ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Monday 28 October 2013

సాధన... ఓ ఆస్వాదన

    సాధనలో తీవ్రత లేదా తీవ్రమైన సాధన... అంటే ఏమిటి? ఎవరికైతే భగవంతుడిపట్ల తీవ్రమైన అనురక్తి వుంటుందో, పరమపదాన్ని పొందాలనే పరితాపం వుంటుందో వాళ్లు చేసే, చేయవలసిన నిరంతర ప్రయత్నమే తీవ్ర సాధన. ఎంత కష్టమున్నా క్లిష్టతరమైనా సహించి, ప్రేమతో చేసికోరవలసిన క్రియలు, ప్రక్రియలే తీవ్ర సాధన. ఏం, తీవ్రసాధనలు చేయకపోతే భగవంతుడు కనికరించడా... లభించడా? భగవంతుడు భక్త సులభుడంటారే! నిజమే. భగవంతుడు భక్త సులభుడే. అప్రమేయుడైన దైవం ముందు ఏ రకంగానూ అంచనాకైనా అందని అత్యంత అల్పుడు మనిషి. అలాంటి మనిషికి అంతటి అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు అందుతున్నాడంటే- అదంతా ఆయన దయ, అనుగ్రహం, అందాలనే సానుభూతి, ప్రేమ కాకపోతే మన నిర్వాకం ఏమీ లేదు. ఏ మాత్రం కాదు. కాకపోతే మనమంటూ ఒకరమున్నామని, ఆయననే కోరుకుంటున్నామని ఆయన దృష్టికి తీసుకురావాలి. దృష్టిలో పడే ప్రయత్నం చేయాలి. అదే సాధన. ఇంకా తీవ్ర పరితాపం, అపరిమితమైన ఆర్తి ఉంటే దానికి కావలసిందే తీవ్రసాధన. పిండి కొద్దీ రొట్టె, ప్రయత్నం కొద్దీ ఫలితం.

సాధన అంటే భగవంతుడి సాన్నిధ్యానికి ప్రయత్నం కాదా? మళ్లీ సాధనలో రకాలుంటాయా? సాధన, తీవ్రసాధన అనే అంతరాలుంటాయా? భగవంతుడు మనసు చూస్తాడు. నిజమే. మనసు ప్రధానం. ఆ మనసులోని ఆర్తి ప్రధానం. అయితే మనసు అంత సులభంగా మనకు కట్టుబడుతుందా, పరమాత్ముని పట్టుకుంటుందా ఆర్తి నింపుకొంటుందా? దాన్ని భగవంతుడివైపు మరల్చాలంటే, అక్కడే, ఆయన పాద కమలాలమీదే స్థిరం చేయాలంటే చిన్న విషయమా? అసలు ఆయన పాదాలవైపు చూడాలంటేనే ఎన్ని జన్మల సుకృతం ఉండాలి! ఆ మనసుకెన్ని సుగుణాలుండాలి! ఎంత స్వచ్ఛత కావాలి?

చిన్న మొత్తం బంగారం ఉందనే ఆచూకీ దొరికితే చాలు, కొండనే కరిగిస్తాం. వ్యర్థాలు తొలగిస్తాం. ముడి బంగారం శుద్ధి చేస్తాం. ఎంతైనా కష్టపడతాం. ఇక సర్వ శ్రేష్ఠుడు, సర్వోన్నత అధికారి, సకల కల్యాణ సంపన్నుడు... భగవంతుడు. ఆయన లభించే మార్గమే ఉండాలిగానీ- ఆ మార్గం ఎంత దుర్గమమైతేనేమి, దుర్లభమైతేనేమి... ప్రయత్నం చేయడం గొప్ప విషయం కాదు. ప్రయత్నించే అవకాశం ఉండటమే గొప్ప. ఆరోగ్యం పొందుతామంటే కాలకూట విషాన్నే మందులా మింగే మనిషికి, భగవంతుడి నామాన్ని తొట్టతొలిసారి స్మరించినది ఆదిగా కైవల్యం పొందేవరకూ అద్వితీయమైన అమందానందం పొందగల అద్భుతమైన అవకాశం ఉన్న ఈ భక్తి మార్గం అందుకుని సాధనం చేయటం ఎంత గొప్పవరం! అదృష్టం! చేద్దాం... సాధన. తీవ్ర సాధన. తీవ్రాతితీవ్ర సాధన. ఎముకలు విరగనీ. కండలు కరగనీ. గుండెలు ఎండనీ. చివరకు పై పొరలన్నీ చిరిగి చితికి జీర్ణమై లోపలి, లోలోపలి ఆత్మజ్యోతి మాత్రం మిగలనీ. వెలగనీ. మనిషికి ఇంకా ఏం కావాలి, ఇంకేం కావాలి?
ఇదంతా- బాధ్యతలు విస్మరించి, కర్తవ్యాలు మరచి, సంసారాన్ని త్యజించి చేయవలసింది కాదు. సంసారంలోనే ఉంటూ, కర్తవ్య పాలన చేస్తూ, అదంతా భగవత్‌ సేవగా భావిస్తూ చేయవలసిన అమృతతుల్య సాధన. ప్రాపంచిక కర్తవ్యాలను పారమార్థిక సేవలుగా భావించేవాడికి సాధన సులభతరమవుతుంది. బాధ మాధుర్యంగా భాసిస్తుంది. అపజయాలు అనంతుడి చిలిపి చేష్టలుగా ముచ్చట కలిగిస్తాయి. నిజానికి సంసారం... ఆధ్యాత్మిక జీవితమనే అసలు జీవితానికి అదనపు పని (పార్ట్‌టైం జాబ్‌) లాంటిది. ఒక చిన్న అభిరుచి (హాబీ) లాంటిది. ఆటవిడుపు లాంటిది. పనిమీద బజారుకు వెళ్తున్న మనతో అమ్మ 'ఎటూ అటే వెళ్తున్నావు కదా? ఇంట్లోకి ఫలానాది తీసుకురా' అని అప్పజెప్పిన కొసరుపని లాంటిది. ప్రాపంచికం అప్రధానం. పారమార్థికమే మనం వచ్చిన అసలు పని. అదే అసలు జీవితం, జీవిత పరమార్థం. దాన్ని సాధించే క్రమంలో తోడు తీసుకున్న చిన్నపాటి వ్యవహారం సంసారం... అంతే. సాధించాలనుకున్న అసలు పదార్థానికి సంసార జీవితం ఓ ఉప ఉత్పత్తి... అంతే!
                                                                          - చక్కిలం విజయలక్ష్మి

No comments:

Post a Comment