని, ఆయుష్షు పెంచుకునే ఏర్పాటు ఏ శాస్త్రవేత్తయినా చేస్తే, దానికి అయ్యే ఖర్చంతా భరించడానికి ఎంతోమంది కోటీశ్వరులు సిద్ధంగా ఉన్నారు. అది సాధ్యమవుతుందా? అయితే దానివల్ల ఏమిటి లాభం?
దొంగతనాలు, దోపిడిలు, కుట్రలు, కుతంత్రాలు, హత్యలు, అవినీతికి పాల్పడుతూ దీర్ఘకాలం జీవించే బదులు మంచి పనులు చేస్తూ, ధర్మం కోసం నిలబడుతూ తక్కువకాలం జీవించినా అది శాశ్వతత్వాన్ని ప్రసాదిస్తుంది కదా.
దేహం ఆత్మకు పూచిన పువ్వులాంటిది. దేహం ఆత్మ తాలూకు దృశ్యభాగం. దేహం ఆత్మకు పరికరం. దేహం ఆత్మ నివసిస్తున్న ఇల్లు. దేహం అద్దెకు తెచ్చుకున్న వాహనం. అందులో ఆత్మ తిరుగుతూ ఉంటుంది. దేహం ఆత్మ అనే ఆకాశంలో మెరిసే మెరుపు. దేహం దేవాలయం. జీవుడు దేవుడు. ఇలా ఎన్నో చెబుతారు...
అయినా మనల్ని దేహభావం వీడిపోదు. ఎందుకంటే దేహం సాక్షాత్కారం అయ్యే ఉంది. ఆత్మ సాక్షాత్కారం ఇంకా కాలేదు. సర్వశాస్త్రాలు, సమస్త యోగులు, మహానుభావులు 'నువ్వు దేహానివి కాదు ఆత్మవి' అని ఘోషిస్తూనే ఉన్నారు... ఎప్పటికి తెలుసుకుంటాం?
- ఆనందసాయి స్వామి
No comments:
Post a Comment