ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Friday, 11 October 2013

తల్లిదండ్రులు


ప్రపంచమంతా తల్లిదండ్రులతోనే నిండి ఉన్నది అన్నారు శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో. దాన్నిబట్టి, ఈ జగత్తులో అమ్మానాన్నలకు ఉన్న స్థానం ఎంతటిదో తెలుస్తుంది. తల్లిదండ్రులు వాగర్థాలవంటివారనీ, వారిని విడదీయడం సాధ్యం కాదనీ అన్నాడు కాళిదాసు రఘువంశంలో. అంటే సృష్టిలో తల్లిదండ్రులకు గల శాశ్వతత్వం ఎలాంటిదో స్పష్టమవుతోంది. ఇలా సకల సాహిత్యాలూ తల్లిదండ్రుల ఉనికిని అత్యున్నత స్థానంలో నిలుపుతుంటే, అలాంటి ప్రత్యక్ష దైవాలకు నేటి బిడ్డలు కనీస కృతజ్ఞతనైనా ప్రకటిస్తున్నారా అంటే, అనుమానమే. ఏ కొందరు మాత్రమే మినహాయింపు కావచ్చు.
'మాతృదేవోభవ', 'పితృదేవోభవ' అనే వేదసూక్తులు 'తల్లిదండ్రులనే దేవతలుగా భావించేవాడివై జీవించు!' అని చెబుతున్నాయి. ఈ సూక్తిని శిరస్సున ధరించి అనుసరిస్తున్నవారు కొందరైతే, తల్లిదండ్రులను తమ సుఖసంతోషాలకు అవరోధాలుగా భావించి, వాళ్లను దయ్యాలుగా చూస్తూ తరిమికొట్టే అధములైన కొడుకులు లోకంలో లేకపోలేదు. పున్నామనరకం నుంచి తమను ఉద్ధరిస్తాడనుకొనే కొడుకు, తాము బతికి ఉండగానే తమకు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తుంటే 'వీడు కొడుకా లేక యమ కింకరుడా?' అని తల్లిదండ్రులు దుఃఖించే పరిస్థితులు నేడు సమాజంలో కనబడటం శోచనీయం.

తల్లిదండ్రుల దగ్గర ఉన్న ఆస్తిపాస్తుల్నీ, డబ్బూ దస్కాన్నీ బలవంతంగా లాక్కొని, తల్లిదండ్రులను ఇంటిలో నుంచి మెడలు పట్టి గెంటేస్తున్న కొడుకులు నేడు కనబడతారు. వీళ్లంతా నిజమైన కొడుకులేనా, అసలు మనుషులేనా?

తల్లిని గౌరవించి, ఆదరించేవారికి మానవ ప్రపంచంలోనూ, తండ్రిని ప్రేమించి పూజించేవారికి అంతరిక్ష లోకాల్లోనూ, గురువులను భక్తిప్రపత్తులతో సేవించేవారికి బ్రహ్మలోకంలోనూ తిరుగు ఉండదని మనుస్మృతి చెబుతోంది. నవమాసాలూ గర్భంలో మోసి, ప్రసవ వేదనను అనుభవించి తనను కన్నతల్లినీ, అష్టకష్టాలు పడి, పెంచి పోషించిన తండ్రినీ క్షణంలో మరచిపోయి, తన ప్రయోజనాన్ని మాత్రమే చూసుకొనే సంతానానికి నిష్కృతి ఉంటుందా? ఉండనే ఉండదు. తల్లిదండ్రుల రుణాన్ని నూరేళ్లపాటు సేవించినా తీర్చుకోవడం కష్టమే. ఏ తల్లిదండ్రులైనా తమ సంతానం గుణవంతులుగా రాణించాలనీ, తమకు ఆత్మసంతృప్తిని కలిగించాలనీ మాత్రమే కోరుకుంటారు. అర్థదృష్టితో చూడనే చూడరు. అలాంటి తల్లిదండ్రులను డబ్బుకోసం, ఆస్తులకోసం, శారీరక సౌఖ్యం కోసం కాలదన్నడం ఎంతవరకు ధర్మం? గుణహీనులైన ఎందరో కొడుకులకంటే గుణవంతుడైన ఒక్క పుత్రుడు చాలుననీ, ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నా ఏం ప్రయోజనం- ఒక్క చంద్రుడు ఉంటే చాలు ఆకాశానికీ, భూమికీ అందం, ఆహ్లాదం కలుగుతాయనీ పంచతంత్రం చెబుతోంది.

పార్వతీ పరమేశ్వరులను ఈ జగత్తుకే తల్లిదండ్రులుగా ప్రస్తుతించాడు కాళిదాసు. అంటే తల్లి పార్వతీదేవి వలె సకల మంగళాలకూ నిలయమైనదనీ, అపార కారుణ్యమూర్తి అనీ, ఆమెను తలచుకుంటే చాలు సకల సౌభాగ్యాలూ వర్షిస్తాయనీ తాత్పర్యం. అలాగే తండ్రి పరమేశ్వరుడి వలె అడిగిన వెంటనే అన్నీ సమకూర్చే స్వభావం కలవాడనీ, పోషించే గుణం నిలువెల్లా నిండి ఉన్నవాడనీ, పిల్లల తప్పులను సరిదిద్దే వాత్సల్యగుణం కలిగినవాడనీ అర్థం. పార్వతీ పరమేశ్వరుల వంటి తల్లిదండ్రులను హృదయకమలంలో నింపుకొని ఆరాధించాలేగాని, వారి మనసులను నొప్పించరాదనే సత్యాన్ని సంతానం తప్పక గ్రహించాలి. తల్లిదండ్రులు లేని పిల్లలు అనాథలవుతారు. తల్లిదండ్రులు కళ్ల ఎదుట ఉన్నంత కాలం వారి విలువ తెలియదు. వారు కనుమరుగైపోతే ఎంత కష్టం, ఎంత నష్టం? అది ఎవరూ పూరించలేని లోటు. తల్లిదండ్రులు బతికి ఉన్నప్పుడు బాధలకు గురిచేసి, చచ్చిన తరవాత వారి సమాధులపై పూలు చల్లితే ఏం లాభం? 'మరు జన్మలో కూడా ఈ సంతానమే మాకు కావాలి' అని తల్లిదండ్రులు కోరుకునే విధంగా పిల్లలు ప్రవర్తించాలన్నదే అన్ని శాస్త్రాలూ ఉపదేశిస్తున్న సత్యం.

తల్లిదండ్రులు జీవించినంతకాలం వారి మనసులను నొప్పించకుండా, అవసరమైనప్పుడు సేవలు అందిస్తే చాలు- అప్పుడు ఈ లోకమే ఒక స్వర్గం. ఒక కైలాసం. ఒక వైకుంఠం. ఒక బ్రహ్మలోకం. ఒక ముక్తిధామం!
- డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ 

No comments:

Post a Comment