ఓం భూర్ భువస్వహ తత్స వితుర్వరేణ్యం .... భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!

Sunday 8 September 2013

వరాహ జయంతి


   సృష్టిలో ప్రతి ప్రాణికీ ఒక్కొక్క ప్రత్యేక లక్షణం, శక్తి ఉంటాయి. అందువల్ల ఆ లక్షణాలుగల జీవి కొన్ని విషయాల్లో అత్యంత బలసమన్వితమై ఉంటుంది. ఆ కారణంగానే స్థితికారకుడైన విష్ణువు దుష్టశిక్షణ చేయవలసివచ్చినప్పుడు స్వస్వరూపంతో కాకుండా ఆయా ప్రాణుల రూపాల్లోనే అవతారం దాల్చాడంటారు. వాటిలో ఒకటి వరాహావతారం.

వరాహం అంటే పంది. ఈ రూపంలో అవతారం దాల్చడానికి కారణం ఉంది. హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు తన బలగర్వంతో భూమినంతటినీ చాపలా చుట్టి పాతాళలోకంలో దాగున్నాడు. బ్రహ్మ సృష్టి అయిన ఈ విశ్వంలో ఏడు వూర్ధ్వలోకాలు, ఏడు అధోలోకాలున్నాయంటారు. అన్నింటిలోనూ అత్యంత ప్రాధాన్యం, ప్రాభవం కలిగినది, వూర్ధ్వలోకాల్లో చేరిఉన్న భూలోకం మాత్రమే. దానిమీదనే మానవాది సర్వప్రాణికోటి నివసించేది. మిగిలిన లోకాలన్నింటి ఉనికికీ కేంద్రస్థానం లాంటిది భూమి. అలాంటి భూలోకం ఉనికికి ప్రమాదం ఏర్పడితే మిగిలిన లోకాల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. ఇదంతా విష్ణువుకు విన్నవించుకున్నారు దేవతలంతా. భూదేవి సైతం తన బాధలను సమగ్రంగా విష్ణువుకు మొరపెట్టుకుంది. తనను రక్షించమని వేడుకుంది. అప్పుడు హిరణ్యాక్షుని చెరనుంచి భూమిని విడిపించడానికి ధరించినదే వరాహావతారం.

ఆ రూపం- పర్వత సమానమై, కొవ్వుపట్టి, బలిష్ఠమైన నల్లని దేహం. చీకట్లను చీల్చుకొని ప్రజ్వరిల్లుతున్న జ్యోతుల్లా ప్రకాశవంతమైన కళ్లు. రెండు దౌడలనుంచి పైకి చొచ్చుకు వచ్చిన ఇనుప కమ్మీల్లాంటి కోరలు. తన పదఘట్టనతో ఎంతటి దుష్టశక్తినైనా అణగదొక్కే సమర్థత కలిగి ఉన్నట్టున్న గిట్టలు. మేఘగర్జనను మించిన 'ఘర్ఘర(పంది అరుపు పేరు) ధ్వని'తో పాతాళంలో దాగిన హిరణ్యాక్షుణ్ని ఎదుర్కోవడానికి అనువైన లక్షణాలతో ఆవిర్భవించిందా వరాహం. పాతాళలోకానికి మార్గమైన సముద్రంలోకి దిగింది. పాతాళలోకం చేరాక అక్కడి వరకూ వ్యాపించి ఉన్న కుల పర్వతాల మొదళ్లను తన ముట్టెతో పెకలించసాగింది. ఆ చర్యతో పర్వతాలు భయపడి హిరణ్యాక్షుడు దాగిన చోటును చూపించాయి. అలా దొరకబుచ్చుకుంది హిరణ్యాక్షుణ్ని. అయినా లొంగక విష్ణువుతో యుద్ధానికి తలపడ్డాడతడు. తనకున్న శక్తినంతా కూడగట్టుకుని వరాహాన్ని కొట్టాడు. తిరిగి తన శరీరానికే దెబ్బతగిలి విపరీతమైన నొప్పి పుట్టసాగింది. దానికితోడు వరాహ రూపధారి అనేక రకాలుగా కొడుతున్న దెబ్బలను తాళలేకపోతున్నాడు హిరణ్యాక్షుడు. పట్టుకుందామంటే దొరకదు, రెండు కాళ్ల సందునుంచి దూరి తప్పించుకుంటోంది. అంతలో అన్నివైపుల నుంచీ హిరణ్యాక్షుడి మీద దాడి చేస్తోంది. అల్పప్రాణిలా కనబడుతున్నా, పైకి కనిపించని శక్తులు కలిగిన వరాహంతో యుద్ధంచేసి అలసి చివరికి మరణించాడు హిరణ్యాక్షుడు. అప్పుడా వరాహమూర్తి పాతాళంలో చుట్టగా పడిఉన్న భూమిని తన కోరలతో పైకి ఎత్తి యథాస్థానంలో ప్రతిష్ఠించాడు. అలా భూమిని ఉద్ధరించిన వరాహమూర్తిని దేవతలందరూ స్తుతించారు.

విష్ణువు మరొక సందర్భంలో కూడా వరాహరూపం దాల్చవలసి వచ్చింది. అది అవతారం కాదు. రూపం మాత్రమే. ఎప్పుడంటే... అది కల్పాంతం ముగిసిశాక కొత్త జగతికి ప్రారంభ సమయం. అంతవరకూ జలమయమై ఉన్న బ్రహ్మాండాన్ని ఏడు వూర్ధ్వ భాగాలుగా, ఏడు అధో భాగాలుగా విభజించి ఆయా లోకాల్లో అవసరమైన వనరులను కూర్చుతున్నాడు విష్ణువు. ఆ ప్రక్రియలో భాగంగా భూమిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలనే తలంపుతో అనేక పర్వతాలు, నదులు, సముద్రాలను సమకూర్చుతున్నాడు. ఆ భారాన్ని తాళలేక భూమి కిందికి కుంగిపోసాగింది. ఆ దశలో విష్ణువు వరాహ రూపం ధరించి తన కోరల మీద భూమిని ఉంచుకున్నాడు. ఆ స్థితిలో భూమిని స్థిరంగా నిలపడానికి అష్టదిగ్గజాలను ఆసరాగా ఏర్పరచి, వాటి తొండాలమీద భూమిని ప్రతిష్ఠించాడు. అప్పటినుంచి ఆ దిగ్గజాలే భూమి గతితప్పకుండా కాపాడుతున్నాయని పురాణ కథనం. అలా అవతరించిన వరాహరూపాన్ని యజ్ఞ వరాహరూపం అంటారు. రెండుసార్లు వరాహరూపం దాల్చడం వల్లనే వరాహ జయంతి విషయంలో సందిగ్ధం నెలకొంది. సృష్ట్యాదిలో భూమిని సుప్రతిష్ఠితం చేయడానికి ఎత్తిన యజ్ఞవరాహ జయంతి చైత్ర బహుళ త్రయోదశినాడు, హిరణ్యాక్షుడి బారినుంచి భూమిని రక్షించడానికి ఏర్పడిన వరాహరూప జయంతి భాద్రపద శుక్ల తృతీయ అని గ్రంథాల ఆధారంగా వెల్లడవుతోంది.

వరాహ రూపంలో ఉన్న విష్ణువుకు ప్రత్యేకంగా ఆలయాలు లేవు. ఆ తరవాతి అవతారమైన నరసింహావతారంతో కలిసి సింహాచలంలో 'వరాహ లక్ష్మీనరసింహ స్వామిగా పూజలందుకొంటున్నాడు.
                                                                      - అయ్యగారి శ్రీనివాసరావు 

No comments:

Post a Comment