జీవితం జీవించడానికే. మరణం గురించి ప్రశాంతంగా ఆలోచించలేం. 'మరణం గురించి ఆలోచిస్తేనే జీవితం గురించి తెలుస్తుంది' అంటాడు వివేకానందుడు. మృత్యు రహస్యం తెలుసుకొమ్మంటాడు మాక్స్ ముల్లర్. ఉపనిషత్తులు మరణం గురించి ఎంతో లోతుగా తెలియజేస్తున్నాయి. సరే, మరణం గురించి తెలుసుకుంటే ఏం జరుగుతుంది? మరణ భయం పోతుంది. మరణం గురించి భయపడనవసరం లేదని తెలుస్తుంది. మరణ భయం పోతే ధైర్యం వస్తుంది. జీవించడానికి ఉత్సాహం కలుగుతుంది. జీవన సమరానికి సిద్ధపడతాం.
మరణ భయం పోగొట్టుకున్న మహాత్ములే చాలామంది తుపాకి గొట్టానికి ఎదురు వెళ్లారు. మరణం గురించి ఖాతరు చెయ్యనివాళ్లే, జీవితాలను త్యాగం చేయడానికి సిద్ధపడి ప్రాణాంతక వ్యాధులతో పోరాడుతున్నవారికి, వృద్ధులకు, అనాథలకు సహాయం చేశారు. లోకకల్యాణం కోసం ఎన్నో మంచి పనులు చేశారు.
మరణం అన్న ఆలోచనే పెద్ద ప్రతిబంధకం. మరణ భావనను అధిగమిస్తే స్వేచ్ఛను మరుక్షణమే అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. మరణం తరవాత జీవితం గురించి వాదోపవాదాలు, చర్చలు అనవసరం. ఆ విషయం గురించి ఆలోచించనక్కరలేదు.
బతికి ఉన్నన్నాళ్లు ఎంత గొప్పగా బతకాలి అని ఆలోచించాలి. అలా బతకాలంటే మృత్యురహస్యం తెలుసుకోవాలి. మృత్యువు రహస్యంగా ఉందా, కనపడకుండా ఉందా? నిత్యం మన వెన్నంటే నీడలా ఉంది. కాని, భయపడనవసరం లేదు. దాని పని అది చేస్తుంది. మన పని మనం చెయ్యాలి.
అది వచ్చినప్పుడు ఒక్క క్షణంలో పని అయిపోతుంది. కానీ మరణ భావన మాత్రం మనల్ని ఇరుకున పెడుతుంది. గొప్ప గొప్ప కార్యక్రమాలు, పెద్ద పెద్ద పనులు చెయ్యనివ్వకుండా 'నీ జీవితం ఎంత, నువ్వేం చేస్తావు?' అని నిరాశపరుస్తూ ఉంటుంది. దీన్ని అధిగమించడం ఎలా?
జీవితానికి మరణమే చివరి అంకం అనుకున్నవాళ్లకు మృత్యుభయం ఉంటుంది. అది సహజం, అసహజం కానే కాదు. ప్రతి ఒక్కరికి పుట్టినరోజు ఉన్నట్లే మరణించే రోజు ఉంటుంది. ఈ రెండు రోజుల మధ్యలో మనం ఏం సాధించాలో పథకం వేసుకోవాలి. స్పష్టత కలిగి ఉండాలి. చివరి రోజున మన గురించి లోకం మంచిగా మాట్లాడుకోవాలి. గొప్పగా మాట్లాడుకోవాలి. మనల్ని మరచిపోకుండా ఉండాలి. అదీ జీవితం. అలాంటి జీవితం కోరుకోవాలి.
లోకం కోసం పాటుపడుతున్న నిజాయతీపరులైన మహానుభావులను 'నీ పని మధ్యలో వదిలేసి నాతో రా!' అని మృత్యువు పిలుస్తుందా? ఒకవేళ పిలిచినా భయపడవలసిన పనిలేదు. ఇంకొకరు ఆ స్థానంలో భర్తీ అయి ఆ పనిని కొనసాగిస్తారు. భగవంతుడు ఆ ఏర్పాటు చేస్తాడు. ఎవరెంతవరకు చెయ్యాలో, అది వారికి జీవితం ఇచ్చే అవకాశాన్నిబట్టి ఉంటుంది.
మృత్యువు అంటే ఏమిటి, ఎందుకు అది మరణాన్ని కలిగిస్తుంది, మరణమంటే ఏమిటి, మృత్యుధర్మం ఏమిటి... వీటిపై శాస్త్రాలు చాలా విషయాలు చెప్పాయి.
భూమి మీద నూకలు చెల్లిపోయిననాడు దేవుడి కొడుకైనా వెళ్లిపోవాల్సిందే. అది అనివార్య సిద్ధాంతం. దీని గురించి రాద్ధాంతం అనవసరం. పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించేవాడు పుట్టక తప్పదు అంటోంది భగవద్గీత. సృష్టి-స్థితి-లయాలు మూడూ జరగాలి. ఎవ్వరూ ఆపలేరు.
మృత్యువును ఎదిరించి బట్టకట్టినవాడు ఒక్కడూ లేడు. మృత్యువును కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వాయిదా వేసుకున్నవాళ్లు ఉన్నారు. మృత్యువు రాకుండా చేసుకున్నవాళ్లు ఒక్కరూ లేరు.
ప్రతి క్షణం బాధపడుతూ, నిత్యం నరకం అనుభవిస్తూ మృత్యువును కోరుకునేవారు కొందరుంటారు. పుట్టడం దురదృష్టంగా, మరణించడం అదృష్టంగా భావిస్తారు వాళ్లు. పుట్టుక మన చేతిలో ఉందా, మనం అనుకున్నప్పుడు మరణించడానికి?
ఎంతటి విపత్కర పరిస్థితుల్లోనైనా బతకడానికే ప్రయత్నించాలి. చివరి ఆశను కూడా వదులుకోకూడదు. బతకాలి, నలుగురిని బతికించడానికి ప్రయత్నించాలి. బతికించేవాడిని చూస్తే మరణం భయపడుతుంది. మృత్యువు పారిపోతుంది. బతుకంటే భయం దానికి.
'నువ్వు చావు పుట్టుకలు లేనివాడివి. నువ్వు శరీరానివి కాదు. నువ్వు ఆత్మవి. ఆత్మకు మరణం లేదు' అని అర్జునుడితో శ్రీకృష్ణుడు చెప్పాడు. ఆ విషయం మనకు ఎప్పటికి అవగాహనకు వచ్చి అనుభూతిని కలిగిస్తుందో వేచి చూడాలి! - ఆనందసాయి స్వామి
No comments:
Post a Comment