ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Friday 26 July 2013

బోనాల పండగ


   తెలంగాణ ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉత్సాహంగా జరుపుకునే పండగ బోనాలు. బోనాల పండగ అనగానే కోలాహలం, ఉరకలెత్తే సంతోషం, కొత్తబట్టలు, పసుపు కుంకుమలు, వేపాకు తోరణాలు. ప్రతీ వీధిలోని అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయి. ఎవరికి వారు ఒంటరిగా కాకుండా కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు అందరూ కలిసి గుడికి వెళతారు,. బోనాల పండగరోజు ఆలయాల దగ్గర వినిపించే తెలంగాణ జానపడద పాటలు కూడా అమ్మను స్తుతిసే ఉత్తేజపర్చేలా ఉంటాయి.

అమ్మ తన బిడ్డలందరినీ ఎంతో ప్రేమగా చూస్తుంది. తప్పు చేస్తే మందలిస్తుంది. అయినా సరే వినకుంటే దండిస్తుంది. అప్పుడు ఆ బిడ్డ తన తప్పు తెలుసుకొని సరైన మార్గంలో పయనిస్తాడు. అదే తల్లీపిల్లలకు ఉన్న అనుబంధం. అదేవిధంగా ప్రకృతిమాత లేదా ఆ అమ్మలగన్న అమ్మకు కోపం వస్తే కడూఆ మనని దండిస్తుంది. అప్పుడే ప్రకృతి విలయతాండవం చేస్తుంది. దానివల్ల అంటురోగాలు ప్రబలుతాయి. 1869వ సంవత్సరంలో హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో ఇలాగే మలేరియా వ్యాధి ప్రబలి తీవ్ర జననష్టం జరిగింది. అమ్మకు కోపం వచ్చిందని భావించిన ప్రజలు ఆమెను శాంతపర్చడానికి ఉత్సవాలు, జాతర జరిపించాలని నిర్ణయించారు. అదే బోనాలు. ఈ పండగను ఆషాడ మాసంలో జరుపుకుంటారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌లలోనే కాకుండా మరికొన్ని తెలంగాణ ప్రాంతాల్లో ఈ పండగ చాలా వైభవంగా జరుపుకుంటారు. ఈ పండగ ముఖ్య ఉద్ధేశం కలరా, ప్లేగు, మశూచి వంటి అంటువ్యాధులు ప్రబలకుండా ప్రకృతి బీభత్సాలు జరగకుండా పాడిపంటలను, తమ పిల్లలను చల్లగా చూడమని ఆమెకు బోనం సమర్పిస్తారు. ఉగాది తర్వాత చాలా రోజులకు వచ్చే మొదటి పండగ ఇదే.

బోనం అంటే భోజనం. శుచిగా అన్నం వండుకుని దానిని కొత్త ఘటంలో అంటే మట్టికుండ లేదా ఇత్తడి గుండిగలో ఉంచి దానికి పసుపు, కుంకుమలతో అలంకరించి, వేపాకు తోరణాలు కడతారు. అన్నంలో పసుపు లేదా పాలు చక్కెర కలిపి నైవేద్యం తయారుచేస్తారు. ఆ పాత్రపైన ఒక ప్రమిదలో దీపం పెట్టి ఇంటి ఇల్లాలు లేదా ఆడపడుచు పట్టుబట్టలు కట్టుకుని, పూలు, నగలు అలంకరించుకుని సంతోషంగా ఆ బోనాన్ని తమ తలపై పెట్టుకుని మంగళవాయిద్యాలు, డప్పుల మధ్య ఊరేగింపుగా వెళ్లి అమ్మకు సమర్పిస్తారు. ఈ ఊరేగింపులో హుషారుగా నాట్యం చేసుకుంటూ వెళతారు. అంతేకాదు వెదురుబద్దలు, రంగు కాగితాలతో తయారుచేసిన తొట్టెలను కూడా అమ్మవారికి సమర్పిస్తారు. అమ్మకు బోనాలు, తొట్టెల సమర్పించి కల్లుతో సాక పెడితే అమ్మశాంతించి తమను, తమ పిల్లలను చల్లగా చూస్తుందని అందరి నమ్మకం. ఎందుకంటే అప్పుడే వానాకాలం మొదలవుతుంది. ఈ సమయంలో వాతావరణ మార్పు వల్ల కూడా అంటురోగాలు వచ్చే ప్రమాదం ఎలాగూ ఉంది. తల్లిని సంతోషంగా చూసుకుంటే ఆమె దయ ఎప్పటికీ ఉంటుందని అన్ని ఆపదల నుంచి ఆమె కాపాడుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

రాజధానితో పాటు చుట్టుపక్కల ఈ పండగను ఆషాడమాసం మొత్తం జరుపుకుంటారు. ఒక్కోవారం ఒక్కోప్రాంతంలో ఉత్సవాలు జరుగుతాయి. ఈ పండగకు సంబంధించి తెలంగాణ ప్రజలకు ఒక ప్రగాఢమైన నమ్మకం ఉంది. కొత్తగా పెళ్లైన ఆడపిల్ల ఆషాడమాసంలో తన పుట్టింటికి వస్తుంది. అమ్మ వారిని తమ తల్లిగా, ఇంటి ఆడపడుచుగా భావించి పూజిస్తారు. కాబట్టి ఆషాడమాసంలో అమ్మ తన పుట్టింటికి వస్తుంది అని నమ్ముతారు. తమ కూతుళ్లు పుట్టింటికి వస్తే ప్రత్యేకంగా చూసుకున్నట్లే ప్రజలందరూ వెళ్లి ఆమెను దర్శించి ప్రేమగా బట్టలు, భోజనం పెడతారు. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ గుళ్లను అందంగా అలంకరించి ఉత్సవాలు జరుపుతారు. ఈ పండగలోని ముఖ్యమైన అంశం బోనాన్ని సమర్పించడం. అమ్మ వారికి సమర్పించే బోనాన్ని తలకెత్తుకున్న మహిళలు ఆ అమ్మ అంశ అని గౌరవిస్తూ ప్రజలు ఆమెకు కోపం రాకుండా ఉండాలని గుడి దగ్గరకు రాగానే బోనం ఎత్తుకున్న మహిళ కాళ్ల మీద నీళ్లుపోస్తారు. అలా చేస్తే అమ్మవారు శాంతిస్తుందని వాళ్ల నమ్మకం.

బోనాల పండగలో అమ్మవారి సోదరుడైన పోతరాజు పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది. బలిష్టుడైన ఒక వ్యక్తి ఒళ్లంతా పసుపు రాసుకుని, నడుముకు వేపాకు మండలు కట్టుకుని, నుదుట పెద్ద కుంకుమ బొట్టుతో, కాలికి గజ్జెలు కట్టుకుని కొరడా ఝలిపిస్తూ పూనకం వచ్చినట్టు ఆడుతూ ఉంటాడు. అమ్మవారికి సమర్పించే బళ్లను అతనే ముందుండి నడిపిస్తాడు. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ ఇలా అమ్మవారిని ఎన్నో పేర్లతో పిలుస్తారు. ' అమ్మ ఏ పేరున పిలిచినా పలుకుతుంది. తమను ఆదుకుంటుంది' అని ప్రజలు బలంగా నమ్ముతారు. ఆదివారం బోనాలు నమర్పిస్తారు. ఆ మరునాడు 'రంగం' అనే ఒక కార్యక్రమం ఉంటుంది. రంగం చెప్పడం అంటే అమ్మవారు ఒక అవివాహిత శరీరాన్ని ఆవహించి ఆమె ద్వారా నగర ప్రజలకు రాబోయే ఏడాదిలో జరగబోయే మంచి-చెడులను చెబుతుంది. రంగం చెప్పే మహిళ గర్భాలయం ముందు ఒక పచ్చికుండ పైన నిలబడి, పూనకంతో ఊగుతూ భవిష్యత్తు చెబుతుంది. అదే సమయంలో ప్రజలు అడిగే ప్రశ్నలకు కూడా జవాబు చెబుతుంది. అందుకే వేలాది మంది భక్తులు ఈ భవిష్యవాణి వినడానికి గుంపు కడతారు.
బోనాల సంబరంలో చివరి అంకం ఘటం ఊరేగింపు. రంగం తర్వాత సాయంత్రం వేళ ప్రతి ప్రాంతం నుంచి వేర్వేరు ఘటాల ఊరేగింపు ప్రారంభమవుతుంది. హైదరాబాద్‌లోని పాతబస్తీ వీదులన్నీ భక్తులతో కిటకిటలాడతాయి. అలంకరించిన వాహనాలపై అమ్మవారిని ఘటం రూపంలో ఉంచుతారు. ఆ తర్వాత ఊరేగింపుగా వెళతారు. ఒక్కొక్కటిగా అన్ని ఘటాల ఊరేగింపులు కలిసిపోయి ఒక్కటిగా సాగుతాయి. ఈ ఊరేగింపులో వివిధ వేషదారణలు, పాటలు, నాట్యాలు, గుర్రాలు కూడా కోలాహం సృష్టిస్తాయి. ఈ రెండు రోజులూ ఎంతో సందడిగా ఉంటుంది. తెలంగాణ జానపద గీతాలతో వీధులన్నీ మారుమోగుతాయి. ఈ పాటలన్నీ ప్రజల్ని చిందులు వేయించేలా ఉంటాయి. ఆటపాటలతోసాగిపోయే ఈ ఘటాలన్నీ నయాపూల్‌లోని మూసీ నదిలో నిమజ్జనం చేయడంతో బోనాల పండగ సంబంరం ముగుస్తుంది. ఇక ఏడాది పొడవునా తమ పంటలను, పిల్లలను చల్లగా ఆ అమ్మ చూసుకుంటుందన్న అపారమైన విశ్వాసంతో భక్తులు నిశ్చింతగా ఇళ్లకు తిరిగి వెళతారు.
                                                                                 - సుహాసిని

No comments:

Post a Comment